ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 14 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కరెంటు లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. దీంతో ప్రమాద తీవ్రత వెంటనే తెలియరాలేదు.  విశాఖ నుంచి పలాస వెళుతున్న స్పెషల్ ప్యాసింజర్ రైలును విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు ఆగి ఉండగా,  దానిని అదే ట్రాక్ పై వచ్చిన విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్ ను ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది.   విశాఖపట్టణంలోని కేజీహెచ్, విమ్స్‌లో వైద్య బృందాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. విశాఖపట్టణం నుంచి ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు పంపించారు. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం నేపథ్యంలో  రైల్వే శాఖ  పలు రైళ్లు  రద్దు చేసింది. కోర్బా-విశాఖపట్టణం, పారాదీప్-విశాఖపట్టణం, పలాస-విశాఖపట్టణం, విశాఖపట్టణం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్టణం, విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్‌‌మోహన్‌రెడ్డి ఏపీ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

తెలంగాణలో బీజేపీ ఖాళీ అయిపోతోందా?

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి ఒక్కరొక్కరుగా అగ్రనేతలు దూరం అవుతున్నారు. తెలంగాణలో అధికారమే  తరువాయి అంటూ ఆర్భాటంగా ఇతర పార్టీల నుంచీ చేరికల  కోసం ఏకంగా  చేరికల క మిటీనే ఏర్పాటు చేసి, ఆ కమిటీ సారథ్య బాధ్యతలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటలకు అప్పగించినా కూడా.. ఆ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరేవారికి విశ్వసనీయత కలిగిన ఆప్షన్ గా కనిపించడం లేదు సరికదా ఇప్పటికే పార్టీలో ఉన్న వారు కూడా మునిగిపోయే నావను ఎలా నమ్ముకుంటాం అనుకుంటున్నారో ఏమో ఒక్కరొక్కరుగా  పార్టీని వీడుతున్నారు. అలా వీడుతున్నట్లు ప్రకటిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీని వీడారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన రాష్ట్ర బీజేపీ నాయకులకే కాదు, ఆ పార్టీ అధిష్ఠానానికి కూడా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. గతంలో  తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి కారణం.. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించాలంటే అప్పట్లో బీజేపీయే సరైన పార్టీగా కనిపించిందనీ, అప్పట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనే పరిస్థితి లేదని భావించి, శాసన సభ్యత్వాన్ని కూడా వదులుకుని రాజీనామా చేసి బీజేపీలో చేరాననీ గుర్తు చేసిన ఆయన ఇప్పుడు బీజేపీని వీడడానికి కూడా అదే కారణం చెప్పారు.  బీఆర్ఎస్ తో గట్టిగా తలపడుతుందని భావించిన బీజేపీ ఇప్పుడు ఆ పార్టీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఆ కారణంగానే పార్టీ వీడుతున్నానని అన్నారు.  ఈ వ్యాఖ్యలతో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని వస్తున్న విమర్శలు, ఆరోపణలకు బలం చేకూర్చారు.  ఇప్పుడు తాజాగా  మాజీ ఎంపీ  వివేక్  కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. రేవంత్ రెడ్డితో ఆయన దాదాపు గంటన్నర పాటు చర్చలు జరపడమే కాకుండా, అందుకు సంబంధించిన పొటో కూడా విడుదల చేయడంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు.  మాజీ ఎంపీ వివేక్ సోదరుడు ఇప్పటికే బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.   మొయినాబాద్‌ లోని వివేక్‌ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవంత్, వివేక్ భేటీ  ఫలవంతమైందనీ, ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఇక లాంఛనమేనని రాజకీయవర్గాలు అంటున్నాయి.  కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడానికి ఇంత కాలం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ ముక్త తెలంగాణ దిశగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

తెలంగాణలో పోటీకి తెలుగుదేశం దూరం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ నుంచి తెలుగుదేశం తప్పుకుంది. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం కోసం ఖమ్మం సభతో శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ పరిస్థితులన్నీ సానుకూలమైన తరువాత హఠాత్తుగా పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ఆ పార్టీకి ప్రజాభిమానం వెల్లువలా పోటెత్తినా.. ప్రస్తుత పరిస్థితుల్లో  తెలంగాణలో పార్టీని సమన్వయం చేయడం, అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగినా ప్రచారం చేయడానికి, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై కాన్సట్రేట్ చేసే పరిస్థితి లేదన్న అభిప్రాయానికి వచ్చిన పార్టీ అధినేత ఈ సారికి పోటీకి దూరంగా ఉండటమే మేలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని శనివారం(అక్టోబర్ 28) రాజమహేంద్రవరంలో తనను ములాఖత్ ద్వారా కలుసుకున్న కాసాని జ్ణానేశ్వర్ కు తెలియజేశారు. అధినేత నిర్ణయాన్ని కాసాని ఆదివారం (అక్టోబర్ 29) హైదరాబాద్ లో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అధినేత అరెస్టు, రాష్ట్రంలో పార్టీ పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం కారణంగా ఆయన ఉద్వేగానికి లోనైనట్లు కనిపించింది. ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు అయితే తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ గుర్తుతో పోటీకి అనుమతిస్తే.. అన్నీ తామే చూసుకుంటామనీ, పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని వారి సందర్భంగా ఉద్వేగంగా చెప్పారు. ఈ విషయంలో ఒక సారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో సంప్రదించాలని కాసానిని కోరారు. ఈ మేరకు అక్కడికక్కడే సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టారు.  దాదాపు ఏడాదిన్నర కిందట తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామంటూ నారా చంద్రబాబునాయుడు ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు వచ్చిన ప్రజాదరణ చూసి రాజకీయ పార్టీలే ఆశ్చర్యపోయాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణను, ప్రతిష్టను, బలాన్ని అప్పటి వరకూ తక్కువ అంచనా వేసిన పార్టీలు తమ వైఖరి మార్చుకున్నాయి. ఖమ్మం సభ తరువాత హైదరాబాద్ లో మరో సభ నిర్వహించి సత్తా చాటిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ.. అక్కడ నుంచీ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై దృష్టి సారించింది. తెలుగుదేశంలోకి చేరికలు పెరిగాయి.  విభజన తరువాత వివిధ కారణాలతో పార్టీని వీడి వెళ్లిన తెలంగాణ నేతలంతా సొంత గూటికి చేరుతారన్న అంచనాలు పెరిగాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పూర్వవైభవం సంతరించుకుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనకు గురయ్యాయి.  ఈ సారి తెలంగాణలో తెలుగుదేశం కింగ్ మేకర్ పాత్ర పోషించడం ఖాయమని అంతా భావించారు. ఇంత కాలం తెలుగుదేశం ఓటు బ్యాంకుతో అధికారాన్ని అనుభవిస్తున్న అధికార బీఆర్ఎస్ లో అన్ని పార్టీల కంటే ఎక్కువ ఆందోళన వ్యక్తం అయ్యింది.  సరిగ్గా ఈ సమయంలోనే ఏపీలో జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసింది. దీంతో తెలంగాణలో పార్టీ పరిస్థితి ఒక్క సారిగా అగమ్యగోచరంగా మారిపోయింది.  చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో  వెల్లువెత్తిన నిరసనలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అధికార బీఆర్ఎస్ పై జనంలో ఆగ్రహం పెల్లుబికింది. దాంతో పరిస్థితిని గమనించిన కేటీఆర్ గొంతు సవరించుకున్నారు. చంద్రబాబు  అరెస్టును ఖండించారు.  ఇక బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు పలువురు చంద్రబాబు అరెస్టును ఖండించడమే కాకుండా.. ఆయన అరెస్టును నిరసిస్తూ ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు  చంద్రబాబు క్వాష్ పిటిషన్, బెయిలు పిటిషన్లు కోర్టుల్లో  వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు బయటకు రాకుండా చేస్తున్నారన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అగ్ర నేతలంతా.. చంద్రబాబు న్యాయపోరాటానికి సంబంధించి అంశాలలోనూ, అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలో  నిరసన కార్యక్రమాలలోనూ, అలాగే ఓటర్ల జాబితాలోని అవకతవకలను వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడంలోనూ నిమగ్నమైపోయారు. ఈ నేపథ్యంలో సరిగ్గా నెల రొజులలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం లేకపోవడంతో పోటీ నుంచి వైదొలగడమే మేలని పార్టీ నిర్ణయానికి వచ్చింది.   

జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్.. ఏపీలో జరుగుతున్నది అదేనా?!

జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్  డెనైడ్, ఇది అందరికీ తెలిసిన నానుడి. అంటే, ఆలస్యంగా అందే న్యాయం అన్యాయంతో సమానం. న్యాయదేవత  ప్రవచించిన న్యాయశాస్త్ర మూల సూక్తుల్లో, ఈ నానుడి అత్యంత ముఖ్యమైనది. అందుకే న్యాయ స్థానాల్లో, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల్లో,ఈ సూక్తి తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే, ఇంతలా వాడుకలో ఉన్న ఈనానుడి  న్యాయ సూక్తి  ఎంతవరకు అమలవుతోంది  అంటే వచ్చే సమాధానం మాత్రం మౌనమే. అంతే కాదు ఈరోజున న్యాయవ్యవస్థ, న్యాయస్థానాలు ఎదుర్కుంటున్నప్రధాన సమస్య, విమర్శ కూడా ఇదే.   అందుకే, భారత ప్రధాన న్యాయమూర్తి మొదలు భారత ప్రధాన మంత్రి వరకు ఎందరో పెద్దలు, ఇదే సూక్తిని పదే పదే నొక్కి నొక్కి చెపుతుంటారు. అయినా, జరగకూడని, అన్యాయం  జరిగి పోతూనే వుంది. న్యాయవిచారణలో జాప్యం కారణంగా ఎందరో ఏ నేరం చేయని వారు సైతం రిమాండ్ లో జైళ్ళలో మగ్గుతున్నారు. విలువైన జీవితాలను కోల్పోతున్నారు.  ఈ రోజున దేశంలోని న్యాయస్థానాల్లో లక్షలు కాదు కోట్లలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఎంత మంది నిర్దోషులు నిదితులుగా విచారణ ఎదుర్కుంటున్నారో   రోజులు, నెలలు, సంవత్సరాలుగా,  జైళ్లలో మగ్గుతున్నారో  లెక్కలేదు. ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయం పొందడం ఆలస్యం కావడం ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటని అన్నారు. చట్టంలో సంక్లిష్టతలను తొలిగించి, అందరికీ అర్థమయ్యే విధంగా, చట్టాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడంతో పాటుగా, సులభతర న్యాయం ఈజ్ ఆఫ్ జస్టిస్  లక్ష్యంగా చట్టాలను సవరించ వలసిన అవసరం ఉందని మోడీ అన్నారు.   అలాగే,భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అనేక సందర్భాలలో పెండింగ్ కేసుల విషయంలో విచారం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో 1970ల నాటి కేసులు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, జుడిషియల్ క్లాక్ పదేళ్ళు ముందుకు పరుగులు తీయాలని అన్నారు. అయితే, వాస్తవంలో ఏం జరుగుతోందో  జుడిషియల్ క్లాక్   ఎంత వేగంగా కదులుతుందో, చూస్తూనే ఉన్నాం. అది కూడా ఎక్కడో కాదు. మన ఆంధ్ర ప్రదేశ్ లోనే చూస్తున్నాం.  అద్ర ప్రదేశ్ లో  2019 అసెంబ్లీ  ఎన్నికలకు ముందు రెండు కీలక నేరాలు తెరపై కొచ్చాయి. అందులో ఇకటి అప్పటి విపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన ‘కోడికత్తి’ దాడి కేసు రెండోది అదే జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. ఈ రెండు కేసులు కూడా రాజకీయాలతో ముడి పడినవే. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినవే. అయినా  ఈ కేసుల్లో ఇంతవరకు దోషులెవరో తేలలేదు.  నిజానికి, బాబాయ్ మర్డర్ కేసుతో పోలిస్తే, కోడి కత్తి కేసు చాలా చాలా చిన్న కేసు. అయినా, బాబాబ్ మర్డర్ కేసులో ఎనిమిదవ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది, అదే కేసులో ఏడవ నిందితుడు,అవినాష్ రెడ్డి తండ్రి   వైఎస్‌ భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం హెల్త్ గ్రౌండ్ పై బెయిల్ మంజూరు చేసింది. ఆయన విడుదలయ్యారు.  వివేకా హత్య కేసుతో పోలిస్తే, కోడికత్తి కేసు చాలా చిన్న కేసు. కాదు కాదు వివేకా హత్య కేసుతో పోలిస్తు కోడికత్తి కేసు అసలు కేసే కాదు. అయినా ఐదేళ్ళ క్రితం వైజాగ్ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడ్డ నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ కు మాత్రం ఇంతవరకు బెయిల్ రాలేదు. దీంతో దాదాపు ఐదేళ్లుగా బెయిల్ లేకుండా  అతను జైల్లోనే మగ్గిపోతున్నారు. ఇదెక్కడి న్యాయం?  కానీ  న్యాయశాస్త్ర మూల సూత్రం, (జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్  డెనీడ్)కు మాత్రం ఈ జాప్యం పూర్తిగా విరుద్ధం. ఇక్కడ ఇంకో దుర్మార్గం, మహా దుర్మార్గం ఇంకొకటుంది.  ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే సరిపోతుందని, కానీ జగన్ రెడ్డి  ముందుకు రాకపోవడంతో శ్రీనుకు బెయిల్ రావడం లేదని అతని కుటుంబం, లాయర్ ఆరోపిస్తున్నారు.  అవును ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు, కానీ,  ఎక్కడో ఇంగ్లాండ్ లో చదువుకుంటున్న తమ బిడ్డలను చూసోచ్చేందుకు.. అక్కడ జరిగే వేడుకల్లో పాల్గొని వారితో ఆనందం పంచుకునేందుకు  సమయం చిక్కిన ముఖ్యమంత్రికి, పక్కనే ఉన్న జగన్ రెడ్డి ఇష్ట నగరం వైజాగ్ వెళ్లి, కోర్టులో వాగ్ములం ఇచ్చే సమయం లేదా  అన్నది  శ్రీను తల్లి తండ్రులే కాదు , సామాన్యులు కుడా అడుగుతున్న ప్రశ్న.  నిజానికి, సమయం చిక్కక పోవడం కాదు, శ్రీను బయటకు వస్తే కోడికత్తి అసలు కథ బయటకొస్తుంది, అందుకే జగన్ రెడ్డి, కోర్టుకు రావడం లేదు  అనేది అనుమానం  కాదు  అందరికీ తెలిసిన నిజం. అయితే, ఇక్కడ ప్రశ్న జగన్ రెడ్డి కోర్టుకు రావడం, రాక పోవడం కాదు, ఒక పాతికేళ్ల యువకుడిని కేవలం ముఖ్యంత్రికి సమయం లేదన్న కారాణంగా బెయిల్ ఇవ్వకుండా జైలుకు పరిమిత చేయడం ఎంతవరకు న్యాయం? ఇది ఇప్పడు న్యాయదేవత ముందున్న ప్రశ్న.

చంద్ర బాబు కోసం!

స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా ఆదివారం (అక్టోబర్ 29) న ‘కళ్లు తెరవాలి’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆ కార్యక్రమంలో భాగంగా  ఆదివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 గంటల వరకూ ఐదు నిముషాలు  కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినదించాలని తెలుగుదేశం  పిలుపునిచ్చింది. అలా చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించింది.  స్కిల్ డెవలప్‌మెంట్‌లో కుంభకోణం జరిగిందని.. అందులో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సెప్టెంబర్ రెండో వారంలో ఆయన్ని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నాటి నుంచి ఆయన అక్కడే  ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రంలోనే కాకుండా.. దేశ విదేశాల్లో సైతం ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.    మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. తెలుగుదేశం పార్టీ పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ క్రమంలో అక్టోబర్ 23న విజయదశమి రోజున మనం చేద్దాం జగనాసుర దహనం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతకు ముందు అంటే అక్టోబర్ 15న న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం చేపట్టింది. అదే విధంగా అక్టోబర్ 7వ తేదీన కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక సెప్టెంబర్ 30న మోత మొగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇవన్నీ రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్య చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టారు. ఇంకోవైపు చంద్రబాబుని అరెస్ట్ చేసి 50 రోజులు పూర్తి కావోస్తోంది. సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.  ఇక చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో.. ఆ విషయాన్ని తట్టుకోలేక 105 మంది మరణించారు.   చంద్రబాబు అరెస్ట్ అక్రమమని నినదిస్తూ.. ఆయన భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజల మధ్యకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్పూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

మేడిగడ్డపై పూర్తి సమాచారం ఇవ్వండి

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనపై  పూర్తి సమాచారాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఆదివారం( అక్టోబర్ 29)లోగా వివరాలు అందివ్వాలంటూ జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ లేఖ రాసింది. అక్టోబర్ 23-26 మధ్య ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర కమిటీ తిరిగి ఢిల్లీ బయలుదేరకముందే వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే కొన్ని వివరాలు అందించగా మరికొన్ని వివరాలు కావాలని కేంద్రం నియమించిన కమిటీ సభ్యులు కోరుతున్నారు.  మొత్తం 20 అంశాలకు సంబంధించిన సమాచారం అడగగా 3 అంశాలకు సంబంధించిన డేటాను మాత్రమే ఇచ్చారని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. ఒక అంశంపై పూర్తి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన ఇటీవలే కుంగిన విషయం తెలిసిందే. భారీ శబ్దంతో కుంగింది. ఆ వెంటనే డ్యామ్ పరిశీలనకు కేంద్రం కమిటీని నియమించింది. బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగుబాటు నేపథ్యంలో దానికి సమీపంలోని అయిదారు పిల్లర్స్ కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. పిల్లర్ కుంగుబాటు అనంతరం పరిస్థితులపై నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదట బ్యారేజీ ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణం, నీటిని తోడిపోయడం, పునాది వరకూ పరిశీలన, బ్యారేజీలో ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్ పరిస్థితిపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం నిపుణులను సంప్రదించి నిర్మాణ సంస్థతో పునరుద్ధరణ పనులు చేయించనున్నారు. ఇప్పటికే దీనిపై ఓ షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ఎత్తిపోతల్లోని మేడిగడ్డ  బ్యారేజీ మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద ఈ నెల 21న కుంగింది. భారీ శబ్దంతో బీ - బ్లాకులోని 18, 19, 20, 21 ఫిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఓ అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే వంతెన కుంగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కి.మీ ఉండగా, సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. బ్యారేజీ అకస్మాత్తుగా కుంగడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా, ఈ ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 

టెన్షన్ ఎందుకు దండగ.. జగన్ ఉండగా అంటున్న బీఆర్ఎస్!

సొంత రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా బీఆర్ఎస్ లో గెలుపు ధీమా తగ్గడం లేదు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ వైఫల్యాలను విపక్షాలు ఎత్తి చూపుతున్నా ఖాతరు చేయడం లేదు. ఎందుకంటే వారి ధీమా వెనుక ఆంధ్రప్రదేశ్ ఉంది. జగన్ సర్కార్ వైఫల్యాలు ఉన్నాయి. సాటి తెలుగు రాష్ట్రంలో అభివృద్ధి లేమినీ, గడిచిన నాలుగున్నరేళ్లలో రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పేర్చలేని ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతూ.. ఇంత కంటే రుజువేం కావాలి మేం బ్రహ్మాండంగా పని చేశామని చెప్పుకోవడానికి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు, మంత్రులు. పదే పదే ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ వైఫల్యాలనూ, నిష్క్రియాపరత్వాన్నీ ఎత్తి చూపుతూ తెలంగాణ ప్రజల మనస్సులను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఐటీ కంపెనీలు రాష్ట్రంలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నాయి. పరిశ్రమలు కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా  పోరుగు రాష్ట్రంలో బిచాణా ఎత్తేసి మరీ తెలంగాణకు తరలివస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. అమరరాజా బ్యాటరీస్ ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. వీటన్నిటినీ చెప్పుకుని తెలంగాణను ఇంతగా అభివృద్ధి చేశామనీ, అదే పొరుగున ఉన్న ఏపీలో అయితే అభివృద్ధి ఆనవాలే కనిపించడం లేదనీ చెప్పుకుంటోంది.  ఇలా ఆంధ్రప్రదేశ్ ను గేలి చేస్తూ తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలూ ఎన్నిరకాలుగా విమర్శించినా ఏపీలో మంత్రుల నోటి వెంట ఒక్క ఖండన కూడా రావడం లేదు. ఏపీ మంత్రులకు రాష్ట్ర అభివృద్ధీ పట్టదు? ప్రజల సంక్షేమమూ పట్టదు. ఎంత సేపూ బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి అంటూ ఆత్మస్థితికీ, విపక్షాల నాయకులపై విమర్శల దాడికే ఎక్కడి సమయమూ సరిపోవడం లేదు.  తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు జగన్ గాలి తీసేసే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన వైనాన్ని ఎత్తి చూపుతూ.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిన వైనాన్ని ఉదాహరణలతో సహా చెప్పారు. ఈ సారి ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ అభివృద్ధి మరింత జోరందుకుంటుందనీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ను చూస్తున్నారుగా? అంటూ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను చూపి ప్రజలను హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి రాకుంటే.. హైదరాబాద్ పరిస్థితి అమరావతిలా మారిపోతుందంటూ ప్రజలకు హెచ్చరికలాంటిది చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే.. ఏపీలో జగన్ సర్కార్ వైఫల్యాలే తమకు విజయసోపానాలుగా ఆయన భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ సర్కార్ ను వైఫల్యాలపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలూ ఇంతగా విమర్శించి, గేలిచేస్తున్నా ఏపీ అధికార పార్టీ నేతలకు చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదంటే ఆ విమర్శలను వారు వాస్తవమేనని అంగీకరిస్తున్నారనే అర్ధమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రాలుగా విడిపోయినా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు పరస్పరాధీనాలు అన్నది నిర్వివాదాంశం. అందుకే ఏపీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపైనా, తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనా ఉంటుంది. మరీ ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ను చూసిన తెలంగాణ జనం.. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ ను చూసి గర్వపడతారనడంలో సందేహం లేదు. దానినే తమ ఎన్నికల విజయానికి దోహదపడేలా మార్చుకోవాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. పైగా ఎం అన్నా నోరెత్తలేని పరిస్థితుల్లో జగన్ సర్కార్, ఆయన కేబినెట్ సహచరులు ఉండటం కూడా తెలంగాణలోని అధికార పార్టీకి సానుకూలాశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఎన్నికలలో జగన్ కు సంపూర్ణ సహకారం అందించిన కేసీఆర్ ఇప్పుడు జగన్ సర్కార్ వైఫల్యాలను అవహేళన చేస్తూ.. తమ విజయానికి బాట వేసుకోవాలని భావిస్తున్నారు.  ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హైద్రాబాద్ కు ఏపీలో అమరావతికి పట్టిన గతే పడుతుందని తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో జగన్ హయాంలో ఏం జరిగింది? గత ప్రభుత్వం బ్రహ్మాండంగా వేసిన అభివృద్ధి పునాదులు కూలిపోయాయి. ప్రపంచ రాజధానిగా దేశ విదేశాల ప్రశంసలు అందుకున్న అమరావతి నేడు నిర్వీర్యమైపోయింది. ఈ విషయాన్నే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పి విజయానికి బాటలు వేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. వాస్తవానికి మామూలు పరిస్థితుల్లో అయితే హరీష్ రావు వ్యాఖ్యలు, విమర్శలు తెలంగాణ సమాజంపై పెద్దగా ప్రభావం చూపి ఉండేవి కావు. కానీ ఏపీ సర్కార్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత, హైదరాబాద్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడి అరెస్టు తరువాత ఏపీలో జరుగుతున్న ప్రతి విషయమూ తెలంగాణ ఎన్నికలను  ప్రభావితం చేసేదిగానే మారింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో కూడా ఏపీతో సమానంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక పార్టీ, ఒక నాయకుడు అని కాకుండా సామాన్య జనులు, ఐటీ ఉద్యోగులూ, పార్టీలతో సంబంధం లేకుండా నేతలూ అంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించకపోయినా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేసుకోవాలంటే ఏపీ వెళ్లి చేసుకోండి.. ఇక్కడ మాత్రం అంగీకరించం, అనమతి ఇవ్వం అని మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరించినా బాబుకు మద్దతు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే వస్తున్నది. కాగా మంత్రి హరీష్ రావు మాత్రం బాబు అరెస్టును తొలి నుంచీ ఖండిస్తూనే వచ్చారు. ఏడు పదులు నిండిన వయస్సున్న వ్యక్తిని అక్రమంగా జైలులో నిర్బంధించడం సరికాదని అన్నారు. ఎన్నికల వేళ తనవ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించిన కేటీఆర్ కూడా మాట మార్చి చంద్రబాబు అరెస్టును ఖండించారు. లోకేష్ కు పూర్తి సంఘీభావం ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అరెస్టు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తొలుత ఎవరూ కనీసం ఊహామాత్రంగానైనా అనుకోలేదు.. కానీ అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సెంటర్ పాయింట్ గా మారిపోయింది. అందుకే తెలంగాణలో రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వారూ జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ స్పందించకున్నా... కేటీఆర్ ఆందోళనలు వద్దన్నా.. బీఆర్ఎస్ నేతలు, శ్రేణులూ ఖాతరు చేయలేదు. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు. బీజేపీ అగ్రనాయకత్వం స్పందించకున్నా తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం బాబు అరెస్టును ఖండించడంలో ముందున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు జగన్ సర్కార్ పై విమర్శల దాడిని పెంచడాన్ని అర్ధం చేసుకోవాలి. ఏపీలో జగన్ సర్కార్ ను ఎంతగా విమర్శిస్తే తెలంగాణలోని చంద్రబాబు అభిమానులను అంత ఎక్కువగా ఆకట్టు కోవచ్చని ఆయన భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే హరీష్ రావు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతోందనీ, అదే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పుకున్నారు.  

బిజెపి తీరుపై బాబూ మోహన్  ఫైర్...  ఈ ఎన్నికలకు దూరమని ప్రకటన

సినిమాల్లో కమెడియన్ పాత్రల నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బాబూమోహన్ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా? బిజెపి ప్రకటించిన రెండు జాబితాలో తన పేరు రాకపోవడంతో ఆయన రోడ్డెక్కారు. పార్టీ తనను అవమాన పరుస్తుందని, పైగా తన కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ప్రకటనలు చేస్తుందని బాబు మోహన్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో చెప్పారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం పార్టీలో 1999 ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రయ్యారు. తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థిగా 2004,2014 ఎన్నికల్లోపోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో తనకు టిఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో బాబూ మోహన్ బిజెపిలోకి జంప్ అయి టికెట్ సంపాదించారు. టిఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ చేతిలో ఓటమి పాలయ్యారు.ఈ ఎన్నికల్లో బిజెపి  ఆందోల్ టికెట్ కేటాయించకపోవడంతో  బాబు మోహన్ బిజెపికి, ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.  తన పాపులారిటీ గురించి తెలియదా? తానెవరో తెలియదా? తనను ఎన్నో జాబితాలో పెడతారు? అయినా తాను ఈసారి పోటీకి దూరంగా ఉండాలనుకున్నానని  బాబూ మోహన్ అన్నారు. తన పేరు మొదటి, రెండో జాబితాలో లేకపోవడంపై ఆయన పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదన్నారు. బీజేపీకీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను ఫోన్ చేసినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇస్తున్నామని చెబుతూ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధిష్ఠానం స్పందనను బట్టి తన నిర్ణయం ఉంటుందన్నారు. వరుస జాబితాల పేరుతో దాపరికం తనకు నచ్చడం లేదన్నారు. పార్టీ రాష్ట్ర పెద్దలు కావాలని తనను పక్కన పెడుతున్నట్లుగా అనిపించిందన్నారు. టిక్కెట్ ఎవరికైనా ఇచ్చుకోనీయండి.. మా అబ్బాయికి అంటున్నారు.. నా కొడుక్కే ఇవ్వండి.. కానీ అది తనకు నేరుగా చెప్పాలి కదా? అని బాబూ మోహన్ ప్రశ్నించారు. నాన్చుడు ధోరణి సరికాదన్నారు. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని అని, అలాంటి తనను ఎన్నో జాబితాలో పెడతారని ప్రశ్నించారు. అందుకే బాధతో పార్టీకి, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి పార్టీలో ఉండాలా? రాజీనామా చేయాలా? చూస్తానన్నారు.

గోరంట్ల మాధవ్ చేతలే కాదు..మాటలు కూడా ఛండాలమే!

ఎన్నికలు వస్తున్నాయంటే.. టైగర్‌కే కాదు.. ఘర్‌ కా టైగర్‌కి సైతం టైమొచ్చేస్తోంది. అందుకు తాజా ఉదాహరణ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం. అధికార వైసీపీ చేపట్టిన సాధికార బస్సు యాత్రలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో  జగన్ తిరిగి సీఎం అవ్వడం.. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చావడం ఖాయమని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  2019 ఎన్నికలకు ముందు ప్రెస్‌మీట్‌లో సీఐ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. మీసం తిప్పి.. నాటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసరడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారని.. ఆయనలోని టాలెంట్‌ని నాడే  జగన్ గుర్తించి.. పార్టీలోకి ఆహ్వానించి.. కండువా కప్పారని.. అలా ఎంపీగా గెలిచారని.. అయితే గతేడాది గోరంట్ల మాధవ్.. నగ్న వీడియో బైటకు వచ్చి.. విపరీతంగా వైరల్ అయిందని.. దీంతో మాధవుడిలోని టాలెంట్ ప్రపంచమంతా చూసిందని.. దాంతో ఈ మాధవుడు మామూలోడు కాదని ప్రపంచమంతటికీ బాగా అర్థమైందని.. అంటే.. సీఐగా ప్రెస్‌మీట్ పెట్టి మీసం తిప్పాడని.. ఎంపీ అయిన తర్వాత బట్టలు విప్పాడని నెటిజన్లు ఈ సందర్భంగా  గోరంట్ల మాధవ్‌పై సెటైర్లు సంధిస్తున్నారు.         వైసీపీ  నేతలంతా అంటే.. నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, గోరంట్ల మాధవ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా ఇంతేనా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. అదీకాక వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌కి ఏం ఇష్టమో.. వీరందరికీ బాగా తెలుసునని.. ఆ క్రమంలో   నారా చంద్రబాబు నాయుడు,  నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్‌లను టార్గెట్ చేసి.. వీరంతా వారిపై బూతులతో విరుచుకు పడిపోతారని.. అలా అయితేనే తమకు మంత్రి పదవి దక్కుతుందన్న  భావనలో  ఉండటం వల్లే  అలా వ్యవహరిస్తున్నారని.. పేర్కొంటున్నారు.  అయితే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశాలు,  బహిరంగ సభల్లో సీఎం  జగన్ సైతం ప్రతిపక్ష పార్టీల నేతల వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేస్తారని.. మరి ఆ సమయంలో ఆయనకు.. తన ఫ్యామిలీ గురించి కానీ.. జగనన్న వదిలిని బాణం వైయస్ షర్మిల ఫ్యామిలీ గురించి కానీ.. వాళ్ల తాతా రాజారెడ్డి ఫ్యామిలీ గురించి కానీ గుర్తుకు రాదా అనే సందేహాన్ని మరో నెట్‌జన్ వ్యక్తం చేశారు.  మరో నెటిజన్  ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారని.. ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్‌లో అంతా బాగానే ఉందని చెబుతున్నారని.. కానీ కోర్టు ఆదేశాలతో ఇటీవల చంద్రబాబును ఐదుగురు వైద్యులు పరీక్షించి.. ఆయనకు కీలక వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారని.. అందుకు సంబంధించిన నివేదికను చంద్రబాబు భార్య నారా భువనేశ్వరికీ అందించారని.. సదరు నివేదికలో బాబు ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉందని తెలిపారని.. దీంతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన ఫ్యామిలీలోనే కాదు... పార్టీ శ్రేణుల్లో , జనంలో సైతం తీవ్ర ఆందోళన నెలకొందని.. అటువంటి వేళ.. ఓ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా గోరంట్ల మాధవ్ ఇలా మాట్లాడడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదీకాక గోరంట్ల మాధవ్.. పూర్వాశ్రమంలో పోలీస్ శాఖలో సీఐగా బాగానే లాఠీ తిప్పారని అంటే... క్రమశిక్షణకు చిరునామాగా నిలవాల్సిన  ఖాకీవనం నుంచి వచ్చిన ఆయన ఇలా వ్యవహరించడం.. ఆ శాఖకే కాదు.. ఆయన పార్టీకి సైతం సిగ్గు చేటని అంటున్నారు.  మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో దక్కించుకోవాలంటే.. ఇటువంటి వ్యాఖ్యలు చేయాలని..  ఆ వ్యాఖ్యలతో జగనన్న కళ్లలో ఆనందం..  మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ చేసినట్లు నాట్యం చేస్తుందని ఇంకో నెటిజన్ సెటైరికల్‌గా అన్నారు. పార్టీ అధినేత, సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం.. ఈ నేతలంతా ఏమైనా చేస్తారని.. ఎంతకైనా తెగిస్తారని.. యథా పార్టీ అధినేత.. తథా ఆయన అనుచరగణమని మరో నెటిజన్ పేర్కొనడం గమనార్హం. అయినా.. ఇన్ని చెబుతున్నా.. గోరంట్ల మాధవ్.. తన నగ్న వీడియో నిజమైనదో కాదో మాత్రం చెప్పడం లేదని... ఆయన వీడియో హల్ చల్ చేసిన తర్వాత... చాలా కాలం బయట ఎక్కడా కనిపించని.. ఈ హిందూపురం ఎంపీగారు.. మళ్లీ ఇలా.. ఎన్నికల వేళ.. మైకు ముందు రెచ్చిపోతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

కాంగి‘రేసు’కు అసమ్మతి కళ్లెం!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట.. కాంగి‘రేసు’కు అసమ్మతి కళ్లేం వేస్తున్నదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ప్రజా వ్యతిరేకతతో బీఆర్ఎస్, అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ డీలాపడిన వేళ.. అనూహ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఐక్యతారాగం ఆలపిస్తూ కాంగ్రెస్ దూసుకుపోతున్నది. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత మాత్రం కాంగ్రెస్ లో అసమ్మతి, గ్రూపు విభేదాలు దాదాపుగా సమసిపోయాయన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఎవరికి వారు.. తమలో విభేదాలు ఉంటే తరువాత చూసుకుందాం.. ముందు అధికారం కోసం సమైక్యంగా కదులుదాం అన్నట్లుగా పార్టీ రాష్ట్ర నాయకులంతా ముందుకు సాగుతున్నారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ రెండో జాబితా విడుదలైందో.. ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. ఎన్నికల విజయంపై ధీమాతో రేసుగుర్రంలా ముందుకు దూసుకెడుతున్న కాంగ్రెస్ కు కళ్లెం పడింది. ఒక్క సారిగా టికెట్ ఆశించి భంగపడిన నేతలు నిరసన గళం విప్పారు. రాజీనామాల బాట  పట్టేలా  కనిపిస్తున్నారు.  టికెట్ రాక  భంగపడిన నాయకులు తమ అనుచరులతో ఆత్మీయ  సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. ముందుగా టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి  రాజీనామా  చేశారు. ఆయన దివంగత నేత పీజేఆర్ తనయుడు కావడం విశేషం. విష్ణువర్ధన్ రెడ్డి ఆశించిన జూబ్లీహిల్స్ స్థానాన్ని మాజీ క్రికెటర్ అజాహరుద్దీన్ కు కేటాయించింది. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి పార్టీ టికెట్ ఆశించిన దండెం రాంరెడ్డి సైతం తన అసమ్మతిని బాహాటంగానే వెల్లడించారు. ఇబ్రహీం పట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రాంరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మహేశ్వరం టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై పారిజాత నర్సిహా రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్, మునుగోడు, ఎల్లారెడ్డి,  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో కూడా అసమ్మతి భగ్గుమంది. ఆయా నియోజకవర్గాలలో టికెట్ ఆశించిన నేతలు కూడా కాంగ్రెస్ ను వీడే యోచనలో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఆత్మీయులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మీద నిన్నటి వరకూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్లు కనిపించిన తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అసమ్మతి మంటలు రేగుతున్నాయి. ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. వీరితో పాటు రెండో జాబితాలో కూడా టికెట్ దక్కని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా అలకబూనినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆశించిన స్థానం నుంచి కేసీఆర్ పోటీకి దిగుతుండటంతో ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ ను రంగంలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఆయనను నిమాజాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దింపాలని హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే అక్కడ నుంచి పోటీకి షబ్బీర్ అలీ పెద్దగా సుముఖత చూపడం లేదని అంటున్నారు.  అలాగే పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయని అంటున్నారు.  

రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు గుర్తించే సాఫ్ట్‌వేర్ లేదు

ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో ఓటు హక్కును వినియోగించడం సహజ న్యాయం. ఒకటికి మించి ఇతర రాష్ట్రాలలో ఓటు హక్కును వినియోగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిది. దీన్ని నిలువరించే మెకానిజం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎన్నికల కమిషన్ కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉంది. ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పందించారు.  ఓటర్లు రెండు చోట్లా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు పార్టీలు తమ దృష్టికి తెచ్చాయని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ తమ వద్ద లేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను బట్టి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న వారిని ఓటు వేయకుండా అడ్డుకోలేమన్న విషయం స్పష్టమవుతోంది.   ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉందని ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. నిన్న ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. జనవరి 1 నాటికి పూర్తి జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటి వరకు ఆ పనిచేయని వారు డిసెంబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 లేదంటే జులై 1 లేదా, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండితే కనుక అలాంటి వారు కూడా ముందస్తుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అలాగే, 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్టు వెల్లడించారు.

బాలినేనికి మళ్లీ పిలుపు.. ఏం జరుగుతోంది?.. ఏం జరుగుతుంది?

ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. శనివారం(అక్టోబర్ 28) ఉదయం వైవీ సుబ్బారెడ్డితో కలిసి వచ్చి తనను కలవవలసిందిగా జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించిన్నట్లు చెబుతున్నారు. బాలినేని, సుబ్బారెడ్డి మధ్య విభేదాల పరిష్కారానికే ఈ పిలుపు అని పార్టీ వర్గాలు చెబుతున్నా.. అంతకు మించిన కారణమే ఉందంటున్నారు పరిశీలకులు. బాలినేనికి మంత్రివర్గ విస్తరణ సమయంలో కేబినెట్ నుంచి తొలగించిన నాటి నుంచీ ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతూనే ఉన్నారు. పార్టీలోనే కాకుండా, నియోజకవర్గంలో కూడా తన మాట చెల్లుబాటు కావడం లేదన్న అసంతృప్తిని అవకాశం వచ్చిన  ప్రతి సందర్భంలోనూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలా వ్యక్తం చేసిన ప్రతి సారీ తాడేపల్లి  నుంచి పిలుపురావడం.. ఆయన ఇష్టంగానో, అయిష్టంగానో సర్దుకు పోవడం జరుగుతూనే ఉంది. ఇంతకీ బాలినేని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినా, పార్టీకి నష్టం కలిగే వ్యాఖ్యలు చేసినా ఇంత వరకూ ఆయనపై వేటుపడకపోవడానికి కారణం.. ఆయన సీఎం జగన్ కు బంధువు కావడమేనని అంటున్నారు. అయితే జగన్ లో బాలినేని తన  బంధువు అన్న సానుకూలత ఇసుమంతైనా లేకపోయినా.. ఆయన పార్టీ వీడి వెళ్లకుండా నిలువరించడం, అలాగే ఎంత అలకబూనినా బాలినేని తెగే వరకూ లాగకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తల్లినీ, చెల్లినీ పార్టీ నుంచి బయటకు గెంటేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు బాలినేనిని కూడా బయటకు పంపితే.. అది పార్టీ శ్రేణులకే కాకుండా.. ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలిస్తుందన్న  భావనతోనే బాలినేనిని తాను స్వయంగా  పొమ్మనడం లేదని చెబుతున్నారు. అలాగే బాలినేని కూడా ఎన్ని అవమానాలెదురైనా పార్టీనే పట్టకు వేలాడటానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచీ  ఆయనతోనే ఉన్న బాలినేని.. ఇప్పుడు బయటకు వెళ్లాలని భావించినా.. ఆయనకు స్వాగతం పలికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే పార్టీ ఏదీ లేకపోవడంతో కేవలం తన రాజకీయ భవిష్యత్ ఏమౌతుందో అన్న ఆందోళనతోనే వైసీపీలో పొమ్మన లేక పొగబెడుతున్నా.. ఆ పొగకు ఉక్కిరిబిక్కిరై విలవిలలాడుతున్నారు కానీ.. స్వతంత్రించి, ధైర్యం చేసి బయటకు రావడం లేదని అంటున్నారు. ఇక  బాలినేనికి వైసీపీతో బంధం తెగిపోయినట్లే అన్న  పరిస్థితి వచ్చిన  ప్రతిసారీ.. తాడేపల్లి నుంచి పిలుపు రావడం.. అక్కడ బుజ్జగింపులో.. బెదరింపులో తెలియదు కానీ బయటకు వచ్చి బాలినేని సర్దుకు పోవడం ఈ రెండేళ్లుగా రివాజుగా మారింది. ఇక బాలినేనికి పొసగని సుబ్బారెడ్డి  కూడా జగన్ కు సమీప బంధువే. ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం బాలినేనికి  జగన్ ఇవ్వడం లేదన్నది పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నారు. జగన్ బాలినేని పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే పార్టీలో, అధికారులలో కూడా ఆయనకు మన్నన మర్యాదా లేవన్నది బహిరంగ రహస్యమే.  ఇటీవల తన అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో మీడియా ముఖంగా వైసీపీ పెద్దలపై విరుచుకుపడిన బాలినేని.. తన వాళ్లపై సప్సెన్సన్ ఎత్తేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. గడువు సైతం విధించారు. కానీ ఆయన కోరుకున్నట్లుగా తన వారిపై సస్పెన్షన్ ఎత్తివేయకున్నా సర్దుకునిపోయారు. ఆ తర్వాత మరోసారి జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారని, పోలీసుల నుండి రెవెన్యూ అధికారుల వరకు ఎవరికీ తన మాట అంటే లెక్కలేకుండా పోయిందని ఆవేశాన్ని వెళ్లగక్కారు. ఆ తరువాతా షరామామూలే. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రకాశం జిల్లాలో  ఓ భూ ఆక్రమణల కుంభకోణం విషయంలో ఫైర్ అయి తన సెక్యూరిటీని సరెండర్ చేసిన బాలినేని.. ఆ చర్యతో అందరి దృష్టీ ప్రకాశం జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై పడేలా చేశారు. ఈ భూ కుంభకోణం వెనుక ఉన్నది వైసీపీ వారే కావడంతో జగన్ కు బాలినేని చర్య ఇబ్బందికరంగా మారింది. దీంతో  ఇక బాలినేని పనైపోయిందనే అంతా అనుకున్నారు. అయితే ఇటీవల జగన్ తల్లి వైఎస్సార్ తెలంగాణ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒంగోలులో బాలినేనికి కలిశారు. ఆ సందర్భంగా బాలినేని తన గోడు వెళ్లబోసుకుంటే..తానేం చేయలేనని విజయమ్మ నిస్సహాయత వ్యక్తం చేశారని బాలినేని వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేనికి తాడేపల్లి నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పిలుపు రాజీ కోసం కాదనీ, బుజ్జగించేందుకు అసలు కాదనీ పరిశీలకులు అంటున్నారు. బాలినేని, సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని తెలిసి కూడా ఇద్దరినీ ఒకే సమయంలో కలవాలని జగన్ భావించడం వెనుక బాలినేని సుబ్బారెడ్డితో సమన్వయం లేకుంటే కుదరదు అన్న అల్టిమేటమ్ ఇవ్వడానికేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైవీ సుబ్బారెడ్డితో చాలా ఇబ్బందులు ఎదుర్కొం టున్నానని బాలినేని ఇదివరకే జగన్‌కు ఫిర్యాదు చేసినందున ఈ భేటీలో కూడా  జగన్మోహన్‌ రెడ్డి  వైవీకే ప్రాధాన్యత ఇస్తే..  బాలినేని పార్టీ వీడడం ఖాయమని అంటున్నారు. 

కాంగ్రెస్ కు పిజెఆర్ కొడుకు రాజీనామా  

కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది.  తాజాగా జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని చివరి వరకూ ఆశించి భండపడ్డ  పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ లో ఒక్క జూబ్లిహిల్స్ లో మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఇటీవలి సర్వేలో తేలిందన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అలాంటిది తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దీన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని, ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.  కాగా, పీజేఆర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే గా,  సిఎల్పి నేతగా పి. జనార్ధన్ రెడ్డి(పిజెఆర్)  కాంగ్రెస్ పార్టీకి విశేషసేవలందించిన సంగతి తెలిసిందే. 

అలిపిరి నడక మార్గాన్ని మూసేద్దామనుకుంటున్నారా?

వన్యప్రాణులు జనావాసాలలోకి రావడం అరుదేమీ కాదు. అయితే వాటి సంచారాన్ని  నిరోధించి అటవీ ప్రాంతంలోకి మళ్లించే చర్యలు చేపట్టకపోవడమే ఆశ్చర్యం. గట్టిగా మాట్లాడితే అసలు శేషాచలం అడవులలో వన్యప్రాణులు లేకుండా చేస్తామంటున్నారు. దీంతో శేషాచలం అడవులలో అక్రమార్కులకు అడ్డులేకుండా చేయాలన్న ప్రయత్నమేదైనా జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల వైభవాన్ని తగ్గించేందుకు.. వన్యప్రాణుల భయం పెట్టి భక్తులు రాకుండా చేసే ఉద్దేశమేమైనా ఉందా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. తిరుమల కొండకు అలిపిరి నడక మార్గంలో వెళ్లే వారికి  ఇప్పుడు చిరుతలు, ఎలుగుబంట్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. రెండు నెలల కాలంలో ఐదారు  చిరుతలను  అటవీశాఖ, టీటీడీ  అధికారులు బంధించారు. అయితే వారా చర్యలు చేపట్టడానికి ముందే అభంశుభం తెలియని  చిన్నారి చిరుతపులి  దాడిలో  ప్రాణాలు  కోల్పోయింది. ఈ ఘటన తరువాతే టీటీడీ, అటవీశాఖ కదిలాయి. బోనులు ఏర్పాటు చేశామని హడావుడి చేశాయి. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచనలు చేశాయి. భక్తులకు ఆత్మరక్షణ కోసం కర్రలు ఇచ్చాయి. అంతేనా నడకదారిలో నిషేధాజ్ణలు విధించాయి. ఓ నాలుగో, ఐదో చిరుతలను బంధించామని ప్రకటించాయి. బోనులో ఉన్న చిరువ దగ్దర టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఫొటోలు కూడా దిగారు. సరే ఆ తరువాత చిరుతల సంచారం గురించిన వార్తలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా అలిపిరి నడకదారిలో  మళ్లీ చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. చిరుతే కాదు ఎలుగుబంటి కూడా నడకదారిలో  ప్రత్యక్షమైంది. దీంతో నడకదారి భక్తులలో మళ్లీ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  నడక దారిన నడచివేళ్ళే వారికి చేతి కర్రలను అందించే  కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్రూర మృగాలు ఎప్పుడు ఎటు వైపు నుండి దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ ఆ ఏడుకొండలవాడిపైనే భారం వేసి కాలి నడకన వెళ్తున్న భక్తులు చేతి కర్రలతో ఏం చేయాలని విమర్శలొచ్చాయి. పులులు, సింహాలను కర్రలతో తరమాలా అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అవన్నీ ఒకింత నెమ్మదించగానే మళ్లీ చిరుత సంచారం అంటూ వార్తలు రావడంతో  టీటీడీ తీర్పుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ క్రూరమృగాలు తిరుమల ప్రాంతానికి రాకుండా చర్యలు తీసుకోకుండా అడవిలో మృగాలను లేకుండా చేయాలనుకోవడం, లేదా వాటిని దారి మళ్లించి శేషాచలం అడవికు దూరంగా ఉంచాలన్న ప్రయత్నాలు టీటీడీ చేస్తున్నదన్న  అనుమానాలు వ్యక్తమవున్నాయి. అసలు  శేషాచలం అడవులను క్రూర మృగాల రహిత ప్రాంతంగా చేయాలనుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడవి నుండి మృగాలు తిరుమల మార్గంలోకి వచ్చే దారిలో రైలింగ్ వాల్స్ ఎత్తు పెంచడం.. నడక మార్గంలోకి అడవి నుండి మృగాలు వచ్చే అవకాశం ఉన్న చోట ఐరన్ గ్రిల్స్ తో జాలీలను ఏర్పాటు చేయడం వంటివి చేయవచ్చు. కానీ, టీటీడీ అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోకుండా అడవి మీద పడడం చూస్తే ప్రభుత్వానికి ఇక్కడ మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే తిరుమలకు భక్తుల రద్దీని తగ్గించే ఆలోచన చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామికి ఏడు కొండలు ఎందుకు.. రెండు కొండలు సరిపోవా అని అసెంబ్లీ సాక్షిగా వాదించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆ మాట నిజం చేసే పని మొదలు పెట్టారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు శేషాచలం అడవులలో వైసీపీ ప్రభుత్వ అండదండలతో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈక్రమంలోనే రక్షణ చర్యలు తీసుకోకుండా తిరుమల వెళ్లే భక్తుల రద్దీని తగ్గించడం.. నడక మార్గంలో భక్తులను భయాందోళనకు గురిచేయడం.. అదే సమయంలో శేషాచలం అడవిలో క్రూర మృగాలను అడ్డు లేకుండా చేసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం అలజడి రేపుతోంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో చిరుతపులి, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నెల 24 నుంచి 27 మధ్యన ఈ దృశ్యాలు నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు. చిరుత, ఎలుగుబంటి సంచారం నేపథ్యంలో నడక దారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గంపులుగా వెళ్లాలని సూచించింది. చిరుతను, ఎలుగుబంటిని బంధించేందుకు ఫారెస్టు అధికారులతో కలిసి చర్యలు చేపట్టినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమలలో కొన్ని నెలలుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న తిరుమల మెట్ల మార్గంలో లక్షిత అనే చిన్నారిపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. నాటి నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడి ఘటనతో అప్రమత్తమైన టీటీడీ.. అటవీ శాఖ అధికారులతో కలిసి తిరుమల కొండల్లో పలుచోట్ల బోన్లను, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. అనంతరం ఐదు చిరుతలు బోన్లలో చిక్కాయి. ఆ చిరుతలను అటవీ శాఖ అధికారులు దట్టమైన అడవుల్లో వదిలిపెట్టారు. ఆ తర్వాత తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లోనూ చిరుతపులి కలకలం రేపింది. తిరుమల, తిరుపతిలో చిరుతపులుల సంచారం నేపథ్యంలో.. నడక మార్గంలో వెళ్లే భక్తులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా భక్తుల చేతికి కర్రలు ఇస్తోంది. అంతేకాకుండా.. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తూ.. బృందానికి ఒకరు చొప్పున గార్డును నియమిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చిన్నారులను నడక మార్గంలో అనుమతించడంలేదు. అంతేకాకుండా.. చిన్నారులకు ట్యాగింగ్‌ను కూడా ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ఏది ఏమైనా చిరుతలు నడకమార్గంలోకి రాకుండా ఫెన్సింగ్ వంటి చర్యలు చేపట్టకుండా టీటీడీ కాలయాపన చేయడమే అనుమానాలకు తావిస్తున్నది. తిరుమల నడకదారిని మూసేద్దామనుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

తెలుగుదేశం, జనసేన ఐక్యతారాగం.. జగన్ సర్కార్ కు డేంజర్ బెల్!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక పెద్ద ముందడుగు వేశాయి. ఔను ఇప్పటికే రెండు పార్టీల మధ్యా పొత్తు కుదిరింది. క్షేత్ర స్థాయి నుంచీ రెండు పార్టీలూ సమన్వయంతో కలిసి నడిచేందుకు తమ కూటమి ఇక నుంచి  ఒకే గొంతుకతో, ఒకే గళంతో ముందుకు వెడుతుందని తెలుగుదేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా  ప్రకటించారు. ఈ సంయుక్త ప్రకటన అధికార వైసీపీకి నిస్సందేహంగా డేంజర్ సిగ్నలేనని పరిశీలకులు అంటున్నారు. ప్రజావ్యతిరేక ఓట్లు చీలే ప్రశక్తే లేదనీ, ఏపీలో జరగబోయేది ముఖాముఖీ పోరేననీ ఈ సంయుక్త ప్రకటనతో తేలిపోయింది. రంగంలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఉన్నా.. ఆ రెండు పార్టీలూ పోటీ పడాల్సింది నోటాతోనేననీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన  శ్రేణులు సమస్యలపై సంయుక్తంగానే పోరాడుతున్నాయి. తెలుగుదేశం కార్యక్రమాలలో జనసైనికులు, జనసేన కార్యక్రమాలలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. వెరసి  ఏ పార్టీ కార్యక్రమమైనా ఇరు  పార్టీల జెండాలూ రెపరెపలాడుతున్నాయి. లోకేష్ యువగళం  పాదయాత్రలో జనసేన పతాకం రెపరెపలు, పవన్ కల్యాణ్ వారాహీ యాత్రలో తెలుగుదేశం జెండాలే ఇందుకు తార్కానం. సరే అదలా ఉంచితే ఇరు పార్టీల మధ్య అధికారికంగా  పొత్తు  ప్రకటన వెలువడిన తరువాత తొలి సారిగా ఇరు పార్టీలదీ  ఇక ఒక అజెండా, ఒకే లక్ష్యం అన్న అధికారక  ప్రకటన మాత్రం  తెలుగుసేన  నామకరణంతోనే వెలువడిందని  చెప్పవచ్చు.   అసలు ఇప్పుడు కాదు.. రెండు  పార్టీలూ కలిసే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన అధినేత ఎప్పుడో రెండేళ్ల కిందటే ప్రకటించేశారు. అప్పటి నుంచీ ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందన్న అభిప్రాయం ఇరు పార్టీల శ్రేణులలోనూ, రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా బలంగా వ్యక్తం అయ్యింది. ఇరు పార్టీల శ్రేణులూ కూడా అందుకు స్వాగతించాయి. క్షేత్రస్థాయిలో కలిసే పని చేస్తూ వస్తున్నాయి. అధికార పార్టీ ఈ రెండు పార్టల మధ్యా పొత్తు పొడవకుండా ఉండేందుకు ఎన్ని యత్నాలు చేసినా, కుల, ప్రాంత, వర్గ విభేదాలకు అజ్యం పోయాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  సరే పవన్ కల్యాణ్ రెండేళ్ల నంచీ చెబుతున్న తెలుగుదేశంతో పొత్తు అన్న మాటను రాజమహేంద్రవరం వేదకగా తానే స్వయంగా ప్రకటించేశారు. అదీ జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబుతో రాజమహేంద్రవరం జైలులో ములాఖత్ అయి బయటకు వచ్చిన వెంటనే ఈ ప్రకటన చేయడంతో ప్రజలలో కూడా ఈ రెండు పార్టీల పొత్తుకు సానుకూలతే కనిపించింది. ఎవరినైనా సరే.. తాము తలచుకుంటే ఎంత కాలమైనా అక్రమంగా నిర్బంధించగలమనీ, రాష్ట్రంలో ఎక్కడా తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ చిన్న పాటి మాట వినబడినా సహించేది లేదనీ, రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛకు కూడా సంకెళ్లు వేశాశమనీ విర్రవీగుతున్న వైసీపీ అధికార మదాన్ని అణచాలంటే.. జగన్ పార్టీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి పోరాడాల్సిందేనన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. జనం కూడా రాక్షస పాలన నుంచి తమకు విముక్తి కలిగాలంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఐక్యంగా ఎన్నికల బరిలోకి దిగాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్, లోకేష్ లు వారం రోజుల కిందట రాజమహేంద్రవరం వేదికగా జరిగిన సమన్వయ కమిటీ భేటీలో ఈ ఐక్యతా రాగం అధికార పార్టీ చెవులు గింగిర్లెత్తేలా వినిపించింది.  

బీజేపీ బీసీ మంత్రం.. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందం?

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు. అయితే, అదేమిటో కానీ, కమల దళం రేకలన్నీ, కాలి వాడి రాలిపోయిన తర్వాత, ఇప్పడు బీసీ మంత్రం జపిస్తోంది. నిజానికి, బీజేపీ అగ్ర నాయకత్వం చేసిన పెద్ద తప్పు, ఎన్నికల ముంగిట పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్  ని తప్పించడం. అంతకు మించిన మరో తప్పు  కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడం. ఇతర కారణాలు ఉన్నా ప్రధానంగా ఈ రెండు తప్పులు బీజేపీని ఎన్నికల రేసులోంచి దాదాపుగా పక్కకు నెట్టేశాయి.  సంజయ్ మూడేళ్ళ శ్రమ బూడిదలో  పోసిన పన్నీరై పోయింది. చివరకు ఏపీలోలానే తెలంగాణలోనూ బీజేపీ ఆటలో అరటి పండుగా మిగిలిపోయింది. బండిని డ్రైవింగ్ సీట్ లోంచి తప్పించడంతో బీజేపీ బండి పట్టాలు తప్పింది. ప్రమాదంలో పడింది. ఇక ఇప్పడు   శుక్రవారం(అక్టోబర్ 27) సూర్యాపేటలో బీజీపీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. నిజమే రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు అమిత్ షా  ప్రయోగించిన బీసీ మంత్రం నిజంగా పనిచేస్తే అది బీజేపీకి గేమ్ చేంజర్ అవుతుంది. కానీ  ఇక్కడ మళ్ళీ బీజేపీ తప్పులో కాలేసింది. ఎప్పుడో చేయవసిన పని ఇప్పుడు చేసింది. అంతే కాదు  ఓ వంక బీసీ బండిని పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించి  ఇప్పడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించినంత మాత్రాన  బీసీలు నమ్ముతార?  బీజేపీ వైపు చూస్తారా? అంటే సందేహమే అంటున్నారు విశ్లేషకులు. అయితే అమిత్ షా ప్రకటన రాజకీయ వర్గాల్లో మాత్రం  ఇప్పుడు  చర్చనీయాశంగా మారింది. నిజానికి, బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించ కుండా బీసీ నేత ఈటల రాజేందర్ ను అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే  ఫలితం మరోలా ఉండేదని  బీజేపీ సీనియర్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అగ్రకుల (వెలమ, రెడ్డి) పార్టీలుగా ప్రజలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ గెలిస్తే  అయితే కేసీఆర్  కాదంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అలగే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే  అయితే రేవంత్ రెడ్డి, కాదంటే ఉత్తమ కుమార్ రెడ్డి ఆయనా కాకపోతే కోమటి రెడ్డి ముఖ్యమంత్రి అవుతారే కానీ ఏ బీసీ నాయకుడో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ వుంది. ఈ  నేపధ్యంలో బీసీ కార్డును సమర్ధవంతంగా వినియోగించుకునే చక్కని అవకాశం బీజేపీకి మాత్రమే వుంది. అయితే  అంతర్గత కుమ్ములాటల కారణమోచ మరోటో కానీ  బీజేపీ అగ్ర నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది. ఇక ఇప్పడు, బీసీ మంత్రం జపించినా అంతగా ఫలితం ఉండక పోవచ్చని బీజేపీలోనే ఒక  వర్గం  నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  అయితే  మరోవర్గం  నాయకులు మాత్రం  ఎన్నికల ప్రచారం ఊపందు సమయంలో  అమిత్ షా విసిరిన బీసీ సవాల్  ప్రత్యర్ధుల  ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ   ఆశలపై నీళ్ళు చల్లిందని అంటున్నారు.  నిజానికి, అసలు కథ ఇప్పుడే మొదలైంది.  బీసీ కార్డుతో పాటుగా అమిత్ షా ఎక్కు పెట్టిన కుటుంబ పాలన, కుటుంబ పార్టీ  అస్త్రం  ప్రజలను ఆలోచింప చేస్తుందని కూడా కొందరు బీజేపీ నేతలు   భావిస్తున్నారు.  కాగా  సూర్యాపేట సభలో అమిత్ షా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని.. అటు రాహుల్ గాంధీని పీఎం చేయటమే సోనియా గాంధీ జీవిత ధ్యేయమని  ఈ రెండు పార్టీలకూ బీసీల సంక్షేమం ఏమాత్రం పట్టదని చెప్పుకొచ్చారు. అందుకు  ప్రధాని నరేంద్ర మోదీనే ప్రత్యక్షసాక్ష్యమని చెప్పు కొచ్చారు. అంతే కాదు, బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ కేసీఆర్‌కు సవాల్ కూడా విసిరారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా  వెళ్ళిన నేపధ్యంలో బీజేపీ బీసీ మంత్రం ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూడవలసిందే కానీ ఇప్పుడే  తీర్పు చెప్పలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆ 19 నియోజకవర్గాలపై సస్పెన్స్

తెలంగాణ ఎన్నికలలో విజయంపై ధీమాతో రేసు గుర్రంలా పరుగెడుతున్న కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. రెండో జాబితా ప్రకటించిన తరువాత కూడా ఇంకా 19 నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరన్న దానిపై కసరత్తు సాగుతోంది. తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, శుక్రవారం (అక్టోబర్ 27) మరో 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. అయితే  మిగిలిన 19 నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవడంలో మాత్రం మల్లగుల్లాలు పడుతున్నది. తీవ్ర కసరత్తులు, పలు భేటీలు, సంప్రదింపుల తరువాత కూడా 19 ఆ 19 నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరన్నదానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది.   రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను తొలి, మలి విడత జాబితాలలో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 19 నియోజకవర్గాల విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో ఆ 19 నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది.  కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టిన   ఈ 19 నియోజకవర్గాలలో అభ్యర్థిత్వం కోసం   తీవ్ర పోటీ ఉండటమే కాకుండా.. పొత్తులో భాగంగా వామపక్షాలు, కోదందరామ్ నేతృత్వంలోని  టీజేఎస్ లకు కేటాయించాల్సి ఉండటం కూడా పార్టీ ఆ 19 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇంతకీ ఆ 19 అసెంబ్లీ నియోజకవర్గాలూ ఏమిటంటే..  వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్,నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పఠాన్ చెరు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్ ఖేడ్, అశ్వారావుపేట. వామపక్షాలు, టీజేఎస్‌కు కేటాయించే సీట్లపై  స్పష్టత వచ్చాకా రానున్న రెండు మూడు రోజులలో ఈ స్థానాలలో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్నది మూడో జాబితాలో ప్రకటిస్తామని కాంగ్రెస్ చెబుతోంది.  

అవహేళన చేస్తారా .. అనుభవిస్తారు.. వైసీపే తీరుతో అగ్రహిస్తున్న జనం

ఆమె రాజకీయ నాయకురాలు కాదు. అలాగని ఆమెకు రాజకీయాలు తెలియవని కాదు. ఆమె ఒక ముఖ్యమంత్రి కూతురు, మరో ముఖ్యమంత్రి భార్య, అయినా  ఆమె  రాజకీయాలకు దూరంగా ఒక సాధారణ గృహిణి. స్వశక్తిని నమ్ముకున్న ఒక చక్కని వ్యాపారవేత్త. అంతకు మించి సేవా మార్గంలో ముందుకు సాగుతున్న ఒక ఆదర్శమహిళ. అవును ఆమె ఎవరో కాదు... విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్రుల ‘అన్న’ అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  స్వర్గీయ నందమూరి తారక రామా రావు కుమార్తె. అలాగే, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించిన, విశేష అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు సతీమణి  నారా భువనేశ్వరి.  నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా  ఉన్న రోజుల్లో సైతం ఆమె ఏనాడూ ఆయనతో రాజకీయ వేదికలను పంచు కోలేదు. ముఖ్యమంత్రి సతీమణిగా పాటించవలసిన ప్రోటోకాల్ అవసరాలకు మించి మరో అడుగు ముందుకు  వేయలేదు. ప్రభుత్వం తరపున నిర్వహించే  దైవ కార్యాల్లో భర్త వెంట భార్యగా పాల్గొనడమే తప్ప ఎప్పుడూ,ఎక్కడా గీత దాట లేదు. ఇన్నేళ్లుగా చంద్రబాబు  నాయుడు సతీమణిగా ఆమె ఎన్నో ఎన్నికలు చూశారు. అయినా, ఏ నాడూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కొందరిలా  భర్త చెప్పుల్లో కాలు పెట్టలేదు.  మనకు తెలుసు, వైఎస్ కుటుంబం, ముఖ్యంగా వైఎస్ విజయమ్మ  ఎన్నెన్ని రాజకీయ విన్యాసాలు చేశారో, చేస్తున్నారో మనం అందరం చూశాం, చూస్తున్నాం. భర్త కోసం, కొడుకు కోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం పులివెందుల ప్రజలకు తెలియంది కాదు. అలాగే, ఆమె భర్త వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తర్వాత ఆమె స్వయంగా ఎన్నికల బరిలో దిగారు.. మరోవంక అటు ఏపీలో కొడుకు, జగన్ రెడ్డి ఇటు తెలంగాణలో కుమార్తె షర్మిల రాజకీయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. తప్పు కాకపోవచ్చును. కానీ, ఏనాడూ పిల్లికి బిచ్చం పెట్టని    వైసీపీ నాయకులు గురువింద గింజల్లా, నవ్వి పోదురు గాక  నాకేటి సిగ్గని భువనేశ్వరిని, నిజం గెలవాలి యాత్రను విమర్శిస్తున్నారు.   అదలా ఉంచితే, భువనేశ్వరి రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఇటు తండ్రి నుంచి, అటు భర్త నుంచి అబ్బిన  ప్రజాసేవ కు   ఏ నాడు దూరం కాలేదు. తమకున్నది నలుగురితో పంచుకోవాలనే ఎన్టీఆర్ ఆదర్శానికి అద్దం పడుతూ, 26ఏళ్ల క్రితం అంటే తన తండ్రి మరణించిన తర్వాత తండ్రి పేరుతో  ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో ఎన్నెనో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ను స్థాపించి అందులో వేలమంది అనాధ పిల్లలను ఉచితంగా చదిస్తున్నారు... ప్రతిభ కలిగిన విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా స్కాలర్ షిప్స్ అందిస్తూ 4,193 మంది పేద విద్యార్థులకు 3.44కోట్ల ఆర్థిక సాయం అందించారు... బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రతి ఏటా 50మంది ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఇప్పటివరకు 1.93కోట్లు స్కాలర్ షిప్ రూపంలో అందించారు...ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1,617మంది విద్యార్థులను కాలేజీలలో చదివిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్థాపించి 7,345 యువతీ యువకులకు శిక్షణ ఇప్పించి వారిలో 2,500 మందికి ఉద్యోగాలు ఇప్పించారు.  జాబ్ మేళాలు నిర్వహించి మరో 4,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు...గత 26 సంవత్సరాలలో 11,372 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 19,07,443 మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు...రక్త నిధి కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 83,582 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందులో 20,045 యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధి బాధితులకు 55,048 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర సేవల నిమిత్తం అందించారు. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 క్లస్టర్ మోడల్ ఆర్వో ప్లాంట్లను, 42ఇండివిడ్యువల్ ప్లాంట్లను నెలకొల్పి తాగు నీరు అందిస్తున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రకృత్తి విపత్తులు సంభవించిన సమయాల్లో ఇప్పటివరకు 20లక్షల మందికి సాయం అందించారు. 2013లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు 500మంది తెలుగు వారిని ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చేర్చారు. 2014లో హుద్ హుద్ తుపాను  వచ్చినప్పుడు 50,000మంది బాధితులకు మందులు, ఆహారం, మజ్జిగ, పాలు, త్రాగునీరు అందించారు. 2016లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు 10బస్తీలలోని 5,000మంది పేదలకు సాయం అందించారు.  2009లో కర్నూల్, మహబూబ్ నగర్ లో వరదలు సంభవించినప్పుడు 54వైద్య బృందాల ద్వారా శిబిరాలు నిర్వహించి 15కోట్ల విలువైన మందులు, వస్త్రాలు, దుప్పట్లను వరద బాధితులకు పంపిణీ చేశారు.  2021లో చిత్తూరు నెల్లూరులలో భారీ వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినప్పుడు 50వేల మందికి పైగా వరద బాధితులకు ఆహారం, పాలు, త్రాగు నీరు, దుప్పట్లు, నిత్యావసర సరకులు అందించారు. అంతేకాకుండా వరదల్లో మరణించిన 48మంది కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున 48లక్షలు సాయం చేశారు. కరోనా సమయంలో 1,500 మంది కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించారు. 2లక్షల మాస్కులు అందించారు. 29లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు. 1.35కోట్లతో ఏపీ, తెలంగాణలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా అధిక బరువు, కొలెస్టరాల్, డయాబెటీస్, రక్తపోటు నియంత్రణ కోసం న్యూట్రిపుల్ యాప్ ద్వారా న్యూట్రిషనిస్టుల ద్వారా డైట్ ప్లాన్లను, ఆరోగ్య సలహాలను ఉచితంగా అందిస్తున్నారు. పేద మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ సంజీవని  పేరుతో ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.  నిజానికి, ఇన్ని లక్షల మందికి ఎన్నో కోట్ల రూపాయల సాయం అందిస్తూ కూడా ఆమె   తెలుగు దేశం పార్టీకో, చంద్రబాబు నాయుడు, లేదా లోకేష్ కు ఓటు వేయమని ఎవరినీ ఏనాడూ  అడగలేదు. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాంటి మాతృమూర్తి, ఈరోజు అనివార్యంగా జనంలోకి వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తన భర్తను అక్రమంగా నిర్బంధించి, 50 రోజులుగా అనేక విధాల వేధింపులకు గురి చేస్తున్న నేపధ్యంలో, భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే నినాదంతో జనంలోకి వచ్చారు. అది కూడా ఓట్ల కోసమో, రాజకీయం కోసమో, కాదు. చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శింఛి, ఒక్కొక కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి.  అయితే దురదృష్టం ఏమంటే, గతాన్ని మరిచిన కొందరు ప్రబుద్ధులు మానవత్వాన్ని మరిచి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రను  రాజకీయ కోణంలో చూస్తున్నారు.  అనుచిత విమర్శలు చేస్తున్నారు. అయితే, భువనేశ్వరి పదే పదే చెపుతున్నట్లుగా ఈరోజు కాక పోయినా రేపైనా నిజం గెలుస్తుంది. సత్యమేవ జయతే .. సందేహం లేదు. అయితే, చంద్రబాబును అక్రమంగా జైల్లో బందించి వైసేపీ నేతలు పొందుతున్న రాక్షస ఆనందం. చేస్తున్న వికటాట్టహాసం తెలుగు దేశం నాయకులు , కార్యకర్తలనే కాదు. సామాన్య  ప్రజల చేత కూడా కంటతడి పెట్టిస్తోంది. కన్నెర్ర చేయిస్తోంది. అయితే  ఈరోజు విర్ర వీగుతున్న వైసీపీ  నేతలు అంతకు అంత చెల్లించక తప్పని రోజు ఇక ఎంతో దూరంలో లేదని వైసీపే నాయకులు గ్రహిస్తే మంచింది.. లేదంటే, నిజం గెలవాలి .. రాజకీయ బ్రహ్మస్త్రంగా మారుతుంది . ఇది తథ్యం అంటున్నారు పరిశీలకులు.