సిద్ధం సభ.. ప్లాప్ అని ఒప్పుకోలేక.. సక్సెస్ అని చెప్పుకోలేక.. పాపం వైసీపీ
posted on Mar 11, 2024 @ 2:50PM
కాలు గడప దాటదు కానీ, మాటలు కోటలు దాటేస్తాయన్నట్లు తయారైంది వైసీపీ పరిస్థితి. బిల్డప్ బాబాయ్ లకే సాధ్యం కాని లెవెల్ లో గంభీర ప్రకటనలు చేయడం.. వాస్తవంలో మాత్రం చెప్పినదానికీ జరిగిన దానికీ ఇసుమంతైనా పొంతన లేకపోవడం జగన్ పార్టీకి పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో యుద్ధానికి సిద్ధం కావాలంటూ సిద్ధం పేరిట ఇప్పటికే మూడు బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ తాజాగా ఆదివారం (మార్చి 10) బాపట్లలో నిర్వహించిన చివరి సిద్ధం సభలో మాత్రం చతికిల పడిపోయింది.
ఆరంభ శూరత్వం తప్ప.. సిద్ధం సభల ద్వారా సాధించిందేమీ లేదని తేటతెల్లమైపోయింది. ఇప్పటి వరకూ ఏమూలో కాస్తో కూస్తో విజయంపై నమ్మకం ఉన్న క్యాడర్ కు కూడా రానున్న ఎన్నికల ఫలితం ఏమిటన్నది కళ్లకు కట్టింది జగన్ చివరి సిద్ధం సభ. 15లక్షల మందికి పైగా వస్తారంటూ ఆర్భాటంగా గొప్పలు చెప్పుకున్న ఆ పార్టీ నేతలు చివరికి కనీస స్థాయిలో కూడా జనాన్ని సమీకరించలేక చేతులెత్తేసి.. ఇక గెలుస్తామంటూ కనీసం మాటవరసకు కూడా చెప్పుకోవడానికి అవకాశం లేని స్థాయికి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేశారు. తొలి సిద్ధం సభలో యుద్ధానికి సమయం వచ్చేసిందనీ, ఇక చొక్కాలు మడతపెట్టేయాలనీ క్యాడర్ కు పిలుపు నిచ్చిన జగన్ చివరి సిద్ధం సభకు వచ్చేసరికి జనాన్ని కూడా సమీకరించలేని పార్టీ దుస్థితిని అందరికీ చూపించేశారు.
తాడేపల్లి ప్యాలెస్ దాటి అడుగు బయటపెడితే జనం తన ముఖం చూడరని ఈ సభ ద్వారా తేటతెల్లం చేసేశారు. అందుకే ఇంత కాలం బయటకు వస్తే రోడ్లకు ఇరువైపులా పరదాలు ఏర్పాటు చేసుకున్న సంగతిని దాపరికం లేకుండా ఈ సభ ద్వారా చెప్పేశారు. చివరి సిద్ధం సభ నాటికి కనీసం అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేయలేని దుస్థితిని చాటుకున్నారు. ఎన్నిక మేనిఫెస్టో కూడా ప్రకటించలేని దయనీయ స్థితిని ఎల్లరకూ తెలిసేలా చేయగలిగారు జగన్.
ఇప్పటి దాకా మైకు పట్టుకుంటే చాలు చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడటం తప్ప తాను ఈ ఐదేళ్ల కాలంలో చేసినది ఇదీ, తన హయాంలో జరిగిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోలేని జగన్.. ఎన్నికల సన్నాహకంలో భాగంగా అఖరి అంకమైన సిద్ధం సభలో మరోసారి తనకు అధికారం కట్టబెడితే ఇది చేస్తాను అని కూడా చెప్పుకోలేని పరిస్థితి తనదని తేటతెల్లం చేసేశారు. మసిపూసి మారేడు కాయ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన జగన్.. సిద్ధం సభ సందర్భంగా అందులోనూ ఘోరంగా విఫలమయ్యారు. లక్షల మంది హాజరౌతారంటూ ఆర్భాటంగా ప్రకటించుకుని మరీ నిర్వహించిన ఈ సభకు జనాలు రాకపోయినా వచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకునేందుకు చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమవ్వడమే కాకుండా పార్టీనీ, జగన్ ను కూడా నవ్వుల పాటు చేసింది. ఇంతకీ జనం హాజరు విషయంలో జగన్ మసిపూసి మారేడు కాయ చేయడానికి చేసిన ప్రయత్నమేంటంటే సభా ప్రాంగణమంతా గ్రీన్ కార్పెట్లు పరిచేసి.. జనం రాకపోయినా ఆ తరువాత వచ్చినట్లుగా కావలసినట్లు మార్చేసుకోవచ్చని చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది వైసీపీ. ఆ ప్రయత్న మంతా సామాజిక మాధ్యమంలో కళ్లకు కట్టినట్లు వచ్చేయడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక సిద్ధం సభ పూర్తయిన తరువాత వైసీపీ విడుదల చేసిన విజువల్స్ లో జనం ఉన్నట్లుగా చూపించడానికి ఫొటోలను మిక్స్ చేసి చేసిన యత్నం కూడా మీడియాలో ఆధారాలతో సహా వచ్చేసింది. దీంతో సిద్ధం సభ విషయంలో వైసీపీ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా తయారైంది. జనం వచ్చారని చెప్పుకోలేక, రాలేదని ఒప్పుకోలేక నానా ఇబ్బందులూ పడుతోంది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధం సభకు సంబంధించి వైసీపీ మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసిన ఫొటోలను తన ఎక్స్ ఖాతా ద్వారా రివీల్ చేసి సీఎం జగన్ సిద్ధం సభలకు జనం రాకపోయినా... మార్ఫింగ్ ఫొటోలు వేసుకుంటూ సభ విజయవంతమైనట్టు చెప్పుకుంటున్నారని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.