కొత్త పార్టీకి సన్నాహాలు మొదలు?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆయన గట్టిగా ఖండించడం లేదు, అలాగని సమర్దించడం లేదు. అయితే ఆయన మరొక కాంగ్రెస్ నాయకుడు జనవరి 17న స్థాపించబోయే కొత్త పార్టీలో జనవరి 23 తరువాత చేరవచ్చని తెలుస్తోంది.
కానీ నేడో రేపో కొత్త పార్టీ ఆవిర్భావం తధ్యమనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. దానిని బలపరుస్తున్నట్లు, ఈ మధ్య ముఖ్యమంత్రి నిత్యం పలుకుతున్న ‘సమైక్యం మా నినాదం కాదు, మా విధానం’ అనే వాక్యాలతో ఉన్న భారీ ఫ్లెక్సీ బ్యానర్లు, గోడ మీద పెయింటింగ్స్ నిన్నరాత్రి విజయవాడలో పలుచోట్ల సాక్షాత్కరించాయి. అందులో ముఖ్యమంత్రి లేదా మరే రాజకీయనాయకుడి ఫోటో లేదు కానీ ఆంద్రప్రదేశ్ మ్యాప్ తో పాటు, పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణరావు, తెలుగు తల్లి బొమ్మలున్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా, మొదటి నుండి ఆయన సమైక్యవాదాన్ని బలంగా సమర్దిస్తున్న విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పడవచ్చనిపిస్తోంది. ఆయనే ఈ పోస్టర్స్, బ్యానర్స్ కట్టించి ఉండవచ్చును. అదేవిధంగా ఈ బ్యానర్లను తగిలించుకొని విజయవాడలో కొన్ని ప్రచార రధాలు కూడా తిరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇదేవిధమయిన ఫోటోలు, వ్యాక్యాలు కలిగిన టీ షర్టు కోసం ఒక ప్రముఖ బట్టల కంపెనీకి భారీ ఎత్తున ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదంతా చూస్తుంటే బహుశః జనవరి 17న కొత్త పార్టీకి సన్నాహాలుగా కనిపిస్తున్నాయి. బహుశః రేపు, ఎల్లుండిలోగా కొత్త పార్టీపై మరికొంత స్పష్టత రావచ్చును. ఒకవేళ కొత్త పార్టీ ఏర్పడితే, సీమాంధ్రలో మళ్ళీ రాజకీయ వలసలు పెద్ద ఎత్తున మొదలవవచ్చును.