నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అంటూ బీఆర్ఎస్ నుంచి జంపింగులు!
posted on Mar 12, 2024 @ 10:57AM
రాజకీయాలలో అధికార పక్షం ప్రతిపక్షం కావడం, ప్రతిపక్షం అధికార పక్షం కావడం అత్యంత సహజం. ఏ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదు. అందుకే రాజకీయాలలో విజయానికి పొంగిపోకూడదు, పరాజయానికి కుంగిపోకూడదు అంటారు. అయితే కొందరు మాత్రం విజయం సాధిస్తే తనంతటోడు లేడని విర్రవీగుతారు. పరాజయం ఎదురైతే ప్రత్యర్థులంతా కలిసి కుట్ర చేశారని గగ్గోలు పెడతారు. మొత్తం మీద ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే పాపం తన ఓటమికి ప్రత్యర్థులు కుట్ర చేశారని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రిన, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎదుర్కొంటున్నారు.
తాను పన్నినదే వ్యూహం, తాను చేసిందే రాజకీయం అన్నట్లుగా అధికారంలో ఉన్నంత కాలం వ్యవహరించిన ఆయన సొంత పార్టీ నేతలకు కూడా ఎన్నడూ అందుబాటులో లేరు. సచివాలయానికి వెళ్లిందే లేదు. తాను ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియెట్ అన్నట్లుగా వ్యవహరించారు. జన బాహుల్యం బాధలను పట్టించుకోకుండా గంటల తరబడి ట్రాఫిక్ ను నిలిపివేసి మరీ అత్యంత రద్దీగా ఉండే సమయాలలోనే ఫామ్ హౌస్ నుంచి క్యాంపు కార్యాలయానికీ, క్యాంపు కార్యాలయం నుంచీ ఫామ్ హౌస్ కూ రాకపోకలు సాగించారు. తనకు నచ్చిన వారు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టాలి అన్న రీతిలో వ్యవహరించారు. తనతో విభేదించి పార్టీ నుంచి బహిష్కృతుడైన ఈటల రాజేందర్, తనపై విమర్శల వర్షం కురిపించి, నిగ్గదీసి నిలదీసే రేవంత్ రెడ్డి వంటి వారు ప్రజా మద్దతుతో గెలిచినా తన ముందు అసెంబ్లీలో కూర్చోవడాన్ని సహించలేక.. వారు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశమే లేకుండా సస్పెన్షన్ల వేటుతో తన పంతం నెగ్గించుకున్నారు. అయితే అదంతా గతం.. ఇప్పుడు కేసీఆర్ విపక్షంలో ఉన్నారు. నాడు తాను ముఖం చూడటానికి కూడా ఇష్టపడని రేవంత్ ముఖ్యమత్రిగా ఉన్నారు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. కీలకమైన బడ్జెట్ రోజున, అలాగే ఇరిగేషన్ పై చర్చకు కూడా సభకు హాజరు కాకుండా ముఖం చాటేశారు. ఇదంతా ఒకెత్తైతే.. ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేసే వ్యూహంతో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మరొక ఎత్తు. ఒక రకంగా దీనికి ఒక ట్రెండ్ గా మార్చింది మాత్రం కేసీఆర్ అనే చెప్పాలి. గతంలో కూడా జంప్ జిలానీలు ఉండేవారు. ఒక పార్టీ నుంచి మరో పర్టీలోకి జంప్ చేసిన నేతలు అరుదేమీ కాదు. కానీ అసలు ప్రత్యర్థి పార్టీయే ఉండకూడదు అన్న లక్ష్యంతో సామదానభేద దండోపాయాలను ఉపయోగించి ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని లాగేసుకునే పరిస్థితి మాత్రం లేదు. కానీ కేసీఆర్ సరిగ్గా అలాగే చేశారు.
ఇప్పుడు అందుకు ఫలితం అనుభవిస్తున్నారు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి జంపింగులు జోరందుకున్నాయి. ఆ పార్టీ నుండి నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి, లేదా కమలం గూటికి చేరిపోతున్నారు. వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసే నైతికత కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేకుండా పోయింది. బిఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేష్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి నిన్న బిఆర్ఎస్ కారు దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, పైళ్ల శేఖర్ రెడ్డి త్వరలోనే గులాబీ బాస్ కు గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వెళ్లేవారిని అడ్డుకోలేక ఉన్నవారిని కట్టడి చేయలేక కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలను చూస్తుంటే.. కేసీఆర్ కు పార్టీపై పట్టు పూర్తిగా పోయిందన్న భావన కలుగక మానదు. పార్టీ మారి వెడుతున్న వారిని ఆపడానికి ప్రయత్నించడం అటుంచి, వారు పార్టీకి ద్రోహం చేశారు, చేస్తున్నారు అన్న విమర్శ కూడా చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీలను నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో ఆయన అడుగులు వేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం తరఫున ఎన్నికైన వారందరినీ బీజేపీలో చేర్చుకుని ఆ పార్టీకి చట్ట సభలో ప్రాతినిథ్యం లేకుండా చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున వలసనలను ప్రోత్సహించి ఆ పార్టీని బలహీనం చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నది. కేసీఆర్ అప్పట్లో వలసల కోసం బీఆర్ఎస్ తలుపులు బార్లా తెరిచేశారు. తొలి నుంచీ అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి తన వెన్నంటి నడిచిన ఉద్యమ కారుల కంటే బయటి పార్టీల నుంచి వచ్చి చేరిన వారికే పెద్ద పీట వేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. బీఆర్ ఎస్ విపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రిగా ఇలా ప్రభుత్వం ఏర్పాటైందో లేదో అలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరీ రేవంత్ తో భేటీకి పోటీలు పడ్డారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే రేవంత్ దూకుడు పెంచారు. పదే పదే తన సర్కార్ కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలకు కౌంటర్ గా ఆయన తాను తలుపులు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. వాస్తవ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఆ మాత్రమైనా సీట్లు లభించాయంటే.. అది గ్రేటర్ పుణ్యమే అని చెప్పాలి. అటువంటి గ్రేటర్ పరిధిలోనే పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రేవంత్ తో టచ్ లోకి వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు.. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి గుత్తా వంటి వారే గైర్హాజరయ్యారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున నిలబడే అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ వెతుక్కోవలసిన పరిస్థితుల్లో ఉందంటే ఒక్క ఓటమితో కేసీఆర్ ఎంతగా డీలా పడిపోయారో అర్ధం చేసుకోవచ్చు.
సరిగ్గా అందుకే అదును చూసి దెబ్బకొట్టిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో బహిరంగ సభలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు మినహాయిస్తే మిగిలిన బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారని ప్రకటించారు. వారంతా తెలంగాణ అభివృద్ధికి తన ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నారనీ, అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు చేస్తున్న కృషిని అభినందిస్తున్నారనీ, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడం కోసం తమ వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లూ సుస్థిరంగా కొనసాగడానికి మద్దతు ఇస్తామని చెబుతున్నారనీ రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు గతంలో కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చే విధంగా తనతో గోక్కోవద్దు, అలా గోక్కున్న వాడెవడూ బాగుపడలేదంటూ రిటార్డ్ ఇచ్చారు.