ఎర్రబెల్లి అంతర్యం ఏమిటి?

  ఈ రోజు తెదేపా నేత పయ్యావుల శాసనసభలో చేసిన ప్రసంగంలో తెరాసను తీవ్రంగా పట్టుబట్టారు గనుక తెరాస నేతలు ఆయనను వ్యతిరేఖించడం సహజమే. కానీ, తేదేపాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పయ్యావుల ప్రసంగాన్నితీవ్రంగా వ్యతిరేఖిస్తూ మాట్లాడటం విశేషం. తెదేపా నేతలు ప్రాంతాల వారిగా చీలిపోయినా, నేటికీ ఒకే పార్టీ గొడుగు క్రింద అందరూ కొనసాగుతున్నారు. అటువంటప్పుడు ఎర్రబెల్లి మీ సీమాంధ్ర పెత్తనం మాకవసరం లేదని నిర్ద్వందంగా చెప్పడమే కాకుండా ఏ కర్నూలుకో వెళ్ళి రాజధాని ఏర్పాటు చేసుకోమని పయ్యవులకు ఒక ఉచిత సలహా కూడా ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన పయ్యావులని ఉద్దేశ్యించి అన్నపటికీ, తెలంగాణాలో కూడా తెదేపాను నిలబెట్టుకొందామని ఆరాటపడుతున్నచంద్రబాబుకి కూడా ఆయన అదే మాట చెప్పదలచుకొన్నారా? అనే ప్రశ్నతలెత్తుతుంది. ఎర్రబెల్లి ఉద్దేశ్యం అదే అయినట్లయితే మరటువంటప్పుడు ఆయన ఇంకా తెదేపాలో కొనసాగడంలో ఔచిత్యమేమిటి? తెలంగాణపై సీమాంధ్రుల పెత్తనాన్ని ఖండిస్తున్నఎర్రబెల్లి మరి ఇంకా చంద్రబాబు క్రింద ఎందుకు పనిచేస్తున్నట్లు? అని ప్రశ్నిస్తే వేరే గత్యంతరం లేకనే అని అనుకోవలసి వస్తుంది.   నాగం జనార్ధన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తదితరులు పార్టీని వీడి బయటకి వెళ్లి ఏవిధంగా అపసోపాలు పడ్డారో చూశారు. గతేడాది తెదేపాను వీడి తెరాసలో చేరిన కడియం శ్రీహరి పరిస్థితి ఏమిటో కూడా స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఇవన్నీ చూసిన తరువాత ఎర్రబెల్లి అంత సాహసం చేయలేకపోతున్నారు. అందువల్ల వేరే పార్టీలోకి వెళ్లేందుకు లేదా స్వయంగా పార్టీని స్థాపించేందుకో సాహసం చేయలేని ఎర్రబెల్లి సీమాంధ్ర పెత్తనాన్నిసహించబోమని చెపుతున్నపటికీ, తెదేపా అండదండలు లేకపోతే తన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందనే సంగతి గ్రహించినందునే ఆయన ఇంకా తెదేపాను అంటిపెట్టుకొన్నారని భావించవచ్చును. అంతే గాక, ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణా ఏర్పడితే అక్కడ తెదేపాకు తానే నేతృత్వం వహించాలనే ఆశ కూడా ఉండి ఉండవచ్చును. కానీ ఒక అచ్చమయిన తెలంగాణావాదిగా అప్పుడప్పుడు ఈవిధంగా తన అక్కసు వ్రేళ్లగ్రక్కుతుంటారు.

శాసనసభలో పయ్యావుల ప్రసంగం

  ఈ రోజు శాసనసభలో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ తెదేపా సభ్యుడు పయ్యావుల కేశవ్ అనర్గళంగా ప్రసంగించారు. తెలంగాణా సాయుధ పోరాటం మొదలుకొని సమైక్యాంధ్ర కోసం జరిగిన పెద్దమనుషుల ఒప్పందం, సాగునీరు, ప్రాజెక్టులు, అభివృద్ధి తదితర అనేక అంశాల గురించి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండటం వలన ఏవిధంగా తెలంగాణా అభివృద్ధి జరిగిందో వివరించారు. అలనాడు పటేల్ పట్వారీ పెత్తందారులకు, దొరలకు వ్యతిరేఖంగా ప్రజలు పోరాటం చేసారని, ఆ తరువాత స్వర్గీయ యన్టీఆర్ హయాంలో ఆ వ్యవస్థలను రద్దు చేసారని, కానీ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వంటి దొరలు పుట్టుకొచ్చారని ఆయన తెరాస నేతలకు చురకలు వేసారు. వారు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం చరిత్రను వక్రీకరించి, ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించి ఉద్యమాలు నడిపి, మళ్ళీ పెత్తందారీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. సోనియాగాంధీ కొడుకు కోసమో, విజయమ్మ కొడుకు కోసమో లేకపోతే కేసీఆర్ కొడుకు కోసమో రాష్ట్ర విభజన చేయడం సరికాదని ఆయన వాదించారు. చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టుకి వ్యతిరేఖంగా పోరాటం చేసి జైలుకి కూడా వెళితే, కేసీఆర్ తెలంగాణా ప్రజల కోసం ఏమి చేసారో చెప్పాలని పయ్యావుల నిలదీశారు.   స్వర్గీయ యన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ కూడా తెలంగాణాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి చిత్తశుద్ధితో కృషి చేసినందునే నేడు ఇంత అభివృద్ధి జరిగిందని ఆయన గుర్తు చేసి, మరి అటువంటప్పుడు సీమాంధ్ర నేతలు, ప్రజలు తెలంగాణాను దోచుకుతింటున్నారని తెరాస నేతలు ఏవిధంగా ఆరోపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

వైకాపా, టీఆర్ఎస్ ల రాజకీయ మైత్రి

      వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రహస్య ఒప్పందాలు నడుస్తున్నాయని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వారిద్దరి రాజకీయ మైత్రికి రాజ్యసభ ఎన్నిక వేదిక కానుంది. శాసనసభ బలాబలాలను చూస్తే.. రాష్ట్రంలో ఉన్న ఆరు ఖాళీలకు మూడు కాంగ్రెస్‌కు, రెండు టిడిపికి దక్కడం ఖాయం. మిగిలిన ఒక స్థానం కోసం వైకాపా, టీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి అభ్యర్ధిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. దీనిపై రెండు పార్టీల మధ్య రహస్య మంతనాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయవర్గాలలో వినిపిస్తున్నా గుసగుసల ప్రకారం... నెల్లూరు జిల్లాకు చెందిన బడా పారిశ్రామికవేత్త ప్రభాకర్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దాని కోసం ఆయన భారీగానే ముట్టజెప్పినట్లు సమాచారం. ఇటీవల జగన్ తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ డీల్ కుదిరినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి.  మొదట జగన్ ప్రభాకర్‌రెడ్డికి.. ఒంగోలు లేదా నెల్లూరు అసెంబ్లీ సీటు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట..కాని ఈసారి రాజ్యసభ ఎన్నికల్లోనే అవకాశం ఇప్పించాలని ఆయన పట్టుపట్టారు. దానికి ఎంత ఖర్చయినా సిద్ధమేనన్నారట. టీఆర్‌ఎస్‌తో కూడా మాట్లాడి ఎలాగైనా తనకే సీటు వచ్చేలా ఒత్తిడి తెచ్చారట. దానితో రంగంలోకి దీగిన జగన్..టీఆర్‌ఎస్ అగ్రనేతతో రహస్య మంతనాలు జరిపి ఒప్పించినట్లు చెబుతున్నారు. ఇప్పటి పరిస్థితి ప్రకారం ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే..39 ఓట్లు కావాలి. వైకాపా, టీఆర్ఎస్ కలిస్తే అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చెలా ఉన్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్ ‘దిక్కరించి, కాంగ్రెస్ అభ్యర్ధికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఓట్లు వేసినా వారిపై కేసీఆర్ ఎలాంటి చర్య తీసుకోని విషయం తెలిసిందే. ఇప్పడు అదే పద్దతిని ఇక్కడ కూడా ఫాలో అవ్వలని నిర్ణయించినట్లు సమాచారం!!    

భత్కల్‌ విడుదలకు కేజ్రీవాల్ కిడ్నాప్?

      ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను విడిపించుకోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కిడ్నాప్ చేయడానికి ఐఎం కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని కేజ్రీవాల్ దృష్టికి తీసుకొనివెళ్ళారు. 'జడ్' కేటగిరీ భద్రత కల్పించడానికి అనుమతించాలని వారు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇతర నగరాలలో కూడా బాంబు పేలుళ్ళతో భయోత్పాతం సృష్టించాలని కూడా ఉగ్రవాదులు చూస్తున్నట్లు తెలిసింది.   కేంద్ర నిఘావర్గాలు హెచ్చరికతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యాసిన్ భత్కల్‌ను విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించిన నేపథ్యంలో ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసే అవకాశాలున్నాయనే హెచ్చరికలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, కేఎస్ఆర్‌పీ బలగాలతో పాటు విమానాశ్రయ ప్రత్యేక బృందాలు బందోబస్తులో పాల్గొన్నాయి.

కాంగ్రెస్ 60 ఏళ్లిచ్చారు..నాకు 60 నెలలు: మోదీ

      దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ ముగింపు సమావేశంలో నరేంద్రమోదీ కీలకోపన్యాసం చేశారు. కాంగ్రెస్ యువతనేత రాహుల్ గాంధీపైన, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ విధానాలపై విమర్శనాస్త్రాలను సంధించారు. ''60 ఏళ్లు ఆ నాయకులకిచ్చారు..60 నెలల ఈ సేవకుడికివ్వండి'' అని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.   రాహుల్ పేరెత్తకుండానే ఆయనపైనా, గాంధీ కుటుంబంపైనా ధ్వజమెత్తారు. కేవలం తమ ఇంటి పేరుతో గొప్పవాళ్లు (నామ్‌దార్)గా చలామణీ అయ్యేవాళ్లు తమ తమ పనుల ద్వారా ప్రఖ్యాతి గాంచిన కృషీవలుడి (కామ్‌దార్)తో పోటీ చేయడాన్ని అవమానంగా భావిస్తారని విమర్శించారు. " నా తల్లి ఇంటి పని చేసేది. నేను రైల్లో టీ అమ్ముకునే వాడిని. ఇలాంటి కిందిస్థాయి నుంచి వచ్చిన నాలాంటి వ్యక్తితో పోటీ చేయడం రాహుల్‌కు ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అది తనకు అగౌరవంగా ఆయన భావించి ఉండొచ్చు'' అని ఎద్దేవా చేశారు. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరల పెరుగుదలను అరికడతానని చెప్పారు. అడ్డూ అదుపు లేకుండా ఉన్న ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానన్నారు. పేదరికాన్ని నియంత్రిస్తానని చెప్పారు. ఈ మూడింటి విషయంలోనూ తన ఆలోచనలను వివరించారు. మాజీ ప్రధాని వాజపేయి మానస పుత్రిక అయిన నదుల అనుసంధాన కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ కలల ప్రాజెక్టు అయిన విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని భారత్‌కు తీసుకు రావడమనే కలను నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ఆ డబ్బును పేదల సంక్షేమానికి ఉపయోగిస్తానని అన్నారు.

విభజన బిల్లుకి రాష్ట్రపతి గడువు పొడిగిస్తారా?

మరో మూడు రోజుల తరువాత రాష్ట్రవిభజన బిల్లుని రాష్ట్రపతికి త్రిప్పిపంపవలసి ఉంటుంది. కానీ, బిల్లుపై సమగ్రంగా చర్చ జరగనందున మరొక నెల రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖకు కొద్ది రోజుల క్రితం వ్రాసింది. హోంశాఖ ఆ లేఖను రాష్ట్రపతికి పంపింది, కానీ రాష్ట్రపతి ఇంకా దానిపై స్పందించలేదు. ఒకవేళ ఆయన కనీసం మరో పదిరోజులు గడువయినా పెంచవచ్చనునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే, బిల్లు కేంద్రానికి చేరేసరికి మరింత ఆలస్యమవుతుంది కనుక, ఫిబ్రవరి ఐదు నుండి మోదలయ్యే పార్లమెంటు సమావేశాలలో బిల్లుని ప్రవేశపెట్టకుండా ఆపవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన సహచరులు భావిస్తున్నారు. కానీ, తెలంగాణా నేతలు బిల్లుపై అసలు చర్చే అవసరం లేదని, అందువల్ల గడువు పెంపు కూడా అనవసరమని, సీమాంధ్ర నేతలు బిల్లును అడ్డుకోవడానికే ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి ప్రభుత్వ అభ్యర్ధనను మన్నిస్తారా లేదా? అనే సంగతి నేడో రేపో తెలిపిపోవచ్చును. దానిని బట్టే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశ పెట్టగలుగుతుందా లేదా అనే సంగతి కూడా స్పష్టమయిపోవచ్చును.

బుద్ధి గడ్డితిని...

      ఎప్పటి నుంచో వైకాపాలో ఉన్న అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడు బుద్ధి గడ్డితిని ఈ పార్టీలో వున్నాం అని పశ్చాత్తాపపడుతున్నారు. వీలైనంత త్వరగా వైకాపా నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళలోనే కాదు.. ఈ మధ్యకాలంలో వైకాపాలో చేరిన నాయకులలో కూడా పశ్చాత్తాపం మొదలైందని తెలుస్తోంది. వాళ్ళు కూడా బుద్ధి గడ్డితిని వైకాపాలో చేరామని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.   ఉత్తరాంధ్రలో కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి అయిన ఒక పెద్దమనిషి తాజాగా వైకాపాలో చేరాడు. తన రాజకీయ చతురత అంతా ఉపయోగించి పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలని, జగన్‌కి చేరువైపోవాలని కలలు కన్నాడు. అయితే ఆయనకి జగన్ ఊహించని షాకులు ఇవ్వడంతో ఆయన కూడా వైకాపాలోకి అనవసరంగా వచ్చానా అన్న ‘ధర్మ’ సందేహంలో పడిపోయాడట. సాధ్యమైనంత త్వరగా ఈ పార్టీ నుంచి బయటపడిపోయే ఆలోచనలో వున్నాడట. ఇంతకీ ఆ పెద్దమనిషికి ఎలాంటి షాకులు తగిలాయంటే, కొత్తగా వైకాపాలోకి వెళ్ళిన ఆయన చాలా ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టాడట. ఉత్తరాంధ్రలో తన బలాన్ని జగన్‌కి ప్రత్యక్షంగా చూపించాలన్న ఉద్దేశంతో ఒక బహిరంగసభ ఏర్పాటు చేయాలని సంకల్పించాడట. రెండు లక్షల మందితో భారీ స్థాయిలో సభ నిర్వహించాలని భావించాడట. ఆ సభకు రావాలని జగన్‌ని ఆహ్వానించినప్పుడు జగన్ ప్రతిస్పందించిన తీరు చూసి సదరు సీనియర్ నాయకుడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందట. రెండు లక్షల మందితో సభ పెట్టబోతున్నా మీరు తప్పకుండా రావాలని ఆ నాయకుడు జగన్‌ని అడిగితే, ‘‘ఆ రెండు లక్షల మంది వచ్చేది నువ్వు సభ ఏర్పాటు చేశావని కాదు.. వాళ్ళు వచ్చేది నన్ను చూడటానికి. అంచేత ఎప్పుడు, ఎక్కడ సభ పెట్టాలో నేను డిసైడ్ చేస్తాను. మీరు ఫాలో అవ్వండి. అంతేతప్ప మీ అంతట మీరు ఉత్సాహంగా సభలు ఏర్పాటు చేయొద్దు’’ అని స్పష్టంగా చెప్పేశాడట. జగన్ అన్న మాటలు విని సదరు నాయకుడు నోరు తెరవడం మినహా  ఏమీ మాట్లాడలేకపోయాడట. రాజకీయాల్లో చాలా సీనియారిటీ వున్న తనను జగన్ పూచికపుల్లలా తీసిపారేయడాన్ని ఆయనగారు జీర్ణించుకోలేకపోతున్నాడట. అనవసరంగా వైకాపాలోకి వచ్చానని బాధపడిపోతూ, ఈసారి ఏ పార్టీలోకి వెళ్ళాలా అని వెతుక్కుంటున్నాడట.

చిదంబర హస్తం!

      తనకి ఎదురు తిరిగి తోకలు జాడించిన వాళ్ళ తోకలు కట్ చేసి సున్నం రాయడం అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అలాంటి కాంగ్రెస్ పార్టీ తనను తీవ్రంగా వ్యతిరేకించిన కొంతమంది విషయంలో మాత్రం తన ఒరిజినల్ పద్ధతిని ఫాలో అవడం లేదు. అలాంటి కొంతమందిలో మొదటి వరుసలో వుండే వ్యక్తి అందరూ ముద్దుగా ‘సర్వేపాటి’ అని పిలుచుకునే లగడపాటి! మొన్నటి వరకూ సమైక్యం అని గొంతు చించుకున్న లగడపాటి ఇప్పుడు గొంతు నొప్పి పుట్టకుండా సమైక్య రాగం కూనిరాగంలా ఆలాపిస్తున్నారు. ఆయన రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.   లగడపాటి కూల్‌గా కూనిరాగం ఆలపించడం, కాంగ్రెస్ అధిష్టానం ఆయన మీద ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం...  ఈ రెండిటి వెనుక ‘చిదంబర హస్తం’ వుందని అంటున్నారు. దీని వెనుక వున్న చిదంబర రహస్యమేమిటో రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రాన్ని కేక్ కోసినట్టు ఈజీగా ముక్కలు చేసేయాలంటే కాంగ్రెస్ అధిష్టానానికి లగడపాటి అవసరం వుంటుంది. అలాగే లగడపాటి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే కాంగ్రెస్ ఆశీస్సుల అవసరం వుంది. అందువల్ల ఈ ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒక అండర్‌స్టాండింగ్ వచ్చినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. లగడపాటి రాష్ట్ర విభజనకు సహకరించాలి. కాంగ్రెస్ అధిష్టానం లగడపాటిని క్షమించేసి ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి. లగడపాటికి మిత్రుడైన కేంద్రమంత్రి చిదంబరం ఈ ఒప్పందం కుదరడానికి కృషి చేసినట్టు తెలుస్తోంది. లగడపాటికి చెందిన సంస్థలు చెల్లించాల్సిన అప్పుల చెల్లింపు విషయంలో గడువు పెంచడం, కొన్ని రుణాలను రీ షెడ్యూలు చేయించడం, కొత్త అప్పులు వచ్చేలా చేయడం లాంటి ఉపకారాలు ఆల్రెడీ జరిగిపోయాయని తెలుస్తోంది. ఈ విషయంలో చిదంబరం కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ మీద వత్తిడి తెచ్చినట్టు సమాచారం. అప్పుల విషయంలో వత్తిడి తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకున్న లగడపాటి ప్రస్తుతం రాష్ట్ర విభజన కార్యక్రమం సజావుగా సాగిపోవడానికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నారని, విభజనకు వ్యతిరేకమని అంటూనే విభజనకు సహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘సొంతలాభం కొంత చూసుకుని తెలుగు వెన్నుకు పోటు పొడువోయ్’ అనే మాటకు నిఖార్సయిన నిదర్శనంగా లగడపాటి నిలుస్తాడని అంటున్నారు.  

సునంద పుష్కర్ మృతిపై అనుమానాలు

      అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సునంద పుష్కర్ బౌతికకాయానికి వైద్యులు శవపరీక్ష పూర్తి చేశారు. ఆమెది అసాధారణ మృతిగా వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె మెడ, మణికట్టుపై గాయలు ఉన్నాయన్నారు. మరికొన్ని పరీక్షల అనంతరం నివేదికను మెజిస్ట్రేట్‌కు అందజేయనున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. విషం తీసుకున్న ఆనవాళ్ళు లేవని స్పష్టం చేశారు. శవపరీక్ష అనంతరం ఎయిమ్స్ వైద్యులు ఆమె మృతదేహాన్ని శశిథరూర్ కి అప్పగించడంతో ఆయన నివాసానికి తీసుకెళ్ళారు.   ఇటీవలే తమ ఆస్పత్రిలో సునందా పుష్కర్ పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని, ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని కేరళలోని తిరువనంతపురంలోని కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు శనివారం తెలిపారు. ఆమెకు ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధులు లేవని వారు పేర్కొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెకు సాధారణ మందులు ఇచ్చామని కార్డియాలజిస్ట్ డాక్టర్ జి విజయరాఘవన్ తెలిపారు. జనవరి 12న ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సునందా పుష్కర్ 14న డిశ్చార్జ్ అయ్యారని, ఆమెతోపాటు భర్త శశిథరూర్ కూడా ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో సునందా ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. ఆమె మృతి తమకు షాక్‌కు గురి చేసిందని వైద్యులు తెలిపారు. కాగా సునందా కుమారుడు శివ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాడు. థరూర్ కుమారులు ఇశాన్, కనిష్క్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

సునంద పుష్కర్ మృతి...ప్రముఖుల దిగ్భ్రాంతి

      సునంద పుష్కర్ మృతి పట్ల ప్రధాని మన్మోహన్ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన థరూర్‌కు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక.. సునంద ఆకస్మిక మృతితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పాక్ జర్నలిస్ట్, ఈ వివాదానికి కేంద్ర బిందువు అయిన మెహర్ తరార్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. తన బాధను మాటల్లో వర్ణించలేనన్నారు. సునంద ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్రమంత్రి కపిల్ సిబల్, బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, శిల్పా శెట్టి.. తదితర ప్రముఖులు షాక్‌కు గురయ్యామంటూ ట్వీట్ చేశారు.   కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో హోటల్‌గదిలో మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలియగానే పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. వారి ఫోన్ కాల్స్ వివరాలను సేకరించారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రమంత్రి శశిథరూర్-ఆయన భార్య సునంద పుష్కర్-పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్.. ఈ ముగ్గురి మధ్య ట్విటర్‌లో జరిగిన సంవాదం బుధ, గురువారాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తన భర్తకు మెహర్ తరార్‌తో వివాహేతర సంబంధం ఉందని, ఆమె పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అని.. తన భర్తను వేధిస్తోందని సునంద సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంబంధం కొనసాగుతోందని, వీరిద్దరూ చాలాకాలంగా ఒకరికొకరు బ్లాక్‌బెర్రీ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపుకొంటున్నారని వివరించారు. త్వరలోనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నానన్నారు. అలాగే తరార్ తన భర్తను వేధిస్తోందని, తాను అనారోగ్యంతో భర్తకు దూరంగా ఉన్న సమయంలో తమ వివాహబంధాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటోందని సునంద మండిపడ్డారు.

యువరాజు ఆవేదన..!!

      ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎఐసిసి సమావేశంలో ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. సమాచార హక్కు చట్టం ఒక్క కాంగ్రెస్‌వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు. పేదలకు ఎంతో చేశామని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసింది కూడా కాంగ్రెసేనని ఆయన తెలిపారు.   ఈ రోజు రాజకీయాల్లోకి సామాన్యులు వచ్చే పరిస్థితి లేదని, దీనిని మనం మార్చాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజల యొక్క ఆకాంక్షలను పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులుగా అనర్హులవుతారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారుతున్నా.. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లుపై అందరూ తమాషా చేశారని, చివరికి లోక్‌పాల్ చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్సేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యమంటే ఏ ఒక్క వ్యక్తి పాలనా కాదని, ప్రజా ప్రతినిధుల పాలన అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ అంటేనే అవినీతి అనే రేంజ్‌లో గడచిన పదేళ్ళలో అవినీతి జరిగిందని అందరికి తెలుసు...కాని  ఇవన్నీ రాహుల్‌ గాంధీకి తెలియనివేమీ కాదు...మరీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి౦ది తామేనని రాహుల్‌ చెప్పుకోవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

శైలజానాథ్ ను 'ఢీ' కొన్న రేవంత్, ఎర్రబెల్లి

  మంత్రి శైలజానాథ్ సుదీర్గ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆయన ప్రసంగం చేస్తున్నంత సేపు కూడా తెరాస, తెదేపా తెలంగాణా నేతలు అడ్డు తగులుతూ ఆయన మాటలను, విమర్శలను త్రిప్పి కొడుతూనే ఉన్నారు. కానీ శైలజానాథ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రాష్ట్ర విభజన అంశం మొదలుకొని, విద్య, విద్యుత్, నీళ్ళు, ఉద్యోగాలు తదితర అంశాలన్నిటి గురించీ గట్టిగా తన వాదనలు వినిపించారు. సీమాంధ్రులను దోపిడీదారులనడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కానీ, తెదేపా నేత రేవంత్ రెడ్డి ఆయనకు ఘాటుగా బదులిస్తూ దోపిడీకి పాల్పడినవారందరూ సీమాంద్రులేనని వాదిస్తూ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, కృషి వెంకటేశ్వర రావు, సత్యం రామలింగ రాజు తదితరుల పేర్లను పేర్కొన్నారు. కానీ తెలంగాణా లో ఒక్క వ్యక్తి కూడా దోపిడీకి పాల్పడినట్లు దాఖలాలు లేవని ఆయన వాదించారు.   ఇదే రేవంత్ రెడ్డి కొన్నే నెలల క్రితం కేసీఆర్, హరీష్ రావు మరియు వారి కుటుంబ సభ్యులందరూ ఉద్యమాల పేరిట పారిశ్రామిక వేత్తలని, విద్యా, వ్యాపార సంస్థలని దోచుకొంటున్నారని ఆరోపించిన సంగతి మరిచిపోయారు. కొద్ది నెలల క్రితం తెరాస నేత రఘునందన్ రావు ఆ పార్టీ నుండి బహిష్కరింపబడినప్పుడు, హరీష్ రావు పై ఆరోపణలు చేస్తుంటే రేవంత్ రెడ్డి అదే అదునుగా తెరసాను ఏకి పారేశారు. కానీ, ఇప్పుడు తెలంగాణాలో అందరూ నీతిమంతులే, సీమాంధ్రలో అందరూ దొంగలేనని వాదించడం విడ్డూరం. ఇక తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు శైలజానాథ్ కు దీటుగా బదులిస్తూ, ఇంతగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నపుడు, అందుకు కారణమయిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకా సిగ్గులేకుండా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నారని ఎద్దేవా చేసారు.

కుంటిసాకులతో సభకు మొహం చాటేసిన వైకాపా

  రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నామని చెప్పుకొంటున్నవైకాపా శాసనసభలో తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పి తెలంగాణా బిల్లుని తీవ్రంగా వ్యతిరేఖించకుండా, బిల్లుపై ఓటింగ్ ఉంటుందా లేదా? అనే విషయంపై స్పష్టత లేని కారణంగా సభ నుండి వాకవుట్ చేసి కీలకమయిన చర్చలో పాల్గొనకుండా తప్పించుకొంది. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సభలో ప్రసంగిస్తూ, అధికార, ప్రతిపక్షాలు కలిసి రాష్ట్ర విభజనకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు రాష్ట్ర విభజనపై ముందు తమ వైఖరి తెలియజేసి ఆనక చర్చలో పాల్గొంటే బాగుంటుందని ఆమె అన్నారు. అవి రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయి గనుకనే టీ-బిల్లుపై చర్చలో పాల్గొంటున్నాయని, చర్చలో పాల్గొనడమంటే విభజనకు అంగీకరిచడమేనని, అందువల్ల తాము వాకవుట్ చేస్తున్నామని చెప్పి, తమ పార్టీ సభ్యులతో సహా ఆమె సభ నుండి నిష్క్రమించారు.   వైకాపా నిజంగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లయితే, సభలో గట్టిగా వాదించి టీ-బిల్లుని అడ్డుకొనే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ, పార్టీకి మనుగడకి రాష్ట్ర విభజన జరగడం అత్యవసరం గనుకనే బిల్లుకి అడ్డుపడకుండా కుంటిసాకులు చెప్పి చర్చలో పాల్గొనకుండా తప్పుకొంటోంది.

శాసనసభలో ధాటిగా ఉపన్యసిస్తున్న శైలజానాథ్

  సంక్రాంతి పండుగ శలవుల తరువాత మళ్ళీ సమావేశమయిన శాసనసభలో తెలంగాణా బిల్లుని వ్యతిరేఖిస్తూ మంత్రి శైజానాథ్ ధాటిగా ప్రసంగిస్తున్నారు. కొందరు వ్యక్తుల స్వార్ధం కోసం తెలంగాణా యువకులను రెచ్చగొట్టి ఉద్యమం లేవదీసారని కేసీఆర్ ని ఉద్దేశించి విమర్శించారు. రాజ్యంగా విరుద్దంగా ఉన్నటీ-బిల్లుతో బాషా ప్రయోక్తంగా ఏర్పరచిన రాష్ట్రాన్ని విడదీస్తున్నందున తాను వ్యతిరేఖిస్తున్నానని స్పష్టం చేసారు. నిజాం పాలన సమయం నాటికే తెలంగాణా అన్ని విధాల అభివృద్ధి చెందిందనే వాదనను ఆయన ఖండిస్తూ, తెలంగాణాలో ఎన్నికళాశాలలు ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. మద్రాసు నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ బాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తరువాతనే అందరి సమిష్టి కృషితో తెలంగాణాలో అభివృద్ధి జరిగిందనే సంగతిని మరుగు పరిచి, కొందరు స్వార్ధ రాజకీయ నేతలు సీమాంధ్రవాసులు తెలంగాణాను దోచుకొంటున్నారని నిందిస్తూ చులకన చేసి మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.   తెలంగాణాలో ప్రభుత్వోద్యోగాలను సీమాంధ్ర ప్రజలు తన్నుకుపోతున్నారని అనడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. అనేక వ్రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొని వాటిలో ఉత్తీర్ణులయిన వారికే ప్రభుత్వోద్యోగాలు దక్కుతాయి తప్ప, ప్రభుత్వం ఎవరినీ నేరుగా నామినేషన్ పద్దతిలో నియమాకాలు చేయదని, అటువంటప్పుడు సీమాంధ్ర ప్రజలు అక్రమంగా ఉద్యోగాలు తన్నుకు పోయారని ఆరోపించడం అవివేకమని ఆయన అన్నారు. తమను సీమాంధ్రవాసులనడం కంటే తెలుగు ప్రజలని పిలిస్తేనే చాలా సంతోషిస్తామని ఆయన అన్నారు. తెలంగాణా ప్రజలను తప్పు దారి పట్టించడానికే తెలంగాణా ఏర్పడితే ఏదో చాలా లబ్ది చేకూరుతుందని రాజకీయ నాయకులు మభ్య పెడుతున్నారని, కానీ నిజానికి రాష్ట్ర విభజనవల్ల రెండు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

రాహుల్ ప్రధాని కాదు...ప్రచార సారథే..!!

      కాంగ్రెస్ గురువారం రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ఖరారు చేసినట్లే కాని ప్రకటన చేయలేదు! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నకాంగ్రెస్ నేతలందరూ రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని సోనియాగాంధీని గట్టిగా కోరినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధిని ప్రకటించే ఆనవాయితీ లేనందున ఆమె తిరస్కరించినట్లు, ఆ పార్టీ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది మీడియాకు తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయన సారధ్యంలోనే వచ్చేఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.   ప్రచార కమిటీ సారథి అంటే దాదాపు ప్రధానమంత్రి అభ్యర్థేనని, పార్టీ విజయం సాధిస్తే ఆయనే ప్రధాని అవుతారని పార్టీ సంకేతాలు పంపిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేదీ కూడా అంగీకరించారు. "ఆయన సారథ్యంలో ఎన్నికల ప్రచారం జరిగి విజయం సాధిస్తే... భావి నాయకత్వం కూడా ఆయన చేతిలో ఉన్నట్లే'' అని తెలిపారు. సీడబ్ల్యూసీ భేటీలో చివరగా రాహుల్ గాంధీ రెండు నిమిషాలు మాట్లాడారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వర్తిస్తానని, తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పారు.

ఆ ఆరుగురు ఏఐసీసీ సమావేశానికి

  అధిష్టానంపై తిరుగుబాటు చేసిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలకు నేడు డిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశానికి ఆహ్వానించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం వారితో సంప్రదింపులు జరుపుతోంది. సమావేశంలో సమైక్యాంధ్ర అంశాన్ని లేవనేత్తకుండా ఉండే షరతుపై వారిని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. అందుకు వారు అంగీకరించినట్లయితే వారందరూ హుటాహుటిన రెక్కలు కట్టుకొని యువరాజవారి పట్టాభిషేక మహోత్సవ సభలో వాలిపోతారు. రాష్ట్ర విభజన చేస్తున్నందుకు తమ అధిష్టానంపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర యంపీలు, రాహుల్ గాంధీని పార్టీ ఎన్నికల రధ సారధిగా ప్రకటించే ఏఐసీసీ సమావేశానికి తమను ఆహ్వానించలేదని చిందులు వేయడం ఒక వింత అయితే, పార్టీపై తిరుగుబాటు చేస్తున్నవారిని కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ ఆహ్వానించాలనుకోవడం మరో వింత. కానీ, వారందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి విధేయులేనని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. లేకుంటే ఒకరినొకరు వ్యతిరేఖించుకొంటూ ఈవిధంగా పార్టీ సమావేశాలకు హాజరయ్యి భుజాలు రాసుకొని ఉండేవారు కాదు.

కష్టాలలో అమాద్మీ

  పాపం ఆమాద్మీకి ఒక్కసారే అన్ని కష్టాలు ముంచుకు వచ్చాయి. మంత్రి పదవి దక్కని ఆ పార్టీ నేత వినోద్ కుమార్ బిన్నీఅసంతృప్తితో పొగలు గ్రక్కుతూ ఈనెల 27లోగా పార్టీ మ్యానిఫెస్టో చేసిన వాగ్దానాలను అమలుచేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించడమే కాక, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారని, పార్టీ సిద్దాంతాలను ఎందుకు అమలు చేయలేదని అడిగినందుకు తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాకెక్కారు. బొటాబొటీ మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్నఅమాద్మీ ప్రభుత్వానికి ఒక్క సభ్యుడి మద్దతు తగ్గినా పడిపోయే పరిస్థితి ఉంది గనుకనే, వినోద్ కుమార్ అంత వీరంగం ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది.   ఆయన తనకు మంత్రి పదవి ఈయకపోతే కనీసం వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు లోక్ సభ టికెట్ అయినా కేటాయించమని అడిగినట్లు, కానీ పార్టీ నియమావళి ప్రకారం శాసనసభ్యులకు లోక్ సభ టికెట్స్ కేటాయించకూడదు గనుక ఆయన కోరికను నిరాకరించడం జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ చెపుతున్నారు.   ఇక ఈ యుద్ధం ఇలాగ సాగుతుంటే, విదేశీ కంపెనీలు రిటైల్ వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేఖిస్తూ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి ఆనంద్ శర్మకు వ్రాసిన లేఖపై మరో దుమారం చెలరేగుతోంది. యఫ్.డీ.ఐ.లలో పెట్టుబడులపై ఇప్పటికే కేంద్రం ఒక నిర్ణయం తీసుకొందని దానిని మార్చడం వీలుకాదని ఆయన కుండబ్రద్దలు కొట్టారు.   దేశంలో అత్యంత చవక విమాన టికెట్స్ ప్రవేశపెట్టిన కెప్టెన్ గోపీనాథ్ ఆమాద్మీ పార్టీ సభ్యుడు కూడా. ఆయన కూడా రిటైల్ వ్యాపారంలోకి విదేశీ కంపెనీ పెట్టుబడులను అరవింద్ కేజ్రీవాల్ తెరస్కరించాదాన్ని తప్పు బట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆమాద్మీ పార్టీ కూడా ఇటువంటి చవకబారు ఎత్తుగడలతో ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తే చివరికి అది కూడా మిగిలిన అన్ని పార్టీలలాగే మిగిలిపోతుంది. విదేశీ పెట్టుబడులను వ్యతిరేఖించడం దేశానికి నష్టం కలిగించడమే కాకుండా, భారత్ లో పెట్టుబడులు పెట్టలనుకొంటున్న ప్రపంచ దేశాలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చినట్లవుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు కూడా మారుతాయనే సంకేతం మంచిది కాదు. అందువల్ల ఆమాద్మీ పార్టీ దీర్గకాల విధానాలు అవలంభించ వలసి ఉంటుంది,” అని అన్నారు.