అన్నంలో తలవెంట్రుక వచ్చిందని భార్యకు శిరోముండనం
posted on Dec 12, 2022 8:49AM
పురుషాధిక్యతకు ఎల్లలు ఉండవా అని పిస్తుంది కొన్సి సంఘటనల గురించి వన్నప్పుడు. ఇక భార్య అంటే లోకువగా చూసే పురుష పుంగవులు కోకొల్లలు. చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్ద శిక్షలు వేయడంలో మృగాళ్లు ఎప్పుడూ ముందుంటారు. మహిళలపై అఘాయిత్యాలు చేయడంలో, వారిని వేధింపులకు గురి చేయడంలో ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.
అలాంటి శాడిస్ట్ భర్త తాను బతికుండగానే భార్యకు గుండు కొట్టించేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ పురుష పుంగవుడు భార్యకు ఎందుకు గుండు కొట్టించాడో తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోకమానరు. సాధారణంగా ఇంట్లోనే కాకుండా.. రెస్టారెంట్లు, హోటల్స్‌లో మనం తినే ఫుడ్‌లో తలవెంట్రుకలను చూస్తుంటాం. అలాంటి సందర్భాల్లో ఎంతో కొంత కోపం, అసహనం సహజం. అయితే అన్నంలో తల వెంట్రుకలు రావడం అన్నది కూడా అంతే సహజం. ఎవరైనా సరే అలా వస్తే సర్దుకు పోతారు. ఆహారంలో వచ్చిన తల వెంట్రుకను తీసి పక్కన పారేసి తినేస్తారు.
కానీ ఆ భర్త మాత్రం ఏకంగా కట్టుకున్న భార్యకు గుండు కొట్టించాడు. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఊరుకోకుండా.. ఇంకోసారి అలా తలవెంట్రుకలు రాకుండా ఉండాలంటే భార్యకు గుండు చేయించడమే మార్గమని నిర్ణయం తీసేసుకున్నారు. వెంటనే అమలు చేసేశాడు. ఇందుకు ఆ వ్యక్తికి అమ్మ , నాన్న అంటే సదరు బాధితురాలి అత్తమామలు కూడా తన వంతు సహకారం అందించారు. దీంతో ఆ బాధితురాలు భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. మహిళ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్‌కు, సీమాదేవితో ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లయినప్పటి నుంచి రూ.15 లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటివారు ఆమెను వేధిస్తున్నారు. ఆ వేధింపులలో భాగంగానే ఆమె వండిన భోజనంలో వెంట్రుక వచ్చిందని శిరోముండనం చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి శిరోముండనం చేశారని సీమాదేవి తన ఫిర్యాదులో పేర్కొంది.