కేసీఆర్ కు అగ్నిపరీక్ష!
posted on Feb 2, 2024 6:12AM
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరగనున్నాయన్న సమాచారంతో బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ అయ్యారు. గురువారం (ఫిబ్రవరి1) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై వారికి కీలక సూచనలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ స్వరంలో గతంలో ఉన్న ధీమా లేదనీ, పార్టీ ఎమ్మెల్యేలపై ఆయనకు పట్టు జారిందనీ చెబుతున్నారు. గట్టిగా మందలిస్తే రేపు పార్టీ వీడుదామనుకుంటున్న వారు ఇప్పుడే జారిపోతారేమో అన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించిందని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పుడు కర్రవిరగకుండా, పాము చావకుండా వ్యవహరించి ఎమ్మెల్యేల వలసలను నిరోధించాలన్న టాస్క్ తో కేసీఆర్ ఉన్నారని వారు చెబుతున్నారు.
అందుకే రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ విషయంలో ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. అలా భేటీ అయిన ఎమ్మెల్యేలను తప్పుపట్టకుండా జాగ్రత్తగా మాట్లాడారు. మంచి ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న వారిని కలిస్తే తప్పు లేదనీ, అయితే అలా కలవడం వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెడతాయనీ కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వాలన్నా, నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవాలన్నా అదంతా ప్రజల సమక్షంలోనే చేయాలని సూచించారు. ఎమ్యెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన నిర్వహించిన ఈ సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది.
లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ ఇక తాను అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. పార్టీ కేడర్ ను కాపాడుకోవడం ముఖ్యమన్నారు. లోకసభ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటకుంటే.. వలసలను ఆపడం సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా వచ్చే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు మాత్రమే కాదు కేసీఆర్ కు కూడా అగ్నిపరీక్షగానే మారాయి.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో నరేంద్రమోడీ గ్రాఫ్ పెరిగింది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టి కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోరు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకునే కేసీఆర్ తెరమీదకు వచ్చారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత.. కేసీఆర్ గాయం కారణంగా ఇన్ని రోజులూ తెరమీదకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో మళ్లీ జోష్ తీసుకురావడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు.