మరక మంచిదే! వైయస్సార్ కాంగ్రెస్
posted on May 1, 2013 @ 11:19AM
జగన్ మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన నాటినుండి, కాంగ్రెస్ ప్రభుత్వం, సీబీఐ రెండూ కలిసి కుట్ర పన్నిరాజకీయ దురుదేశంతోనే అతనిని అన్యాయంగా జైలులో పెట్టారని గట్టిగా చెపుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, అంత కంటే గట్టిగా ‘చట్టం తన పని తానూ చేసుకుపోతోందని’ కాంగ్రెస్ నేతలు సమాధానం ఇచ్చేవారు. సీబీఐ కూడా తమపై ఎవరి ప్రభావం కానీ, ఒత్తిళ్ళు గానీ లేవని ఇంతవరకు గట్టిగానే చెపుతోంది. ఈ అంశంపై ఇరువర్గాల మద్య ఇంత తీవ్రంగా వాదోపవాదనలు జరుగుతున్నపటికీ, బయటపడని రహస్యం వేరే అంశం (బొగ్గు గనుల) చర్చల్లో బయట పడటం విశేషం.
కేంద్రంలో బొగ్గు గనుల కేటాయింపులలో జరిగిన అవక తవకలపై సీబీఐ విచారణ నివేదికను, కేంద్ర న్యాయ శాఖా మంత్రి అశ్వినీ కుమార్ మరియు మరో ఇద్దరు ప్రభుత్వాదికారులు స్వయంగా పరిశీలించడమే కాకుండా దానిలో చాలా మార్పులు కూడా చేసారని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ సుప్రీం కోర్టులో ఒప్పుకొన్నారు. సీబీఐ కూడా ప్రభుత్వంలో ఒక భాగం కావడమే అందుకు కారణమని, విచారణలో భాగంగా ప్రభుత్వంతో మరియు అధికారులతో కొన్నిసార్లు సంప్రదింపులు, సలహాలు తప్పనిసరని ఆయన స్పష్టం చేసారు. అంతే గాక, తమ సంస్థపై ప్రభుత్వ ప్రభావం కూడా అనివార్యమని ఆయన కుండ బద్దలు కొట్టారు.
దీనితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొండంత బలం వచ్చినట్లయింది. సీబీఐ విచారణలో కాంగ్రెస్ హస్తం ఉందని తాము చేస్తున్న ఆరోపణలు రుజువయ్యాయని, ఇప్పటికయినా కోర్టులు హేతుబద్ధంగా ఆలోచించి జగన్ మోహన్ రెడ్డి విడుదలకు అంగీకరించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. తాము ఇంత కాలంగా మొట్టుకొంటున్నా తమ మాటలని ఎవరు పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటుకొన్న బొగ్గు మసి వలనయినా అసలు నిజాలు బయటపడ్డాయని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.