ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ కష్టమే!
posted on Feb 27, 2024 8:51AM
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి ఘోర పరాభవం తప్పదని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన అన్నినియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చారు. వీరిలో కొందరికి వేరే నియోజకవర్గాల్లో అవకాశం కల్పించగా.. మరికొందరిని పక్కన పెట్టారు. ఈ జిల్లాలో గత ఎన్నికల్లో కేవలం నాలుగు నియోజకవర్గాల్లోనే టీడీపీ విజయం సాధించింది. ఈసారి అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం, జనసేన కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలు ప్రకాశం ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం, జనసేన హవా ఖాయమని పేర్కొన్నాయి. ఈ జిల్లాలో తెలుగుదేశం, జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా పరిస్ధితులను పరిశీలిస్తే..
గిద్దలూరు..
గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా అన్నా రాంబాబు పోటీ చేసి విజయం సాధించారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రజల నుంచి వ్యతిరేక పెల్లుబుకుతుండటంతో వైసీపీ అధిష్టానం అన్నారాంబాబును మార్కాపురం నియోజకవర్గానికి మార్చేసింది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు పంపింది. కందూరుకు రాంబాబు వర్గీయులు సహకరించేలా కనిపించడం లేదు. దీనికితోడు వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కందూరు ఓటమికి కారణమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమి విడుదల చేసిన తొలి జాబితాలో ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని కేటాయించలేదు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి ఎవరు బరిలో నిలిచినా విజయం ఖాయమన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతుంది.
మార్కాపురం..
మార్కాపురం నియోజకవర్గానికి గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.. గత ఎన్నికలలో గిద్దలూరు రాంబాబు విజయం సాధించారు. వైసీపీ అధిష్టానం నిర్వహించిన సర్వేల్లో మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తే ఓటమి ఖాయమని తేలడంతో కందూరు నాగార్జునను గిద్దలూరు పంపించి.. రాంబాబును మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం బరిలో నిలిపింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీలో దిగేది ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలిపిన విజయం ఖాయమన్న వాదన స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎర్రగొండపాలెం..
ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేశ్ విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందంటూ ఆదిమూలపు సురేష్ ను తప్పించి తాటిపత్రి చంద్రశేఖర్ ను వైసీపీ అదిష్టానం ఇక్కడ బరిలోకి దింపింది. ఈ పరిణామాలతో సురేశ్ వర్గం సంతృప్తితో ఉంది. బహిరంగంగా బయటపడకపోయినా చంద్రశేఖర్ కు సహకరించేది లేదని సురేశ్ వర్గం అంతర్గత సంభాషణల్లో స్పష్టంగా చెబుతోందని సమాచారం. దీనికితోడు ఈ నియోజకవర్గంలో ప్రజల నుంచి వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా గూడూరి ఎలక్షన్ బాబు మరోసారి బరిలోకి దిగుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుతోపాటు, టీడీపీ, జనసేన శ్రేణుల అండతో ఎలక్షన్ బాబు విజయం నల్లేరు మీద బండినడకేనని అంటున్నారు.
కనిగిరి..
కనిగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బుర్రా మధుసుదన్ యాదవ్ విజయం సాధించారు. ఈసారి ఆయన్ని జగన్ పక్కన పెట్టేశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో నేత డి. నారాయణ యాదవ్ ను వైసీపీ అధిష్టానం బరిలోకి దింపింది. అయితే, నారాయణ యాదవ్ ను నియమించడంపై మధుసూదన్ యాదవ్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనికితోడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ప్రజా వ్యతిరేకత వ్యతిరేకత నారాయణ యాదవ్ విజయానికి పెద్ద అవరోధం అని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా ఉగ్రనరసింహారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఆయన విజయం సునాయాసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఒంగోలు..
ఒంగోలు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. మరోసారి వైసీపీ అభ్యర్థిగా ఆయనే బరిలోకి దిగనున్నారు. బాలినేనిపై భూకబ్జాల ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రజల నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా మరోసారి దామచర్ల జనార్దన్ రావు బరిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల చేసిన తొలి జాబితాలోనే దామచర్ల పేరు ప్రకటించారు. దీనిని బట్టే ఒంగోలులో దామచర్ల విజయంపై తెలుగుదేశం ఎంత ధీమాతో ఉందో అర్ధమౌతోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, స్థానికంగా బాలినేనికి ఉన్న ప్రతికూలతలే దామచర్ల విజయానికి సోపానాలుగా పరిశీలకులు చెబుతున్నారు.
కొండపి..
కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గత రెండు దఫాలుగా అక్కడ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తోంది. గత ఎన్నికల్లో డోల బాలవీరాంజనేయ స్వామి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ సారి కూడా తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా కొండపి నుంచి బాల వీరాంజనేయ స్వామి పోటీ చేయనున్నారు. 2024 ఎన్నికల్లోనూ ఆయన విజయం ఖాయమని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్థిగా కొండపి నుంచి ఆదిమూలపు సురేశ్ బరిలోకి దిగబోతున్నారు. వైసీపీ అధిష్టానం ఇప్పటికే సురేశ్ ను కొండపి నియోజకవర్గం ఇంచార్జిగా నియమించింది. అయితే, ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కావడంతో పాటు జనసేన ఓటు బ్యాంకు కూడా తోడవుతుండటం, జగన్ పాలనపై నియోజకవర్గం ప్రజల్లో వ్యతిరేకత ఇలా అన్ని అంశాలు మరోసారి తెలుగుదేశం అభ్యర్థి విజయానికి దోహదం అవుతాయిని అంటున్నారు.
దర్శి ..
దర్శి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ విజయం సాధించారు. అయితే జగన్ ఆయన్న తప్పించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. 2014లో బూచేపల్లి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీకి ఈసారి ఓటమి తప్పదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో కాపు, కమ్మ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ. తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా జనసేన నేత గరికపాటి వెంకటరావు బరిలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే రెండు సామాజిక వర్గాల ఓట్లతోపాటు, వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వైసీపీ అభ్యర్థి ఓటమిలో కీలక భూమిక పోషించే అవకాశం ఉన్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.
సంతనూతలపాడు..
సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సుధాకర్ బాబు విజయం సాధించారు. అయితే వైసీపీ అధిష్టానం అతన్ని పక్కనపెట్టి మంత్రి మేరుగ నాగార్జునను సంతనూతలపాడు వైసీపీ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ నియోజకవర్గం ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు పార్టీలో వర్గవిబేధాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా బి. విజయ్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు. గత రెండుసార్లు విజయ్ కుమార్ ఓడిపోవటంతో నియోజకవర్గంలో ఆయన పట్ల సానుభూతి వ్యక్తమవుతోంది. దీనికి తోడు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో కమ్మసామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువే. ఈ రెండు అంశాలకు తోడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఈదఫా విజయ్ కుమార్ విజయానికి దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కందుకూరు..
కందుకూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మహిదర్ రెడ్డి విజయం సాధించారు. అయితే వైసీపీ అధిష్టానం ఆయనను పక్కన పెట్టి అరవింద యాదవ్ ను రంగంలోకి దింపింది. విద్యాసంస్థల అధినేత పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్ భర్త వెంకటరంగయ్య బెంగళూరులో వ్యాపారవేత్త. ఈ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. అందుకే అరవింద యాదవ్ ను వైసీపీ ఇంచార్జిగా నియమించినట్లు స్థానికంగా చర్చ జరుగుతున్నది. తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావుకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందంని అంటున్నప్పటికీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో గూటికి చేరితే.. ఆయనకు సన్నిహితుడైన మహిదర్ రెడ్డిని తెలుగుదేశం బరిలోకి దించే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో కమ్మసామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. గతంలో మహిదర్ రెడ్డికే కమ్మ సమాజికవర్గం మద్దతుగా నిలిచింది. ఈసారి ఆ సామాజిక వర్గం ఓట్లు తెలుగుదేశం కూటమివైపు మళ్లే అవకావం ఉంది. దీనికితోడు వైసీపీ ప్రభుత్వం పై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈనేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం సునాయాసం అని అంటున్నారు.
అద్దంకి..
అద్దంకి నియోజకవర్గం అంటే గొట్టిపాటి రవికుమార్ గుర్తుకొస్తారు. 2019లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. మరోసారి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఆయనే బరిలోకి దిగుతున్నారు. ఆయనకు నియోజకవర్గంలో అన్నివర్గాల నుంచి ప్రజల మద్దతు ఉంది. అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా హనిమిరెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. అయితే, ఈ నియోజకవర్గం నుంచి మరోసారి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధిస్తారన్న వాదన స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
చీరాల..
చీరాల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం విజయం సాధించారు. అయితే, ఆయన వైసీపీలో చేరడంతో చీరాల నుంచి వైసీపీ ఇంచార్జిగా కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్ ను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. తెలుగుదేశం కూటమి నుంచి చీరాల అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈ నియోజకవర్గంలో మరోసారి తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థే విజయం సాధిస్తారని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కరణం బలరాంపై నియోజకవర్గ ప్రజలపై కొంత వ్యరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు వైసీపీ ప్రభుత్వంపైనా ప్రజల్లో వ్యరేకత ఉంది. మరోవైపు తెలుగుదేశం ఓటు బ్యాంకుతో పాటు జనసేన ఓటు బ్యాంకు కూడా కలవనున్న నేపథ్యంలో చీరాలలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు.
పరుచూరు..
పరుచూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు గత రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. మరోసారి ఇక్కడ నుంచి ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. చ ఇక్కడ ఏలూరి హ్యాట్రిక్ విజయం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నియోజకవర్గంనుంచి వైసీపీ అభ్యర్థిగా యడం బాలాజీని జగన్ ఎంపిక చేశారు. పరుచూరు నియోజకవర్గంలో రాజకీయంగా కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. ఆ తరువాత కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. తెలుగుదేశం జనసేన కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మద్దతుతోపాటు.. మిగిలిన సామాజిక వర్గాల్లోనూ ఏలూరి సాంబశివరావు అంటే అభిమానం ఉంది. ఈ క్రమంలో ఏలూరి విజయం లాంఛనమేనంటున్నారు.