వైసీపీలో లోకేష్ టెన్షన్!
posted on Nov 3, 2023 @ 10:08AM
ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి రాజకీయంగా పరిణితి చెందిన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆయన స్థైర్యం, ధైర్యం, నిముషాలలో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం, ప్రజలతో మమేకం కావడం, విశ్వసనీయత పెంచుకోవడం అన్నీ చూస్తుంటే తండ్రికి తగ్గ తనయుడిగా అందరి మన్ననలూ పొందుతున్నారు. ఇప్పుడు అదే వైసీపీలో టెన్షన్ కు కారణమైంది.
మొన్నటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. ముందు ముందు ఈ లెక్కలు ఇంకా ఇంకా మారతాయి అన్న భయం వారిని వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. మొన్నటి వరకూ నారా లోకేష్ అంటే తండ్రి చాటు తనయుడు. కానీ, ఇప్పుడు రాటుదేలిన నాయకుడు.. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని కాపాడుకోగల సమర్ధుడు. పార్టీని ముందుండి నడిపించగలిగిన, ప్రత్యర్థుల విమర్శలకు వారి నోళ్లు మూతపడేలా సమాధానం ఇవ్వగల పరిణితి చెందిన నాయకుడు. ఇది సగటు తెలుగుదేశం అభిమానుల మాట మాత్రమే కాదు. పార్టీ సీనియర్లు, అంతెందుకు అధికార వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తున్న వాస్తవం.
రాజకీయాలలో తొలి అడుగుపడిన నాటి నుంచి ఆయన మాట నుంచి ఆహారం, ఆహార్యం వరకూ ప్రతి అంశాన్ని ఎత్తి చూపుతూ ఎగతాళి చేసిన ఆ నోళ్లే ఇప్పుడు లోకేష్ మాట ఎత్తాలంటే భయపడే పరిస్థితికి వచ్చాయి. ఆయన ప్రతి అడుగూ అధికార పార్టీ గుండెల్లో గుబులు పెంచుతోంది. యువగళం పేరిట ఆయన పాదయాత్ర చేస్తుంటే.. ప్రతి అడుగులోనూ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిన జగన్ సర్కార్ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. ఆంక్షలు, అడ్డంకులను అధిగమిస్తూ ఆయన ముందకు సాగారు. పార్టీ అధినేత, తండ్రి నారా చంద్రబాబును అధికార మదంతో జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో అటు న్యాయపోరాటం, ఇటు పార్టీ సమన్వయం రెండూ ఏకకాలంలో చేసి నారా లోకేష్ ప్రత్యర్థి పాలిట సింహస్వప్నంగా మారారు. చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చినా.. రాజకీయ క్షేత్రంలో తన ముద్రను బలంగా చాటారు. ప్పుడు అధికార పార్టీ నేతలు నారా లోకేష్ ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు.. ఎవరిని కలుస్తున్నారు.. ఏం మాట్లాడుతున్నారు. లోకేష్ ఏపీలోనే ఉన్నారా.. లేకపోతే ఎప్పుడు వస్తారు అంటూ ఆంటూ ఆరా తీస్తున్నారు. ఔను.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు వింటేనే వైసీపీ నేతలు వణికి పోతున్నారు. యువగళం పాదయాత్రతో లోకేష్ ఒక పొలిటికల్ లీడర్ గా ఎంతగా మార్పు చెందారో చూశారు. తన మాట, నడత, నడకను మలచుకుని మాస్ లీడర్ గా ఎదిగిన క్రమాన్ని చూశారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం ద్వారా ఆయన ఎదుగుదలను అడ్డుకోగలమని భావించారు. సాధ్యం కాకపోవడంతో అడ్డగోలు విమర్శలతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని భావించారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత కానీ లోకేష్ లోని రాజకీయ పరిణితి వారికి అవగతం కాలేదు. ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలను జాతీయ మీడియా వేదికగా ఎండగట్టడం దగ్గర నుంచీ.. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడంలో కానీ లోకేష్ వ్యవహరించిన తీరు.. లోకేష్ లో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఢిల్లీ నడిబొడ్డున జాతీయ మీడియాతో చర్చకు కూర్చొని రాష్ట్రంలో వైసీపీ చేసే అరాచకాలను దుమ్మెత్తి పోస్తే.. అప్పటికప్పుడు సీఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీలోనే ఎక్కువ గడపడంతో ఇక్కడ వైసీపీ నేతలు ఆయన పారిపోయారంటూ ప్రచారం చేసుకుని సంబరపడ్డారు. కానీ జాతీయ స్థాయిలో ఏపీలో అరాచకపాలనపై అందరి దృష్టీ పడేలా చేయడంలో లోకేష్ సక్సెస్ అయిన వరువాత కానీ వైసీపీ పెద్దలకు అర్ధం కాలేదు.. ఆయన ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరించారన్నది. ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన తరువాత కూడా.. లోకేష్ ఢిల్లీ వెళ్లారు. బుధవారం తిరిగి హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు.
దీంతో వైసీపీ నేతలలో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవల చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ జగన్ అక్రమాస్తుల కేసును ప్రస్తావించారు. ఇక నుండి మొదలవుతుంది అసలైన రాజకీయం అంటూ వైసీపీ అధినేతకు స్పష్టమైన హెచ్చరిక పంపారు. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దక్కిన సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు జగన్ కేసులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ నేతలలో అలజడి మొదలైంది. మరీ ముఖ్యంగా నారా లోకేష్ కదలికలను వైసీపీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ వెళ్లిన దగ్గర నుండి ప్రతి కదలికను నిఘా వర్గాల ద్వారా వైసీపీ సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపై లోకేష్ ఏ చేయబోతున్నారన్నభయం ఆందోళన వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీస ఆధారాలు లేని స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 52 రోజుల పాటు జైలులో ఉంచిన జగన్ సర్కార్..ఇప్పుడు ఆధారాలు ఉండి కూడా పదేళ్లుగా బెయిలుమీద ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక రావడంతో అధికార పార్టీ అగ్రనాయకత్వంవణికి పోతున్నదని అంటున్నారు.
చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయినా కేసుల మీద కేసులు అన్నట్లుగా ముందుకు వెడుతున్న జగన్ సర్కార్ తీరుపై, పాలనా వైఫల్యాలపై, అడ్డగోలు అప్పులపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగడం వెనుక ఉన్నది లోకేష్ అని అర్ధం అవ్వడంతో లోకేష్ ను లైట్ గా తీసుకుని ఎంత తప్పు చేశామో అర్ధమై భయపడుతోందంటున్నారు.
చంద్రబాబుపై కేసుల్లో కనీస ఆధారాలు కూడా సీఐడీ చూపలేకపోవడంపై ఇప్పటికే జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. న్యాయవర్గాల్లోనూ ఈ అంశంపై లోకేష్ చర్చ పెట్టగలిగారని అంటున్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటలను తేలిగ్గా తీసుకోలేమని… ఏదో చేస్తున్నారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. భయపడుతున్నాయని అంటున్నారు.