మార్పు మొదలైంది!.. వైసీపీ ఓటమి ఖరారైంది!
posted on Mar 12, 2024 @ 3:20PM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. ఇప్పటి దాకా ఇష్టారీతిగా, అడ్డగోలుగా, అధికార పార్టీ ఏం చెబితే అది చేసిన అధికారులు ఇప్పుడు నిబంధనలు మీరమని ఆ పార్టీ నేతల ముఖం మీదే చెప్పేస్తున్నారు. వైసీపీ ప్రయోజనాల కంటే మా ఉద్యోగ భద్రతే మాకు ముఖ్యమంటూ తెగేసి చెబుతున్నారు. నాలుగున్నరేళ్ల పై చిలుకు కాలంగా రాష్ట్రంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం వేరువేరు అని ఎవరూ అనుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేస్తారు. బాధితుల ఫిర్యాదులు స్వీకరించడానికి వారి చేతులు రావు అన్నట్లుగానే సాగింది. ఇక ప్రభుత్వం తరఫున పని చేయాల్సిన అధికారులు అధికార పార్టీ కార్యకర్తలను మించి పార్టీ భక్తి ప్రదర్శిస్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఇప్పటి వరకూ అదే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు వంటి నాయకుడిని కూడా ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేసేస్తారు. కారణం చెప్పమంటే ముందు అరెస్టు చేస్తున్నాం, తరువాత దర్యాప్తు చేసి అరెస్టుకు కారణమేంటో చెబుతాం అంటూ తర్కానికి అందని వాదనను తెరమీదకు తీసుకువస్తారు. ఇలా జగన్ పార్టీ కనుసన్నలలో నడిచిన అధికారులకు ఇప్పుడు తమ విధులు, పరిమితులు, ఉద్యోగ ధర్మం, అన్నిటికీ మించి రూల్స్ గుర్తుకు వస్తున్నాయి.
ఎన్నికల ముంగిట అటువంటి వారిలో హఠాత్తుగా జ్ణానోదయం కలగడానికి కారణం ఎన్నికలు కాదు. ఆ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉప్పందడమేనని పరిశీలకులు అంటున్నారు.
నిన్న మొన్నటి వరకూ అధికార పార్టీ సభలు అంటే అడ్డగోలుగా వేలకు వేల బస్సులను కేటాయించేసి సామాన్య ప్రజల ఇక్కట్ల గురించి కనీసం ఆలోచన కూడా చేయని ఆర్టీసీ అధికారులు ఇప్పుడు మారారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఈ నెల 17న చిలకలూరి పేటలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు కావాలన్న తెలుగుదేశం లేఖకు ఆర్టీసీ ఆఘమెఘాల మీద స్పందించింది. బస్సులు కేటాయిస్తాం.. ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ పెట్టండంటూ రిప్లై ఇచ్చింది. ఇది నిజంగా ఆశ్చర్యకరపరిణామమే. ఎందుకంటే సిద్ధం సభకు వేలకొద్దీ బస్సులు కేటాయించిన ఆర్టీసీ విపక్షాల సభకు మాత్రం బస్సులు ఇచ్చే ప్రశక్తేలేదని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చింది. తెలుగుదేశం ఆధ్వర్యంలో చిలకలూరి పేటలో జరిగే సభకు బస్సులు కావాలంటూ తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడి లేఖకు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించారు. గత ఐదేళ్లుగా ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థలా కాకుండా వైసీపీ రవాణా సంస్ధగా మారిపోయిందనడంలో సందేహం లేదు. జగన్ సభలకు, వైసీపీ కార్యక్రమాలకు ఎన్ని వేల బస్సులను కేటాయించిందో, అలా కేటాయించిన బస్సులకు ఆ పార్టీ నుంచి సొమ్ములు ముట్టాయా లేదా అన్న లేక్కలు లేవు. అంతా వైసీపీ ఇష్టారాజ్యంగా నడిచిపోయింది.
అయితే తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసి పని చేయనున్నదన్న విషయం తేటతెల్లమయ్యాకా అన్ని శాఖల అధికారులలో వచ్చినట్లుగానే ఆర్టీసీ అధికారుల్లో కూడా మార్పు మొదలైంది. వైసీపీ గెలిచే చాన్స్ లేదన్న నమ్మకం బలపడటంతో ఇప్పటి వరకూ ఊడిగం చేసిన అధికారులు మెల్లమెల్లగా తాము నిబంధనలకు లోబడే ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నామని చెప్పుకోవడానికి తాపత్రేయ పడుతున్నారు. ఒక్క ఆర్టీసీ అని కాదు, దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పుడైతే ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తోంది కానీ, జగన్ సర్కార్ భవిష్యత్ ను మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ అధకారులు ముందుగానే కనిపెట్టేశారు. గత ఏడాది జూన్ నాటికే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ మరోమారు అధికారంలోకి వచ్చే సరిస్థితి లేదని వారికి తెలిసిపోయింది. అదెలాగంటారా?
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా అన్న విషయం తెలుసుకోవడానికి రాజకీయపార్టీలు సాధారణంగా సర్వేల మీద ఆధారపడతాయి. సొంతంగా సర్వేలు నిర్వహించుకుంటాయి. ఆ సర్వేల ఆధారంగా కార్యాచరణను రూపొందించుకుంటాయి. కానీ ఇలాంటి సర్వేలేవీ అవసరం లేకుండానే వచ్చే ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయం అందరికంటే ముందే పసిగట్టేయగలరు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు. వారినే రాజకీయ పరిభాషలో బాబూస్ అని పిలుస్తారు. వారెలా కనిపెట్టేయగలరంటారా? అదంతే వారికన్నీ అలా తెలిసిపోతుంటాయంతే.
వారికి ఎలా తెలిసిపోతుందంటారా? అదంతే.. వారు ప్రజలలోకి రాకపోయినా రాజకీయ క్షేత్రంలో ఎక్కడ ఏం జరుగుతోందో ఇట్టే కనిపెట్టేయగలరు? వారి ఉద్యోగ ధర్మంలో భాగంగా వారికి ఉండే నెట్ వర్క్ అలాంటిది. రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేనట్టుగా కనిపించే వీరు రాజకీయ పరదాల మాటున జరుగుతున్నదేమిటో ఇట్టే కనిపెట్టేయగలరు. రేపు ఎన్నికలలో గెలిచే పార్టీ ఏదో, ఓడే పార్టీ ఏదో ఇప్పుడే చెప్పేయగలరు? అటువంటి బాబూస్ ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లు చేయడానికి ముందు వెనుకలాడుతున్నారు. నిబంధనలను ఒకటికి రెండు సార్లు చూసుకుని అవిధేయత ప్రదర్శించకుండానే తమ పరిధి దాటి పని చేయలేమని జగన్ సర్కార్ పెద్దలకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. అంతే కాదు.. ఏ మాత్రం చాన్స్ దొరికినా ఒక సారి తెలుగుదేశం అధినేత దృష్టిలో పడితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచే బాబూస్ లో ఈ మార్పు కనిపించింది. చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న సమయంలో ఏపీకి చెందిన పలువురు బాబూస్ అక్కడకు వెళ్లి మరీ ఆయనను కలిసి వచ్చేవారు.
తాము నిబంధనలను అతిక్రమించి పని చేసిన సందర్భాలను ఏకరవు పెట్టి ప్రభుత్వ ఒత్తిడే తప్ప అది తమ అభిమతం కాదని విన్నవించుకున్నారు. ఇక ఎన్నికల ముంగిట వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా నింబంధనలకు అనుగుణంగా పని చేయడానికే మొగ్గు చూపుతున్నారు. తద్వారా అధికార పార్టీ అడుగలు మడుగులొత్తడం లేదని విపక్ష నేతకు తెలిసేలా చేయడానికి తాపత్రేయ పడుతున్నారు. దీంతో అధికారుల వద్ద జగన్ పార్టీ నేతల పప్పులు గతంలోలా ఉడకడం లేదని అంటున్నారు. ఈ మార్పు.. జగన్ ప్రభుత్వ పతనానికి సంకేతంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.