కర్ణాటకలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం ఓట్లు రాలుస్తుందా
posted on May 1, 2013 @ 3:06PM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు చార్జీల పెంపు, సర్ చార్జీల వడ్డింపుల నిర్ణయాలతో రాష్ట్రంలో ఎంత వ్యతిరేఖత మూటగట్టుకొన్నపటికీ, కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల తరపున ప్రచారం చేస్తూ ఆంధ్ర రాష్ట్రం ఆయన హయంలో అద్భుతాలు సృష్టిస్తోందని, అటువంటి ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు.
బెంగళూరు పరిసర ప్రాంతాలలో తెలుగువారు అధికంగా ఉండే అనేకల్, జయనగర్, బసవగుడి తదితర ప్రాంతాలలోపర్యటించిన ఆయన అక్కడి తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “కర్ణాటకను దోచుకొన్నబీజేపే మంత్రులు ప్రస్తుతం ఆంద్ర రాష్ట్రం జైళ్లలో ఉన్నారని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు సుస్థిరమయిన, సమర్ధమయిన, స్వచ్చమయిన పాలన అందించగలదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రలో ఆయన ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పధకాలు, రాష్ట్రం సాదించిన ప్రగతి ఇత్యాదుల గురించి ఘనంగా వర్ణించి, అటువంటి ప్రగతి కోరుకొంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నపటికీ, ఇక్కడ అంత సుభిక్షం, సస్యశ్యామలం అన్నట్లు ఆయన చాటింపు వేసుకోవడం విశేషమే!మరి ఆయన మాటలను కర్ణాటకలో ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారో లేదో చూడాలి. ఆయనతో బాటు టీజీ. వెంకటేష్, పొంగులేటి సుధాకర్, గంగ భవాని, యమ.యల్.సి. రంగా రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.