చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలు.. సీఐడీ అభ్యర్థనకు హైకోర్టు నో

చంద్రబాబు మధ్యంతర బెయిలులో అదనపు షరతులు విధించాలంటూ ఏపీ  సీఐడీ హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు కార్యకలాపాలపై నిఘాకుఇద్దరు డీఎస్పీలను నియమించాలన్న ఏపీ  సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అదనపు  షరతుల సంగతి పక్కన పెడితే.. చంద్రబాబునాయుడు స్కిల్ కేసుకు సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొంది. అలాగే రాజకీయ ర్యాలీలలో పాల్గొనకూడదంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలూ కొనసాగుతాయని హైకోర్టు  స్పష్టం చేసింది.  చంద్రబాబు మధ్యంతర బెయిలుపై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్ పై బుధవారం (నవంబర్ 1) విచారణ జరిపిన హైకోర్టు తీర్పును శుక్రవారానికి (నవంబర్ 3) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తన అనుబంధ పిటిషన్ లో సీఐడీ బెయిలు షరతులను చంద్రబాబు ఉల్లంఘించారనీ, రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారనీ పేర్కొన్నారు. అలాగే షరతులను ఉల్లంఘించి రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి వరకూ భారీ ర్యాలీ తీశారని కూడా పేర్కొన్నారు. అయితే సీఐడీ వాదనలతో విభేదించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు.. చంద్రబాబు కోర్టు ఆదేశాలను అతిక్రమించలేదనీ, ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మాట్లాడటం ప్రాథమిక హక్కులో భాగమే తప్ప షరతుల అతిక్రమణ కాదని పేర్కొన్నారు.   అంతే కాకుండా సీఐడీ కోరుతున్న అదనపు షరతులు ప్రాథమిక హక్కులను హరించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.  

ప్రభుత్వ ముసుగువేసుకున్న వైసీపీ కార్యకర్తలు?!

సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఈ రెండు పేర్లు గత 53 రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలలో  చాలా ఎక్కువగా వినిపించిన పేర్లు. మీడియాలో ఎక్కువగా కనిపించిన పేర్లు. అయితే వీరేం రాజకీయ నాయకులు కారు. వీరిరువురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ కాగా.. మరొకరు ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్. తెలుగుదేశం అధినేత అక్రమ అరెస్ట్ నుండి స్కిల్ కేసు న్యాయస్థానాలలో విచారణ వరకూ ఈ ఇద్దరూ ఎక్కడా  నిబంధనలను పాటించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లుగా వ్యవహరించలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని అందరూ నిర్ధారించారు. 17ఏ సెక్షన్ కింద సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నేతను అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కానీ  చంద్రబాబు అరెస్టు కనీసం గవర్నర్ కు సమాచారం కూడా ఇవ్వకుండానే అర్ధరాత్రి ఆయన బస చేసిన శిబిరాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అప్పటివరకూ అసలు ఎఫ్ఐఆర్ అనేదే లేకుండా ఈ అరెస్ట్ జరిగింది.  కోర్టులో విచారణ మొదలయ్యాక హడావుడిగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు చంద్రబాబును సీఐడీ విచారణకు అప్పగించినా ఈ కేసులో ఆయన పాత్ర లేకపోవడంతో సీఐడీ విచారణ కూడా వృధానే అయింది. మొత్తం 52 రోజులుగా ఏసీబీ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకూ ఈ కేసులో విచారణ సాగినా.. ఎక్కడా స్పష్టమైన ఆధారాలు సీఐడీ  న్యాయస్థానాలకు అందించలేకపోయింది.   పైగా జైల్లో చంద్రబాబు సదుపాయాలపై కూడా సీఐడీ ఎక్కడిక్కడ అడ్డుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీనిని బట్టి చూస్తే సీఐడీ కేవలం ప్రభుత్వ పెద్దల ఆనందం కోసమే పనిచేస్తున్నదనీ, ప్రభుత్వ కక్షసాధింపులో సీఐడీ పావుగా మారిందని అందరికీ స్పష్టంగా అర్ధమైంది. ఇంకా చెప్పాలంటే జగన్ సర్కార్ ఇలా వేధింపుల కోసమే సంజయ్ ను సీఐడీ చీఫ్ గా నియమించుకున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అంతకు ముందు విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ కు సీఐడీ అదనపు బాధ్యతలు అప్పగించి మరీ జగన్ సర్కార్ తీసుకొచ్చింది. గతంలో సంజయ్ పై రాయలసీమలో పనిచేసే సమయంలోనే వైసీపీ వాదిగా ముద్ర ఉంది.  ఇక ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసు మొదలైన దగ్గర నుండి ఈయన  ఏఏజీ లా కంటే.. వైసీపీ కార్యకర్తలానే ఎక్కువగా వ్యవహరించారు. ఈ కేసు విచారణ మొదలైన తొలి రోజు నుండే మీడియాకెక్కిన పొన్నవోలు నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి చంద్రబాబు దోషి అంటూ రచ్చ రచ్చ చేశారు. కేసు దర్యాప్తులో ఉండగా.. అదే కేసులో వాదనలు వినిపించే న్యాయవాది కేసుకు సంబంధించి వివరాలను బహిర్గతం చేయకూడదనే నిబంధన తెలిసినా అడ్డగోలుగా మీడియా చర్చలో పాల్గొన్నారు. అసలు పసలేని కేసులో భారీ కుంభకోణం అనేలా చిత్రీకరించేందుకు సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు శాయశక్తులా కృషి చేశారు. నారా లోకేష్ ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించి ఈ కేసు గురించి జాతీయ స్థాయి మీడియాకు వివరణ ఇచ్చిన అనంతరం సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు ప్రభుత్వ డబ్బుతో ఢిల్లీ వెళ్లి  అక్కడా చంద్రబాబును అవినీతి పరుడిగా ముద్రవేసేందుకు కేసు వివరాలను వెల్లడిస్తూ మీడియా సమావేశాలలో మాట్లాడారు.   ఈ వ్యవహారంపై  హైకోర్టులో పిటిషన్  దాఖలైంది. స్కిల్  కేసు దర్యాప్తులో ఉండగా సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ సుధాకర్ రెడ్డిలు మీడియా సమావేశాలు ఏర్పాటు కేసు గురించి మాట్లాడారనీ, ఆ క్రమంలో  ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు  పిటిషన్ దాఖలు చేశారు.  ప్రజాధనం దుర్వినియోగంపై ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని పిటిషనర్ తెలిపారు. ఆ పిటిషన్ ను విచారించిన  హైకోర్టు ఆర్టీఐ కింద కోరిన సమాచారం ఇవ్వకపోవడం   చట్టవిరుద్ధమేనని పేర్కొంది. మరో సారి ఆర్టీఐని వివరాలు ఇవ్వాలని కోరాల్సిందిగా పిటిషనర్ కు సూచించింది.  ఇక తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయంలో కూడా హైకోర్టులో పొన్నవోలు వితండవాదం వినిపించారు.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకోలేదని పొన్నవోలు హైకోర్టులో తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా హైకోర్టు ఆగ్రహించింది. మార్గదర్శకాల ప్రకారమే తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేశామని స్పష్టం చేసిన హైకోర్టు.. ఏవైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళమని సూచించింది. అంతే కాదు  కోర్టు తీర్పులు ఎలా ఇవ్వాలో కూడా మీరే చెప్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తే సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు అధికారుల ముసుగేసుకున్న వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారన్నది తేటతెల్లమౌతోందని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.  

వైసీపీలో లోకేష్ టెన్షన్!

ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి రాజకీయంగా పరిణితి చెందిన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆయన  స్థైర్యం, ధైర్యం, నిముషాలలో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం, ప్రజలతో మమేకం కావడం, విశ్వసనీయత పెంచుకోవడం అన్నీ  చూస్తుంటే తండ్రికి తగ్గ తనయుడిగా అందరి మన్ననలూ పొందుతున్నారు. ఇప్పుడు అదే వైసీపీలో టెన్షన్ కు కారణమైంది.  మొన్నటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. ముందు ముందు ఈ లెక్కలు ఇంకా ఇంకా మారతాయి అన్న భయం వారిని వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. మొన్నటి వరకూ నారా లోకేష్ అంటే  తండ్రి చాటు తనయుడు. కానీ, ఇప్పుడు రాటుదేలిన నాయకుడు.. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని  కాపాడుకోగల సమర్ధుడు. పార్టీని ముందుండి నడిపించగలిగిన, ప్రత్యర్థుల విమర్శలకు వారి నోళ్లు మూతపడేలా సమాధానం ఇవ్వగల పరిణితి చెందిన నాయకుడు. ఇది  సగటు తెలుగుదేశం అభిమానుల మాట మాత్రమే కాదు.  పార్టీ సీనియర్లు, అంతెందుకు అధికార వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తున్న వాస్తవం. రాజకీయాలలో తొలి అడుగుపడిన నాటి నుంచి ఆయన మాట నుంచి ఆహారం, ఆహార్యం వరకూ ప్రతి అంశాన్ని ఎత్తి చూపుతూ ఎగతాళి చేసిన ఆ నోళ్లే ఇప్పుడు లోకేష్ మాట ఎత్తాలంటే భయపడే పరిస్థితికి వచ్చాయి.  ఆయన ప్రతి అడుగూ అధికార పార్టీ గుండెల్లో గుబులు పెంచుతోంది.   యువగళం పేరిట ఆయన పాదయాత్ర చేస్తుంటే.. ప్రతి అడుగులోనూ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిన జగన్ సర్కార్ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. ఆంక్షలు, అడ్డంకులను అధిగమిస్తూ ఆయన ముందకు సాగారు. పార్టీ అధినేత, తండ్రి నారా చంద్రబాబును అధికార మదంతో జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో అటు న్యాయపోరాటం, ఇటు పార్టీ సమన్వయం రెండూ ఏకకాలంలో చేసి నారా లోకేష్ ప్రత్యర్థి పాలిట సింహస్వప్నంగా మారారు. చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చినా.. రాజకీయ క్షేత్రంలో తన ముద్రను బలంగా చాటారు.  ప్పుడు అధికార పార్టీ నేతలు నారా లోకేష్ ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు.. ఎవరిని కలుస్తున్నారు.. ఏం మాట్లాడుతున్నారు. లోకేష్ ఏపీలోనే ఉన్నారా.. లేకపోతే  ఎప్పుడు వస్తారు అంటూ ఆంటూ ఆరా తీస్తున్నారు. ఔను.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు వింటేనే వైసీపీ నేతలు వణికి పోతున్నారు.     యువగళం పాదయాత్రతో లోకేష్ ఒక పొలిటికల్ లీడర్ గా ఎంతగా మార్పు చెందారో చూశారు. తన మాట, నడత, నడకను మలచుకుని మాస్ లీడర్ గా ఎదిగిన క్రమాన్ని చూశారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం ద్వారా ఆయన ఎదుగుదలను అడ్డుకోగలమని భావించారు. సాధ్యం కాకపోవడంతో అడ్డగోలు విమర్శలతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని భావించారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత కానీ లోకేష్ లోని రాజకీయ పరిణితి వారికి అవగతం కాలేదు. ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలను జాతీయ మీడియా వేదికగా ఎండగట్టడం దగ్గర నుంచీ.. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడంలో కానీ లోకేష్ వ్యవహరించిన తీరు.. లోకేష్ లో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఢిల్లీ నడిబొడ్డున జాతీయ మీడియాతో చర్చకు కూర్చొని రాష్ట్రంలో వైసీపీ చేసే అరాచకాలను దుమ్మెత్తి పోస్తే.. అప్పటికప్పుడు సీఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీలోనే ఎక్కువ గడపడంతో ఇక్కడ వైసీపీ నేతలు ఆయన పారిపోయారంటూ ప్రచారం చేసుకుని సంబరపడ్డారు.  కానీ జాతీయ స్థాయిలో ఏపీలో అరాచకపాలనపై అందరి దృష్టీ పడేలా చేయడంలో లోకేష్ సక్సెస్ అయిన వరువాత కానీ వైసీపీ పెద్దలకు అర్ధం కాలేదు.. ఆయన ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరించారన్నది.  ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన తరువాత కూడా.. లోకేష్   ఢిల్లీ వెళ్లారు. బుధవారం తిరిగి హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. దీంతో వైసీపీ నేతలలో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవల చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో   మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ జగన్ అక్రమాస్తుల కేసును ప్రస్తావించారు.  ఇక నుండి మొదలవుతుంది అసలైన రాజకీయం అంటూ వైసీపీ అధినేతకు స్పష్టమైన హెచ్చరిక పంపారు. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దక్కిన  సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు జగన్ కేసులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ నేతలలో అలజడి మొదలైంది.  మరీ ముఖ్యంగా నారా లోకేష్ కదలికలను వైసీపీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు.  లోకేష్ ఢిల్లీ వెళ్లిన దగ్గర నుండి ప్రతి కదలికను నిఘా వర్గాల ద్వారా వైసీపీ సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.  ఇకపై లోకేష్ ఏ చేయబోతున్నారన్నభయం ఆందోళన వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కనీస ఆధారాలు లేని స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 52 రోజుల పాటు జైలులో ఉంచిన జగన్ సర్కార్..ఇప్పుడు ఆధారాలు ఉండి కూడా పదేళ్లుగా బెయిలుమీద ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక రావడంతో అధికార పార్టీ అగ్రనాయకత్వంవణికి పోతున్నదని అంటున్నారు. చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయినా కేసుల మీద కేసులు అన్నట్లుగా ముందుకు వెడుతున్న జగన్ సర్కార్ తీరుపై, పాలనా వైఫల్యాలపై, అడ్డగోలు అప్పులపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగడం వెనుక ఉన్నది లోకేష్ అని అర్ధం అవ్వడంతో లోకేష్ ను లైట్ గా తీసుకుని ఎంత తప్పు చేశామో అర్ధమై భయపడుతోందంటున్నారు.  చంద్రబాబుపై కేసుల్లో కనీస ఆధారాలు కూడా సీఐడీ చూపలేకపోవడంపై ఇప్పటికే జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. న్యాయవర్గాల్లోనూ ఈ అంశంపై లోకేష్ చర్చ పెట్టగలిగారని అంటున్నారు.  లోకేష్ ఢిల్లీ పర్యటలను తేలిగ్గా తీసుకోలేమని… ఏదో చేస్తున్నారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. భయపడుతున్నాయని అంటున్నారు. 

కామారెడ్డిలో కేసీఆర్ కు పౌల్ట్రీ రైతుల నిరసన సెగ.. వంద నామినేషన్లు వేయడానికి నిర్ణయం

తెలంగాణ ఎన్నికల ముంగిట అధికార బీజేపీకి ఏదీ కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్ కు కామారెడ్డిలో రైతులు షాక్ ఇచ్చారు.  పౌల్ట్రీ రైతులు కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో నామినేషన్స్ వేయడానికి సిద్ధపడుతున్నారు. కార్పొరేట్ శక్తుల తీరుతో అన్యాయానికి గురవుతున్నామని పేర్కొంటూ కామారెడ్డి నియోజకవర్గం నుంచి వంద మందికి పైగా పౌల్ట్రీ రైతులు నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు గురువారం (నవంబర్ 2)కామారెడ్డిలోని పద్మశాలీ సంఘం భవనంలో జరిగిన పౌల్ట్రీ ఫార్మర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఫౌల్ట్రీ రైతులకు  చికెన్ సెంటర్స్ అసోసియేషన్, ట్రేడర్స్ కూడా మద్దతు తెలిపారు. పౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్న తమ డిమాండ్ కు అధికార బీఆర్ఎస్ పట్టించుకోలేదనీ, రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగానే పౌల్ట్రీ రంగానికి కూడా ఉచిత కరెంట్ సరఫరా చేయాలని కోరినా ఫలిలం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రో ఇన్ ఛార్జెస్ ప్రభుత్వమే నిర్ణయించాలనీ. గతంలో సెంట్రల్ బోర్డు ద్వారా 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారనీ, ఆ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే పౌల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించేలా అవకాశం ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం  కామారెడ్డిలో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్ల పౌల్ట్రీ రైతులు చెప్పారు.శుక్రవారం (నవంబర్ 3) నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియలో విడతల వారిగా 100 నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు. 

బిజెపి మూడో జాబితా... చాన్స్ కొట్టేసిన  బాబు మోహన్ , కృష్ణాయాదవ్ 

ఎట్టకేలకు బిజెపి మూడో జాబితా విడుదలైంది. 52తో మొదటి జాబితా విడుదల చేసిన బిజెపి రెండో జాబితాలో కేవలం ఒకే అభ్యర్థిని ప్రకటించి అసమ్మతి నేతలు కాంగ్రెస్ పార్టీలో వలసవెళ్లే విధంగా వ్యవహరించింది. టిడిపి హాయంలో ఆందోల్ ఎమ్మెల్యేగా గెలిచిన సినీ నటుడు బాబు మోహన్ కొద్ది రోజుల్లోనే మంత్రయ్యారు కూడా.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కెసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీలో చేరారు.   2014లో టిఆర్ఎస్ ఆందోల్ టికెట్ పై గెలిచినప్పటికీ రెండో సారి(2018) మాత్రం బాబు మోహన్ కి ఇవ్వకుండా జర్నలిస్ట్ క్రాంతికిరణ్ కు ఇవ్వడంతో బాబు మోహన్ బిజెపిలోకి జంప్ అయ్యారు. అక్కడ పోటీ చేసి పరాజయం చెందారు. దీంతో బిజెపి అధిష్టానం బాబు మోహన్ కి  ఈ సారి టికెట్ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూప లేదు. పైగా తన కొడుకుకు ఇస్తామని చాల రోజుల వరకు దాటవేసింది. మనస్థాపం చెందిన బాబు మోహన్ ప్రెస్ మీట్ పెట్టి బిజెపి పై నిప్పులు చెరిగారు. కుటుంబంలో చిచ్చు పెట్టిందని విమర్శించారు.  అసలు ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ఏ పార్టీలో చేరే విషయం త్వరలో వెల్లడిస్తానని అధిష్టానాన్ని బెదిరించినంత పని చేశారు.  తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులతో నిన్ననే విడుదల చేస్తారని భావించారు. కానీ టిక్కెట్ కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరికి మించి ఆసక్తి చూపించడం, జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆలస్యమైంది. ఈ రోజు 35 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.  బాన్సువాడ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆందోల్ నుంచి బాబుమోహన్, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, అచ్చంపేట నుంచి దేవని సతీష్ మాదిగ, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి తదితరులకు టిక్కెట్ వచ్చింది.

బీజేపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం?.. రామ్ చరణ్, ప్రభాస్ కూడా!

తెలంగాణలో బీజేపీ పరిస్థితి తిరోగమన దిశలో సాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. కొంత కాలం క్రితం వరకూ బయట పార్టీల నుంచి వచ్చి చేరిన బలమైన నేతలతో రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపించిన కమలం పార్టీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి ఒక్కొక్కటిగా రేకలు రాలిపోయినట్లు.. నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమౌతున్నారు. గతంలో ఏ నేతల వల్లనైతే బీజేపీ బలంగా కనిపించిందో.. ఆ నేతలే పార్టీని వీడటంతో  రాష్ట్రంలో  బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం  రాష్ట్రంలో బీజేపీ బలహీన పడిందన్న విషయాన్ని గుర్తించినా కూడా అధికారమే లక్ష్యంగా  పావులు కదుపుతున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడం, కర్నాటకలో  ఆ పార్టీ చేతిలో ఎదురైన పరాజయ పరాభవం మరచిపోకముందే.. తెలంగాణలో మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడంతో.. కొత్త కొత్త వ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎదుర్కొనేందుకు సమాయత్తమౌతున్నది. ఆ వ్యూహాలలో భాగంగానే తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున స్టార్ నటులను ప్రచార రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ప్రేక్షకులలో విశేష  ఆదరాభిమానాలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లను బీజేపీ  తరఫున ప్రచారానికి తీసుకురావాలన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వారి అంగీకారాన్ని  తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీ విజయావకాశాలను వీరి ప్రచారం గణనీయంగా పెంచుతుందని పార్టీ అగ్రనేతలు విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు.  పాన్ ఇండియా స్టార్లుగా విశేష గుర్తింపు, ప్రేక్షకాభిమానం ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లు పార్టీ తరఫున ప్రచారం చేస్తే విజయావకాశాలు  పెరుగుతాయన్నది ఆ  పార్టీ అగ్రనేతల వ్యూహంగా చెబుతున్నారు.  జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్‌లతో తెలంగాణలోని మూడు ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురితో ఇప్పటికే  కేంద్రహోంమంత్రి అమిత్‌షా భేటీ అయిన సంగతి విదితమే. జూనియర్ ఎన్టీఆర్‌తో.. అమిత్‌షా గతంలో హైదరాబాద్ లో భేటీ అయ్యారు.  అలాగే మరో సంరద్భంలో రామ్ చరణ్ తో  కూడా అమిత్  షా భేటీ అయ్యారు. ఇక  ప్రభాస్ తో అయితే ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు బతికి  ఉన్న రోజులలోనే భేటీ అయ్యారు. స్వయంగా  కృష్ణం  రాజు ప్రభాస్ ను  అమిత్ షా వద్దకు తీసుకువెళ్లారు. కాగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రభాస్ గ్రేటర్ హైదరాబాద్ లోనూ,  రామ్ చరణ్ ను ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ, జూనియర్  ఎన్టీఆర్ ను  ఖమ్మం, నల్గొండ, వరంగల్  లలో ప్రచారం చేయించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. తద్వారా సెటిలర్ల ఓట్లతో పాటు ఆయా సామాజిక వర్గాల ఓటర్లను కూడా వీరి ప్రచారం ప్రభావితం చేస్తుందని అంటున్నారు.  ఇక ఈ ముగ్గురు పాన్ ఇండియా సినీ స్టార్ల ప్రచార షెడ్యూల్ ను వారి వారి సినిమా షూటింగ్ లకు అంతరాయం లేకుండా ఉండేలా రూపొందించే విషయంలో కసరత్తు జరుగుతోందని అంటున్నారు.    

జగన్ వైఫల్యాలే బీఆర్ఎస్ ప్రచారాస్త్రాలు!

ఏపీలో  రోడ్ల దుస్థితి..  భూముల ధరల పతనం ఇవే ఇప్పుడు తెలంగాణలో  అధికార బీఆర్ఎస్ కు ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి. ఏపీలో రోడ్డెక్కితే మంచాన పడుడే.. తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చు, పాలన చేతకాదన్న వాళ్ళే ఇప్పుడు దివాళా తీశారు, తెలంగాణ విడిపోతే చీకటైతది అంటే ఇప్పుడు ఏపీనే అంధకారమైంది, ఏపీలో పనితనం లేదు.. పగ తనమే ఉంది. ఇదీ తెలంగాణ నేతలు ఏపీ పరిస్థితి గురించి మాట్లాడిన, మాట్లాడుతున్న  మాటలు. తెలంగాణ సీఎం కేసీఆర్ నుండి ఆ పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్  సహా మంత్రులు, నాయకులు అందరూ   ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు,  అధఃపాతాళానికి పడిపోయిన అభివృద్ధి,  వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపులను ప్రస్తావిస్తూ ఏపీని అవహేళన చేస్తూ  వ్యాఖ్యలు చేశారు. చేస్తున్నారు. సాధారణంగానే తెలంగాణ అభివృద్ధి సూచికగా ఏపీలో దిగజారిన పరిస్థితులను చూపే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ చేశారు.   బీఆర్ఎస్ నేతలు  జగన్ సర్కార్ వైఫల్యాలనే తమ పార్టీ ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఏపీలో రోడ్ల నుండి వ్యవసాయానికి అందని చేయూత వరకూ ప్రతిదీ బీఆర్ఎస్ నేతలు తమకి అనుకూలంగా వాడేసుకుంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ నేతలకు ఏపీ ప్రస్తావన లేకుండా ఏ ఎన్నికలు పూర్తికావు. ఒకవైపు ఆంధ్రా పాలకుల పెత్తనంలో అన్యాయం అయిపోయామని కొందరు తెలంగాణ వాదాన్ని తెరపైకి తెస్తే.. ఎ న్టీఆర్, చంద్రబాబు లాంటి వాళ్ళు తెలంగాణ సంక్షేమం, హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన వ్యక్తులని మరికొందరు ఎన్నికలవేళ ఆంధ్ర సెటిలర్లను ఆకట్టుకొనే పనిచేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయంలో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై దాదాపుగా అన్ని పార్టీల నేతలు సానుభూతి వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ నేతలైతే వెళ్లిన ప్రతిచోటా ఏపీలో కుంటుపడిన అభివృద్ధి, దిగజారిన పరిస్థితులను చూపెడుతూ బీఆర్ఎస్ కు ఓటెయ్యకపోతే మీ పరిస్థితి కూడా ఇంతే అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా  ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ సీఎం జగన్ పరిపాలన వైఫల్యాన్ని తమ పరిపాలన సామర్థ్యానికీ  కొలమానంగా  చిత్రీకరించి చెప్పుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఏపీలో పరిస్థితులపై  చాలా చులకనగా మాట్లాడారు.  బీఆర్ఎస్ చేసిన  అభివృద్ధి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనీ,  మనం ఎవరితో విడిపోయామో వాళ్లే చెబుతున్నారని అన్నారు.   అవతలివాళ్ల రోడ్లు ఎలా ఉన్నాయో.. మన రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే చాలు. నేను ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు.. మీరు రోజూ రాకపోకలు సాగిస్తుంటారు కదా! డబుల్ రోడ్ వచ్చిందంటే తెలంగాణ.. సింగిల్ రోడ్ వచ్చిందంటే అది ఆంధ్రా అనేది మీకు కనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు రాష్ట్రం విడిపోతే తెలంగాణ కటిక చీకటి అవుతుందన్నారు. కారు చీకట్లు కమ్ముకుంటాయన్నారు. ఇవాళ తెలంగాణలో వెలుగుజిలుగులు ఉంటే.. ఎవరైతే మనకు శాపం పెట్టారో వాళ్లే చీకట్లో  ఉన్నారన్నారు. తాము విడిపోతే.. రాష్ట్రాన్ని పాలించటం వస్తుందా? అంటూ వ్యాఖ్యానించారని.. ఇప్పుడు వాళ్లే వచ్చి మన దగ్గర ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు.  మన రాష్ట్రంలో ధాన్యం అమ్మితే సొమ్ము త్వరగా ఇస్తున్నాం. అందుకే వాళ్లు ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇది ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు గత వారం మంత్రి హరీష్ రావు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఏపీలో పని తనం లేదని కక్షసాధింపు పాలన సాగుతుందని వ్యాఖ్యానించారు. ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.  అయితే  బీఆర్ఎస్ నేతలు ఎంతగా  జగన్ పాలనను చులకన చేసి మాట్లాడుతున్నా.. వ్యాఖ్యలు చేసినా వైసీపీ నేతలలో చలనం ఉండడం లేదు.  తాజాగా సీఎం కేసీఆర్ చేసిన  వ్యాఖ్యలను, బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఏపీలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఇక్కడి పరిస్థితులపై చేస్తున్న వ్యాఖ్య లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు లాంటి నాయకుడిని కాదనుకోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టం ఇదని.. ఓ అసమర్ధుడిని ముఖ్యమంత్రి చేయడం వలన పొరుగు రాష్ట్రాలలో మనం పరువు పోతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు, పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ఎంత అవహేళనగా జగన్ సర్కార్ వైఫల్యాలను విమర్శించినా.. వైసీపీ నేతలు, ప్రతి విషయానికీ మీడియా ముందుకు వచ్చి తనదైన స్టైల్ లో భాష్యం చెప్పే సకల శాఖల మంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల నోటి వెంట కూడా ఈ కామెంట్లను ఖండిస్తూ ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. అంటే బీఆర్ఎస్ నేతలు చెబుతున్న ప్రతి మాటా, చేస్తున్న ప్రతి వ్యాఖ్యా నిజమేనని అంగీకరించినట్లేనా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

  హైదరాబాద్ లో  చంద్రబాబుపై ‘కోడ్’ కేసు

రాజమండ్రి జైలు నుంచి  చంద్రబాబు విడుదల కావడంతో తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్న మూడ్ లో ఉన్నప్పుడే ఆయనపై మరో కేసు నమోదైంది. ఈ సారి  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణపై కేసు నమోదు చేశారు.  హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు  చంద్రబాబుకు  గురువారం ఘనస్వాగతం లభించింది. ఎన్నికల కోడ్‌  ఉల్లంఘించినట్లు ర్యాలీ నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బేగంపేట ఎయిపోర్టు నుంచి జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి ర్యాలీ తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండుగంటలు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని అందులో ఆరోపించారు. ర్యాలీ నిర్వహించిన హైదరాబాద్ సిటీ టీడీపీ జనరల్ సెక్రెటరీ జివిజి నాయుడు సహా పలువురిపై  పోలీసులు కేసు నమోదు చేశారు .

అక్రమాస్తుల కేసులో కదలిక.. జగన్‌కు కొత్త టెన్షన్!?

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండగా ఏపీలో వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో జరగనున్నాయి. అంటే ఏపీలో కూడా ఐదు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో కూడా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది.  ఇప్పటికే విపక్ష తెలుగుదేశం  దూకుడు మీద ఉండగా.. జనసేన కూడా తెలుగుదేశంకు తోడు కావడంతో  అధికార వైసీపీలో ఓటమి భయం ముప్పిరి గొంది. ఇప్పటికే ముందస్తు సర్వేలు, ప్రజల అభిప్రాయాలతో వైసీపీ ఓటమి ఖరారైనట్లేనని నివేదికలు బయటకు వస్తున్నాయి.  దీంతో వైసీపీ లో నిరుత్సాహం అలముకుంది.  సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో ఉత్సాహం నింపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా విపక్షాల జోరు ముందు అవేమీ ఆనడం లేదు. తెలుగుదేశం అధినేత  చంద్రబాబును అరెస్టు చేసి.. ఆయనను జనానికి దూరం చేశామని అధికార వైసీపీ భావించినా.. ఆ అరెస్టు జనంలో వైసీపీపై   వ్యతిరేకత  మరింత పెరగడానికీ, తెలుగుదేశం పట్ల అభిమానం వెల్లువెత్తడానికీ మాత్రమే దోహదపడింది. మధ్యంతర బెయిలుపై చంద్రబాబు బయటకు వచ్చిన తరువాత జనం ఆయనకు బ్రహ్మరథం పట్టిన తీరు చూసిన వైసీపీ శ్రేణులకు సినిమా అర్ధమైపోయింది. అయితే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీకి , ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు  కొత్త టెన్షన్ మొదలైంది.    ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి  వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను సుప్రీం శుక్రవారం విచారించనుంది. జగన్ పై  సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయని తన పిటిషన్ లో పేర్కొన్న రఘురామకృష్ణం రాజు.. ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించటం లేదని ఆరోపించారు. ఇందులో జగన్ కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేఛ్చను ఇచ్చారని..  ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించటం లేదని రఘురామరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు.  తమిళనాడుకు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణను కర్నాటకలో విచారణ జరిపినట్లే.. ఇప్పుడు జగన్ కేసుల విచారణను తెలంగాణలో కాకుండా మరో రాష్ట్రంలో  జరపాలని   తన పిటీషన్‌లో కోరారు. కాగా  జగన్ అక్రమాస్తుల కేసుతో రఘురామ సుప్రీం తలుపు తట్టడం  రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.   జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం  ఈ పిటిషన్‌ విచారించనుంది.   ఈ పిటిషన్ శుక్రవారం (నవంబర్ 3) విచారణకు రానుంది.  జగన్ కేసుల విషయంలో విచారణ జాప్యం మీద సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా  అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. పిటిషనర్ ఎంపీ రఘురామ కోరినట్లుగా వేరే రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒక వేళ ఉంటే  ఏ రాష్ట్రానికి ఈ కేసు బదిలీ చేసే అవకాశం ఉంది అన్న చర్చ జోరందుకుంది. సుప్రీం ఈ కేసుపై అడిగే ప్రశ్నలకు సీబీఐ ఎలాంటి సమాధానం ఇవ్వనుంది.. ఎందుకు విచారణ ఇంత ఆలస్యమవుతుందంటే ఏ చెప్పనుందన్నది ఆసక్తిగా మారింది. ఈ కేసులో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే అవుతుంది. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేసినా..  సీబీఐ కోర్టు విచారణకు జగన్ రావాల్సిందేనని నోటీసులు ఇచ్చినా కూడా అది జనగ్ కు ఇబ్బందికరంగానే మారుతుందనడంలో సందేహం లేదు.   ఎన్నికల సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మళ్లీ జగన్ కేసులపై జనం దృష్టి మళ్లడానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు. స్కిల్ కేసులో చంద్రబాబు గొప్పతనంపై జనంలో చర్చ జరిగింది. అదే జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక వస్తే.. జగన్ అక్రమార్జన, క్విడ్ ప్రోకో, అరెస్టు వంటి  అంశాలపై  జనంలో చర్చ జరుగుతుందని  పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. దీంతో కేసులో ఎలాంటి కదలిక వచ్చినా అది జగన్ ప్రతిష్టకు  భగం వాటిల్లడమే కాకుండా.. ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా కూడా మారుతుంది. అసలే చంద్రబాబు అక్రమ అక్రమ అరెస్టుతో తెలుగుదేశం  శ్రేణులు ఇప్పటికే పదే పదే జగన్ కేసులను ప్రస్తావిస్తున్నాయి. జగన్ బెయిలు దశాబ్ద  ఉత్సవాలు అంటూ సెటైర్లు కూడా వేశాయి. ఇలాంటి సమయంలో సీబీఐ ఈ కేసు విచారణ వేగవంతం చేస్తే అది కచ్చితంగా   జగన్ కు ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఒకవేళ ప్రతి శుక్రవారం సీబీఐ  కోర్టులో జగన్ విచారణకు రావాల్సిందేనని ఆదేశిస్తే..  అది జగన్  ప్రతిష్టకు డ్యామేజీ అవుతుందనడంలో సందేహం లేదు.  ఏది ఏమైనా ఈ కేసు భవితవ్యం ఏంటన్నది ఈ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చనుండడంతో ఇప్పుడు అందరి దృష్టి అక్కడే ఉంది. సుప్రీం నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అన్న విర్గాలలో వ్యక్తం అవుతోంది. 

కాంగ్రెస్ నేతల ఇళ్లు , కార్యాలయాలపై ఐటీ సోదాలు

అధికారంలో ఉన్న పార్టీలు ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కామన్. అయితే తెలంగాణలో పోలింగ్ కు నెల రోజుల వ్యవధి కూడా లేదు. ఇదే అదను అని భావించినట్లుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి  ఆ పార్టీ  ప్లాన్ చేసింది. తెలంగాణలో బిజెపి బి టీం  బిఆర్ఎస్ అనే ప్రచారం ఉండనే ఉంది. శత్రువు శత్రువు మిత్రుడు అన్న చాణక్య రాజనీతిని కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోంది. ఇందుకు బిఆర్ఎస్ సహకారం తీసుకుంటుంది. ఆ పార్టీ  సూచించిన కాంగ్రెస్ నేతల ఇళ్లు , కార్యాలయాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ దాడులు చేస్తోంది. గురువారం (నవంబర్ 1)కాంగ్రెస్ నాయకురాలు చిగిరింత పారిజాత ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఉదయం ఐదు గంటల సమయంలో హైదరాబాద్ శివారులోని బాలాపూర్‌లోని ఆమె నివాసంతోపాటు మరో 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలకు దిగారు. ఈ క్రమంలో పారిజాత కుమార్తె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బడంగ్‌పేట్ మేయర్ అయిన పారిజాత ఇల్లుతోపాటు కంపెనీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలంలో బాలపూర్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే, మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, విపక్ష నాయకుల ఇళ్లలో సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 

ఒక్క అరెస్ట్.. బై బై జగన్.. వై నాట్ బాబు

నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబు సంపాదించుకున్న, విస్వసనీయత ఇంతా కాదు. ఆ విజనరీ, ఆ దృక్పధం, ఆ విశ్వసనీయతల ఆధారంగానే, చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్  నగరాన్ని, విశ్వనగరంగా, ఐటీ హబ్  గా అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాటిన ఐటీ విత్తనాలే ఈరోజు మహా వృక్షాలుగా ఎదిగాయి. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో  గుర్తింపు తీసుకువచ్చాయి. రాష్ట్ర విభజన తరువాత   నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక సవాళ్ళను ఎదుర్కుంటూ కూడా చంద్రబాబు నాయుడు, తమ అనుభవం, విజ్ఞత, వివేచన.. ఈ అన్నిటినీ మించిన విస్వసనీయతలను కలగలిపి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. కియా వంటి అనేక మేజర్ కంపెనీలు కొత్త రాష్ట్రం, అని చూడకుండా, చంద్రబాబు ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఉంటుందన్నవిశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయి. అటువంటి దార్శనికుడిని   రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారిని సైతం ఆయన అభిమానులుగా మార్చేసింది. ఇది పదే పదే రుజువు అవుతున్న వాస్తవం. కాదనలేని సత్యం. తాజాగా చంద్రబాబును స్కిల్ కేసులో జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేస్తే.. ఆయన తప్పు చేయడు.. చేయ నివ్వడు అంటూ రాజకీయాలతో సంబంధం లేని వారంతా రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడమే నిదర్శనం. తెలుగు  రాష్ట్రాలలోనే కాదు.. దేశ, విదేశాల్లో తెలుగువారు ఉన్న ప్రతిచోటా చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. రాజకీయంగా ఆయనను విభేదించే పార్టీల నాయకులు సైతం చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ రోడ్లపైకి వచ్చారు. సైబర్ టవర్స్ రజతోత్సవం సందర్భంగా హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ ఈవెంట్ నిర్వహించారు.  ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ది లీడర్. అందుకే అన్ని వర్గాల ప్రజలూ ఆయన కోసం నిలబడుతున్నారు.  ఓట్లు, సీట్లు తప్ప పాలన అంటే ఏమిటో తెలియని వైసీపీ అజ్ణానంతోనో, అహంకారంతోనో చంద్రబాబును లేని కేసులో ఇరికించి అక్రమంగా  అరెస్టు చేసింది. ఇలా చేయడం ద్వారా ఆయన ప్రజలలో తిరగకుండా చేయెచ్చని భావించింది.  చేశామని  సంబరపడింది. అయితే ఆయన అరెస్టుకు నిరసనగా వెల్లువెత్తిన ప్రజాగ్రహం జగన్ సర్కార్ ను బెంబేలెత్తించింది. ఆయన మధ్యంతర  బెయిలుపై విడుదలైన తరువాత రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసం వరకూ జనం నుంచి  నభూతో నభవిష్యతి అన్నట్లుగా లభించిన స్వాగతం.. జగన్ పార్టీకి  మైండ్ బ్లాక్ చేసిందనే చెప్పాలి.  సాధారణంగా ఎవరైనా జైలుకు వెడితే.. వారు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా  అరెస్టు చేయడం వల్ల  చంద్రబాబు గొప్పతనం బయటకు వచ్చింది. ఈ నాలుగున్నర దశాబ్దాల ప్రజా జీవితంలో చంద్రబాబు  ఔన్నత్యం గురించి తెలియని వారికి  కూడా తెలిసింది.  ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలి సారి బాధ్యతలు చేపట్టి పరుగులు పెట్టించిన అభివృద్ధి గురించి పాతికేళ్ల యువకులకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడంతో  తమకు ఇప్పుడు ఇన్ని ఉపాధి, ఉద్యోగ, విద్యావకాశాల వెనుక ఉన్న మహత్తర ఆలోచన చంద్రబాబుదే అన్న విషయం బోధపడింది. అంతే కాదు.. చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా ఆయన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏం సాధించారో.. సమాజాభ్యున్నతికి, పేదల సంక్షేమానికి, వారి జీవన స్థాయి పెంచడానికి ఏం చేశారో జనబాహుల్యానికే కాదు.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కూడా కళ్లకుకట్టినట్లు తెలిసింది. అందుకే జనాభిమాన సంద్రం రాజమహేంద్రవరం నుంచి.. ఉండవల్లిలోని ఆయన వివాసం వరకూ ఉప్పెనలా పొంగింది. ఆయన రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లికి  బయలుదేరానని తెలిసిన క్షణం నుంచీ జనం ఆయనకు స్వాగతం పలికేందుకు రాదారి పొడవునా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అర్థరాత్రి దాటిపోతుందని తెలిసినా సాయంత్రం ఆరుగుంటల నుంచే ఆయన కోసం రోడ్ల పక్కన వేచి ఉన్నారు. అలా వేచి ఉన్నవారిలో  పెద్ద సంఖ్యలో  మహిళలు కూడా ఉన్నారు. రాజమహేంద్రవరం  నుంచి  ఉండవల్లి నివాసం చేరుకోవడానికి సాధారణంగా అయితే నాలుగు గంటలు పడుతుంది. కానీ చంద్రబాబు కోసం అశేషంగా వచ్చిన జనవాహిని కారణంగా ఆ ప్రయాణం  14  గంటలకు పైగా పట్టింది. దీనిని బట్టే చంద్రబాబు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అవగతమౌతుంది.  స్కిల్ కేసులో  చంద్రబాబును జగన్ అక్రమంగా అరెస్టు చేసిందని.. మొత్తం ప్రపంచం అంతా నమ్మింది. వైసీపీ నేతలు ఎంతగా గొంతు చించుకుని ఆయన అవినీతికి పాల్పడ్డారు అంటూ చెప్పినా, ఆధారాలు ఉన్నాయని నమ్మబలికినా నమ్మలేదు. ఆఖరికి  వైసీపీ శ్రేణులు కూడా చంద్రబాబు అవినీతికి  పాల్పడ్డారంటే నమ్మలేమనే ప్రైవేటు సంభాషణల్లో చెప్పాయంటే ఆయన విశ్వసనీయత ఎంతటిదో అవగతమౌతుంది. ఆ విశ్వసనీయతకు భయపడే చంద్రబాబు అవినీతి పరుడని ఎంత చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రుసరుసలాడారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలో ఆయన గురించి ఒక మాట తరచూ వినిపించేది. ఆయన నిద్రపోరు.. అధికారులను నిద్రపోనివ్వరు  అని. ఇప్పుడు  జనం .. ఆయన తప్పు చేయరు.. ఎవరినీ తప్పు చేయనీయరు అని చెబుతున్నారు. అదే  నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబుపై స్కిల్ కేసు జగన్ ప్రభుత్వ  కక్షసాధింపేనని చంద్రబాబుకు  సంఘీభావం  తెలపడంద్వారా  తేటతెల్లం చేశారు. 

మేడిగడ్డను పరిశీలించిన రాహుల్ గాంధీ

లక్షా 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలకు గండిపడటంతో కెసీఆర్ సర్కారు ఆత్మ విశ్వాసంలో పడింది. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్  సిద్దంగా ఉంది. ఈ  ప్రాజెక్టును పరిశీలించడానికి కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వచ్చింది.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం (నవంబర్ 1) మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అనంతరం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ చేరుకున్న ఆయన ఇటీవల కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన వెంటనే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క కూడా ఉన్నారు. అనంతరం హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు.  మరోవైపు, బ్యారేజీ పరిశీలనకు పోలీసులు ఇతరులెవరికీ అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ కార్యకర్తలను బ్యారేజీ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుంటూ బ్యారేజీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటనకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.  ప్రాజెక్టు పరిశీలన అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన బ్యారేజీ రెండేళ్లలోనే దెబ్బతినడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల దోపిడీ, నిర్మాణంలో అక్రమాల వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. దర్యాప్తు సంస్థల అధినేత అమిత్‌షా అవినీతిపై మోదీ చర్యలు తీసుకోలేదని రాహుల్ పేర్కొన్నారు.అంతకుముందు మేడిగడ్డ అంబటిపల్లిలో జరిగిన మహిళా సదస్సులో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతున్న దోపిడీ, అన్యాయాన్ని చూసేందుకే వచ్చినట్టు చెప్పారు. బీఆర్ఎస్ పాలనతో ఈ తొమ్మిదిన్నరేండ్లలో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌కు, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ఏటీఎంలా మారిందని విమర్శించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ దోచుకోవడం వల్ల మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకవైపు.. కాంగ్రెస్ మరోవైపు ఉందని పేర్కొన్నారు. 

జగన్ లో ముదిరిపోయిన ఓటమి భయం

తప్పు ఒప్పు లేదు.. చట్టం, రాజ్యాంగం పట్టదు.. పాపం పుణ్యం అసలే లేదు. కావలసింది ఒక్కటే మరోసారి అధికారం దక్కించుకోవడం. అందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కనీ అంతిమ లక్ష్యం అధికారమే. మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతకైనా సిద్దపడుతున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ హత్య, కోడికత్తి లాంటి ఎన్నో డ్రామాలను రక్తి కట్టించిన జగన్ ఈసారి ప్రతిపక్షాలను తనకు అడ్డం లేకుండా చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు. కనీసం ఛార్జ్ షీట్ లో పేరు కూడా  లేని కేసులో చంద్రబాబును ఇరికించి.. అప్పటికప్పుడు కఠినమైన సెక్షన్లతో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన్ను రాజమండ్రి జైలుకు పరిమితం చేశారు. 53 రోజులుగా ఈ కేసు దర్యాప్తు ఎలాంటి కొలిక్కి రాలేదు. అయితే, చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసే సమయంలో కూడా సీఐడీ చంద్రబాబును కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. ఆయనను బయటకి పంపినా ఆయన చేతులు కట్టేసేలా చర్యలు ఉండాలని సీఐడీ కోరింది. చంద్రబాబు విడుదలతో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.  రాజమండ్రి నుండి విజయవాడ వరకూ దారిపొడవునా జనం బాబుకు జయజయధ్వనాలు చేశారు. చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పార్టీ అధినేత జైలు నుండి బయటకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులలో కదలిక వచ్చిది. తెలుగుదేశం నేతలు మునుపెన్నడూ లేని విధంగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. ఇక, ప్రభుత్వంపై సమరశంఖమే అనే భావన కలుగుతుండగానే ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. టీడీపీలో ఉత్సాహం ఏ మాత్రం గిట్టని వైసీపీ సర్కార్ మాత్రం దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. చంద్రబాబు విడుదల సందర్భంగా ఎటువంటి రాజకీయ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ సర్కారు ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. అప్పటికప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని.. అందుకే చంద్రబాబును కట్టడి చేసేలా చర్యలు ఉండాలని కోరారు. చంద్రబాబు అరెస్టుకు ముందు వైసీపీ పరిస్థితి నిర్జీవంగా కనిపించింది. అప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు బస్సు యాత్ర, ప్రాజెక్టుల సందర్శనతో టీడీపీ ఫుల్ స్వింగ్ లో ఉండగా.. పవన్ కళ్యాణ్ కూడా వారాహీ యాత్రతో జనసేనను యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ముందస్తు సర్వేలలో కూడా వైసీపీ పరాజయం ఖరారనే ఫలితాలతో ఎక్కడికక్కడ వైసీపీ పరిస్థితి దిగజారిపోయింది. దీంతో ఎలాగైనా చంద్రబాబును కట్టడి చేయాలనే కుట్ర పన్ని స్కిల్ కేసులో ఆయనను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ కేసును న్యాయస్థానాలలో నిలిపేందుకు కూడా   శ్రమ  పడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో సీఐడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోతుంది. ఒకవేళ ఈ కేసులో చంద్రబాబు ఎక్కడ బయటకి వస్తారోనని రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, పుంగనూరు కేసులను కూడా పైకి తెచ్చిన సీఐడీ ఎలాగైనా ఆయన్ను బయటకు రాకుండా చూడాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ, ఫైనల్ గా చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చారు . అయితే, చంద్రబాబు బయట ఉన్నా బెయిల్ షరతుల పేరిట ఆయన్ను కట్టడి చేయాలని ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తే.. ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో అర్ధమవుతుంది. స్కిల్ కేసులో ఈసారి కోర్టు తప్పకుండా చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందని భావించిన సీఐడీ.. అప్పటికప్పుడు మద్యం కేసును తెరపైకి తెచ్చింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు అక్రమంగా లిక్కర్ లైసెన్సులు ఇచ్చారంటూ ఆయన్ను ఏ3గా చూపుతూ కోర్టుకు నివేదించింది. అయితే కోర్టు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ వైపే మొగ్గు చూపింది. బెయిల్ ఇచ్చినా షరతులు కఠినంగా ఉండాలని మరో పిటిషన్ కూడా వేసింది. ఇదంతా చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డిలో ఓటమి భయం ఎంతగా ముదిరిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.  

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

స్కిల్ కేసులో  హైకోర్టు మధ్యంతర బెయిలుతో మంగళవారం (అక్టోబర్ 31) రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన నారా చంద్రబాబునాయుడు..అక్కడ నుంచి  రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి బుధవారం(నవంబర్1) ఉదయం చేరుకున్న సంగతి తెలిసిందే. దారి పొడవునా ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. రాజమహేంద్రవరం నుంచి నాలుగు గంటలలో చేరుకోవాల్సిన చంద్రబాబు కాన్వాయ్ ఉండవల్లి చేరుకునే  సరికి తెల్లావారి ఆరు గంటలు అయ్యింది. అంటే 14 గంటల సమయం పట్టింది. దీనిని బట్టే దారి పొడవునా జనం ఆయనకు స్వాగతం పలకడానికి ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఉండవల్లి నివాసంలో సాయంత్రం వరకూ విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుని విమానంలో హైదరాబాద్ వచ్చారు. అక్కడ నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని తరువాత కంటి పరీక్షల  నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెడతారు. ఇలా ఉండగా గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించాలని  తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు సాయంత్రం 4.30 నుంచి కార్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం నాయకుడు, శ్రేణులే కాకుండా చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులూ కూడా పాల్గొన్నారు. 

విజయశాంతి భావోద్వేగ ట్వీట్ ..ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు? 

విజయశాంతి చేసిన ఓ భావోద్వేగ ట్వీట్ ఆమె బీజేపీలో ఉక్కపోతకు గురౌతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఉంది. గత కొంత కాలంగా ఆమె బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన రెండు సందర్భాలలోనూ ఆమె మోడీ సభలకు హాజరు కాలేదు. దీంతో ఆమె త్వరలో బీజేపీకి గుడ్ బై చెబుతారన్న వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత బీజేపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నా విజయశాంతి బీజేపీనే అంటిపెట్టుకుని ఉండటంతో ఆ ప్రచారం అంతా ఉత్తిదేనని అంతా భావించారు. అయితే ఉరుము లేని పిడుగులా విజయశాంతి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తెలంగాణ ఉద్యమం నాటి ఉద్వేగాన్నీ, ఉద్యమ  ఆంకాంక్షలను వెల్లడించారు. తెలంగాణ  బిడ్డల  క్షేమం  తప్ప నాడు  ఉద్యమంలో   తాము  ఇంకేం కోరుకోలేదనీ, అలాగే ఉద్యమ ఫలితం తెలంగాణ  రాష్ట్రం వచ్చిన తరువాత తాము  వ్యతిరేకించింది కేసీఆర్ దోపిడీనీ, కుటుంబ పాలననే  తప్ప.. బీఆర్ఎస్ కార్యకర్తలను కాదనీ, తన పోరాటం కేసీఆర్  కుటుంబపాలన, కొందరు  బీఆర్ఎస్ నేతల  అరాచకత్వంపైనేనని స్పష్టం  చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. తెలంగాణ బిడ్డలు.. వారు ఏ  పార్టీ కార్యకర్తలైనా అంతా సంతోషంగా  గౌరవంగా ఉండాలన్నదే తన  ఆకాంక్ష  అని  ఆ  ట్వీట్ లో పేర్కొన్నారు. జై తెలంగాణ అంటూ తన పోస్టును ముగించిన విజయశాంతి.. రాజకీయ కార్యాచరణ ఏంటన్నది ఇప్పుడు తెలంగాణ సమాజంలో పెద్ద చర్చగా మారింది. గతంలో ఒక సందర్భంలో విజయశాంతి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీపై తన అభిమానాన్ని చాటుకున్నారు.  ఇప్పటి ట్వీట్ లో రాజకీయ వైరాగ్యం ప్రదర్శించారు.  తన పాతికేళ్ల రాజకీయ జీవితం అంతా సంఘర్షణతోనే గడిచిపోయిందన్న నిర్వేదం ఆమె ట్వీట్ లో ప్రస్ఫుటమైంది. ఎన్నడూ పదవుల కోసం పాకులాడకపోయినా అదే పరిస్థితి ఎందుకు ఎదురౌతున్నదో అవగతం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ట్వీట్ తరువాత ఇప్పుడు ఆమె రాజకీయ అడుగులు ఎటుపడనున్నాయన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.

చంద్రబాబు బెయిల్ పై సీఐడీ అనుబంధ పిటిషన్.. తీర్పు రిజర్వ్

చంద్రబాబు బెయిల్‌పై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌పై  ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు బెయిలు నిబంధనలను ఉల్లంఘించారనీ, మరింత కఠినమైన షరతులు విధించాలని కోరుతూ ఏపీ సీఐడీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. సీఐడీ పిటిషన్ పై బుధవారం  (నవంబర్ 1) విచారించిన హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఇలా ఉండగా సీఐడీ కోరుతున్న షరతులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయంటూ చంద్రబాబు తరఫు  న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న హైకోర్టు న్యాయమూర్తి  తీర్పును రిజర్వ్ చేశారు. ఈ తీర్పు శుక్రవారం(నవంబర్ 3) వెలువడే అవకాశాలు ఉన్నాయి.   తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్యంతబెయిలులో మరిన్ని షరతులు విధించాలని తన అనుబంధ పిటిషన్ లో సీఐడీ కోరింది. మధ్యంతర బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత  చంద్రబాబు మీడియాతో మాట్లాడారనీ తద్వారా  షరతులను ఉల్లంఘించారనీ పేర్కొంటూ అందుకు సంబంధించి వీడియో క్లిప్పింగులను కోర్టుకు సమర్పించింది. అలాగే రాజమహేంద్ర వరం నుంచి భారీ ర్యాలీగా విజయవాడకు వచ్చారనీ కోర్టుకు ర్యాలీలు నిర్వహించ వద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా...రాజమహేంద్రవరం నుంచి 13 గంటల పాటు ర్యాలీగా విజయవాడకు వచ్చారని కోర్టుకు తెలిపింది. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు చంద్రబాబు కోర్టు ఆదేశాలను అతిక్రమించలేదనీ, ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మాట్లాడటం ప్రాథమిక హక్కులో భాగమే తప్ప షరతుల అతిక్రమణ కాదని పేర్కొన్నారు.  ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయస్థానం తీర్పు శుక్రవారం(నవంబర్3)కు వాయిదా వేసింది. 

విశాఖకు జగన్.. మళ్లీ వాయిదా తప్పదా?

ఈ సంక్రాంతి.. ఈ దసరాకి.. మరో రెండు నెలలలో.. మరి కొద్ది రోజులలోనే.. అతి త్వరలోనే.. ఇవీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుండి పాలన కోసం పెట్టిన గడువులు, ముహూర్తాలు, చెప్పిన మాటలు. గత రెండేళ్లుగా విశాఖ రాజాధాని అనే మాట వల్లె వేసిన వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో విశాఖ నుండి పాలన అనే కొత్త నినాదాన్ని అందుకున్నారు. అధికారికంగా విశాఖకు రాజధాని తరలింపు కుదిరే అంశం కాకపోవడంతో సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు అంటూ హడావుడి మొదలు పెట్టారు. మాటలైతే ఎప్పటికప్పుడు కోటలు దాటుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ కాదు.. రిషికొండ ప్యాలెస్ నుంచి జగన్ పాలన అంటూ ప్రసంగాలూ, ప్రకటనలూ దంచేస్తున్నారు. కానీ అందుకు ముహూర్తాలు మారుతున్నాయి. గడువులు మారుతున్నాయి  ఆచరణ మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. రిషికొండను తవ్వేసి అక్కడ భారీ నిర్మాణాలు కట్టేస్తున్న సంగతి తెలిసిందే. పేరుకు ఇవ్వన్నీ పర్యాటక శాఖ భవనాలని చెప్పినా.. అవి సీఎం కార్యాలయాల కోసమేనని అందరికీ తెలిసిందే.  వైసీపీ నేతలే ఓపెన్ గా ఈ మాట చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు గడువులు మారిన విశాఖ పరిపాలన తరలింపు తాజాగా దసరా నుండి ఈ డిసెంబర్ కి మారిన సంగతి తెలిసిందే. అయితే  ఇప్పుడు ఈ డిసెంబర్ లో సీఎం విశాఖకు మకాం మార్చడం కష్టమే అన్న భావనే అందరిలో వ్యక్తం అవుతోంది.   విశాఖకు తరలి వెళ్లాలంటూ ప్రభుత్వం అక్కడ పరిపాలనకు అనువైన భవనాలు చూడాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే విశాఖలో పర్యటించి నివాస యోగ్యమైన భవనాలను ఎంపిక చేసింది. ఆ మాటకొస్తే కమిటీ ఏర్పాటుకు ముందే వైసీపీ నేతలు ఇక్కడ భవనాలను వెతికి పెట్టారు. ఇక రుషికొండ మీద నిర్మిస్తున్న భవనాలలలో కొన్నింటిలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే, రుషికొండ మీద భవనాలంటే తొలి నుండి ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే రుషికొండపై భవనాలపై పిటిషనర్లు కోర్టుకు వెళ్లారు. రుషికొండ మీద కోర్టు అనుమతికి విరుద్ధంగా అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని గతంలో కోర్టుకు వెళ్ళిన పిటిషనర్లే ఇప్పుడు మరోసారి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. గతంలో రుషికొండపై 9.88 ఎకరాలలో తవ్వకాలకు పర్యావరణ శాఖ అనుమతిస్తే.. ఏకంగా 20 ఎకరాలలో తవ్వకాలు చేపట్టారు. ఇదే విషయాన్ని అప్పుడు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో కేంద్ర బృందం పరిశీలించి అక్రమ తవ్వకాలు నిజమేనని నివేదికను హైకోర్టుకు అందజేసింది. మరి ఆ నివేదిక ఏమైందో తెలియదు.. చర్యలు ఎందుకు తీసుకోలేదో తెలియదు. కాగా, ఇప్పుడు మరోసారి అదే పిటిషనర్లు రుషికొండ మీద అక్రమ కట్టడాలు అంటూ హైకోర్టుకు వెళ్లగా.. కేంద్ర బృందాలతో మరోసారి సర్వే చేయించాలని కోర్టు ఆదేశించింది. అలాగే గతంలో ఇచ్చిన అక్రమ తవ్వకాల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మొత్తంగా త్వరలోనే బృందాలు మళ్ళీ విశాఖకు వచ్చి ఈ నిర్మాణాలను పరిశీలించనున్నాయి. అనుమతులకు మించి తవ్వకాలు జరిపారని ఇప్పటికే కేంద్ర బృందాలు నివేదిక ఇవ్వగా..  ఇప్పుడు పరిశీలినకు రానున్న బృందాలు కూడా అనుమతికి మించి నిర్మాణాలు కూడా జరిపారని నివేదిక ఇవ్వడం గ్యారంటీ. ఎందుకంటే అక్కడ పర్యాటక భవనాలకు సరిపడా నిర్మాణాలు కట్టాల్సిన చోట.. సీఎంఓ కోసం సుమారు రూ.500 కోట్లతో భారీ ప్యాలెస్  నిర్మాణం జరుగుతోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కనుక కేంద్ర బృందం రేపు ఎలాగూ నివేదికలో కోర్టుకు అదే చెప్పనుంది. దీంతో కోర్టు ఆదేశాలు కీలకం కానున్నాయి. రుషికొండపై భవనాలు నిబంధనలుకు విరుద్దమైతే అది సీఎంఓకు పనికి రాదని తీర్పు రానుంది. అసలు ఈ నివేదిక  విచారణకు ఎంత లేదన్నా  నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.  ఈ లోగా డిసెంబర్ కూడా వచ్చేస్తుంది. సీఎంఓ తరలింపుకు కనీసం నెల రోజుల సమయం కావాలి. ఈ నెలలోనే అది మొదలైతే తప్ప డిసెంబర్ లో అక్కడ నుండి పరిపాలన మొదలయ్యే అవకాశం ఉండదు. కానీ ఇప్పట్లో ఈ వ్యవహారం తేలే పరిస్థితి కనిపించడం లేదు. సీఎంఓ ఒక్కటే రుషికొండపై ఏర్పాటు చేయాలని చూస్తుండగా.. మిగతా అధికారులకు నగరంలో పలు చోట్ల నివాసాలు వెతికి పట్టుకున్నారు. సీఎంఓను కూడా నగరంలో ఎక్కడో ఒక చోట భారీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, జగన్ అందుకు సుముఖంగా లేరు.  దీంతో విశాఖ నుంచి పాలన ముహూర్తం మరో సారి వాయిదా తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కృష్ణాతీరంలో. వైసీపీ కార్పొరేటర్ భర్త గోదావరి బాబుకి దేహశుద్ది

 ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (అక్టోబర్ 31)రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఆయన రాజమండ్రి నుండి విజయవాడ కరకట్ట సమీపంలో ఉన్న తన నివాసానికి కాన్వాయితో బయలుదేరారు. ఆ క్రమంలో రహదారిపైకి భారీగా ప్రజలు చేరుకోన్నారు. అయితే విజయవాడ బెంజిసర్కిల్ వద్ద జేబు దొంగలు హల్‌చల్ చేశారు. ఓ టీడీపీ కార్యకర్త జేబులోని సెల్ పోన్‌తోపాటు రూ. 20 వేల నగదు కొట్టేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. సదరు దొంగను పట్టుకొని.. దేహశుద్ది చేసి.. విజయవాడ నగర పోలీసులకు అప్పగించారు. అయితే నగదు దొంగిలించి పారిపోతున్న వ్యక్తి విజయవాడ నగరంలోని 37వ డివిజన్ కొత్తపేట కార్పొరేటర్, వైసీపీ నాయకురాలు గోదావరి గంగ భర్త గోదావరి బాబు అని గుర్తించారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు ఈ ఘటన నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు బెంజి సర్కిల్ వద్ద  చోటుచేసుకుంది. మరోవైపు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో గోదావరి బాబుపై కేడీ షీట్ ఉందని తెలుస్తోంది. జేబు దొంగతనాలు, రద్దీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ల చోరీ చేయడంలో ఈ గోదావరి బాబు ఆరితేరిపోయాడన్న ప్రచారం అయితే  స్థానికంగా హల్‌చల్ చేస్తోంది. అయితే అతడి భార్య గత మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో జగన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం విశేషం.   ఓ వైపు భార్య ప్రజా ప్రతినిధిగా ఉన్నా.. ఆమె భర్త గోదావరి బాబు మాత్రం పాత వృత్తిని వదులుకోకపోవడంతో.. ఈ ఘటన జరిగిందనే ఓ ప్రచారం అయితే నగరంలో వాడివేడిగా నడుస్తోంది. అదీకాక చంద్రబాబు నాయుడు కాన్వాయి బెంజిసర్కిల్ వద్దకు చేరుకున్న సమయంలో టీడీపీ శ్రేణులు జోష్‌లో ఉండటాన్ని గుర్తించిన గోదావరి బాబు.. అదే సమయం అనుకొని.. ఓ టీడీపీ కార్యకర్త జేబులో నుంచి సెల్ ఫోన్, నగదు దొంగిలించి.. పక్కనే ఉన్న తన సన్నిహితుడికి ఇచ్చి.. అక్కడి నుంచి చల్లగా జారుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించిన టీడీపీ శ్రేణులు గుర్తించి.. వెంటనే గోదావరి బాబును పట్టుకొని.. బాగా దేహశుద్ది చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. స్థానిక ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరులుగా ఉన్న వారిలో చాలా మంది నేరచరితులు, కాల్ మనీ వ్యాపారులు, చిల్లర దొంగలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.