ఏపీ మద్యం తాగితే అంతే సంగతులు!
ఆంధ్రప్రదేశ్ లో మద్యం విధానం ఓ పెద్ద కుంభకోణం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఇది మాత్రం మా చేత.. మా కొరకు..మేమే తెచ్చుకున్న మద్యం విధానాన్ని జగన్ సర్కార్ అవలంబిస్తోంది. ఏపీలో మద్యం విధానంపై మొదటి నుంచీ విమర్శలు, ఆరోపణలూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ మందు బాబుల ప్రాణాలను హరించేలా నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తోందని, మొత్తం మద్యం విధానమంతా వైసీపీ అగ్రనేతల కనుసన్నలలో సాగుతోందన్న విమర్శలూ ఉన్నాయి. అయితే తాజాగా భువనేశ్వరి ఏపీ ప్రభుత్వ మద్యం వ్యాపారం బండారాన్ని బట్టబయలు చేశారు. దీని వెనుక ఉన్న పెద్దల పేర్లనూ మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందన ఏమిటో ఇంకా తెలియలేదు కానీ.. ఏపీలో మాత్రం మరెక్కడా వినని, కనని బ్రాండ్ల పేరుతో విషంలాంటి మద్యాన్ని యథేచ్ఛగా ప్రభుత్వమే విక్రయించేస్తోంది.
ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, యూత్ స్టార్, యంగ్ స్టార్, టాప్ స్టార్, సూపర్ స్టార్, 999 పవర్ స్టార్, ఛాంపియన్, సెలబ్రిటీ, రాయల్ సింహ, బ్లాక్ బస్టర్, భూమ్ భూమ్, బ్యాచిలర్ ఛాయిస్, కౌంట్ డౌన్, గెలాక్సీ, రాయల్ గోల్డ్, ఆంధ్ర గోల్డ్, ఆల్ సీజన్ బ్రాందీ, కల్ట్ విస్కీ.. ఈ పాటికే అర్ధం అయ్యే ఉంటుంది ఈ చిత్ర విచిత్రమైన పేర్లన్నీ ఏంటో. మన దేశంలో ఓ యాభై ఏళ్లుగా రోజూ మందుకొట్టే మహారాజులకు కూడా ఈ బ్రాండ్స్ గురించి తెలియదేమో. అసలు ఇలాంటి బ్రాండ్లు ఉన్నాయనీ కానీ వస్తాయని కానీ ఎవరూ ఊహించి ఉండరేమో. కానీ, ఏపీలో ఇదే మందు.. ఇవే బ్రాండ్లు. ఇప్పటికే ఈ పేర్లలో సోషల్ మీడియాలో కావాల్సినన్ని మీమ్స్, వీడియోలు కూడా ఉండగా.. కనీస పరీక్షలు కూడా చేయని మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి అమ్మేస్తూ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విపక్షాలు ఎన్ని ఆరోపించినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ కంపెనీలకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని దబాయిస్తారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. అప్పటి నుండి నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ వస్తుండగా.. ఇందులో వైసీపీ కార్యకర్తలే జీతాలకు పనిచేస్తున్నారు. ప్రభుత్వమే నడపనీ, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వనీ ప్రజలకు కావాల్సింది క్వాలిటీ. కానీ, ఏపీలో ఆ ఒక్కటే అడగకూడదు అన్నట్లు ఉంది పరిస్థితి. గతంలో ఎన్నడూ చూడని.. ఎప్పుడూ వినని బ్రాండ్లు, సీసాలు ఏపీలో కనిపిస్తున్నాయి. దీనికి ప్రతిపక్షాలు జే బ్రాండ్ మద్యం అంటూ పేరు కూడా పెట్టారు. ఈ జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏపీలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో సగం మంది రుగ్మతలకు మద్యమే కారణమని తేలింది. కనీస పరీక్షలు కూడా చేయకుండా మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి ప్రభుత్వ దుకాణాలకు అందిస్తున్నారు. తెలిసిన కంపెనీ మద్యం ఒక్కటీ లేకపోవడంతో ప్రజలు ఉన్న దాన్నే తాగేసి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.
నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే వైసీపీ అభ్యర్థులు సొంత చీఫ్ లిక్కర్ బ్రాండ్ పేరుతో రాష్ట్రమంతా దొంగతనంగా పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. కానీ, ఆ తర్వాత టీడీపీ హయాంలో దీనికి అడ్డుకట్ట పడింది. అయితే, ఇప్పడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ అభ్యర్థుల సొంత చీప్ లిక్కర్ అధికారిక మద్యంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ నేతలు తాజాగా ఈ మద్యాన్ని ల్యాబుల్లో పరిశీలించగా నకిలీ మద్యంగా నిర్ధారణ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఈ నకిలీ మద్యం, మద్యం పాలసీలపై పోరాడుతున్నారు. రాష్ట్రంలో మద్యం ద్వారా 25 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపణలు చేస్తూ సీబీఐ విచారణ కోరారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఇక ఇటీవల పురందేశ్వరి నరసాపురంలో ఓ మద్యం దుకాణానికి వెళ్లి క్రయవిక్రయాలపై ఆరా తీసి అవినీతిని బయటపెట్టారు. నేరుగా ఆసుపత్రికి కూడా వెళ్లి రోగులను పరామర్శించారు. మద్యం తాగడం వల్లే ఆసుపత్రి పాలైనట్లు మెడికల్ రిపోర్టులు ఉన్నాయని ఆమె పరిశీలనలో వెల్లడైంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఆరా తీస్తే మద్యం వలనే అనారోగ్యం పాలైన కేసులు వేలల్లో ఉన్నట్లు తేలింది. దీంతో ఏపీ మద్యం తాగితే ప్రాణాలు హరీ అనడం ఖాయమని నిర్ధారణయింది. ఒకవైపు లిక్కర్ షాపులతో వైసీపీ కార్యకర్తల దందా పెరిగిపోతోంది. లిక్కర్ అమ్మకాలపై వచ్చిన డబ్బు, ఆదాయానికి.. పలుచోట్ల లెక్కలు గోల్ మాల్ చేసినట్లు ఆరోపణలు ఉండగా.. అక్రమ మార్గాలలో బెల్ట్ షాపులకు లిక్కర్ సరఫరా చేసి మరికొందరు జేబులు నింపుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడులుగా వెలిశాయి. ఈ నకిలీ మద్యాన్నే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకు విక్రయిస్తూ వారి ఆరోగ్యాలను పీల్చి పిప్పి చేస్తోంది.