ఎడ్లబళ్లను లాగుతూ టీడీపీ నిరసన ప్రదర్శన
posted on Sep 19, 2022 @ 11:07AM
ఏపీలో రైతుసమస్యల్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రధాని విపక్షం తెలుగుదేశం భారీ ఎత్తున నిరసనలు చేపట్టింది. సోమవారం అసెంబ్లీ వద్ద కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయ కత్వంలో టిడిపి శాసనసభ పక్షం నిరసన ర్యాలీ నిర్వహించింది. అయితే వారంతా ఎడ్లబండ్ల మీద వచ్చి నిరసనకు దిగడం పట్ల పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వారిని పట్టించు కోకుండా నినాదాలు చూస్తూ ప్రభుత్వం పట్ల విముఖతను వ్యక్తం చేశారు. ఈ నిరసన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు పెట్టడంతో బండ్లు నిలిపివేశారు. ఎడ్లబళ్లను పోలీసులు తీసికెళ్లారు. తెలుగుదేశం ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీ లు తూళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ కూడా నిరసనకు దిగారు. అక్కడి నుంచి ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్లు లేకుండానే కాడ తామే స్వయంగా తగిలించు కుని మరీ రోడ్లమీదకు వచ్చారు.
ఈ సందర్భంగా తెదేపా శాసనసభ పక్షఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కోటరీ వల్లే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. మూడేళ్లుగా వ్యవ సాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తెలిపారు. మూగజీవాల్ని పోలీసులు తరమటం దుర్మార్గమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎడ్లను పోలీసులు తీసుకెళ్లడంపై పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. ఎడ్లబండి కాడె మోస్తూ అసెంబ్లీ కి లోకేష్, అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఇతర ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసు వలయాన్ని తోసుకుంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ ఎడ్ల బండిని నేతలు లాక్కుంటూ వెళ్లారు.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారన్నారు. రైతుపై చెయ్యి చేసుకున్న పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతును కొట్టిన అంశంపై అసెంబ్లీలోనూ నిరసన తెలుపుతామన్నారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యల వల్లే పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.