జగన్ కు లోకేష్ భయం.. అందుకే ఆళ్లకు మళ్లీ రెడ్ కార్పెట్!
posted on Feb 21, 2024 @ 9:41AM
వరుసగా రెండో సారి అధికారం అందుకోవడం సంగతి దేవుడెరుగు.. మంగళగిరిలో నారా లోకేష్ వరుసగా రెండోసారి ఓటమి పాలైతే అదే పది వేలు అనుకునే స్థితికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ వచ్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని.. మార్పులు చేర్పులూ కేవలం మంగళగిరిలోనే పార్టీ అధినేత వైయస్ జగన్ చేయడం చూస్తుంటే.. ఆయన తీరు అలాగే ఉందని అంటున్నారు.
తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ ఫ్యాన్ పార్టీలోకి ఆహ్వానించడమే కాదు.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గెలిచి తీరాలి, అందుకు ఏం చేస్తావో ఏమో అంటూ పార్టీని మంగళగిరిలో గెలిపించే బాధ్యతలు ఆయన భుజస్కందాలపై జగన్ పెట్టడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.
ఇటీవల జగనన్నా నీకో దండం.. నీ పార్టీకో దండం అంటూ వైసీపీకే కాదు.. ఆ పార్టీ తరఫున గెలిచినఎమ్మెల్యే పదవికి సైతం రాం రాం చెప్పేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఆ తర్వాత.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పంచన చేరిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాంటి వేళ మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డి యూ టర్న్ తీసుకుని వైసీపీలో చేరడం వెనుక పెద్ద తతంగమే నడిచిందని పరిశీలకులు అంటున్నారు.
ఆళ్ల తొలుత పార్టీకి రాజీనామా చేయడంతో.. బయటకు వెళ్లితే వెళ్లారులే అని లెక్కలేసుకున్న తాడేపల్లి ప్యాలెస్‌లోని అగ్రనేతలు, ఆ తర్వాత మంగళగిరిలో తాజాగా నెలకొన్న పరిస్థితులు చూసి.. ఒకింత షాక్ అయ్యారని.. ఆ క్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవిని మార్చి కాండ్రు కమలకు బాధ్యతలు కట్టబెట్టారని.. అయినా కూడా విజయంపై నమ్మకం కలగలేదని అంటున్నారు. దీంతో మంగళగిరిలో లోకేష్ ఓటమే లక్ష్యంగా ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్దకు రాయబారం పంపి.. మంతనాలు నెరిపి.. తిరిగి పార్టీలోకి వచ్చేలా ఒప్పించారని, అయితే రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డినే బరిలో దింపేందుకు పార్టీ అధినేత వైయస్ జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. మంగళగిరి నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. అలాగే 2019 ఎన్నికల్లో సైతం ఆయన వరుసగా రెండో సారి గెలిచారు. మళ్లీ అంటే.. 2024లో మంగళగిరి నుంచి ఆర్కేని బరిలో దింపి.. నారా లోకేష్ ను ఓడించేందుకు జగన్ అండ్ కో శతథా ప్రయత్నాలు చేస్తుందని వారు చెబుతున్నారు.
అయితే గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓటమి పాలైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తు వస్తున్నారని.. అలాగే అన్నా క్యాంటీన్లతోపాటు ఆరోగ్య సంజీవని పేరుతో మొబైల్ ఆరోగ్య సేవలను సైతం అందిస్తున్నారని.. ఇక మంగళగిరిలో నారా లోకేష్ భార్య నారా బ్రహ్మణి..టాటా తనేరా సీఈవోతో కలిసి వీవర్ శాలను ఇటీవల ప్రారంభించారని... అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగమేఘాల మీద స్పందిస్తు.. వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతేన్నాయనీ, దీంతో రానున్న ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనే ఓ ప్రచారం ఓ వైపు సాగుతోండగా.. మరోవైపు మంగళగిరిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడటం ఖాయమని సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయని వారు వివరిస్తున్నారు.
తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గం మంగళగిరి. అలాంటి నియోజక వర్గంలో నారా లోకేష్ విజయం సాధిస్తారన్న విషయాన్ని సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారనీ, ఆ క్రమంలోనే మంగళగిరిలో పార్టీ అభ్యర్థి ఎంపికలో ఆయన తికమక.. మకతిక పడుతూ.. పార్టీని వీడి బయటకు వెళ్లిపోయిన ఆళ్లను మళ్లీ పార్టీలోకి తీసుకు వచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.