కుర్చీ రాజకీయమా?
posted on Mar 12, 2024 @ 10:51AM
ఒక చిట్టడవిలో ఒక కోతుల గుంపు నివసించేది. ఒకరోజు అమ్ము అనే కోతికి ఒక కొబ్బరిచిప్ప దొరికింది. దానికి అదేంటో అర్థం కాలేదు. పైన గరుకుగా, లోపల మెత్తగా ఉండటంతో కొరికి చూసింది. రుచిగా ఉండటంతో కొబ్బరిని కొరికి తినే సింది. ఖాళీ కొబ్బరి చిప్పను పడేయడానికి దానికి మనసొప్పలేదు. చెట్టుపైన ఒక చోట దాచుకుంది. రోజూ ఆ కొబ్బరిచిప్పను జాగ్రత్తగా కాపాడుకునేది. దాని వింత చేష్టలు చూసి మిగతా కోతులు నవ్వుకునేవి. ఒకరోజు జోరున వర్షం కురిసింది. కోతులన్నీ తడిసి ముద్దయ్యాయి. అమ్ము మాత్రం కొబ్బరిచిప్పను తలపై గొడుగులా పెట్టుకుని తడవకుండా ఉంది. కొబ్బరిచిప్ప గొడుగులా ఉపయోగపడటంతో దాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మిగతా కోతులకేసి చూస్తూ వేళాకోళమాడింది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలోనూ కొబ్బరిచిప్పను తలపై పెట్టుకుని తిరిగేది. కొబ్బరి చిప్ప దొరకడం అదృష్టంగా భావించేది. మిగతా కోతులకు కూడా కొబ్బరిచిప్ప దొరకడం గురించి గొప్పగా చెప్పేది. అమ్ము బడాయి మాటలు విని మిగతా కోతులు నవ్వుకునేవి. ఒకరోజు సాయంత్రం కోతులన్నీ చెట్టు కింద చేరి ఆడుకుంటున్నాయి. అదే సమయంలో ఈదురుగాలులు మొదలయ్యాయి.
చెట్ల కొమ్మలు ఊగుతుండటం, ఆకాశంలో మబ్బులు కమ్ముతుండటంతో కోతులన్నీ భయంతో ఓ మూలన చేరాయి. అమ్ము మాత్రం కొబ్బరి చిప్ప ఉందన్న దైర్యంతో ‘నాకు వానపడినా భయం లేదు. నా దగ్గర కొబ్బరి చిప్ప ఉందిగా’ అంటూ గెంతులేయసాగింది. ఈ కోతి పరిస్థితి తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి ఒకే మాదిరిగా ఉంది. నిన్న యాదరగుట్ట లక్ష్మినరసింహా స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్బంగా ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ కార్యక్రమానికి డిప్యూటి సీఎం కొద్దిగా ఆలస్యంగా చేరుకున్నారు . అప్పటికీ వేదిక మీద ముఖ్యమంత్రితో బాటు కేబినెట్ మంత్రులు ఆసీనులయ్యారు. ఆలస్యంగా రావడంతో బట్టి విక్రమార్క కూర్చునే కుర్చీ ఎత్తును అధికారులు సరిగ్గా చూసుకోలేకపోయారు. అందుబాటులో ఉన్న కుర్చీ ఇచ్చారు. మిగతా కుర్చీల కంటే ఈ కుర్చీ కొద్దిగా ఎత్తు తక్కువ ఉండటంతో బిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. యాదగిరి గుట్టలో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేశారు.
యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానించారని బీఆర్ఎస్ నాయకులు చేస్తోన్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ దీటుగా స్పందిస్తోంది. యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్టూల్స్‌పై కూర్చోగా, భట్టివిక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కింద కూర్చున్నారు. దీంతో... దళితులు, వెనుకబడిన వర్గాల వారిని కాళ్ల వద్ద కూర్చోబెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు.
యాదగిరిగుట్టలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు సీఎం పక్కన ఉన్నారని, భద్రాద్రిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నారని వివరించారు.
సోషల్ మీడియాలో యాదగిరిగుట్టను ట్రోల్ చేస్తుండటంతో కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ భట్టివిక్రమార్క పైన కూర్చొని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు కింద కూర్చున్న ఫొటోను షేర్ చేసింది. బీఆర్ఎస్ నాయకులకు రెండు ఫొటోలు పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది.
అందులో ఓ ఫొటోలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లు భట్టి విక్రమార్కలు పక్క పక్కన కుర్చీల్లో కూర్చొని ఉండగా... కోమటిరెడ్డి వెంకట రెడ్డి కింద కాళ్లపై కూర్చొని రాహుల్ గాంధీ చేతిలోని దోశను ఆరగిస్తున్నట్లుగా ఉంది. 'కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వం' అని పేర్కొంది. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.మరో ట్వీట్‌లో రేవంత్ రెడ్డి కాలుమీద కాలు వేసుకొని ఉండగా, మల్లు భట్టి విక్రమార్క మీసాలు దువ్వుతున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇందులో వారిద్దరు నవ్వుతూ సరదాగా ముచ్చటించుకుంటున్నారు. 'తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని... తరిమేవాళ్ళను హితులుగా తలిచి ముందుకెళ్లాలని' అని ట్వీట్ చేసింది.