అధికార పార్టీలో గందరగోళం.. విపక్ష కూటమిలో క్లారిటీ.. జగన్ పనైపోయిందా?
posted on Mar 11, 2024 @ 5:01PM
ఎన్నికల షెడ్యూల్ రోజుల వ్యవధిలో వెలువడనుంది. మోస్ట్లీ ఈ వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తి అవుతాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఈ పరిస్థితుల్లో ఒక స్పష్టత ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల్లో చిన్న పాటి గందరగోళం కూడా ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక, గెలుపు గుర్రాల ఎంపిక విషయంలో వాటిలో ఒకింత అయోమయం ఉంటుంది. కానీ విచిత్రంగా ఏపీలో మాత్రం అధికార పార్టీలో విచిత్రంగా పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది.
విపక్షాలు పొత్తుల విషయంలో, సీట్ల సర్దుబాటులో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా ముందుకు సాగుతుంటే.. అధికారంలో ఉండి కూడా అభ్యర్థలను ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడుతోంది. జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తూ, మార్పుల మీద మార్పులు చేస్తూ నానా కంగాళీ చేస్తున్నది. అసమ్మతి అగ్నిగుండంలా రగులుతోంది. అసాధారణంగా అధికార పార్టీ నుంచే వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో స్పష్టత ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలో గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల నుండి తాజాగా తెలంగాణ ఎన్నికల వరకూ తెలుగు రాజకీయాలలో అదే చూశాం. కానీ ఏపీలో అధికార పార్టీలో గందరగోళం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ జనసేనతో పొత్తులో , బీజేపీని కూడా కలుపుకుని కూడా ధీమాగా కనిపిస్తున్నది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో కానీ విపక్ష కూటమిలో పూర్తి క్లారిటీ కనిపిస్తోంది. అదే సమయంలో ఏ పార్టీతోనూ పొత్తుల మాటే లేని అధికార వైసీపీలో మాత్రం తీవ్ర గందరగోళ పరిస్థితి కనిపిస్తున్నది. అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో.. ఎంపీ అభ్యర్థి ఎవరో.. ఎవరు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారో కూడా అర్ధంకాక క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పటి దాకా విడుదలైన జాబితాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిత్వం ఖరారైందన్న ఆనందం నేతలలో కనిపించడం లేదు. మరో జాబితాలో ఈ ఖారారైన సీటు గల్లంతౌతుందేమోనన్న భయంచ ఆందోళన వారిలో వ్యక్తం అవుతున్నాయి. అంతేనా అసలు షెడ్యూల్ విడుదలయ్యే నాటికి పార్టీలో ఉండేది ఎవరో.. పోయేది ఎవరో అన్న నిర్వేదం కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా నిండా నాలుగైదు వారాలు కూడా లేదు. అయినా పార్టీలో అసంతృప్తి భగ్గుమంటున్నా, నేతలు పక్షుల్లా పార్టీ గూడు వదిలి ఎగురిపోతున్నా నిలువరించేందుకు చిన్నపాటి ప్రయత్నం కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఎందుకు మిగిలిపోయారు. కనీసం చెలరేగి పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? సీట్ల మార్పులో ఇంత గందరగోళం నెలకొన్నా సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? అంటే పార్టీ నేతలలో తన మాటు చెల్లుబాటు కాదన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారా అన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ నిర్వహించిన నాలుగు సిద్ధం సభల స్పందన చూసిన తరువాత జగన్ పరిస్థితి చేయిదాటిపోయిందన్న నిర్ణయానికి వచ్చి చేతులెత్తేశారా అన్న భావన కూడా వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. చివరిగా ఆదివారం (మార్చి 10) బాపట్ల జిల్లాలో నిర్వహించిన సిద్ధం సభకు ఎంత ప్రయత్నించినా అనుకున్న మేర జనాలను తరలించడంలో అధికార పార్టీ విఫలం కావడమే రానున్న ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందనడానికి తార్కానంగా చెబుతున్నారు. ఐదేళ్ల పాలనలో తాను సాధించిందేమిటీ, మరో సారి అధికారంలోకి వస్తే ఏం చేస్తాను అన్న విషయాలను చెప్పడం మాని, విపక్షాలపై విమర్శలకే జగన్ ప్రసంగం పరిమితం కావడాన్ని బట్టే జగన్ తన వైఫల్యాన్ని అంగీకరించేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.