కోమటరెడ్డికి దారి చూపిన కాంగ్రెస్
posted on Dec 11, 2022 8:53AM
కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ ఈ రెండింటినీ వేరు చేసి చూడటం సాధ్యం కాదన్న పరిస్థితి నుంచి వారిరువురి వల్ల తెలంగాణ కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందన్నంత వరకూ పరిస్థితి వచ్చింది. వచ్చింది అనే కంటే కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకు వచ్చారని చెప్పడమే సబబు. కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత విభేదాలు, గ్రూపుల కుమ్ములాటలూ సహజమే. అయితే కోమటి రెడ్డి బ్రదర్స్ మాత్రం పార్టీలో తమఅసమ్మతి, అసంతృప్తి ని ప్రదర్శించే విషయంలో వేరే లెవల్ చూపించారు.
ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వానికీ, అటు హై కమాండ్ కీ కూడా చుక్కలు చూపించారు. నల్గొండ జిల్లాలో తమకు ఉన్న పట్టు కాంగ్రెస్ పార్టీకి అవసరమ్మన్న అతి ధీమానూ ప్రదర్శించారు. తామేం చేసినా చెల్లి పోతుందన్న అతిశయంతో వ్యవహరించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పదవిని ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది దక్కకపోయే సరికి.. తన అసమ్మతి రాగాన్ని పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడేందుకు దారితీసే విధంగా వినిపించారు. పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టడాన్ని పార్టీలో పలువురు సీనియర్లు వ్యతిరేకించారు. తమ వ్యతిరేకతను, అసమ్మతిని తమ తమ స్థాయిల్లో ప్రదర్శించారు కూడా అయితే.. ఆ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన స్థాయిని మించి వ్యక్తం చేశారు.
అధిష్ఠానానికి విధేయుడిని అని అంటూనే.. అవిధేయతను వ్యక్త పరచడంలో కొత్త పుంతలు తొక్కారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ కాంగ్రెస్ బ్రాండ్ అన్నంతగా రెచ్చిపోయారు. కానీ హై కమాండ్ నుంచి బుజ్జగింపులే తప్ప.. తాము కోరుకున్న విధంగా పదవి రాకపోవడంతో.. ముందుగా సొదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు తెరతీశారు. మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. రాష్ట్రంలో కాంగ్రెస్ వరస ఓటములు చవి చూస్తున్న సమయంలో సిట్టింగ్ సీటుకు ఉప ఎన్నిక జరగడం కాంగ్రెస్ కు ఏ విధంగానూ కలిసి వచ్చే వ్యవహారం కాదు. అయినా అనివార్యంగా ఉప ఎన్నికను తీసుకు వచ్చి కాంగ్రెస్ బలహీనతలను బట్టబయలు చేసి సత్తాచాటాలన్న వ్యూహంతోనే రాజగోపాలరెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు తెర తీశారు.
ఇక అక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసమ్మతి ప్రదర్శనలో విశ్వరూపం ప్రదర్శించారు. అనుక్షణం తన ప్రకటనలతో పార్టీని, పార్టీ అధినాయకత్వాన్ని ఇబ్బందుల పాల్జేశారు. స్టార్ క్యాంపెయినర్ గా ఉండి కూడా మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ పై విమర్శలతో చెలరేగారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమి తథ్యమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మునుగోడు పరాజయం తరువాత రాష్ట్ర పార్టీ పగ్గాలు తనవే అంటూ ఆయన చేసిన కామెంట్లూ కాంగ్రెస్ ను చీకాకు పెట్టాయి. అయినా చర్య తీసుకోకుండా కాంగ్రెస్ హై కమాండ్ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంది. లోక్ సభలో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ మరో ఎంపీని వదులు కోవడానికి సిద్ధంగా లేకపోవడంతో వెంకటరెడ్డిపై చర్యలకు వెనుకాడింది.
దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కంటే తానే ఎక్కువ అన్న భావనతో తనది రాజకీయ విరామమే తప్ప సన్యాసం కాదంటూ కాంగ్రెస్ ను వీడనున్నట్లు ఘనంగా ప్రకటించారు. ఇంత జరిగిన తరువాత కానీ కాంగ్రెస్ కళ్లు తెరవలేదు. కన్నెర్ర చేయలేదు. ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బయటకు దారి చూపింది.
తనంత తాను పొమ్మనకుండానే.. పొగబెట్టిన చందంగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పీసీసీ కమిటీలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పూర్తిగా విస్మరించింది. 22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని, ఉపాధ్యక్షుల్ని, జనరల్ సెక్రటరీస్‌ని.. అలాగే 26 జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించింది. ఈ జాబితాలో ఎక్కడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేదు. అంతే కాదు పార్టీలో ఆయన అనుయాయులనూ దూరం పెట్టింది. అంటే కోమటిరెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా విస్మరించింది. మీ సేవలు చాలు ఇక దయచేయండని మర్యాదగా చెప్పింది. దీంతో ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాల వేడి కూడా చల్లారుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని కోమటిరెడ్డిని పూర్తిగా విస్మరించడం ద్వారా అసమ్మతీయులకు బలమైన సంకేతాన్ని పంపింది.