సరబ్జిత్ ను హత్య చేశారా!

        భారతీయుడన్న ఒకే ఒక్క కారణంతో సరబ్జిత్ సింగ్ను పాకిస్థాన్ ప్రభుత్వం హత్య చేసిందని ఆయన సోదరి దల్బీర్కౌర్ న్యూఢిల్లీలో ఆరోపించారు. సరబ్జిత్ ఎప్పుడో చనిపోయినా, దాచి పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడి మరణం తమ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. సరబ్జిత్ మృతికి నిరసనగా దేశవాసులంతా ఒకే తాటిపై నడవాలని ఆమె భారతీయులకు పిలుపునిచ్చారు. పాక్ వైఖరీపై మొదట నుంచి తమకు అనుమానం ఉందని అన్నారు. 2005 నుంచి సరబ్జిత్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని తాము ప్రభుత్వాన్ని అభ్యర్థించిన సరైన రీతిలో స్పందించలేదని దల్బీర్కౌర్ తెలిపారు. భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే సరబ్జిత్ మరణించేవాడు కాదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అమాయకుడిని బలి తీసుకున్న పాక్ వ్యవహార శైలిలో ఎప్పటికి మారదని దల్బీర్కౌర్ వ్యాఖ్యానించారు.

అక్బరుద్దీన్ కు కష్టాలు

      వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీకి నాంపల్లి కోర్టు మళ్లీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈనెల 9వ తేదీలోగా అక్బరుద్దీన్ను కోర్టు ముందు హాజరు పరచాలని మాదన్నపేట పోలీసులకు నాంపల్లి ఏడో మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్పై కరుణాసాగర్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అదిలాబాద్ జిల్లా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో గత ఏడాది డిసెంబర్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అక్బరుద్దీన్ పైన దేశవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అతను నెల రోజులకు పైగా జైలులో కూడా ఉన్నారు. అనంతరం బెయిల్ పైన విడుదలయ్యారు.

'కారు'కి సైకిల్ పంచ్

      టీఆర్ఎస్ 'ఆకర్ష్' మంత్రతో టిడిపి పార్టీని ఖాళీ చేసేస్తామని కేసీఆర్ ప్రకటించగా.. దానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు 'కారు' దిగి 'సైకిల్'ఎక్కడానికి ఇష్టపడడంతో ఆయనకి రివర్స్ పంచ్ పడినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దొమ్మాటి సాంబయ్య, మేకల సారంగపాణి మూడు రోజుల క్రితం చంద్రబాబుని కలిసినట్లు సమాచారం. అనుచరులతో కలిసి టీడీపీతీర్థం పుచ్చుకుంటామని వారు కోరాగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీకి, పదవికి దొమ్మాటి సాంబయ్య బుధవారం రాజీనామా చేశారు. ఆ తరువాత కొన్ని గంటలకే చాడ సురేష్ రెడ్డి, మేకల సారంగపాణిలపై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారని, కేసీఆర్ కుటుంబం ఒంటెద్దు పోకడల మూలంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, డబ్బున్న వారికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎంపీ ఛాడా సురేష్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఈ విధంగానే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 100 సీట్లు కాదు కదా కనీసం పది సీట్లు కూడా రావని అన్నారు. గతంలో రెండు సార్లు టీడీపీ నుండి ఎంపీగా గెలిచిన సురేష్ రెడ్డి ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. అయితే చాడ, సాంబయ్యలు ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ కు చెందిన బలమైన నాయకులు కావడంతో జిల్లా రాజీకీయాలపైనే కాకుండా పార్టీపైనా తీవ్రప్రభావం చూపుతుందని పార్టీ వర్గాలు మదనపడుతున్నాయి.

బొత్స ఇంట్లో అసమ్మతి నేతల రాగాలాపనలు

  ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎన్నికల ప్రచారానికి బయలుదేరితే, ఇక్కడ హైదరాబాదులో ఆయనకి వ్యతిరేఖంగా పార్టీలో అసమ్మతి నేతలు సాక్షాత్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఆయన నివాసంలో సమావేశం అవుతున్నారు. మొదటి నుండి ముఖ్యమంత్రిని వివిధ కారణాలతో వ్యతిరేఖిస్తున్న డా. డీ.యల్. రవీంద్ర రెడ్డి, జానారెడ్డిలకు ఇప్పుడు పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్ కూడా తోడవగా, వీరికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వం వహించడం విశేషం. ఈ సమావేశానికి ప్రధాన కారణం ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన బంగారు తల్లి పధకమే! మొన్న ముఖ్యమంత్రి తన బంగారు తల్లి పధకాన్ని మెదక్ జిల్లాలో ప్రకటించి నప్పటినుండి మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. మంత్రులు జానరెడ్డి, డీ.యల్, తదితరులు మంత్రి వర్గానికి తెలియజేయకుండా, మంత్రులతో సంప్రదించకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఈవిధంగా ఒంటెత్తు పోకడలు ప్రదర్శించడాన్నితప్పుపట్టారు. ముఖ్యమంత్రి తన స్వంత ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఈ విధంగా పధకాలను ప్రవేశపెడుతున్నట్లు డా. డీ.యల్ అభిప్రాయపడ్డారు.

వందరోజుల సమ్మెకు గంట కొట్టిన శ్రీనివాస్ గౌడ్

  తెలంగాణ జెయేసి మొన్న డిల్లీలో చెప్పటిన రెండు రోజుల ధర్నా పూర్తయిన తరువాత తెలంగాణ జెయేసి నేతలు యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసారు. కాని, అది సఫలం కాకపోవడంతో, తెలంగాణ కోరుతూ ఆమెకు వినతి పత్రం ఇవ్వనిదే తిరిగి వెళ్ళేదిలేదని వారు పట్టుబట్టడంతో చివరికి తెలంగాణ జెయేసి కో కన్వీనర్ శ్రీనివాస్‌ గౌడ్ ను మాత్రం లోనికి అనుమతించారు. కానీ, అతనికి కూడా సోనియాగాందీని కలిసే అవకాశం మాత్రం దొరకలేదు. తన వినతి పత్రాన్ని ఆమె వ్యక్తి గత సహాయకుడి చేతిలో పెట్టి బయటకు వచ్చారు. ఉద్యోగసంఘ నాయకుడి స్థాయి నుండి తెలంగాణ జెయేసి కన్వీనర్ స్థాయికి ఎదిగిన శ్రీనివాస్‌ గౌడ్ మున్ముందు పూర్తీ స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగాలనే ప్రయత్నంలో యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలిసి స్వయంగా కలిసి వినతి పత్రం ఇవ్వాలని ఆశించి భంగపడ్డారు. తాము సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ ఇవ్వలేదని ఆయన తీవ్రఆగ్రహం వ్యక్తం చేసారు. తమ తెలంగాణా కాంగ్రెస్ పార్టీ యంపీలకే అపాయింట్‌మెంట్ ఇవ్వని ఆమెను, ఒక సాదారణ ఉద్యోగసంఘ నాయకుడయిన శ్రీనివాస్‌ గౌడ్ అపాయింట్‌మెంట్ ఆశించడం దురాశే అవుతుందని గ్రహించకపోవడం అవివేకం.   మరి అందుకు ఆయన ప్రతీకారం తీర్చుకోవాలని భావించడం వలననో లేక ముందస్తుగా ప్రణాలికలు ఉన్నందునో తెలియదు కానీ, త్వరలో మళ్ళీ తెలంగాణా సాధన కోసం వందరోజుల సమ్మెకు సిద్దమవుతున్నట్లు మీడియాకు తెలిపారు. హైదరాబాద్ చేరుకొన్న తరువాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.   గతంలో నెలరోజుల నిరవదిక సమ్మె విఫలం అయిన నేపద్యంలో మళ్ళీ ఈ సారి ఏకంగా మూడు నెలల నిరవదిక సమ్మె గురించి ఆలోచించడం దుస్సాహసమే అవుతుందని చెప్పవచ్చును. గత సమ్మె కాలంలో చేదు అనుభవాలను ఎదుర్కొని సమ్మె తాలూకు దుష్పరిణామాలు నేటికీ అనుభవిస్తున్న తెలంగాణా ఉద్యోగులు, మళ్ళీ ఈసారి ఏకంగా వంద రోజుల సమ్మెకు కదిలివస్తారనేది అనుమానమేనని చెప్పవచ్చును. ఒకవేళ వచ్చినా ఇదివరకు వలే మొత్తం అన్ని సంఘాల వారు ఈ సమ్మెలో పాల్గోనకపోవచ్చును. అదే జరిగితే, ఇటువంటి భారీ కార్యక్రమం ప్రకటించిన శ్రీనివాస్‌ గౌడ్ అభాసుపాలవడం ఖాయం.

భారత ఖైదీ సరబ్‌జిత్ సింగ్ మృతి

      భారత్‌కు చెందిన ఖైదీ సరబ్‌జిత్‌సింగ్ మృతి చెందాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందినట్లు లాహోర్ వైద్యులు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక 1. 30 గంటలకు ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. 49 సంవత్సరాల సరబ్ గత ముప్పై ఏళ్లుగా పాకిస్తాన్ జైలులో మగ్గుతున్నాడు. 1990 నాటి బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటూ లాహోర్ కోట్‌లఖపత్ జైలులో ఉన్న సరబ్‌జిత్ సింగ్‌పై తోటి ఖైదీలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. గూఢచర్యం కేసులో ఆయనకు పాక్ న్యాయస్థానం మరణశిక్ష విధించగా, భారత్ సహా పలు స్వచ్చంద సంస్థలు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ వచ్చాయి. చివరికి సరబ్ జీవితం ఇలా దారుణ పరిస్థితుల్లో ముగిసింది. సరబ్ జిత్ విషయంలో భారత ప్రభుత్వ స్పందన బాగాలేదని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటకలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం ఓట్లు రాలుస్తుందా

          ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు చార్జీల పెంపు, సర్ చార్జీల వడ్డింపుల నిర్ణయాలతో రాష్ట్రంలో ఎంత వ్యతిరేఖత మూటగట్టుకొన్నపటికీ, కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల తరపున ప్రచారం చేస్తూ ఆంధ్ర రాష్ట్రం ఆయన హయంలో అద్భుతాలు సృష్టిస్తోందని, అటువంటి ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు.   బెంగళూరు పరిసర ప్రాంతాలలో తెలుగువారు అధికంగా ఉండే అనేకల్, జయనగర్, బసవగుడి తదితర ప్రాంతాలలోపర్యటించిన ఆయన అక్కడి తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “కర్ణాటకను దోచుకొన్నబీజేపే మంత్రులు ప్రస్తుతం ఆంద్ర రాష్ట్రం జైళ్లలో ఉన్నారని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు సుస్థిరమయిన, సమర్ధమయిన, స్వచ్చమయిన పాలన అందించగలదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రలో ఆయన ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పధకాలు, రాష్ట్రం సాదించిన ప్రగతి ఇత్యాదుల గురించి ఘనంగా వర్ణించి, అటువంటి ప్రగతి కోరుకొంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.   రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నపటికీ, ఇక్కడ అంత సుభిక్షం, సస్యశ్యామలం అన్నట్లు ఆయన చాటింపు వేసుకోవడం విశేషమే!మరి ఆయన మాటలను కర్ణాటకలో ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారో లేదో చూడాలి. ఆయనతో బాటు టీజీ. వెంకటేష్, పొంగులేటి సుధాకర్, గంగ భవాని, యమ.యల్.సి. రంగా రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

డిల్లీలో ముగిసిన తెలంగాణా దీక్షలు

  పార్లమెంటు ముందు తెలంగాణా కాంగ్రెస్ యంపీలు, జంతర్ మంతర్ వద్ద తెలంగాణా జేయేసీ నేతలు చెప్పటిన రెండు రోజుల దీక్షలు నేటితో ముగిసాయి. పార్లమెంటు మెట్ల మీద ఎంత పడిగాపులు గాసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తరపున ఏ ఒక్కరూ కూడా వచ్చికాంగ్రెస్ యంపీలను పరమార్శించడానికి రాలేదు. కనీసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ అయినా వచ్చి తమతో మాట్లాడి సముదాయిస్తారని వారు ఆశించారు కానీ, ఆయన కూడా రాకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. తమ పట్ల అధిష్టానం ఇంత కటిన వైఖరి పాటిస్తుందని ఊహించకపోవడంతో తమ దీక్ష ముగిసేలోగా తప్పనిసరిగా అధిష్టానం తరపున తమతో మాట్లాడేందుకు ఎవరో ఒకరు వస్తారని ఆశగా ఎదురుచూసిన వారికి చివరికి నిరాశే మిగిలింది.   ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలో పార్టీకి అండగా నిలబడవలసిన కాంగ్రెస్ యంపీలే ఈ విధంగా సమస్యలు సృష్టించడంతో వారిపట్ల కాంగ్రెస్ అధిష్టానం కటినంగా వ్యవహరింఛి ఉండవచ్చును. ఇటీవల వారు తెరాస అధినేత కేసీఆర్ తో రహస్య సమావేశాలవడం, వారిలో కొందరు పార్టీ మారుతారనే వార్తలు మొదలయిన అంశాలు కూడా పార్టీ అధిష్టానానికి వారిపట్ల వ్యతిరేఖత ఏర్పరచి ఉండవచ్చును. రేపు టికెట్స్ కేటాయింపు సమయంలో కూడా పార్టీ ఇదే ధోరణి అనుసరిస్తుందా లేక ఈ కోపం తాత్కాలికమేనా అనేది రానున్న కాలమే చెపుతుంది.   కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, బేనీ ప్రసాద్ వర్మ మాత్రం వారిని పలుకరించారు. సాటి తెలంగాణా మంత్రులయిన సర్వే సత్యనారాయణ మరియు బలరం నాయక్ లిరువురు తమను పరమార్శించలేదని తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రం నుండి కే.జానా రెడ్డి, అరెపల్లి మోహన్, ప్రవీణ్ రెడ్డి, శ్రీధర్ బాబు, భిక్షమయ్య తదితరులు తెలంగాణా యమ్పీలకు సంఘీభావం ప్రకటించేందుకు నిన్న డిల్లీ తరలి వెళ్ళారు.   ఇక, జంతర్ మంతర్ వద్ద తెలంగాణా జేయేసీ నేతలు చెప్పటిన దీక్ష మాత్రం విజయవంతం అయిందని చెప్పవచ్చును. తెలంగాణకు మద్దతు ఇచ్చే అన్ని జాతీయ పార్టీల నేతలు వచ్చి వారి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న యన్.సి.పీ నేతలు కూడా ఈ దీక్షలో ఉత్సాహంగా పాల్గోనడమే కాకుండా, తెలంగాణా జేయేసీలో సభ్యత్వం కూడా స్వీకరించడం జేయేసీ నేతలకి ఉత్సాహం కలిగించింది.   రాష్ట్రంలో బీజేపీతో పెట్టుకోబోమని తెరాస నిర్ద్వందంగా ప్రకటించినప్పటికీ, తెరాస ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ దీక్షకు సుష్మా స్వరాజ్ వంటి బీజేపీ నేతలు కూడా వచ్చి తమ మద్దతు తెలుపడం విశేషం. బహుశః రానున్న ఎన్నికలలో పొత్తులకు తాము సానుకూలమని తెలియజేసేందుకే వారు వచ్చి ఉండవచ్చును.

మరక మంచిదే! వైయస్సార్ కాంగ్రెస్

  జగన్ మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన నాటినుండి, కాంగ్రెస్ ప్రభుత్వం, సీబీఐ రెండూ కలిసి కుట్ర పన్నిరాజకీయ దురుదేశంతోనే అతనిని అన్యాయంగా జైలులో పెట్టారని గట్టిగా చెపుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, అంత కంటే గట్టిగా ‘చట్టం తన పని తానూ చేసుకుపోతోందని’ కాంగ్రెస్ నేతలు సమాధానం ఇచ్చేవారు. సీబీఐ కూడా తమపై ఎవరి ప్రభావం కానీ, ఒత్తిళ్ళు గానీ లేవని ఇంతవరకు గట్టిగానే చెపుతోంది. ఈ అంశంపై ఇరువర్గాల మద్య ఇంత తీవ్రంగా వాదోపవాదనలు జరుగుతున్నపటికీ, బయటపడని రహస్యం వేరే అంశం (బొగ్గు గనుల) చర్చల్లో బయట పడటం విశేషం.   కేంద్రంలో బొగ్గు గనుల కేటాయింపులలో జరిగిన అవక తవకలపై సీబీఐ విచారణ నివేదికను, కేంద్ర న్యాయ శాఖా మంత్రి అశ్వినీ కుమార్ మరియు మరో ఇద్దరు ప్రభుత్వాదికారులు స్వయంగా పరిశీలించడమే కాకుండా దానిలో చాలా మార్పులు కూడా చేసారని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ సుప్రీం కోర్టులో ఒప్పుకొన్నారు. సీబీఐ కూడా ప్రభుత్వంలో ఒక భాగం కావడమే అందుకు కారణమని, విచారణలో భాగంగా ప్రభుత్వంతో మరియు అధికారులతో కొన్నిసార్లు సంప్రదింపులు, సలహాలు తప్పనిసరని ఆయన స్పష్టం చేసారు. అంతే గాక, తమ సంస్థపై ప్రభుత్వ ప్రభావం కూడా అనివార్యమని ఆయన కుండ బద్దలు కొట్టారు.   దీనితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొండంత బలం వచ్చినట్లయింది. సీబీఐ విచారణలో కాంగ్రెస్ హస్తం ఉందని తాము చేస్తున్న ఆరోపణలు రుజువయ్యాయని, ఇప్పటికయినా కోర్టులు హేతుబద్ధంగా ఆలోచించి జగన్ మోహన్ రెడ్డి విడుదలకు అంగీకరించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. తాము ఇంత కాలంగా మొట్టుకొంటున్నా తమ మాటలని ఎవరు పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటుకొన్న బొగ్గు మసి వలనయినా అసలు నిజాలు బయటపడ్డాయని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బయ్యారంపై కేసిఆర్ అనవసర ఆరోపణలు

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో లక్షా యాభై వేల ఎకరాల గనులను ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చినప్పుడు మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు వాటిని ప్రభుత్వ రంగ సంస్థకు ఇస్తే మాత్రం ఎందుకు గొంతు చించుకుంటున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంటును వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి వారిని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కెసిఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకే బయ్యారం గనులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. కెసిఆర్ ఎప్పుడైనా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎల్లుండి తెలంగాణ బందు ప్రజల కోసం కాదని వారి రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. బందుకు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. బందును తాము వ్యతిరేకిస్తున్నామని, మెదక్ జిల్లా ప్రజలు సహకరించరన్నారు. బందును సమర్థవతంగా ఎదుర్కోంటామన్నారు.

మాట మార్చిన కేంద్ర మంత్రి గారు

  మొన్న సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి బెయిలు పిటిషను విచారణ చేపట్టినప్పుడు జగన్ తరపున వాదిస్తున్నలాయరు హరీష్ సాల్వే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి “జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు” అని మీడియాకు ఇచ్చిన స్టేట్మెంటును కోర్టుకి సమర్పిస్తూ తన క్లయింటు జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అరెస్టు చేయించిందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని వాదించేసరికి సీబీఐ కూడా నోట మాటలేకుండా ఉండిపోవలసి వచ్చింది. ఆ విధంగా భరోసా ఇచ్చిన మంత్రిగారికి సమన్లు జారీ చేసి ఈ విషయంలో ఆయనను సంజాయిషీ కోరుతామని సీబీఐ చెప్పింది.   మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ అటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందుల్లో పడేసింది. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఇంతకాలం ఇదే విషయాన్ని గట్టిగా చెపుతున్నప్పటికీ వారి వాదనను కాంగ్రెస్ పార్టీ తేలికగా కొట్టివేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు స్వంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రే స్వయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి వాదనను బలపరుస్తున్నట్లు మాట్లాడటం, ఆ పాయింటును సుప్రీం కోర్టులో జగన్ న్యాయవాదులు బయటపెట్టడంతో కాంగ్రెస్ కూడా అడ్డుగా దొరికిపోయింది.   అయితే, మహా మహా కుంభ కోణాలు బయటపడ్డపుడే కాంగ్రెస్ పార్టీ బెదిరిందీ లేదు, బయపడిందీలేదు. ఇక ఎప్పుడో జరిగిన ఈ కుంభకోణాలను చూసి ఎందుకు బయపడుతుంది? ఇటువంటి సమస్యల నుండి బయటపడటానికి కాంగ్రెస్ వద్ద సాంప్రదాయ సిద్దమయిన గృహ చిట్కాలు చాలానే ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ “కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిగారు చెప్పిన మాటలు పూర్తిగా అయన వ్యక్తిగతమయినవి. పార్టీకి వాటితో సంబంధం లేదు,” అని ప్రకటించి చేతులు దులుపుకొన్నారు.ఇక, మీడియా ఒక వైపు సీబీఐ మరో వైపు నిత్యం వరి కుప్పలు నూర్చి పోస్తున్నట్లు దివంగత ముఖ్య మంత్రి రాజశేకర్ రెడ్డి హయంలో జరిగిన ‘పుణ్య కార్యలన్నిటినీ’ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా కూడా, ఒకవేళ రాజశేకర్ రెడ్డి గనుక తప్పుచేసి ఉంటే, కాంగ్రెస్ వాదులమయిన మేమందరం సిగ్గుతో తలలు వంచుకోవలసి ఉంటుందని ఆయన చెప్పడం మరో విశేషం.   ఇక ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి గారిలో కూడా స్వచ్చమయిన కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోంది కనుక, ఆయన కూడా అలవాటయిన మరో చిట్కాను ప్రయోగిస్తూ “జగన్ మోహన్ రెడ్డి మా పార్టీలో చేరితేనే అతనికి జైలు నుండి విముక్తి లభిస్తుందని నేనెన్నడూ అనలేదు. ఆ విధంగా అన్నానని ఎవరయినా ఋజువు చేస్తే నా మంత్రి పదవిని వదులుకోవడానికి కూడా నేను సిద్ధం. మరి ఎవరయినా దానిని నిరూపించగలరా?” అని సవాలు చేసారు. కానీ, సీబీఐ మాత్రం ఆయనకి సమన్లు జారీ చేసి సంజాయిషీ కోరాలని నిర్ణయించుకొనట్లు సమాచారం.

కిరణ్ పధకాలకు డబ్బెక్కడి నుండి రాలుతుంది?

  రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధికారంలో లేని ప్రతిపక్షాలతో పోటీ పడుతున్నట్లు నిత్యం ఏదో ఒక కొత్త పధకంతో ప్రజల ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవాలనే ఆయన ఆలోచనను ఎవరూ కాదనరు. కానీ, ఆయన వారికి ఒక చేత్తో ఇస్తూ, మరో చేత్తో మరో వర్గం వారి జేబులోంచి బలవంతంగా డబ్బు గుంజుకోవడం ఏమనాలి?   ఇప్పుడు కరెంటు సర్ చార్జీలు పెరగడం నిత్య కృత్యం అయిపోయింది. ఇక బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకుల ధరలను సామాన్యులకే కాదు, మధ్యతరగతి వారికి సైతం భరించడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నఅమ్మ హస్తం, బంగారు తల్లి, పచ్చతోరణం ఇత్యాది పధకాలకు, ఇప్పటికే అమలవుతున్న జనని సురక్ష యోజన, ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, రాజీవ్ విద్యా దీవెన వంటి అనేక ఇతర పధకాలకు అవసరమయిన వేలకోట్ల రూపాయల డబ్బు ఆయన ఎక్కడి నుండి తీసుకువస్తారని ప్రశ్నిస్తే, ఆ భారం మోయవలసినది బాధ్యత సమాజంలో మిగిలిన ప్రజలదేనని చెప్పక తప్పదు. అంటే, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు పన్నులు చెల్లించక తప్పదన్నమాట.   ఇప్పటికే, ప్రజలు అధిక ధరలతో విలవిలలాడుతు తమ కష్టాన్నిఎవరికీ మోర పెట్టుకొవాలో తెలియక బాధపడుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తున్నఈ పధకాలతో మరింత పన్ను భారం, మరిన్ని కొత్త పన్నులు మోయక తప్పదు. ప్రజల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపరిచే ప్రయత్నం చేయవలసిన ప్రభుత్వాలు, వారిని ఎల్లకాలం ఇటువంటి సంక్షేమ పధకాల మీద ఆధారపడి బ్రతికేలా చేయడం చాలా దారుణమయిన ఆలోచన. ప్రభుత్వాలు ప్రజలకి ఉపాధి కల్పించి వారు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయాలి తప్ప, ఒకరి కష్టార్జితాన్ని మరొకరికి ఈ విధంగా పంపిణీ చేస్తూ రాజకీయ లబ్దిపొందాలనుకోవడం చాలా హేయమయిన పని.   ప్రతిపక్ష నేత చంద్రబాబు మరియు షర్మిల ఇద్దరూ ప్రకటిస్తున్న పధకాలకు లక్షల కోట్లు ఏ చెట్లు దులిపి తెస్తారని అడుగుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు తను ప్రకటించే పధకాలకు ఏ చెట్లు దులిపి తెస్తారో చెపితే బాగుంటుంది.

నోరు జారి జగన్ కేసులో ఇర్రుకొన్న కేంద్ర మంత్రి

  జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కాంగ్రెస్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్యన ఉన్న ఒక అస్పష్టమయిన సన్నటి గీతను కూడా చేరిపివేస్తోంది. అతని కేసులతో విడదీయలేనంతగా ముడిపడిపోయిన మంత్రులు తమ తప్పులను ఒప్పుకొనలేక, వాటి నుండి తప్పుకొనలేక అవస్థలు పడుతుంటే, ప్రభుత్వంలో బాద్యతగల మంత్రులుగా వారు తీసుకొన్న నిర్ణయాలకు, ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేని జగన్ మోహన్ రెడ్డిని ఏవిధంగా బాధ్యుని చేస్తారంటూ జగన్ తరపు లాయర్లు వేస్తున్న ప్రశ్నలకు వారి దగ్గర సరయిన సమాధానం లేకపోవడంతో, వారు చనిపోయిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వైపు చూ(పి)స్తున్నారు.   ఇక, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో ఉలికులికిపడుతున్న కాంగ్రెస్ నేతలు, ఆయన పార్టీని బౌతికంగా, నైతికంగా దెబ్బతీసే ప్రయత్నంలో జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేయసాగారు. కొందరు అతనినిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తే, మరి కొందరు అతను శాశ్వితంగా జైలలోనే ఉండిపోతాడని జోస్యం చెప్పుతున్నారు.   ఆ ఊపులోనే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఇటీవల రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు “ఏదో ఒకనాడు జగన్ మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు. అతను జైలు నుండి బయట పడాలంటే అతనికి అంతకంటే వేరే మార్గం లేదు,” అని పంచ్ డైలాగులు చెప్పి అనుచరులచేత చప్పట్లు కొట్టించుకొని సంతోషపడ్డారు.   కానీ ఆయన పంచ్ డైలాగులు జగన్ మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న హరీష్ సాల్వే అనే పెద్దాయనకు కూడా తెగ నచ్చేయడంతో, ఆ డైలాగులు వచ్చిన పేపర్ కటింగులని జాగ్రత్తగా భద్ర పరుచుకొని, మొన్న సుప్రీం కోర్టులో జగన్ బెయిల్ పిటిషను మీద వాదనలు జరుగుతున్నప్పుడు కోర్టులో బయటపెట్టి, “జగన్ మోహన్ రెడ్డి అరెస్టులో తమకి ఏ మాత్రం సంబంధం లేదని వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరిప్పుడు అతను పార్టీలో చేరితే జైలు నుండి బయటపడతాడని ఏవిధంగా హామీ ఇస్తోంది? అంటే జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర చేస్తే దానికి సీబీఐ పరోక్షంగా సహకరిస్తోందని భావించాలా? ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒప్పుకొంటే సీబీఐ అతని మీద పెట్టిన కేసులన్నీ మాఫీ అయిపోతాయా?” అని ప్రశ్నించేసరికి సీబీఐ వద్ద చెప్పేందుకు సమాధానం లేదు.   ఒక పక్క తాము జగన్ మోహన్ రెడ్డి కేసులలో నిష్పక్షపాతంగా, ఎవరి ఒత్తిళ్ళు లేకుండా దర్యాప్తు జరుపుతున్నామని, తమది స్వతంత్ర సంస్థ అని సీబీఐ పదేపదే ప్రకటించుకొంటుంటే మరో వైపు, కాంగ్రెస్ మంత్రులే స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే అతను కేసుల నుండి, జైలు నుండి విడుదల హామీలు గుప్పించడంతో సీబీఐ ఇరకాటంలో పడింది. ఇక చేసేదేమీ లేక ఆవిధంగా హామీ ఇచ్చిన సదరు మంత్రి గారికి కూడా సమన్లు జారీ చేసి, ఆయన ఏవిధంగా జగన్ మోహన్ రెడ్డి ని జైలు నుండి విడిపిస్తారో తెలుసుకోవాలనుకొంటున్నట్లు కోర్టుకు విన్నవించుకొని బయట పడింది.   ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలందరి నోళ్ళు మూతపడే అవకాశం ఉంది. లేకుంటే వారు కూడా కోట్ల లాగే కోర్టు మెట్లక్కక తప్పదు.

గండం గట్టెక్కిన మంత్రి ధర్మాన

  మంత్రి ధర్మాన ప్రసాదరావు చట్టూ బిగిసిన సీబీఐ ఉచ్చునుండి హైకోర్టు ఆయనకు ఈ రోజు విముక్తి కలిగించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను వెనకేసుకు రావడంతో సీబీఐ, కోర్టులో మెమో దాఖలు చేసింది. సీబీఐ కోర్టు ఆయనను ప్రాసిక్యూషన్‌ చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ తీర్పు ఇవ్వడంతో, ఆయన కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషను దాఖలు చేసారు. ఈ రోజు హైకోర్టు సీబీఐ కోర్టు ఇచ్చిన మెమోను కొట్టివేసింది. ప్రస్తుతానికి ధర్మాన గండం గట్టెక్కినట్లే! కానీ, ఆయనపై చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ ఆయనను అంత తేలికగా వదిలిపెట్టకపోవచ్చును. సీబీఐ ఒక వ్యక్తిపై నేరారోపణలు చేసిన తరువాత దానిని రుజువు చేయవలసిన బాద్యత దానిమీదే ఉంటుంది కనుక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే, ధర్మానకు కొంచెం వెసులుబాటు దొరికిందని భావించవచ్చును. ఆయన సీబీఐను ఇదే విధంగా మరికొంత కాలం నిలువరించగలిగితే ఒకసారి ఎన్నికల గంట మ్రోగితే ఇక ఆయన అవసరం ప్రభుత్వానికి చాలా ఉంటుంది కనుక, ఆయనపై ఈగ (సీబీఐ) కూడా వాలకుండా చూసుకొనే బాద్యత కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలే చూసుకొంటాయి. ధర్మాన కేసులో హైకోర్టు కూడా ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి నిరాకరించిది గనుక, ఇక చార్జ్ షీటులో కెక్కిన మంత్రులకు కూడా కొంచెం దైర్యం వస్తుంది. సీబీఐ తమకి కూడా సమన్లు జారీ చేస్తే, అప్పుడు ఏమిచేయాలనే విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు వారికొక మార్గం చూపించి పుణ్యం కట్టుకొన్నారు గనుక వారు కూడా అదేవిధంగా బయటపడోచ్చును. కానీ, సీబీఐ కూడా అందుకు తగిన వ్యుహంతోనే ఇకపై కేసులు నమోదు చేయవచ్చును.

'బొగ్గు'తో పూర్తిగా 'నల్లకప్పేసి' పోయిన కాంగ్రెస్ యుపిఎ సర్కారు!

- డా. ఎబికె ప్రసాద్ (సీనియర్ సంపాదకులు)       భారత రాజకీయాలలో చిత్రమైన పరిణామాలొస్తున్నాయి. మన ఇరుగు పోరుగైన పాకిస్తాన్ సైనిక నియంతృత్వానికి క్రమంగా దూరమవుతూ ప్రజాస్వామ్యం మార్గంలో కాళ్ళూనుకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మన (భారత)దేశ రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకపక్షాలు 'ప్రజాస్వామ్యం' పేరు చాటున దాగి ప్రజాస్వామిక పద్ధతులనుంచి పక్కదారులు తొక్కుతూ నియంతృత్వ పోకడలకు పట్టం కట్టె వైపుగా బలంగా అడుగులు వేస్తున్నారు.   పాకిస్తాన్ లో ఇంతకుముందు సైనిక పాలనా నియంతలలో ఒకరైన ముషారఫ్ తన హయాములో పాకిస్తాన్ న్యాయవ్యవస్థను సహితం శాసించే దశకు చేరుకున్నప్పుడు పాకిస్తాన్లోని ప్రజాస్వామ్య శక్తులు, కొన్ని రాజకీయపక్షాల దన్నుతో బలపడుతున్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చౌధురిని పదవినుంచి బర్తరఫ్ చేయడానికి సాహసించాడు. దాని పర్యవసానంగా పాకిస్తాన్ లోని ప్రజాస్వామ్య న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు మూకుమ్మడిగా విజృంభించి ముషారఫ్ చర్యను ఖండించడమేగాక భారీ స్థాయిలో కోర్టువద్ద, దేశంలోనూ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయవలసి వచ్చింది. ఈ చర్య పాకిస్తాన్ లోని ప్రజాస్వామ్య శక్తులకు అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో బలసంపన్నులను చేసింది. పాకిస్తాన్ పౌరసమాజం పౌర ప్రభుత్వం ఏర్పాటు కోసం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని జుల్ ఫికార్ భుట్టో ప్రదానమంత్రిత్వంతో ప్రారంభమైన (ఎన్నికల ద్వారా) పౌరప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా, భుట్టోను హత్య చేయడం ద్వారా, సైనిక నియంతృత్వ శక్తులు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నించాయి. కాని భుట్టో హత్య అనంతరం ఆయని కుమార్తె, రాజకీయ నాయకురాలైన బెనాజిర్ భుట్టోను పాక్ ప్రజలు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ పరిణామం జనరల్ ముషారఫ్ కు కంటగింపుగా మారి,ఆమె హత్యకు పన్నుగడ పన్నాడు.   ఆమె హత్యానంతరం అధికారానికి వచ్చినవాడు ముషారఫ్ కాని పాక్ ప్రజలు క్రమంగా ప్రజాస్వామ్య వ్యవస్థా స్థాపన కోసం అనేక త్యాతాల ద్వారా ఈ రోజుకీ అకుంఠితంగా పోరాడుతూనే ఉన్నారు. గత పదేళ్ళలోపే పాకిస్తాన్ ప్రజలు ఉగ్రవాదుల బెడద మధ్యనే తిరిగి పౌర ప్రభుత్వాలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవడంద్వారా పౌర ప్రజాస్వామ్య ప్రబ్బుత్వాల సుస్థిరత కోసం పునాదులు వేసుకుంటున్నారు. అయినా, విదేశాలలో గత అయిదేళ్ళకు పైగా తలదాచుకుంటున్న ముషారఫ్ తిరిగి పాక్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయాలని చూశాడు. ఆ ప్రయత్నాన్ని పాక్ రాజకీయ పక్షాలు, సుప్రీంకోర్టు, ఎన్నికల కమీషన్ కూడా తుత్తునీయలు చేశారు. మూడు, నాలుగు చోట్ల ముషారఫ్ వేసిన నామినేషన్ పత్రాలను స్థానిక ఎన్నికల సంఘాల రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించడంతో అతగాడు డీలా పడిపోయాడు. ప్రజాస్వామిక శక్తుల అండతో తిరిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చౌధురి నాయకత్వంలో యిప్పటికి పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కొంతవరకు నిలదొక్కుకుంది. ఇలాంటి పరిస్థితులలో మన దేశంలోని కాంగ్రెస్ - యు.పి.ఎ. పాలకవ్యవస్థ మాత్రం "ప్రజాస్వామ్యం'' పేరిటనే అనేక ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలకు పాల్పడడమే గాకుండా ప్రపంచబ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణలను తలకెత్తుకుని, బహుళ జాతి గుత్తసంస్థల పెట్టుబడులకు దేశపు ఆర్థికవ్యవస్థను భారత పారిశ్రామిక, వ్యవసాయ విధానాలకు విరుద్ధంగా బాహాటంగా తలుపులు తాను కూడా భారీ స్థాయిలో అవినీతికి పాల్పడింది. ఇలా దేశ సహజవనరులలో కీలకమైన  రేడియో తరంగ వ్యవస్థపై ఆధిపత్యాన్ని విదేశీ గుత్త కంపెనీలకు "2-జి స్పెక్ట్రమ్'' పేరిట గుత్తగా కట్టపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థికమంత్రి చిదంబరం, ప్రధానమంత్రి కార్యాలయం, చివరికి జాతీయస్థాయి నేర విచారణ సంస్థ అయిన సిబీఐ ఉన్నతాధికారులు కొందరు (ఎ.కె.సింగ్) పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ దొరికిపోయారు.   ఈ "స్పెక్ట్రమ్'' తాలూకూ "అయినవాళ్ళకు కంచాలలో'' పెట్టి లైసెన్సులను విచ్చలవిడిగా యు.పి.ఎ. సర్కారు పంచడాన్ని సుప్రీంకోర్టు విమర్శించి, 122 లైసెన్సులను చుప్తాగా రద్దుచేసింది. ఇది పాలకశక్తులకు "గొంతులో పచ్చి వెలక్కాయ''గా మారింది. ఈలోగా ఈ "స్పెక్ట్రమ్'' కుంభకోణం ఆనాటి టెలికామ్ మంత్రి రాజా చర్యల ఫలితమేనని ప్రకటించి, అతణ్ణి మాత్రమే నేరస్థుడిగా చిత్రించి, అరెస్టు చేసి, ఆ దరిమిలా కేంద్రంలో డి.ఎం.కె. అండకోసం అతనికి బెయిల్ మంజూరు చేసిందీ ప్రభుత్వమే! తీరా ఇప్పుడు అదే రాజా ఈ కుంభకోణానికి ప్రధానబాధ్యులు మన్మోహన్ సింగ్, చిదంబరం అనీ, ప్రధానమంత్రితో చర్చించిన తరువాతనే, అతని అనుమతి మీదనే, అతని కోరిక మేరకే తాను లైసెన్సులు మంజూరు చేయడం జరిగిందనీ రాజా విస్పష్టమైన ప్రకటనతో ముందుకొచ్చాడు. అయినా సరే ప్రధానమంత్రికి, చిదంబరానికీ ఎలాంటి సంబంధంలేనట్టు ఇతర సంబంధిత మంత్రులు ప్రభుత్వంలో దాగిన అవినీతిపరులను పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, రాజకీయపక్షాల ప్రతినిధులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ సంఘానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న పి.సి.చాకో (కాంగ్రెస్) బుకాయింపులకు దిగాడు. ఈలోగా బొగ్గుగనుల కేటాయింపుల విషయంలో బి.జె.పి. హయామునుంచి నేటిదాకా కొనసాగుతున్న లైసెన్సుల కుంభకోణంతో కూడా మన్మోహన్ సింగ్ కు "సంబంధం ఉంద''ని ఆరోపణలు వెల్లువెత్తాయి. "ముగ్గురి మధ్య ముంత దాగింద''న్న సామెతలాగా ఇలాంటి కుంభకోణాల మధ్యనే నియంతృత్వశక్తులు కూడా బలుస్తూంటాయి. చివరికి, తాజాగా ప్రయివేట్ పార్టీలకు బొగ్గుగనుల కేటాయింపులలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపిన ప్రభుత్వ సంస్థ సిబీఐ సహితం రూపొందించిన నివేదికలోని అంశాలను కూడా పాలకపక్షం తారుమారు చేసి తన ప్రభుత్వాన్ని ఎలాగోలా రక్షించుకొనే ప్రయత్నంలో సిబీఐ అధికారులను అటకాయించడానికి ప్రయత్నించింది. దీని పర్యవసానంగా ప్రతిపక్షాల నిరంతర డిమాండ్ల మధ్యన ప్రభుత్వం తప్పించుకోలేని పరిస్టితులలో సుప్రీంకోర్టు జోక్యం ద్వారా సిబీఐ వాస్తవాలతో కోర్టు ముందుకు రాక తప్పలేదు. తన వాంగ్మూలాన్ని సమర్పించింది. కోర్టుకు సమర్పించడానికి ముందే న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ కు నివేదికను చూపించిన మాట నిజమేనని సిబీఐ ఒప్పేసుకుంది.   అశ్వినీ కుమార్ కే గాక, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులకూ, బొగ్గుగనులశాఖా అధికారులకూ కూడా చూపించామని సిబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా వెల్లడించడంతో పాలకపక్షం గుట్టు కాస్తా రట్టు అయింది. అయితే "మొండివాడు రాజుకంటే ఘనుడు'' అన్నట్టుగా ప్రధాని మన్మోహన్ సింగ్ నిరంకుశుడిగా మొదటిసారిగా తన నిజరూపాన్ని బయటపెట్టుకున్నారు. న్యాయశాఖమంత్రి అశ్వినీ కుమార్ రాజీనామా చేయవలసిన అవసరమే లేదని ప్రతిపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చారు. అదేమంటే, యు.పి.ఎ. తొమ్మిదేళ్ళ పాలనలో ప్రతిపక్షాలు ఇలా వ్యవహరించడం వాటికి మామూలేన''ని వాదించసాగారు! చివరికి అవసరమైతే మిగిలిన పార్లమెంటు బడ్జెటరీ సమావేశం కాస్తా చుప్తాగా రద్దయ్యే పరిస్థితి వచ్చినా మన్మోహన్ సింగ్ తన వైఖరిని మార్చుకోడాని వార్తలొచ్చాయి! లార్డ్ యాక్డన్ సూక్తి ప్రకారం "కొంత అవినీతికి అలవాటుపడిన వాళ్ళు పూర్తిస్థాయిలో అవినీతికి పాల్పడడానికి జంకరు''! అలాగే రోచీ అనే ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త దృష్టిలో "ఆహికారంలో ఉన్నప్పుడు అవినీతికి అలవాటుపడ్డ వారు అధికారాన్ని కోల్పోనున్నామని భావించినప్పుడు కూడా భారీ అవినీతికి దిగుతార''ట! నిరంకుశ వ్యవస్థకు బీజాలు పడేది యిలాగనేనని మరవరాదు. చివరికి 2-జి స్పెక్ట్రమ్ కుంభకోణం సందర్భంగా ప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరించిన సుప్రీంకోర్టు చేతుల్ని కూడా మెలితిప్పాలని ఈ మధ్యలో పాలకశక్తులు ప్రయత్నించడాన్ని మనం మరచిపోలేదు. ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రధానమంత్రి ఒకసారి "రాజ్యాంగం పాలకవర్గానికి, న్యాయవ్యవస్థకు మధ్య బాధ్యతలను విభజించి ఉన్నందున ఒకరి విభాగంలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిద''ని హెచ్చరించిన విషయాన్ని మరవరాదు! ఇలాంటి ఘట్టాలలోనే "ముచ్చు''కూ, "నాలిముచ్చు'' కూ ఉన్న తేడా గురించి పెద్దలు ప్రస్తావిస్తుంటారు!

వైఎస్ జగన్ బెయిల్ కు సుప్రీం 'నో'

      అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. జగన్ బెయిల్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. జగన్ కేసుకు సంబంధించి సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సీబీఐ తరఫున న్యాయవాదులు ఎవరూ హాజరుకాలేదు. కేసు ఇన్వేష్టిగేషన్ చేస్తున్న ఎస్.పి. వెంకటేష్ మాత్రమే హాజరయ్యారు. విజిటర్స్ హాలులో కూర్చుని వాదనలు విన్నారు. జగన్ తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.

వైజాగ్ కాంగ్రెస్ లో సిగపట్లు

  ఇంకా ఎన్నికలకి ఏడాది సమయం ఉండగానే, వైజాగ్ లో కాంగ్రెస్ నేతలందరూ ఎవరి ప్రయత్నాలలో వారు బిజీ అయిపోయారు. కొందరు తమకే టికెట్ ఇప్పించవలసిందిగా పార్టీ పెద్దల దగ్గర పైరవీలు చేసుకొంటుంటే, మరికొందరు తమకు పోటీగా ఉన్న వారిని రంగంలోంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నారు.   ఈ విషయంలో అందరి కంటే ముందుగా రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామి రెడ్డి రంగంలోకి దిగి అటు డిల్లీలోను, ఇటు నగరంలోనూ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల నగరంలో అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంబించారు.   ఇక కాంగ్రెస్ పార్టీలో ముటాలు కట్టుకోవడానికి పెద్ద కారణాలేవీ అక్కరలేదనే సంగతి అందరికీ తెలిసిందే. మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి, అనకాపల్లి ప్రాంతాలను విశాఖలో విలీనం చేద్దామనే ప్రతిపాదన చేయగా దానిని సుబ్బిరామి రెడ్డి సమర్దించారు. కానీ, పురందేశ్వరి మరియు విశాఖ దక్షిణ శాసన సభ్యుడు మరియు నగరంపార్టీ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమస్యను పరిష్కరించేదుకు శాసనసభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీ విలీన ప్రతిపాదనను నిర్ద్వందంగా ఖండించడంతో దానిని సమర్దిస్తున్న వారిరువురి అహం దెబ్బతింది.   అటువంటి సమయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ రాష్ట్రంలో జిల్లా, నగర, మండల స్థాయి వరకు పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తుండటంతో ఇదే అదునుగా గంటా శ్రీనివాసరావు ‘ఒక వ్యక్తికి ఒక పదవి’ అనే రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ఫార్ములాను తెలివిగా ఉపయోగించుకొని, తనను వ్యతిరేకిస్తున్న తైనాలను ఆ పదవిలోంచి తప్పించి తన అనుచరుడు బెహరా భాస్కర్ రావుని నియమించుకొన్నారు. అందుకు సుబ్బిరామిరెడ్డి కూడా ఓ చెయ్యేసి తోడ్పడారని సమాచారం.   తద్వారా మంత్రి గంటా తనను వ్యతిరేకించినందుకు తైనాల పదవికి కత్తెరవేసి తన తడాఖా చూపించానని సంతోషిస్తే, తద్వారా పురందేశ్వరికి తన తడాఖా చూపానని సుబ్బిరామిరెడ్డి కూడా సంతోషిస్తున్నారు. పనిలో పనిగా ఆమెను కూడా మెల్లగా పోటీలోంచి తప్పించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, గతంలో కార్పొరేటర్ గా ఉన్న తన అనుచరుడు భాస్కర్ రావుని ముందుకు తేవడం ద్వారా రాబోయే ఎన్నికలలో తనను వ్యతిరేకిస్తున్నమరో విశాఖ శాసనసభ్యుడిని కూడా రేసులోంచి తప్పించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.   ఈ సిగపట్లు ఎన్నికలు దగ్గిరపడుతున్న కొద్దీ ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. ఇటువంటి రాజకీయాలను చూస్తుంటే రాహుల్ గాంధీ వల్లె వేస్తున్న నీతి సూత్రాలని కాంగ్రెస్ పార్టీలో అమలు చేయడం ఎన్నటికయినా సాధ్యమేనా అనే ప్రశ్న ప్రజలకి ఉదయించక మానదు.

శ్రీపతి రాజేశ్వర్ కు బాలకృష్ణ నివాళి

        అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన శ్రీ పతి రాజేశ్వర్ బౌతికకాయానికి మారేడుపల్లిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో శ్రీపతి రాజేశ్వర రావు మంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్‌కు ఆయన విపరీతమయిన అభిమాని. ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అరవై ఏళ్ల క్రితమే ఆయన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఎన్టీఆర్ పార్టీ పెట్టాక అందులో చేరి మూడుసార్లు శాసనసభ్యులుగా గెలుపొంది, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. పార్టీ పెట్టక ముందు నుండే ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మీద అభిమానంతో శరీరంపై ఆయన ఎన్టీఆర్ బొమ్మను పచ్చ పొడిపించుకున్నారు. నిజాయితీ గల నేతగా ఆయన పేరుంది.