కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనం కాబోదు: కేసీఆర్
posted on Mar 3, 2014 @ 9:03PM
దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన తెరాస పోలి బ్యూరో సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనం, పొత్తులపైనే ప్రధానం చర్చ జరిగింది. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోదని ప్రకటించారు. సమావేశంలో మాట్లాడిన దాదాపు 85మంది పార్టీ నేతలు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేఖించినందున ఇక విలీనం ప్రసక్తి లేదని ఖరాఖండీగా ప్రకటించేశారు. ఇక కే.కేశవ్ రావు అధ్యక్షతన ఏర్పడే కమిటీ కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ పార్టీలతో ఎన్నికల పొత్తుల గురించి ఒక నిర్ణయం తీసుకొంటుందని ఆయన ప్రకటించారు. అందువల్ల ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం కానీ, ఎన్నికల పొత్తులు కూడా లేనట్లే స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీ విలీనం కాకూడదని నిర్ణయం వెనుక బలమయిన కారణాలు చాలానే ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అవి ప్రధానంగా:
1. రాష్ట్రవిభజన/తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెరాసను పరిగణనలోకి తీసుకోలేదు. అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకొంది.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినట్లే, తెలంగాణాలో వెనుకబడిన 8 జిల్లాలకు మేము ప్రత్యేక ప్రతిపత్తి కోరితే కాంగ్రెస్ అధిష్టానం మా మాట పట్టించుకోలేదు.
3. అదేవిధంగా పోలవరానికి జాతీయ హోదా కల్పించినట్లే తెలంగాణాలోని చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించమని మేము చేసిన విజ్ఞప్తిని కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు.
4. తెలంగాణా రాష్ట్రం ఏర్పరుస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద వచ్చే ఏడూ మండలాలను సీమంధ్రలో కలుపుతూ ఏకపక్షంగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.
5. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తూనే ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాదుపై సర్వాదికారాలను గవర్నర్ చేతికి అప్పగించావద్దని మేము చేసిన విజ్ఞప్తులను కాంగ్రెస్ అధిష్టానం పేద చెవిన పెట్టింది.
6. ఇక మా పార్టీపై కేంద్రమంత్రి జైరాం రమేష్ చేసిన అనుచిత వ్యాక్యలు మమ్మల్ని చాలా భాదించాయి.
కలిసి పనిచేద్దామని కోరుతూనే, మా పార్టీ నుండి బహిష్కరించిన నేతలని కాంగ్రెస్ లో చేర్చుకోవడం మేము ఖండిస్తున్నాము. “చెప్పాలంటే ఇంకా ఇటువంటి వంద కారణాలున్నాయి. ఇంతకాలంగా కాంగ్రెస్ నేతలు మా పార్టీని మమ్మల్నీ ఎంతగా అవమానించినప్పటికీ, మావల్ల తెలంగాణా బిల్లు ఆగిపోకూదదనే ఉద్దేశ్యంతోనే భరించాము. కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు మాపట్ల ఇంత అనుచితంగా,నిర్లక్ష్యంగా వ్య్వహరిస్తున్నపుడు మేము వారితో కలవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇక ముందు కూడా తెరాస స్వంతంత్రంగా పనిచేస్తూ ఎన్నికలలో పోటీ చేస్తుంది. తెలంగాణా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుల విషయం కేశవ్ రావు అధ్యక్షతన పనిచేసే కమిటీయే నిర్ణయిస్తుంది,” అని కేసీఅర్ స్పష్టం చేసారు.