తెలంగాణాలో కూడా తెదేపా-బీజేపీల పొత్తులుంటాయా
posted on Jan 8, 2014 @ 4:35PM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి తెరాసను విలీనం లేదా ఎన్నికల పొత్తులని ఆశిస్తునట్లు స్పష్టమవడంతో, బీజేపీ కూడా రాష్ట్రంలో తెదేపాతో పొత్తులకి ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అస్పష్ట రాజకీయ పరిస్థితుల్లో తెదేపాకు కూడా బీజేపీ వంటి ఒక బలమయిన పార్టీ మద్దతు చాలా అవసరం కనుక నరేంద్ర మోడీ అందించిన స్నేహ హస్తాన్ని చంద్రబాబు అందుకోవడంతో, రెండు పార్టీల మధ్య మళ్ళీ స్నేహసంబందాలు క్రమంగా బలపడుతున్నాయి. అయితే, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి ఇతర తెలంగాణా నేతలు తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం వాస్తవ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెదేపాతో పొత్తులకే ప్రాధాన్యం ఇస్తోంది. పొత్తులు కుదుర్చుకోగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ (రహస్య) కూటమిని తేలికగా ఎదుర్కోవడమే గాక రెండు పార్టీలు లాభాపడవచ్చని భావిస్తున్నాయి.
ప్రస్తుతం దేశమంతట నరేంద్ర మోడీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాతావరణం కనిపిస్తునందున, బీజేపీతో పొత్తుల ప్రభావం తెదేపాకు రాష్ట్రంలో మరింత సానుకూల వాతావరణం కల్పించగలదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా, తెదేపా మద్దతుతో సీమాంధ్రలో బీజేపీ కూడా బలపడవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఖరారయిన బీజేపీ-తెదేపాల పొత్తుల గురించి మీడియాలో వస్తున్నవార్తలపై తెదేపా యంపీ రమేష్ రాథోడ్ స్పందిస్తూ, “సంక్రాంతి పండుగ తరువాత రెండు పార్టీల ఎన్నికల పొత్తుల గురించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని” అన్నారు. కానీ వారి పొత్తులు కేవలం సీమాంధ్రకే పరిమితం చేస్తారా లేక తెలంగాణాకు కూడా వర్తింపజేస్తారా? అనేది తేలవలసి ఉంది.
కాంగ్రెస్-తెరాసలు ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నా, పెట్టుకోకపోయినా కేంద్రంలో ఏకూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలుంటే తెరాస దానికే మద్దతు ఇస్తుంది గనుక, బీజేపీ తెరాసతో పొత్తులు పెట్టుకోకపోయినా ఆపార్టీతో వైరం పెంచుకోదు. ఒకవేళ తెరాస-కాంగ్రెస్ పార్టీతో జతకడితే బీజేపీ కూడా తెదేపాతో పొత్తులు పెట్టుకోవచ్చును. జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉండి ఉండవచ్చును కానీ, రాష్ట్రంలో మాత్రం చాలా బలహీనంగా ఉంది. అయితే సీమాంధ్రతో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ కొంత బలంగా ఉందని చెప్పవచ్చును. కానీ, అది తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ పార్టీలను ఒంటరిగా డ్డీకొని ప్రభుత్వం ఏర్పరచగలిగేంత మాత్రం కాదని ఆ పార్టీ అధిష్టానానికి కూడా బాగా తెలుసు గనుక, తెలంగాణాలో కూడా మంచి బలమయిన క్యాడర్ ఉన్నతెదేపాతో పొత్తులకి సిద్దపడవచ్చును. తద్వారా తెలంగాణాలో కూడా ఒకరివల్ల మరొకరు లాభాపడగలవు కూడా.