జగన్ లో ముదిరిపోయిన ఓటమి భయం
posted on Nov 2, 2023 6:42AM
తప్పు ఒప్పు లేదు.. చట్టం, రాజ్యాంగం పట్టదు.. పాపం పుణ్యం అసలే లేదు. కావలసింది ఒక్కటే మరోసారి అధికారం దక్కించుకోవడం. అందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కనీ అంతిమ లక్ష్యం అధికారమే. మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతకైనా సిద్దపడుతున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ హత్య, కోడికత్తి లాంటి ఎన్నో డ్రామాలను రక్తి కట్టించిన జగన్ ఈసారి ప్రతిపక్షాలను తనకు అడ్డం లేకుండా చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు. కనీసం ఛార్జ్ షీట్ లో పేరు కూడా లేని కేసులో చంద్రబాబును ఇరికించి.. అప్పటికప్పుడు కఠినమైన సెక్షన్లతో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన్ను రాజమండ్రి జైలుకు పరిమితం చేశారు. 53 రోజులుగా ఈ కేసు దర్యాప్తు ఎలాంటి కొలిక్కి రాలేదు. అయితే, చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసే సమయంలో కూడా సీఐడీ చంద్రబాబును కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. ఆయనను బయటకి పంపినా ఆయన చేతులు కట్టేసేలా చర్యలు ఉండాలని సీఐడీ కోరింది.
చంద్రబాబు విడుదలతో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాజమండ్రి నుండి విజయవాడ వరకూ దారిపొడవునా జనం బాబుకు జయజయధ్వనాలు చేశారు. చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పార్టీ అధినేత జైలు నుండి బయటకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులలో కదలిక వచ్చిది. తెలుగుదేశం నేతలు మునుపెన్నడూ లేని విధంగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. ఇక, ప్రభుత్వంపై సమరశంఖమే అనే భావన కలుగుతుండగానే ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. టీడీపీలో ఉత్సాహం ఏ మాత్రం గిట్టని వైసీపీ సర్కార్ మాత్రం దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. చంద్రబాబు విడుదల సందర్భంగా ఎటువంటి రాజకీయ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ సర్కారు ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. అప్పటికప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని.. అందుకే చంద్రబాబును కట్టడి చేసేలా చర్యలు ఉండాలని కోరారు.
చంద్రబాబు అరెస్టుకు ముందు వైసీపీ పరిస్థితి నిర్జీవంగా కనిపించింది. అప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు బస్సు యాత్ర, ప్రాజెక్టుల సందర్శనతో టీడీపీ ఫుల్ స్వింగ్ లో ఉండగా.. పవన్ కళ్యాణ్ కూడా వారాహీ యాత్రతో జనసేనను యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ముందస్తు సర్వేలలో కూడా వైసీపీ పరాజయం ఖరారనే ఫలితాలతో ఎక్కడికక్కడ వైసీపీ పరిస్థితి దిగజారిపోయింది. దీంతో ఎలాగైనా చంద్రబాబును కట్టడి చేయాలనే కుట్ర పన్ని స్కిల్ కేసులో ఆయనను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ కేసును న్యాయస్థానాలలో నిలిపేందుకు కూడా శ్రమ పడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో సీఐడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోతుంది. ఒకవేళ ఈ కేసులో చంద్రబాబు ఎక్కడ బయటకి వస్తారోనని రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, పుంగనూరు కేసులను కూడా పైకి తెచ్చిన సీఐడీ ఎలాగైనా ఆయన్ను బయటకు రాకుండా చూడాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ, ఫైనల్ గా చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చారు .
అయితే, చంద్రబాబు బయట ఉన్నా బెయిల్ షరతుల పేరిట ఆయన్ను కట్టడి చేయాలని ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తే.. ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో అర్ధమవుతుంది. స్కిల్ కేసులో ఈసారి కోర్టు తప్పకుండా చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందని భావించిన సీఐడీ.. అప్పటికప్పుడు మద్యం కేసును తెరపైకి తెచ్చింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు అక్రమంగా లిక్కర్ లైసెన్సులు ఇచ్చారంటూ ఆయన్ను ఏ3గా చూపుతూ కోర్టుకు నివేదించింది. అయితే కోర్టు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ వైపే మొగ్గు చూపింది. బెయిల్ ఇచ్చినా షరతులు కఠినంగా ఉండాలని మరో పిటిషన్ కూడా వేసింది. ఇదంతా చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డిలో ఓటమి భయం ఎంతగా ముదిరిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.