ఏపీ బీఆర్ఎస్ ఇన్ చార్జ్ తలసాని?
posted on Dec 12, 2022 6:31AM
బీఆర్ఎస్ ఏపీపై దృష్టి సారించింది. ఇప్పటకే బీఆర్ఎస్ బ్యానర్లు, పోస్టర్లు విజయవాడలో వెలిశాయి. తొలుత బీఆర్ఎస్ పేరు నిర్ణయించే సమయంలో సభ ఏర్పాటు తరువాత కూడా ఏపీలో పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ కు మద్దతుగా పోస్టర్లు వెలిసిన సంగతి విదితమే. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సహా పలు ప్రాంతాలలో అప్పట్లో పోస్టర్లు వెలిశాయి.
ఇప్పుడు మూడు రోజుల కిందట బీఆర్ఎస్ అధికారికంగా ఆవిర్భవించిన తరువాత విజయవాడలో పోస్టర్లు వెలిశాయి. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఆ పార్టీ అధినేత తొలుత దృష్టి పెట్టింది ఏపీపైనే అని చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసే బాధ్యతను తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు కేసీఆర్ అప్పగించనున్నారని ఆ పార్టీ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తోంది.
2019 ఎన్నికలకు ముందు బీసీలను ఏకం చేసి, వారిని వైసీపీ వైపు మళ్లించేందుకు తలసాని విజయవాడలో పర్యటించిన సంగతి విదితమే. అప్పట్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఏపీలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులను బీఆర్‌ఎస్ వైపు మళ్లించే వ్యూహంతో, తలసానినిని బీఆర్‌ఎస్ ఏపీ ఇన్చార్జిగా నియమించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో కాపుల తరువాత సంఖ్యాపరంగా పెద్ద సమాజిక వర్గం యాదవులే కావడంతో వారిని బీఆర్ఎస్ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా, వారి మద్దతు పొందడమే ధ్యేయంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారంటున్నారు.
సమైక్య రాష్ట్రంలో తలసాని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా పనిచేశారు. ఏపీలోని అనేక వర్గాలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. తలసాని, తలసాని టీడీపీలో ఉండగా, ఆయనతో ఏపీకి చెందిన టీడీపీ నేతలతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆవి కొనసాగుతున్నాయి. దీంతో ఏపీ నేతలతో తలసానికి ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్.. బీఆర్‌ఎస్ పార్టీకి, ఏపీ ఇన్చార్జిగా తలసానినేనియమించాలని నిర్ణయించారని అంటున్నారు.ఈ నేపథ్యంలోనే విజయవాడలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం తలసాని శ్రీనివాస యాదవ్ డిసెంబర్ నెలలో విజయవాడలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.