ముఖ్యమంత్రి చాలా మంచోడు: దిగ్విజయ్ సింగ్
posted on Feb 8, 2014 @ 1:40PM
కాంగ్రెస్ చరిత్రలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాగ ఇంతవరకు మరే ముఖ్యమంత్రి కూడా తన అధిష్టానం మీద ఇంతగా తిరుగుబాటు చేసి ఉండరు. అదేవిధంగా అధిష్టానం కూడా మరే ముఖ్యమంత్రిని ఇంతగా వెనకేసుకొచ్చిన దాఖలాలు లేవు. పార్టీని వ్యతిరేఖించడం, పార్టీ నిర్ణయాన్నివ్యతిరేఖించడం రెండూ వేర్వేరు అంశాలనే సరికొత్త సిద్దాంతాన్నికాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి కలిసి కనిపెట్టారు. ఆ సిద్ధాంతం ప్రకారం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించడం, దానిని తప్పుపట్టడం, తీర్మానాలు చేయడం, డిల్లీలో ధర్నాలు చేయడం అన్నీ కూడా అభిప్రాయ వ్యక్తీకరణ పద్ధులోనే రాసుకోబడుతాయి తప్ప పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన ఖాతాలో నమోదు చేయబడవని ఆ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇవ్వాళ మరోమారు స్పష్టం చేసారు. అయితే ఈ సిద్ధాంతం టీ-కాంగ్రెస్ నేతలకి బొత్తిగా అర్ధం కాలేదో లేక అర్ధమయినప్పటికీ అర్ధంకానట్లు నటిస్తూ కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతున్నారో తెలియదు.
దిగ్విజయ్ సింగ్ ఈరోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం పార్టీ తీసుకొన్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మాత్రమే వ్యతిరేఖిస్తున్నారు. ఆయన మొదట నుండి సమైక్యవాది గనుకనే తన నిరసనను తెలియజేసేందుకు మొన్న డిల్లీలో ధర్నా చేసారు. మేమే మా పార్టీ సభ్యులందరికీ రాష్ట్ర విభజన అంశంపై నిస్సంకోచంగా మాట్లాడమని, తమ తమ అభిప్రాయాలను చెప్పమని కోరాము. అటువంటప్పుడు తన అభిప్రాయం చెపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి, క్రమశిక్షణ ఉల్లంఘించారని భావించలేము. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కానీ, సోనియాగాంధీని గానీ ఎన్నడూ వ్యతిరేఖించలేదు” అని అన్నారు.
దిగ్విజయ్ సింగ్ చెపుతున్న ప్రకారం చూసినట్లయితే, అధిష్టానం ఆదేశాల ప్రకారమే ముఖ్యమంత్రి నడుచుకొంటున్నారని స్పష్టమవుతోంది. ఆయన అధిష్టానానికి వ్యతిరేఖంగా చేస్తున్నసమైక్య ప్రసంగాలు, విమర్శలు, తీర్మానాలు, ధర్నాలు అన్నీ కూడా అధిష్టానం అనుమతితోనే జరుగుతున్నాయని దిగ్విజయ్ సింగ్ చెప్పకనే చెప్పారు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎటువంటి డోకా లేదని కూడా అర్ధమవుతోంది.
ఆయన డిల్లీలో ధర్నా చేసి పార్టీ పరువు మంట గలిపినందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై చాలా ఆగ్రహంతో ఉందని, అందువల్ల రాజ్యసభ ఎన్నికల తరువాత ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నుండి తప్పిస్తారని మీడియాలో వచ్చిన వార్తలు కూడా నిజం కావని దిగ్విజయ్ తాజాగా ఇచ్చిన సర్టిఫికేట్ దృవీకరిస్తోంది. అందువల్ల కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి తనంతట తాను ఆట డిక్లేర్ చేసేసి తప్పుకొంటే తప్ప ఆయనకి ఇంకా చాలా లాస్ట్ బాల్స్ ఆడుకోవచ్చని థర్డ్ ఎంపైర్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేసారు.
ఇక ఇంతకాలం సమైక్యమంటూ ఊగిపోయిన మంత్రి గంటా శ్రీనివాసరావు కొత్త పార్టీ గురించి ఇప్పుడేమీ ఆలోచన చేయడం లేదని చెప్పడం చూస్తే,కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ నిరాశపరుస్తూ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయిపోతారా అనే అనుమానం కలుగుతోంది.