కొలిక్కి వచ్చిన సర్దుపాట్లు.. లోక్ సభకే పవన్ పోటీ?!
తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా సజావుగా ముగిసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి నివాసంలో జరిగిన కీలక భేటీలో సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు త్యాగాలకు వెనుకాడకపోవడం చూస్తుంటే.. పొత్తు పటిష్ఠంగా ఉండేందుకు ఆ పార్టీలు కంకణం కట్టుకున్నాయని స్పష్టమౌతోంది. తాజాగా కుదిరిన ఒప్పందం మేరకు పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలు కలిసి మొత్తం 31 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తాయి. వీటిలో బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలలోనూ, జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఇక్కడ తెలుగుదేశం కూడా తన కోటా నుంచి ఒక స్థానాన్ని బీజేపీ కోసం త్యాగం చేసింది. దీనితో సీట్ల సర్దుబాటు ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా ముగిసిందనే చెప్పాలి.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో జనసేనాని పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ నాయకుడు జయంత్ దాదాపు ఎనిమిది గంటలకు పైగా దీర్ఘంగా చర్చించి.. సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహనకు వచ్చారు. పొత్తులో భాగంగా ఎవరికి ఏ సీటు వచ్చినా అక్కడ గెలుపు గుర్రాన్నే నిలబెట్టాలనీ, ఎట్టి పరిస్థితిలో ఆ సీటు వైసీపీకి వెళ్లకూడదన్న విషయంలో మూడు పార్టీలూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని, ఈ విషయంలో పంతాలు, పట్టింపులకు పోరాదనీ నిర్ణయించారు. అవసరమైతే అవసరమైన స్థానాలలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్ధుల మార్పు చేర్పులకూ వెనుకాడరాదని కూడా ముగ్గురు నేతలూ ఒక అభిప్రాయానికి వచ్చారు.
ఇదంతా సీట్ల సర్దుబాటు విషయంలో జరిగిన చర్చ అయితే రాష్ట్రంలో వైసీపీ అరాచక, హింసాత్మక తీరుపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై కూడా చర్చ జరిగిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అలా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులలో కొందరు కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ వచ్చిన వారు కూడా ఉన్నారన్న విషయంపై చంద్రబాబు కేంద్ర మంత్రి, బీజేపీ నేతలకూ వివరించారని అంటున్నారు. ఎన్నికల సమయంలో ఆ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలున్నాయన్న అనుమానాన్ని చంద్రబాబు కేంద్ర మంత్రి వద్ద వ్యక్తం చేశారంటున్నారు. అటువంటి వారి జాబితా తనకు ఇవ్వాలని కేంద్ర మంత్రి షెకావత్ కోరగా, ఆ జాబితాను చంద్రబాబు షెకావత్ కు అందజేశారని అంటున్ారు. ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చిన తరువాత ఆ జాబితాలో ఉన్న వారందరినీ ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గట్టిగా డిమాండ్ చేసినట్లు తెలిసింది.
గత ఎన్నికల ముందు కూడా ఇలాగే డీజీపీ, ఇంటలిజన్స్ ఏడీజీ, సీఎస్‌ను తప్పించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్ర మంత్రికి గుర్తు చేశారని తెలిసింది. మొత్తంగా సీట్ల సర్దు బాటు విషయంలోనే కాదు, ఎన్నికలలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న అనుమానాలు ఉన్న అధికారుల విషయంపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కేంద్ర మంత్రి షెకావత్ తోనూ, బీజేపీ జాతీయ నాయకుడు జయంత్ తోనూ చర్చించినట్లు తెలిసింది. గెలుపే లక్ష్యంగా ప్రతి అడుగూ పడాలన్న ఈ భేటీలో నిర్ణయించారని అంటున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటు వేసే వాతావరణం ఉండాలని అందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి షెకావత్ చెప్పినట్లు తెలుస్తోంది.