ఎన్నికల తరువాత చిరంజీవి రాజకీయాలకు రామ్ రామ్?
posted on Jan 16, 2014 6:25AM
సినీ రంగంలో రారాజుగా వెలుగుతున్నమెగాస్టార్ చిరంజీవి, తను పార్టీ పెట్టడమే తరువాయి నందమూరి వారిలా ఏడాది తిరక్కుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవచ్చుననే ఆశతో రాజకీయాలలో అడుగుపెట్టారు. ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టి కేంద్రమంత్రి అవగలిగారు. అదేమీ దురదృష్టమో కానీ, కేంద్రమంత్రి పదవిలో ఉన్నమజాని పూర్తిగా అస్వాదించక మునుపే, రాష్ట్ర విభజన అంశం మెడకు చుట్టుకోవడంతో, కష్టపడి ముచ్చటపడి సంపాదించుకొన్న కేంద్రం మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లు మాట్లాడినా, సీమాంధ్ర ప్రజల నమ్మకాన్నికోల్పోయారు. అదే కారణంతో తెలంగాణా ప్రజలకు కూడా దూరమయ్యారు.
ఇక ప్రస్తుతం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాలే పరిస్థితి లేకపోవడంతో, సీనియర్లే తలోపార్టీ వైపు పరుగులు తీస్తుంటే చిరంజీవి పరిస్థితి ఊహించవచ్చును. పోనీ త్వరలో ముఖ్యమంత్రో మరొకరో పెట్టబోయే కొత్త పార్టీలోకి మారుదామంటే, గతంలో సోనియాగాంధీతో మంచి టచ్చులో ఉన్నపుడు ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా చాలా పిర్యాదులు చేయడంతో, ఆయనతో సంభందాలు దెబ్బతినడం వలన ఆ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి. పోనీ కాంగ్రెస్ అధిష్టానాన్నే నమ్ముకొందామన్నా,ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు మోడీ పుణ్యమాని కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేపరిస్థితులు కనబడటం లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా తనకు కలిసిరాని రాజకీయాలలో కొనసాగడం కంటే మళ్ళీ సినీ పరిశ్రమకు తిరిగి వెళ్ళిపోవడమే మంచిదని తలచారో లేక ఎన్నికల తరువాత ఖాళీగా కూర్చొనే బదులు ఏవో నాలుగు సినిమాలు తీసుకొంటూ పోయిన చోటనే ఉంగరం(పరువు) వెతుకోవడం మేలని భావించారో తెలియదు కానీ, ఎన్నికల తరువాత తన 150వ సినిమా చేసేందుకు ఆలోచిస్తున్నాని చిరంజీవి తాజా స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించుకొన్నపేరు ప్రతిష్టలు, లక్షలాది అభిమానులను కేవలం మూడు సంవత్సరాలలో పోగొట్టుకొన్న మెగాజీవికి బహుశః అంతకంటే వేరే దారి ఉండబోదు కూడా!