గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎపి పోలీసులు
posted on Feb 2, 2024 @ 10:41AM
గంజాయి మీద ఉక్కు పాదం మోపిన తెలంగాణ సర్కారు కు వింత అనుభవం ఎదురైంది. తెలంగాణ పోలీసులకు ఆంధ్రా పోలీసులు పట్టుబడిన వైనమిది. హైదరాబాద్ లోని బాచుపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున సంచలనం చోటుచేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాలానగర్ పోలీసులకు పట్టుబడ్డారు. కారులో గంజాయి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా డ్యూటీకి సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు తెరలేపారు. ముందస్తు సమాచారం అందడంతో తెలంగాణ పోలీసులు తనిఖీ చేపట్టడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలో గంజాయి అమ్మేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ సమాచారం అందడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఓ కారులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విస్తుపోయే విషయం బయటపడింది. వారిద్దరూ ఏపీ పోలీస్ శాఖకు చెందిన వారని, కాకినాడలో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారని తేలింది. విధులకు సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిద్దరినీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వివరించారు.