నీ యమ్మా మొగుడు చెప్పాడా..?
posted on Feb 21, 2024 9:21AM
వై నాట్ 175.. వై నాట్ 175 అంటూ నిన్న మొన్నటి వరకు ఒకే పాట.. పాడిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్.. ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జీలను టోకున మార్చేస్తుండడంతో.. అసలు పార్టీలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలోకి.. ఆ పార్టీలోని అగ్రనాయకులంతా దాదాపుగా వెళ్లిపోయారు.
తాజాగా అలాంటి పరిస్థితే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి సైతం ఎదురైందని, దీంతో ఆయన అనుచర వర్గం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుందని ఓ ప్రచారం గుడివాడ నియోజకవర్గంలో ఓ రేంజ్ లో సాగుతోంది. గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మండల హనుమంతరావును ఎంపిక చేస్తున్నారంటూ.. గుడివాడ పుర వీధుల్లో రాత్రికి రాత్రే భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. దాంతో గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నానిపై నియోజకవర్గ బదిలీ వేటు పడిందనీ, ఆయన్ని మైలవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపనున్నారంటూ ఓ ప్రచారం జోరందుకొంది. దీంతో ఈ వ్యవహారం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
దాంతో ఈ వ్యవహరంపై కొడాలి నాని అనుచర వర్గం తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయని.. అలాంటి వేళ పార్టీ అగ్రనాయకత్వం ఆచి తూచి అడుగు వేయాల్సి ఉందని.. అంతేకానీ.. ఇలా నిప్పు లేకుండా పొగ వచ్చినట్లు... ఇలా పలు వార్త కథనాలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయని... ఆ వెంటనే అవి ప్రజల్లోకి బలంగా దూసుకు వెళ్తున్నాయని.... దీంతో పార్టీలోని ప్రస్తుత ప్రజా ప్రతినిధుల పరిస్థితి దారుణంగా తయారవుతోందని.. అలాంటి పరిస్థితుల్లో పార్టీలోని పెద్దలు.. ఆగమేఘాల మీద స్పందించి.. ఇవి వదంతులు మాత్రమే.. నమ్మవద్దంటూ.. ప్రెస్ మీట్ పెట్టి వివరించడం లేదా.. మీడియా వేదికగా ప్రకటించడమో చేయాలి కానీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని కొడాలి నాని అనుచరులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదీకాక.. తమ నాయకుడు వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారని.. అయిదో సారి కూడా ఆయన గుడివాడ నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తారని వారు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారంటూ వదంతులు షికారు చేయడంతో.. ఈ అంశంపై ప్రశ్నిస్తున్నవారిపై.. నీ యమ్మా మొగుడు చెప్పాడా? అంటూ నాని ఆగ్రహంతో విరుచుకుపడుతున్న ప్రచారం కూడా మరో వైపు జోరందుకుంది.
2004లో తెలుగుదేశం అభ్యర్థిగా తొలి సారి గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టిన కొడాలి నాని.. 2009లో సైతం అదే పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. 2012లో జగన్ పంచన చేరి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గుడివాడ నుంచి విజయం సాధించారు.
ఇక జగన్ తొలి కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని విధులు నిర్వర్తించారు. ఆ క్రమంలో ఆయన మీడియా ముందుకు వచ్చినా.. ప్రెస్ మీట్ పెట్టినా.. బూతులు కాదు బండ బూతులే మాట్లాడే వారు. ఆ క్రమంలో ఆడు చెప్పాడా.. వీడు చెప్పాడా.. నీ యమ్మ మోగుడు చెప్పాడా? అంటూ.. తన వాచలత్వాన్ని ప్రదర్శించే వారు. దీంతో నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా కాకుండా బూతు సరఫరాల శాఖ మంత్రిగా జనాల్లో మద్ర పడిపోయారు. ఇక ఆయన అనుచర గణం సైతం గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారంటూ.. మీడియాలో కథనాలను సైతం చూసి.. నీ యమ్మా మొగుడు చెప్పారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారనే ఓ ప్రచారం సైతం నియోజకవర్గంలో కొన.. సాగుతోంది.