వందరోజుల సమ్మెకు గంట కొట్టిన శ్రీనివాస్ గౌడ్
posted on May 2, 2013 @ 11:35AM
తెలంగాణ జెయేసి మొన్న డిల్లీలో చెప్పటిన రెండు రోజుల ధర్నా పూర్తయిన తరువాత తెలంగాణ జెయేసి నేతలు యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసారు. కాని, అది సఫలం కాకపోవడంతో, తెలంగాణ కోరుతూ ఆమెకు వినతి పత్రం ఇవ్వనిదే తిరిగి వెళ్ళేదిలేదని వారు పట్టుబట్టడంతో చివరికి తెలంగాణ జెయేసి కో కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ ను మాత్రం లోనికి అనుమతించారు. కానీ, అతనికి కూడా సోనియాగాందీని కలిసే అవకాశం మాత్రం దొరకలేదు. తన వినతి పత్రాన్ని ఆమె వ్యక్తి గత సహాయకుడి చేతిలో పెట్టి బయటకు వచ్చారు. ఉద్యోగసంఘ నాయకుడి స్థాయి నుండి తెలంగాణ జెయేసి కన్వీనర్ స్థాయికి ఎదిగిన శ్రీనివాస్ గౌడ్ మున్ముందు పూర్తీ స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగాలనే ప్రయత్నంలో యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలిసి స్వయంగా కలిసి వినతి పత్రం ఇవ్వాలని ఆశించి భంగపడ్డారు. తాము సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ ఇవ్వలేదని ఆయన తీవ్రఆగ్రహం వ్యక్తం చేసారు. తమ తెలంగాణా కాంగ్రెస్ పార్టీ యంపీలకే అపాయింట్‌మెంట్ ఇవ్వని ఆమెను, ఒక సాదారణ ఉద్యోగసంఘ నాయకుడయిన శ్రీనివాస్ గౌడ్ అపాయింట్‌మెంట్ ఆశించడం దురాశే అవుతుందని గ్రహించకపోవడం అవివేకం.
మరి అందుకు ఆయన ప్రతీకారం తీర్చుకోవాలని భావించడం వలననో లేక ముందస్తుగా ప్రణాలికలు ఉన్నందునో తెలియదు కానీ, త్వరలో మళ్ళీ తెలంగాణా సాధన కోసం వందరోజుల సమ్మెకు సిద్దమవుతున్నట్లు మీడియాకు తెలిపారు. హైదరాబాద్ చేరుకొన్న తరువాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
గతంలో నెలరోజుల నిరవదిక సమ్మె విఫలం అయిన నేపద్యంలో మళ్ళీ ఈ సారి ఏకంగా మూడు నెలల నిరవదిక సమ్మె గురించి ఆలోచించడం దుస్సాహసమే అవుతుందని చెప్పవచ్చును. గత సమ్మె కాలంలో చేదు అనుభవాలను ఎదుర్కొని సమ్మె తాలూకు దుష్పరిణామాలు నేటికీ అనుభవిస్తున్న తెలంగాణా ఉద్యోగులు, మళ్ళీ ఈసారి ఏకంగా వంద రోజుల సమ్మెకు కదిలివస్తారనేది అనుమానమేనని చెప్పవచ్చును. ఒకవేళ వచ్చినా ఇదివరకు వలే మొత్తం అన్ని సంఘాల వారు ఈ సమ్మెలో పాల్గోనకపోవచ్చును. అదే జరిగితే, ఇటువంటి భారీ కార్యక్రమం ప్రకటించిన శ్రీనివాస్ గౌడ్ అభాసుపాలవడం ఖాయం.