సీమాంధ్రలో చక్కర్లు కొడుతున్న డిల్లీ నేతలు
posted on Mar 3, 2014 @ 3:32PM
గత మూడునాలుగేళ్ళుగా రాష్ట్రం రావణకాష్టంలా రగులుతున్నా, లక్షలాది ప్రజలు రోడ్లమీధకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, డిల్లీ నుండి రెక్కలు కట్టుకొని వచ్చి రాష్ట్రంపై వాలిపోయారు. ఒకరు రాష్ట్రవిభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ కాగా, మరొకరు రాజ్యసభలో తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చిన వెంకయ్య నాయుడు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా తెలంగాణా కోసం తెలంగాణా ప్రజలు పోరాడుతున్నపుడు ఈ ప్రజా ప్రతినిధులు ఇద్దరూ ఈ సమస్య పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపలేదు. వందలాది అమాయకులయిన యువకులు తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొంటున్నపుడయినా స్పందించిన పాపానపోలేదు. కానీ ఇప్పుడు తెలంగాణా మేమే ఇచ్చామంటే, కాదు మేమే తెచ్చామని క్రెడిట్ కోసం కొట్లాడుకొంటున్నారు.
ఏనాడూ సీమాంధ్ర ప్రజలను పరమార్శించడానికి కూడా రాని జైరాం రమేష్ ఇప్పుడు సీమాంధ్రలోనే చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్ర విభజన సంగతి పక్కనబెట్టి, తాము విదిలించబోయే తాయిలాలు కావాలంటే తమ పార్టీకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి, శాసనసభకు, కేంద్రమంత్రులకు పూచికపుల్లెత్తు విలువీయకపోయినా సీమాంధ్ర ప్రజలందరూ తమ కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించమని కోరుతున్నారు. ఇంక వెంకయ్య నాయుడు మరొక అడుగు ముందుకు వేసి తన ప్రాస బాషలో అలవోకగా ఉపన్యాసాలు దంచుతూ, గతంగతః అని జరిగినదంతా ఒక పీడకలగా మరిచిపోయి, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీకే ఓటేయమని కోరుతున్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్నంత కాలం రాష్ట్రంలో అడుపెట్టని
ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు రాష్ట్రంలోనే ఎందుకు తిరుగుతున్నారంటే వారి అగ్ర నేతలు నరేంద్ర మోడీ, సోనియా రాహుల్ గాంధీలు పర్యటనకు రంగం సిద్దం చేయడానికే. త్వరలో మోడీ రాష్ట్ర పర్యటన చేయబోతున్నట్లు ఖరారయింది. ఇక సోనియా, రాహుల్ గాంధీలు ఎప్పుడు తెలుగు ప్రజలను అనుగ్రహిస్తారో చూడాలి.