బీజేపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం?.. రామ్ చరణ్, ప్రభాస్ కూడా!
posted on Nov 2, 2023 @ 3:41PM
తెలంగాణలో బీజేపీ పరిస్థితి తిరోగమన దిశలో సాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. కొంత కాలం క్రితం వరకూ బయట పార్టీల నుంచి వచ్చి చేరిన బలమైన నేతలతో రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపించిన కమలం పార్టీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి ఒక్కొక్కటిగా రేకలు రాలిపోయినట్లు.. నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమౌతున్నారు. గతంలో ఏ నేతల వల్లనైతే బీజేపీ బలంగా కనిపించిందో.. ఆ నేతలే పార్టీని వీడటంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం రాష్ట్రంలో బీజేపీ బలహీన పడిందన్న విషయాన్ని గుర్తించినా కూడా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడం, కర్నాటకలో ఆ పార్టీ చేతిలో ఎదురైన పరాజయ పరాభవం మరచిపోకముందే.. తెలంగాణలో మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడంతో.. కొత్త కొత్త వ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎదుర్కొనేందుకు సమాయత్తమౌతున్నది. ఆ వ్యూహాలలో భాగంగానే తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున స్టార్ నటులను ప్రచార రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ప్రేక్షకులలో విశేష ఆదరాభిమానాలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లను బీజేపీ తరఫున ప్రచారానికి తీసుకురావాలన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వారి అంగీకారాన్ని తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో పార్టీ విజయావకాశాలను వీరి ప్రచారం గణనీయంగా పెంచుతుందని పార్టీ అగ్రనేతలు విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియా స్టార్లుగా విశేష గుర్తింపు, ప్రేక్షకాభిమానం ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లు పార్టీ తరఫున ప్రచారం చేస్తే విజయావకాశాలు పెరుగుతాయన్నది ఆ పార్టీ అగ్రనేతల వ్యూహంగా చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్‌లతో తెలంగాణలోని మూడు ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురితో ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్‌షా భేటీ అయిన సంగతి విదితమే. జూనియర్ ఎన్టీఆర్‌తో.. అమిత్‌షా గతంలో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. అలాగే మరో సంరద్భంలో రామ్ చరణ్ తో కూడా అమిత్ షా భేటీ అయ్యారు. ఇక ప్రభాస్ తో అయితే ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు బతికి ఉన్న రోజులలోనే భేటీ అయ్యారు. స్వయంగా కృష్ణం రాజు ప్రభాస్ ను అమిత్ షా వద్దకు తీసుకువెళ్లారు.
కాగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రభాస్ గ్రేటర్ హైదరాబాద్ లోనూ, రామ్ చరణ్ ను ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ, జూనియర్ ఎన్టీఆర్ ను ఖమ్మం, నల్గొండ, వరంగల్ లలో ప్రచారం చేయించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. తద్వారా సెటిలర్ల ఓట్లతో పాటు ఆయా సామాజిక వర్గాల ఓటర్లను కూడా వీరి ప్రచారం ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఇక ఈ ముగ్గురు పాన్ ఇండియా సినీ స్టార్ల ప్రచార షెడ్యూల్ ను వారి వారి సినిమా షూటింగ్ లకు అంతరాయం లేకుండా ఉండేలా రూపొందించే విషయంలో కసరత్తు జరుగుతోందని అంటున్నారు.