జగన్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..అరెస్ట్

      వైకాపా ఎమ్మెల్యేలు శాసన సభ నుంచి సస్పెండయ్యారు. ఐదు రోజులుగా అసెంబ్లీకి తీవ్ర ఆటంకం కలిగిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేల్ని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. శాసన సభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ వీరి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా స్పీకర్ ఆమోదం తెలిపి.. 15 మంది ఎమ్మెల్యేల్ని సభ నుంచి బయటికి వెళ్లాల్సిందిగా కోరారు. ఐతే ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ అక్కడే ఉండటంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటికి పంపారు. ఐతే సస్పెండ్ చేసిన సభ్యుల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేదు. తమ సభ్యులందరినీ బయటికి పంపేయడంతో విజయమ్మ ఒంటరి అయిపోయారు. మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతుండగా విజయమ్మ లేచి.. సమైక్య తీర్మానం చేయనందుకు నిరసనగా తాను వాకౌట్ చేస్తున్నట్లు చెప్పి.. బయటకు వెళ్లిపోయారు.   అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ నెంబర్ 1 వద్ద ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శాసన మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలను కూడా సస్పెండ్ చేశారు.

తెలంగాణలో 'ప్రజాగర్జన'

      ఇటీవల తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టిన ప్రజాగర్జన సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి విజయవంతం కావడంతో..ఈ సభలను తెలంగాణలోనూ నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. బుధవారం తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశమైన చంద్రబాబు..పొత్తుల విషయం పక్కన పెట్టి ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలో పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచాలని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో ఈ నెలాఖరు లోపు విస్తృత సమావేశాలు నిర్వహించి, తర్వాత నియోజకవర్గాలవారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తెలంగాణలో రెండుచోట్ల జోనల్ సభలు నిర్వహించాలనీ నిర్ణయం తీసుకొన్నారు.

బిజెపిలోకి కృష్ణంరాజు

      సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తిరిగి సొంతగూటికి చేరారు. ఆయన బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణంరాజు రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణంరాజు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి పాత పార్టీలోనే చేరేందుకు నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ మళ్లీ బీజేపీలో చేరడం, పాత మిత్రులందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ఆకాంక్షల మేరకు మళ్లీ బీజేపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. గతంలో బీజేపీతరపున లోక్‌సభకు ఎన్నికైన కృష్ణం రాజు.. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

తెలంగాణాలో కూడా తెదేపా-బీజేపీల పొత్తులుంటాయా

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి తెరాసను విలీనం లేదా ఎన్నికల పొత్తులని ఆశిస్తునట్లు స్పష్టమవడంతో, బీజేపీ కూడా రాష్ట్రంలో తెదేపాతో పొత్తులకి ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అస్పష్ట రాజకీయ పరిస్థితుల్లో తెదేపాకు కూడా బీజేపీ వంటి ఒక బలమయిన పార్టీ మద్దతు చాలా అవసరం కనుక నరేంద్ర మోడీ అందించిన స్నేహ హస్తాన్ని చంద్రబాబు అందుకోవడంతో, రెండు పార్టీల మధ్య మళ్ళీ స్నేహసంబందాలు క్రమంగా బలపడుతున్నాయి. అయితే, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి ఇతర తెలంగాణా నేతలు తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం వాస్తవ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెదేపాతో పొత్తులకే ప్రాధాన్యం ఇస్తోంది. పొత్తులు కుదుర్చుకోగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ (రహస్య) కూటమిని తేలికగా ఎదుర్కోవడమే గాక రెండు పార్టీలు లాభాపడవచ్చని భావిస్తున్నాయి.   ప్రస్తుతం దేశమంతట నరేంద్ర మోడీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాతావరణం కనిపిస్తునందున, బీజేపీతో పొత్తుల ప్రభావం తెదేపాకు రాష్ట్రంలో మరింత సానుకూల వాతావరణం కల్పించగలదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా, తెదేపా మద్దతుతో సీమాంధ్రలో బీజేపీ కూడా బలపడవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఖరారయిన బీజేపీ-తెదేపాల పొత్తుల గురించి మీడియాలో వస్తున్నవార్తలపై తెదేపా యంపీ రమేష్ రాథోడ్ స్పందిస్తూ, “సంక్రాంతి పండుగ తరువాత రెండు పార్టీల ఎన్నికల పొత్తుల గురించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని” అన్నారు. కానీ వారి పొత్తులు కేవలం సీమాంధ్రకే పరిమితం చేస్తారా లేక తెలంగాణాకు కూడా వర్తింపజేస్తారా? అనేది తేలవలసి ఉంది.   కాంగ్రెస్-తెరాసలు ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నా, పెట్టుకోకపోయినా కేంద్రంలో ఏకూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలుంటే తెరాస దానికే మద్దతు ఇస్తుంది గనుక, బీజేపీ తెరాసతో పొత్తులు పెట్టుకోకపోయినా ఆపార్టీతో వైరం పెంచుకోదు. ఒకవేళ తెరాస-కాంగ్రెస్ పార్టీతో జతకడితే బీజేపీ కూడా తెదేపాతో పొత్తులు పెట్టుకోవచ్చును. జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉండి ఉండవచ్చును కానీ, రాష్ట్రంలో మాత్రం చాలా బలహీనంగా ఉంది. అయితే సీమాంధ్రతో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ కొంత బలంగా ఉందని చెప్పవచ్చును. కానీ, అది తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ పార్టీలను ఒంటరిగా డ్డీకొని ప్రభుత్వం ఏర్పరచగలిగేంత మాత్రం కాదని ఆ పార్టీ అధిష్టానానికి కూడా బాగా తెలుసు గనుక, తెలంగాణాలో కూడా మంచి బలమయిన క్యాడర్ ఉన్నతెదేపాతో పొత్తులకి సిద్దపడవచ్చును. తద్వారా తెలంగాణాలో కూడా ఒకరివల్ల మరొకరు లాభాపడగలవు కూడా.

అసెంబ్లీలో కిరణ్ కొత్త పార్టీపై చర్చలు..!

      సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీపై అసెంబ్లీ లాబీలో పలువురు మంత్రులు చర్చలు జరిపారు.మంత్రులు పార్థసారధి, డీకే అరుణ మధ్య ఈ అంశంపై మాట్లాడుతూ కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని, విభజన ఆగుతుందని అనిపిస్తోందని మంత్రి పార్థసారథి అనగా, విభజన ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని, కిరణ్ కొత్త పార్టీ పెట్టరని మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు.   కాంగ్రెస్ దుకాణం మూసేస్తే...కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తానని మరో నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 23 వరకు సైలెంట్‌గా ఉండాలని కిరణ్ చెప్పారన్నారు. తాను ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆదాల తెలిపారు. కాంగ్రెస్ టికెట్ కోసం ముసలివాళ్లు పోటీలో ఉన్నారని, హైకమాండ్ ఒక్కో సీటుకు రూ.2 కోట్లు ఇస్తుందంటా అని ఆయన అన్నారు. ఏ పార్టీలో సీటు దక్కని వాళ్లే సీఎం పార్టీలో చేరతారని ఆదాల అన్నట్లు తెలుస్తోంది. కిరణ్ చివరి నిమిషంలో పార్టీ పెట్టి రికార్డు సృష్టించవచ్చని మరో మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు.

అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాం

      అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం స్పీకర్ నాదెండ్లమనోహర్, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క స్థలాన్ని పరిశీలించారు. మహాత్మా గాంధీ విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నిర్ణయించినట్లు తెలియవచ్చింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేలోపే అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 22న విగ్రహావిష్కరణ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 500 కేజీల బరువు గల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్‌లో తయారు చేయించారు. దీనికి అయ్యే ఖర్చు రూ. 23 లక్షలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

జేసీ బ్రదర్స్...టిడిపి కన్ ఫార్మ్..!!

      తెలుగు దేశం పార్టీలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరులు చేరబోతున్నారని రాజకీయ వర్గాలలో, మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరి రాక ఖాయమైనట్లుగా కథనాలు వస్తున్నాయి. దీనికి టిడిపి అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల23 లేదా 24న టిడిపి తీర్ధం పుచ్చుకుంటారని జేసీ బ్రదర్స్ చెప్పినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో పయ్యావుల కేశవ్ కీలకపాత్ర పోషించాడని తెలుస్తోంది. మరోవైపు జేసీ రాకను పరిటాల సునీత పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. పరిటాల హత్య కేసులో జేసీ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడని, ఇతర హత్యల కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నేతను ఎలా పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నించినట్లు సమాచారం. ఆమెను ఒప్పించే బాధ్యతను జిల్లా నేతలకు బాబు అప్పగించినట్లు సమాచారం.

శాసనసభలో శాడిజం... దామోదర

      శాసనసభ వ్యవహారాలు చూస్తుంటే చిరాకేస్తుంది. శాడిజం పెరిగిపోతోంది. ఇతరులు అసహనానికి గురయ్యేలా మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అసహనం వ్యక్తం చేశారు. శాస్త్రీయత, అవగాహన, అధ్యయనం లేకుండా ఇతరులను అగౌరవపరచేలా మాట్లాడుతున్నారని అన్నారు. శాసనసభ వ్యవహారాలను పరిశీలిస్తుంటే ఎలాంటి చర్చ జరగదని స్పష్టం అవుతోందన్నారు. బిల్లుపై చర్చ కొనసాగుతుందని ఒకవైపు శాసనసభలో ప్రతిరోజూ విడుదల చేస్తోన్న బులిటెన్‌లో పేర్కొంటుండగా, మరోవైపు ఇంకా చర్చ ప్రారంభం కాలేదని కొందరు అనడం మూర్ఖత్వమే అవుతుందని రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ సమైక్యవాదం గురించి సభలో రెండు గంటలు మాట్లాడితే, ప్రతిగా తాను దీటైన సమాధానం చెబుతానన్నారు.

వాయిదాల సభ

      శాసన సభ రేపటికి వాయిదా పడింది.  ఈ రోజుకి ముగిసింది.  కానీ రేపు కూడా ఇదే సన్నివేశం పునరావృతం కాదనే హామీ ఏమైనా ఉందా.  దీనికి పరిష్కారమేమిటి?  రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఆ ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారు? రేపు, ఎల్లుండి, ఆ తర్వాత ఇంకో రోజు.. వెరసి 10వ తేదీతో అసెంబ్లీ సమావేశాలు ముగిసినట్టే. ఆ తర్వాత మళ్ళీ 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. నిజానికి రాష్ట్ర విభజనను కోరుకొంటున్న తెలంగాణావాదులు, దానిని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర సభ్యులు కూడా బిల్లుపై ఎటువంటి చర్చ జరిపే ఉద్దేశ్యంలో లేరని స్పష్టమవుతోంది. కానీ, ఆ మాట పైకి అంటే రాజకీయంగా ఇబ్బంది తప్పదు గనుక సభ జరగనీయకుండా రసాబాస చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. బహుశః జనవరి 23వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగి, బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండానే రాష్ట్రపతికి తిప్పి పంపబడవచ్చును

ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశం

      కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ ముఖ్య నేతలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జనవరి 17న జరిగే ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. సమావేశంలో కూడా ఈ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గత మార్పులపై కూడా చర్చించినట్లు సమాచారం. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయరని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఆమె పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వారంటున్నారు.

చట్ట సభలను అపహాస్యం చేస్తున్న ప్రజా ప్రతినిధులు

  ఊహించినట్లుగానే అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులు రాష్ట్ర విభజనపై బిల్లుపై సభలోఎటువంటి చర్చ జరగనీయకుండా అడ్డుపడుతూ సభను స్థంబింపజేస్తూ రోజులు దొర్లించేస్తున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. బిల్లుపై చర్చలో పాల్గొంటే అది రాష్ట్ర విభజనను అంగీకరించినట్లే అవుతుందని తెదేపా, వైకాపాలు భావిస్తూ అడ్డుపడుతుంటే, చర్చజరిగితే అది కొత్త సమస్యలు సృష్టించే ప్రమాదం ఉందని తెలంగాణా శాసనసభ్యులు అడ్డుపడుతున్నారు. కానీ, అందరూ కూడా బిల్లుపై చర్చ జరగాల్సిందేనని, కానీ అందుకు ఎదుట పార్టీ వాళ్ళే అడ్డుతగులుతున్నారని వితండవాదం చేస్తూ, చట్టసభలలో చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనను కోరుకొంటున్న తెలంగాణావాదులు, దానిని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర సభ్యులు కూడా బిల్లుపై ఎటువంటి చర్చ జరిపే ఉద్దేశ్యంలో లేరని స్పష్టమవుతోంది. కానీ, ఆ మాట పైకి అంటే రాజకీయంగా ఇబ్బంది తప్పదు గనుక సభ జరగనీయకుండా రసాబాస చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. బహుశః జనవరి 23వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగి, బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండానే రాష్ట్రపతికి తిప్పి పంపబడవచ్చును. అందువల్ల బిల్లు శాసనసభకు వస్తే అడ్డుకొంటానని చెప్పిన ముఖ్యమంత్రికి కానీ ఆయన అనుచరులకు గానీ ఇక ఆ శ్రమ ఉండకపోవచ్చును. బహుశః అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో బిల్లుపై చర్చ జరగాలని చెప్పడమే కానీ అందుకు గట్టిగా ఎటువంటి ప్రయత్నమూ చేయదంలేదు.   మొత్తం మీద శాసనసభ్యులు అందరూ కలిసి టీ-బిల్లుపై ఎటువంటి ప్రశ్న లేవనెత్తకుండా, ఎటువంటి సూచనలు,సవరణలు చేయకుండా దానిని యధాతధంగా తిప్పిపంపేందుకు సిద్దం అవుతున్నారు. తమ తమ ప్రాంతాల, ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన ప్రజా ప్రతినిధులు, తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికే ఈవిధంగా వ్యవహరించడం కేవలం బాద్యతరాహిత్యమే. విజ్ఞత ప్రదర్శించి లోపభూయిష్టమయిన రాష్ట్ర విభజన బిల్లులో లోపాలను సవరించే ప్రయత్నాలు చేయకుండా, రాజకీయంగా తమకి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో దానిని యదా తధంగా త్రిప్పి పంపుతుండటం వలన రెండు ప్రాంతాలకు, ప్రజలకు తీరని నష్టం కలగడం తధ్యం.

వైకాపాలో సామాజిక 'అ'న్యాయం..!!

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుందని చాలామంది నాయకులు విశ్వసించారు. అందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి బీసీలు ఇతర సామాజిక వర్గాల నాయకులు తోసుకుంటూ వలస వెళ్లారు. కానీ.. ఇప్పుడు అక్కడ ఎక్కడ చూసినా ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత! జగన్ సొంత జిల్లాలో తాజాగా ముగిసిన సహకార సంఘాల అధ్యక్ష పదవుల ఎంపిక వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ విధమైన అనుమానాలు, సందేహాలకు బలం చేకూరుతోంది.   కొన్ని నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలకు ఎన్నికలు జరగగా... వివిధ కారణాల వల్ల కడప జిల్లాలోని 20 ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సంఘాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 16 సొసైటీల్లో వైకాపా, 4 సొసైటీల్లో కాంగ్రెస్ వారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే... వైకాపా తరపున 16 సొసైటీల్లో ఎన్నికైన అధ్యక్షులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం. కడపలో 16 సొసైటీల్లో ఆధిపత్యాన్ని సాధించిన వైకాపా.. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసి ఇతర సామాజిక వర్గాలవారిపై చిన్నచూపు చూడడంతో..త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఇదే తరహా సూత్రాన్ని అమలు చేస్తారన్న అభిప్రాయలు బలపడుతున్నాయి. దీంతో వైకాపాలో అంటే ఒక సామాజిక వర్గం పార్టీగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఈ పరిణామం కనిపిస్తోంది.

టిడిపిలోకి 'చిరు' ఎమ్మెల్యే

      పాపం కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ లోని తన వర్గ ఎమ్మెల్యేలతో ఎంత మొత్తుకున్నా వారు పార్టీని వీడే౦దుకే మొగ్గుచూపుతున్నారు. నెల్లూరు అర్భన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి, ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో నేత మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ చాన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా జనవరి 23 తర్వాత పార్టీ మారే విషయమై తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. వీరితో పాటు మరికొందరు మాజీ పీఆర్పీ నేతలు త్వరలో టిడిపి లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.

బీఏసీ సమావేశాల్లో కుదరని ఏకాభిప్రాయం

      ఈ రోజు జరిగిన బీఏసీ రెండు సమావేశాల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. మొదటి సారి ఉదయం ప్రారంభమైన బీఏసీ సమావేశం దాదాపు రెండుగంటలకుపైగా జరిగిప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి గంటలకు మరోసారి భేటీ అవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమైక్య తీర్మానానికి కట్టుబడి ఉన్నామని, తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టేవరకు సభ జరగనివ్వమని వైసీపీ స్పష్టం చేయగా, సమైక్య తీర్మానం అవసరం లేదని...టి.బిల్లుపై చర్చ జరుగుతుందని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.   రెండో దఫా బీఏసీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం అర్దాంతరంగా ముగిసింది. రెండో సారి సమావేశం ప్రారంభమైన వెంటనే టీడీపీ నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బిల్లును తిరిగి పంపించేయాల్సిందే అంటూ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు కోరారు.