రాహుల్ కోసం ప్రత్యర్ధి మద్దతు కోరుతున్న కాంగ్రెస్
posted on Feb 8, 2014 @ 7:25PM
తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడే బీజేపీ అసలు రంగు బయటపడుతుందని దిగ్విజయ్ సింగ్ వ్యాక్యానించారు. అయితే, బిల్లులో ఏముందో కూడా తెలుసుకోకుండా బిల్లుకి మద్దతు ఇస్తామని ఏవిధంగా హామీ ఈయగలమనే బీజేపీ ప్రశ్నకూడా సమంజసమే.
అత్యంత పారదర్శకంగా జరుగవలసిన రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగా తన వైఖరి, తన ఆలోచనలు, తన నిర్ణయాలు ప్రకటించకుండా గోప్యత పాటిస్తూ ప్రతిపక్షాల వైఖరి చెప్పమని కోరుతూ వాటిని ఇరుకున బెట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే దేశంలో నేడు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని మెచ్చుకోలేకపోతున్నాయి. అందుకే నేడు ఆ పార్టీ తన రాజకీయ ప్రత్యర్ధుల గుమ్మం ముందు నిలబడి వారి సాయం అర్ధించవలసి వస్తోంది. స్వంత పార్టీ వారే బిల్లుకి మద్దతు ఈయబోమని చెపుతున్నపుడు తన రాజకీయ ప్రత్యర్దులను కాంగ్రెస్ అధిష్టానం ఏమొహం పెట్టుకొని మద్దతు అడగ గలుగుతోందో దానికే తెలియాలి. రాహుల్ గాంధీని ప్రధానికుర్చీలో కూర్చోబెట్టేందుకు, రాష్ట్రం నుండి అవసరమయిన యంపీ సీట్లు పొందేందుకే రాష్ట్ర విభజనకు పూనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకు తన రాజకీయ ప్రత్యర్ధి బీజేపీ మద్దతు కోరడం మరీ సిగ్గు చేటు.
చివరికి తన స్వంత పార్టీ నేతలచేతే చ్చీ కొటించుకొంటున్నా దాని వైఖరిలో మార్పు కలగలేదు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో సహా పార్టీ నేతలందరూ డిల్లీలో తన కంటెదురుగా ధర్నా చేసినా దానిని అవమానంగా భావించకపోగా నిర్లజ్జగా సమర్ధించుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికే చెల్లు. తన ఈ ఆశయం నెరవేర్చుకోవడం కోసం స్వంత పార్టీ నేతలని, వారి రాజకీయ భవిష్యత్తుని కూడా బలిపెట్టేందుకు సిద్దపడిన కాంగ్రెస్ అధిష్టానం, అసలేమీ జరగనట్లుగా సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు బిల్లుకి మద్దతు ఇస్తారని భావిస్తున్నానని దిగ్విజయ్ సింగ్ పలకడం సిగ్గుచేటు.
కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వలన నేడు ఆ పార్టీ నేతలు ప్రజల ముందు తలెత్తుకొని తిరుగలేకపోతున్నారు. ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సాహసించడం లేదు. చెట్టుకొకరు, పుట్టకొకరు చొప్పున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెల్లాచెదురయిపోతున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం తన ఆశయం మరువలేదు. తన పంతం వీడలేదు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లుగా మొండిగా ముందుకు పోతోంది. వినాశకాలే విపరీత బుద్ది అన్నారు పెద్దలు. అందుకే కాంగ్రెస్ తన స్వంత పార్టీనే పణంగాపెట్టి ఈ విభజన జూదం ఆడుతోంది. తను ఏ అంశంతో కేంద్రంలో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని భావిస్తోందో, అదే అంశం ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారబోతోంది.