బీజేపీకి రాములమ్మ గుడ్ బై.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న విజయశాంతి!
posted on Nov 17, 2023 5:33AM
చివరకు అనుకున్నదే అయ్యింది. బీజేపీకి రాములమ్మ విజయశాంతి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. శుక్రవారం(నవంబర్ 17) తెలంగాణ పర్యటనకు రానున్న కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ సమక్షంలో, విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. దీనితో సుదీర్ఘకాలం బీజేపీలో ఆమె పోషించిన పాత్ర ముగిసిపోయింది. అయితే రాములమ్మ రాజీనామా విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
తెలంగాణ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేస్తారని చాలా కాలంగా వినిపిస్తున్నా, బీజేపీ హైకమాండ్ తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆమె చేష్టల ద్వారా స్పష్టమౌతున్నా, అమెతో మాట్లాడేందుకు కానీ, ఆమె ఆగ్రహం లేదా అసంతృప్తికి కారణమేమిటో తెలుసుకుని పరిష్కరించేందుకు కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇసుమంతైనా చొరవ చూపకపోవడం పార్టీ శ్రేణులలో అసంతృప్తికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సేవలు వినియోగించుకోని పార్టీ నాయకత్వంపై ఆమె చాలాకాలం నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ మేరకు సందర్భం వచ్చినప్పుడల్లా ట్వీట్లు చేసి, పార్టీని ఇరుకున పెట్టినా, నాయకత్వం ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు చేయలేదు. తెలంగాణకు ఇద్దరు ముగ్గురు ఇన్చార్జిలు ఉన్నప్పటికీ, వారెవరూ ఆమెతో మాట్లాడి అసంతృప్తి చల్లార్చే ప్రయత్నాలు చేయలేదు. ఆ క్రమంలో ఆమెకు ఆందోళన కార్యక్రమాల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ అది.. రాములమ్మలోని అసంతృప్తిని ఇసుమంతైనా తగ్గించలేదు.
నిజానికి విజయశాంతి సేవలు వినియోగించుకోవడంలో బీజేపీ నాయకత్వం విఫలమైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జనంలో ఆమెకునన ఇమేజ్, సినీ గ్లామర్, ముక్కుసూటిగా కేసీఆర్ పాలనను నిర్భయంగా విమర్శలు చేసే ప్రసంగాలు తెలంగాణ ప్రజలకు సుపరిచితాలే. అటువంటి విజయశాంతి సేవలను బీజేపీ వినియోగించుకు ఉండి ఉంటే.. పార్టీ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండి ఉండేది కాదనీ.. పార్టీ క్యాడర్ బాహాటంగానే చెబుతోంది. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమెకు పార్టీలో సముచిత గౌరవం లభించేది. అయితే కిషన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమెను పట్టించుకోవడమే మానేసి పూర్తిగా పక్కన పెట్టారనీ, ఇదే ఆమె పార్టీ నుంచి వైదొలగడానికి కారణమని పార్టీ వర్గాలే అంటున్నాయి. కిషన్ రెడ్డి వ్యవహారశైలిపై ఆమె పలు మార్లు పార్టీ నేతల వద్ద అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. అసలు మొదట్టో విజయశాంతిని కేటీఆర్ పై సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న చర్చ జరిగింది. అందుకు విజయశాంతి అంగీకారం కూడా తెలిపారు. కానీ చివరి జాబితాలో కూడా తన పేరు లేకపోవడం, లోక్‌సభ ఎన్నికల్లో పోటీపైనా స్పష్టత ఇవ్వకపోవడంతోనే విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పేశారని అంటున్నారు.
కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకార సభకు హాజరైన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను ఆక్షేపిస్తూ, విజయశాంతి అర్ధంతరంగా సభ నుంచి నిష్క్రమించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘తెలంగాణకు అడ్డుపడ్డ వారితో వేదిక పంచుకోవడం ఇష్టం లే కనే వెళ్లిపోయానంటూ ఆమె చేసిన ట్వీట్ పై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార సభకు ఆహ్వానించి వేదికపై చోటు ఇవ్వడాన్ని విజయశాంతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెకు పార్టీలోని పలువురు మద్దతు తెలిపారు కూడా. అయితే పార్టీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో ఆమె విసిగిపోయారని అంటున్నారు. అందుకే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ, వారిని విజయశాంతి కలవలేదని అంటున్నారు. దీంతొ అప్పుడే విజయశాంతి పార్టీ మారుతారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
కాగా విజయశాంతి నిష్క్రమణతో బీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే బలమైన నేతలందరికీ బీజేపీ పొమ్మనలేక పొగబెడుతోందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. కేటీఆర్‌తోపాటు, కీలకమైన మంత్రులపై బలమైన అభ్యర్ధులను పోటీకి దింపకపోవడం, టికెట్లు తీసుకున్న అభ్యర్ధులు.. బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు ఎక్కడా ఇబ్బంది కలిగించకపోవడం, అసలు చాలామంది అభ్యర్ధులు ప్రచారపర్వంలోనే నాన్ సీరియస్ గా ఉండటం వంటి కారణాలతో ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.