దగ్గుబాటి ఓటేందుకు వేయలేదు
posted on Feb 7, 2014 @ 12:26PM
కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఈరోజు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో పార్టీ నిలబెట్టిన అభ్యర్దులెవరికీ ఓటేయకుండా తిరస్కరించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా తమ పార్టీ రాష్ట్ర విభజన చేస్తున్నందుకు నిరసనగానే తాను పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులకు ఓటు వేయకుండా తిరస్కరించి తన నిరసన వ్యక్తం చేసానని తెలిపారు. ఆయన ఈవిధంగా ప్రజాస్వామ్యబద్దంగా తనకున్న హక్కుని వినియోగించుకొని నిరసన తెలపడం అభినందనీయం.
రాష్ట్రాన్నిసమైఖ్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర నేతలందరూ పార్టీపై పోరాటం చేస్తూనే, రాజ్యసభ టికెట్స్ కోసం అర్రులు చాచడం, తిరుగుబాటు అభ్యర్ధుల కారణంగా ఎన్నికలలో ఓడిపోతామేనని విలపించడం, ఆ తరువాత ముఖ్యమంత్రితో సహా అందరూ కలిసి తాము ఏ అధిష్టానానికి వ్యతిరేఖంగా పోరాడుతున్నారో ఆ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్ధులని గెలిపించుకోవడం కోసమే, సమైక్యవాదుల తరపున పోటీలో నిలబడిన తిరుగుబాటు అభ్యర్ధి చైతన్యరాజుని అప్రదిష్ట పాలుచేసి, చివరికి పోటీలో నుండి బలవంతంగా విరమింపజేయడం అందరం కళ్ళారా చూసాము. కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాత్రం, నిర్భీతిగా, నిర్ద్వందంగా పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులను తిరస్కరించగలిగారు.
అయితే, ఆయన భార్య మరియు కేంద్రమంత్రి అయిన దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర విభజన అనివార్యమని భావిస్తూ సీమాంధ్ర కోసం కేంద్రాన్ని ప్యాకేజీలు కోరుతున్నారు. కానీ, ఆయన ఆమెను ఎందుకు వారించడం లేదో తెలియదు. రాష్ట్ర విభజనపై వారిరువురు ఏనాడు తమ ఉమ్మడి నిర్ణయం లేదా అభిప్రాయం ప్రకటించిన దాఖలాలు లేవు గనుక, ఆమె తన భార్య అయినప్పటికీ, ఆమె అభిప్రాయాలను గౌరవిస్తూ ఆ విషయాన్ని ఆమె విజ్ఞతకే వదిలిపెట్టారనుకోవలసి ఉంటుంది.
ఇక ఆయన సుబ్బిరామి రెడ్డిని తిరస్కరించడానికి కారణం అందరికీ తెలిసిందే. వైజాగ్ లోక్ సభ సీటు కోసం సుబ్బిరామి రెడ్డి, పురందేశ్వరికి పొగబెట్టే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంగా ఆయనకీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు మధ్య జరిగిన గొడవ కోర్టులో పరువు నష్టం దావా వేసుకొనే వరకు వెళ్ళింది. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు దగ్గుబాటి ఆయనకే ఓటువేస్తారని ఆశించలేరు. ఇక యం.ఏ.ఖాన్, కేవీపీలకి ఓటు వేయపోవడానికి కారణం మాత్రం ఆయన చెప్పిన కారణమే అయి ఉండవచ్చును.