ఒక్క అరెస్ట్.. బై బై జగన్.. వై నాట్ బాబు
posted on Nov 2, 2023 @ 12:19PM
నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబు సంపాదించుకున్న, విస్వసనీయత ఇంతా కాదు. ఆ విజనరీ, ఆ దృక్పధం, ఆ విశ్వసనీయతల ఆధారంగానే, చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగరాన్ని, విశ్వనగరంగా, ఐటీ హబ్ గా అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాటిన ఐటీ విత్తనాలే ఈరోజు మహా వృక్షాలుగా ఎదిగాయి. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చాయి.
రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక సవాళ్ళను ఎదుర్కుంటూ కూడా చంద్రబాబు నాయుడు, తమ అనుభవం, విజ్ఞత, వివేచన.. ఈ అన్నిటినీ మించిన విస్వసనీయతలను కలగలిపి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. కియా వంటి అనేక మేజర్ కంపెనీలు కొత్త రాష్ట్రం, అని చూడకుండా, చంద్రబాబు ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఉంటుందన్నవిశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయి. అటువంటి దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారిని సైతం ఆయన అభిమానులుగా మార్చేసింది. ఇది పదే పదే రుజువు అవుతున్న వాస్తవం. కాదనలేని సత్యం. తాజాగా చంద్రబాబును స్కిల్ కేసులో జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేస్తే.. ఆయన తప్పు చేయడు.. చేయ నివ్వడు అంటూ రాజకీయాలతో సంబంధం లేని వారంతా రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడమే నిదర్శనం. తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ, విదేశాల్లో తెలుగువారు ఉన్న ప్రతిచోటా చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. రాజకీయంగా ఆయనను విభేదించే పార్టీల నాయకులు సైతం చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ రోడ్లపైకి వచ్చారు. సైబర్ టవర్స్ రజతోత్సవం సందర్భంగా హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ ఈవెంట్ నిర్వహించారు. ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ది లీడర్. అందుకే అన్ని వర్గాల ప్రజలూ ఆయన కోసం నిలబడుతున్నారు.
ఓట్లు, సీట్లు తప్ప పాలన అంటే ఏమిటో తెలియని వైసీపీ అజ్ణానంతోనో, అహంకారంతోనో చంద్రబాబును లేని కేసులో ఇరికించి అక్రమంగా అరెస్టు చేసింది. ఇలా చేయడం ద్వారా ఆయన ప్రజలలో తిరగకుండా చేయెచ్చని భావించింది. చేశామని సంబరపడింది. అయితే ఆయన అరెస్టుకు నిరసనగా వెల్లువెత్తిన ప్రజాగ్రహం జగన్ సర్కార్ ను బెంబేలెత్తించింది. ఆయన మధ్యంతర బెయిలుపై విడుదలైన తరువాత రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసం వరకూ జనం నుంచి నభూతో నభవిష్యతి అన్నట్లుగా లభించిన స్వాగతం.. జగన్ పార్టీకి మైండ్ బ్లాక్ చేసిందనే చెప్పాలి.
సాధారణంగా ఎవరైనా జైలుకు వెడితే.. వారు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడం వల్ల చంద్రబాబు గొప్పతనం బయటకు వచ్చింది. ఈ నాలుగున్నర దశాబ్దాల ప్రజా జీవితంలో చంద్రబాబు ఔన్నత్యం గురించి తెలియని వారికి కూడా తెలిసింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలి సారి బాధ్యతలు చేపట్టి పరుగులు పెట్టించిన అభివృద్ధి గురించి పాతికేళ్ల యువకులకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడంతో తమకు ఇప్పుడు ఇన్ని ఉపాధి, ఉద్యోగ, విద్యావకాశాల వెనుక ఉన్న మహత్తర ఆలోచన చంద్రబాబుదే అన్న విషయం బోధపడింది. అంతే కాదు.. చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా ఆయన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏం సాధించారో.. సమాజాభ్యున్నతికి, పేదల సంక్షేమానికి, వారి జీవన స్థాయి పెంచడానికి ఏం చేశారో జనబాహుల్యానికే కాదు.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కూడా కళ్లకుకట్టినట్లు తెలిసింది.
అందుకే జనాభిమాన సంద్రం రాజమహేంద్రవరం నుంచి.. ఉండవల్లిలోని ఆయన వివాసం వరకూ ఉప్పెనలా పొంగింది. ఆయన రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లికి బయలుదేరానని తెలిసిన క్షణం నుంచీ జనం ఆయనకు స్వాగతం పలికేందుకు రాదారి పొడవునా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అర్థరాత్రి దాటిపోతుందని తెలిసినా సాయంత్రం ఆరుగుంటల నుంచే ఆయన కోసం రోడ్ల పక్కన వేచి ఉన్నారు. అలా వేచి ఉన్నవారిలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి నివాసం చేరుకోవడానికి సాధారణంగా అయితే నాలుగు గంటలు పడుతుంది. కానీ చంద్రబాబు కోసం అశేషంగా వచ్చిన జనవాహిని కారణంగా ఆ ప్రయాణం 14 గంటలకు పైగా పట్టింది. దీనిని బట్టే చంద్రబాబు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అవగతమౌతుంది.
స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ అక్రమంగా అరెస్టు చేసిందని.. మొత్తం ప్రపంచం అంతా నమ్మింది. వైసీపీ నేతలు ఎంతగా గొంతు చించుకుని ఆయన అవినీతికి పాల్పడ్డారు అంటూ చెప్పినా, ఆధారాలు ఉన్నాయని నమ్మబలికినా నమ్మలేదు. ఆఖరికి వైసీపీ శ్రేణులు కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మలేమనే ప్రైవేటు సంభాషణల్లో చెప్పాయంటే ఆయన విశ్వసనీయత ఎంతటిదో అవగతమౌతుంది. ఆ విశ్వసనీయతకు భయపడే చంద్రబాబు అవినీతి పరుడని ఎంత చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రుసరుసలాడారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన గురించి ఒక మాట తరచూ వినిపించేది. ఆయన నిద్రపోరు.. అధికారులను నిద్రపోనివ్వరు అని. ఇప్పుడు జనం .. ఆయన తప్పు చేయరు.. ఎవరినీ తప్పు చేయనీయరు అని చెబుతున్నారు. అదే నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబుపై స్కిల్ కేసు జగన్ ప్రభుత్వ కక్షసాధింపేనని చంద్రబాబుకు సంఘీభావం తెలపడంద్వారా తేటతెల్లం చేశారు.