మోడీ గొంతుకి ఏమైంది?

      భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గొంతు బొంగురుపోయింది. ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించినప్పటి నుంచి నరేంద్ర మోడీ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూనే వున్నారు. రోజుకి అయిదారు బహిరంగ సభల్లో మాట్లాడుతూనే వున్నారు. ఇంకా పార్టీ మీటింగ్స్ లో, తనను కలవటానికి వచ్చేవారితో మాట్లాడ్డం అదనం. సోమవారం నాడు బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోడీ మాట్లాడినప్పుడు ఆయన గొంతు బొంగురుపోయి వినిపించింది. మాట్లాడేది నరేంద్ర మోడీయేనా అనిపించేలా ఆయన గొంతు మారిపోయింది. ఎన్నికల ప్రచారం మరింత వేడి పుంజుకుంటున్న సమయంలో మోడీ గొంతు బొంగురుపోతూ వుండటం పట్ల భాజపా శ్రేణులు కలవరపడుతున్నాయి. మోడీ గొంతులోంచి వచ్చే తూటాల్లాంటి మాటల ప్రభావం గొంతు పాడవటం వల్ల తగ్గిపోయే ప్రమాదం వుందని అంటున్నారు. మోడీ దీని నివారణకు తగిన వైద్య సహకారం తీసుకోవాలని కోరుకుంటున్నారు.

టీడీపీ ఫస్ట్ లిస్ట్

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లోక్‌సభ, శాసనసభలకు తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 27 అసెంబ్లీ, 3 పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు. మోడీ నాయకత్వాన్ని బలపరచడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పారు. పొత్తు కారణంగా పార్టీలోని కొంతమందికి న్యాయం జరగలేదని, వారికి భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు విడుదల చేసిన మొదటి జాబితా ఇదే..   టీ.టీడీపీ అభ్యర్ధులు వీరే... బాన్సువాడ- రెడ్యానాయక్‌ బాల్కొండ- ఏలేటి మల్లికార్జునరెడ్డి బోధన్‌- ప్రకాశ్‌రెడ్డి జగిత్యాల- ఎల్‌.రమణ మంథని- కర్రు నాగయ్య పెద్దపల్లి- విజయరమణారావు మానుకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ నారాయణఖేడ్‌-విజయపాల్‌రెడ్డి జహీరాబాద్‌- నరోత్తమ్‌ గజ్వేల్‌- ప్రతాప్‌రెడ్డి కూకట్‌పల్లి- మాధవరపు కృష్ణారావు ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి రాజేంద్రనగర్‌- ప్రకాశ్‌గౌడ్‌ తాండూరు- ఎం.నరేష్‌ సనత్‌నగర్‌- తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చాంద్రాయణగుట్ట- ప్రకాశ్‌ ముదిరాజ్‌ అచ్చంపేట- పి.రాములు దేవరకొండ- బిల్యా నాయక్‌ మిర్యాలగూడ- వెంకటేశ్వర్లు హుజూర్‌నగర్‌- వంగాల స్వామిగౌడ్‌ సూర్యాపేట- పటేల్‌ రమేష్‌రెడ్డి భువనగిరి- ఉమామాధవరెడ్డి మహబూబాబాద్‌- బాలూచౌహాన్‌ నర్సంపేట- రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల- చల్లా ధర్మారెడ్డి ములుగు- ధనసరి అనసూయ(సీతక్క) టీ.టీడీపీ లోక్‌సభ అభ్యర్థులు: ఆదిలాబాద్- రమేష్‌రాథోడ్‌ జహీరాబాద్‌- మదన్‌మోహన్‌రావు మహబూబాబాద్‌- బానోతు మోహన్‌లాల్‌

టీఆర్ఎస్ టిక్కెట్: పైసలుంటే చాలు భై!

      టీఆర్ఎస్‌లో టిక్కెట్ కావాలంటే పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినవాళ్ళు, త్యాగాలు చేసినవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదని, బాగా డబ్బుండాలి, లేదా వేరే పార్టీకి చెంది వుండాలని టీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. కేసీఆర్ విడుదల చేసిన మొదటి, రెండు లిస్టులను చూసి కడుపు మండిన తెరాస నాయకులు సొంత పార్టీ మీద, పార్టీ నాయకుడు కేసీఆర్ మీద గుర్రుగా వున్నారు. కేసీఆర్ విడుదల చేసిన రెండు లిస్టుల్లోనూ సగానికి పైగా పార్టీకి చెందని వారు, బాగా డబ్బుండి సడెన్‌గా ఊడిపడినవారే వున్నారని  విమర్శిస్తున్నారు. డబ్బులుంటే చాలు సీటు ఇచ్చే పరిస్థితి టీఆర్ఎస్‌కి రావడం బాధాకరమని అంటున్నారు. పార్టీ కోసం జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని, పార్టీని అభివృద్ధి చేయడానికి నిద్రాహారాలు మాని కృషి చేసిన వారికి మొండిచెయ్యి చూపించారని విమర్శిస్తున్నారు. ఇలా మోసం చేసిన పార్టీకి ఈ ఎన్నికలలో సహకరించడానికి మనసు రావడం లేదని అంటున్నారు.

రాష్ట్ర విభజన: కేంద్రానికి హైకోర్టు నోటీసు!

      రాష్ట్ర విభజన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం మే మొదటి వారంలో విచారించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో విభజన మీద అనేక కేసులు దాఖలయ్యాయి. అయితే హైకోర్టు ఈ దశలో ఈ అంశపై కేసులు తీసుకోలేమని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు రాష్ట్ర విభజన కేసుల విషయంలో స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది ఒక శుభపరిణామమని సమైక్యవాదులు అంటున్నారు.

మళ్ళీ కాంగ్రెస్‌లోకి ఆకుల రాజేందర్

      కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ మళ్ళీ పార్టీ మారారు. ఈసారి ఆయన తన సొంత పార్టీ కాంగ్రెస్‌లోకే చేరారు. పది రోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి మారిన ఆకుల రాజేందర్ పేరును టీఆర్ఎస్ తన తొలి జాబితాలో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే మందకష్ణ మాదిగ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆకుల రాజేందర్ ఇప్పడు మళ్ళీ కాంగ్రెస్‌లో చేరి సంచలనం సృష్టించారు. దీంతో ఆయనకు మళ్ళీ మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ ఆయనకి ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. అయితే ఇక్కడో తిరకాసు వుంది. మల్కాజిగిరి తెలుగుదేశం నాయకుడు ఈరోజే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకి మల్కాజిగిరి ఎమ్మెల్యే స్థానం నుంచి టిక్కెట్ ఇవ్వనున్నట్టు దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. తాజాగా ఆకుల రాజేందర్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో ఇప్పుడు మల్కాజిగిరి టిక్కెట్ కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి ఇస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

తిరస్కరణ ఓటుకీ గుర్తు: హైకోర్టు

      ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ వుంటారు. ఈసారి ఎన్నికలలో ‘ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు’ అనే ఆప్షన్ కూడా ఉంది. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. దీన్ని ఇంగ్లీషులో ‘నోటా’ అని పిలుస్తున్నారు. నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లో ‘నోటా’ ఆప్షన్ కూడా వుంచారు. అయితే గ్రామీణులకు ఈ ఆప్షన్ అర్థం కాలేదు. అందుకే హైకోర్టు జోక్యం చేసుకుని, త్వరలో జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో నోటా ఆప్షన్ మీటకి ఒక గుర్తును కేటాయించాలని, దానివల్ల నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రజలు ఆ ఆప్షన్‌ని వినియోగించుకునే అవకాశం వుంటుందని హైకోర్టు ఎన్నికల కమిషన్‌కి సూచించింది. ‘నోటా’ ఓటుకి ఎన్నికల కమిషన్ ఏ గుర్తును కేటాయిస్తుందో చూడాలి.

కిరణ్ కి సాయిప్రతాప్ బైబై

      మాజీ క్రికెటర్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీలో వికెట్లు టపటపా పడిపోతున్నాయి. కిరణ్‌ పార్టీ పెట్టడానికి ఉత్సాహం ఇచ్చి, కాంగ్రెస్‌లో నుంచి బయటకి రావడానికి కారణమైన వాళ్ళందరూ ఇప్పుడు మెల్లగా బయటకి జారుకుంటున్నారు. నిన్నగాక మొన్న పితాని సత్యనారాయణ జారుకుంటే, ఇప్పుడు రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ వికెట్ పడింది. పార్టీకి ఉపాధ్యక్షుడు కూడా అయిన సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాజంపేట నుంచి మళ్ళీ కాంగ్రెస్ టిక్కెట్ పొందబోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మారడం వెనుక సాయి ప్రతాప్ వ్యూహమేంటో అర్థం కావడం లేదు. జై సమైక్యాంధ్ర పార్టీలోనే వుంటే ఎన్నికలలో ఓడిపోయినా పరువు దక్కి వుండేది. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఓటమి దక్కడంతోపాటు జనాల్లో పరువు కూడా పోతుంది.

కాంగ్రెస్‌లోకి మైనంపల్లి

      తెలుగుదేశం, బీజేపీ మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు వల్ల కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే నరసరావుపేట అసెంబ్లీ సీటు విషయంలో కోడెల శివప్రసాదరావు నుంచి అలకని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి మరో సమస్య వచ్చిపడింది. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లోని మల్కాజిగిరి శాసనసభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వున్న మైనపల్లి హనుమంతరావు ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో హర్టయ్యారు. వెంటనే కాంగ్రెస్ తలుపులు తట్టారు. దాంతో ఢిల్లీ నుంచి ఆయనకి పిలుపు రావడం, ఢిల్లీకి వెళ్ళడం, దిగ్విజయ్ సింగ్‌ని కలవటం, కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగిపోయాయి. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు.

టీడీపీ, బీజేపీ పొత్తు: ఫ్రస్టేషన్‌లో టీఆర్ఎస్

      టీడీపీ, బీజేపీ పొత్తు కుదరడంతో రెండు పార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కూడ ఈ కలయిక దేశానికి మేలు చేసేదని అంటున్నారు. అయితే రాష్ట్రంలోని మిగతా పార్టీలు మాత్రం ఫ్రస్టేషన్‌లో పడిపోయాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఏడుస్తుంటే, ఉప ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో ఏడుస్తోంది. అలా పొత్తు కుదిరిందో లేదో ఇలా ప్రెస్‌మీట్ పెట్టేసిన హరీష్‌రావు తన ఫ్రస్టేషన్‌ని, టీఆర్ఎస్‌ నాయకుల ఫ్రస్టేషన్‌ని బయట పెట్టేశారు. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం అదేదో దారుణం అన్నట్టుగా మాట్లాడారు. కాసేపు చంద్రబాబుని తిట్టి తన బీపీని తగ్గించుకున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా వుంటే బాగుండేదని బీజేపీకి హితవు చెప్పారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు తెలంగాణలో తమ పుట్టిని పూర్తిగా ముంచేసే అవకాశం వుందని టీఆర్ఎస్ భయపడుతోందన్న విషయం అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

జగన్ అవినీతి తెలియదు: దినేష్‌రెడ్డి

      పదవిలో ఉన్నంతకాలం బాగానే సంపాదించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ పోలీస్ బాస్ దినేష్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చకున్న విషయం తెలిసిందే. వైకాపా తీర్థం పుచ్చుకోగానే దినేష్‌రెడ్డి పక్కా రాజకీయ నాయకుడిలా మాట్లాడ్డం మొదలెట్టేశారు. ఈసారి ఎన్నికలలో మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న దినేష్‌రెడ్డి జగన్‌ని ప్రసన్నం చేసుకోవడానికి పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఆ ప్రయత్నాలో భాగంగానే ఆయన జగన్‌ని బుద్ధిమంతుడు అని అనేశారు. జగన్ అమాయకుడట. అవినీతి అంటే అస్సలు జగన్‌కి ఎంతమాత్రం తెలియదని అంటున్నారు. జగన్‌కి వ్యతిరేకంగా నమోదైన కేసులన్నీ దురుద్దేశ పూరితంగా పెట్టినవేనని ఆయన అన్నారు. పాపం దినేష్‌రెడ్డి అమాయకుడైనా అయి వుండాలి లేదా జనాన్ని అమాయకులని అనుకుంటూ అయిన వుండాలి.

బీజేపీ మేనిఫెస్టో: శ్రీరామనవమి గిఫ్ట్!

      భారతీయ జనతాపార్టీ శ్రీరాముడికి శ్రీరామనవమి కానుకని తన మేనిఫెస్టోలో ప్రకటించింది. రామాలయ నిర్మాణ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని, నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే మైనారిటీల అభ్యున్నతికి తమ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. 52 పేజీలున్న మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ విడుదల చేశారు. దేశప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బీజేపీ మేనిఫెస్టో వుందని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో తయారీ కోసం మురళీ మనోహర్ జోషీ ఆధ్వర్యంలోని 17 మంది సభ్యులతో కూడిన కమిటీ పనిచేసింది. ఉపాధి కల్పన – పోలీసుల, న్యాయ పరిపాలన విభాగాల్లో సంస్కరణలు – మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం – అందరికీ ఆహార భద్రత – బ్లాక్ మనీ నివారణ – బ్రాండ్ ఇండియా రూపకల్పన – ప్రతి ఒక్కరికీ సాగు – తాగు నీరు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.

వైకాపాలో చేరిన దినేష్ రెడ్డి

      మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఈరోజు వైకాపాలో చేరారు. వైకాపా అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆయన ఈరోజు లోటస్ పౌండ్ లో పార్టీ సభ్యతం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్ రెడ్డి ఈ సారి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. తాను మల్కాజ్ గిరీ నుండి లోక్ సభకు పోటీ చేస్తానని జగన్ కోరినట్లు సమాచారం. వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తాను దగ్గరగా చూశానని,ఆయన ప్రజల కోసం,ముఖ్యంగా పేదల కోసం ఎంతగా తపనపడ్డారో తనకు తెలుసునని దినేష్ రెడ్డి అన్నారు. ఆయన కుమారుడు జగన్ నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని నమ్ముతున్నానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచి అయినా పోటీచేస్తానని ఆయన తెలిపారు.

తొలిసారిగా లోక్ సభ బరిలో నారాయణ

  కాంగ్రెస్-సీపీఐల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తులలో భాగంగా సీపీఐకు దక్కిన ఖమ్మం సీటు నుండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మొట్టమొదటి సారిగా లోక్ సభకు పోటీ చేయబోతున్నారు. సీపీఐ పార్టీకి స్టేషన్ ఘనపూర్, రామగుండం,బెల్లంపల్లి, మహేశ్వరం దేవరకొండ, పినపాక, కొత్తగూడెం, వైరా, మునుగోడు, అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కాయి. గుండా మల్లేష్:                      బెల్లంపల్లి కూనంనేని సాంబశివరావు          కొత్తగూడెం పల్లా వెంకటరెడ్డి                      మునుగోడు రమావత్ రవీంద్రకుమార్           దేవరకొండ డాక్టర్ మూడు నారాయణ          వైరా తోలెం రమేష్‌                         పినపాక  

బీజేపీతో పొత్తు-కోడెల సీటుకు ఎసరు

  తెదేపా-బీజేపీల పొత్తులో భాగంగా మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నగుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గాన్ని బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలియడంతో ఆయన తీవ్ర ఆగ్రహం చెందారు. “మా రెండు పార్టీల మధ్య పొత్తులు కోరుకొనే వాళ్ళల్లో నేనే మొదటివాడిని. రాష్ట్రంలో చంద్రబాబు, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ అధికారం చెప్పట్టాలని నేను కోరుకొంటున్నాను. కానీ బీజేపీ తను బలంగా లేని, గెలవలేని స్థానాలకు కూడా పట్టుబట్టడం వలన రెండు పార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. దానివల్ల ప్రత్యర్ధ పార్టీలు లాభపడతాయి. అందువల్ల బీజేపీ తెదేపా నుండి వీలయినన్ని ఎక్కువ సీట్లు రాబట్టుకొనే ప్రయత్నం చేయడం కంటే, తను గెలవగలిగే సీట్లను మాత్రమే తీసుకొంటే మంచిది. తెదేపా ఖచ్చితంగా గెలవగల యంపీ సీట్లను, బీజేపీ బలవంతంగా తీసుకొని పోటీలో ఓడిపోయినట్లయితే దాని వలన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి అన్ని సీట్లు తక్కువ పడతాయి. అంతే గాక మేమూ నష్టపోతాము. ఇదివరకు జరిగిన ఎన్నికలలో కూడా ఈ సంగతి రుజువయ్యింది. అందువల్ల రాష్ట్రంలో, దేశంలో ప్రతీ ఒక్క సీటు కూడా చాలా విలువయినదేనని బీజేపీ నేతలు గుర్తించి అందుకు అనుగుణంగా తమకి బాగా బలం ఉన్నసీట్లను మాత్రమే తీసుకోవడం మేలు. లేకుంటే వారూ నష్టపోతారు,” అని అన్నారు.   గత ఐదు ఎన్నికలలో ఏకధాటిగా నరసరావుపేట నుండి గెలుస్తున్న కోడెలను, బీజేపీ కోసం ఆ సీటు నుండి తప్పించి సత్తెనపల్లి నుండి పోటీ చేయించాలనికోవడం తెదేపాకు నష్టం కలిగించవచ్చును. అయితే బీజేపీ కూడా అదే నియోజక వర్గం కావాలని బిగుసుకు కూర్చోవడంతో తప్పనిసరిగా కోడెలను తప్పించవలసి వస్తోంది. కానీ కోడెల మాత్రం తన నియోజక వర్గం వదిలే ప్రసక్తే లేదన్నట్లు చెపుతున్నారు. అవసరమయితే స్వతంత్ర అభ్యర్ధిగానయినా అక్కడి నుండే పోటీ చేస్తానని చెపుతున్నట్లు సమాచారం. ఇటువంటి సమస్యలే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో అనేక చోట్ల ఉన్నదున త్వరలోనే రెండు పార్టీలలో అలక పాన్పు-బుజ్జగింపు సీన్లు మొదలవుతాఎమో. ఇప్పటికే బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలక పాన్పు ఎక్కగా, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినట్లు తాజా సమాచారం. మున్ముందు ఇంకా ఎంత మంది అలక పాన్పులు ఎక్కుతారో చూడాలి.

జగన్ని కలిసిన అశోక్ బాబు !

  ఒకప్పుడు మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి కనుసన్నలలో పనిచేసిన ఏపీ యన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు, ఒకానొక సమయంలో ఎన్నికలలో పోటీ చేయాలని కూడా చాలా ఉవ్విళ్ళూరారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఆయన అందులో జేరి ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారని అందరూ భావించారు. నిజానికి అశోక్ బాబు, ఆయన వెనుకున్న ఉద్యోగ సంఘాలు, లక్షలాది ఉద్యోగస్తులు, వారి కుటుంబాల పూర్తి మద్దతు తనకే ఉంటుందనే భ్రమ కూడా కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించడానికి ఒక ప్రధాన కారణం. కానీ కిరణ్ పార్టీ పెట్టినప్పటికీ దానికి రాజకీయ నేతల నుండి కానీ, ప్రజల నుండి గానీ ఎటువంటి ఆదరణ లేకపోవడంతో అశోక్ బాబు కూడా మొహం చాటేశారు. ఆయన ఆ తరువాత చంద్రబాబు వైపు వెళ్లేందుకు కూడా చూసారు. కానీ ఎందువల్లో పొసగలేదు. ఈరోజు ఆయన తన ఉద్యోగ సంఘాల నేతలను వెంటబెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కలిసారు. అయితే అందుకు ఆయన చెపుతున్న కారణం నమ్మశక్యంగా లేదు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదులో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులకు తగిన భద్రత కల్పించేందుకు జగన్ కృషి చేయాలని, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతూ మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వాలని కోరేందుకే కలిసారుట. జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి ఉద్యోగుల మద్దతు కోరుతూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తాను కూడా వారిని తన తండ్రి లాగే భద్రంగా చూసుకొంటానని హామీ ఇచ్చారుట. ఇంతకీ అశోక్ బాబు చల్ల కొచ్చి ముంత దాచినట్లుగా తనకి టికెట్ ఇవ్వమని అడిగారో లేదో తెలియనే లేదు. కానీ ఆయన తరువాత చంద్రబాబుని, కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలనుకొంతున్నారుట! దేనికో..?

ఎన్నికల బరిలో దూసుకుపోతున్న తెరాస

తెరాస కాంగ్రెస్,తెరాసల మధ్య పొత్తులు కుదరకపోవడంతో రెండు పార్టీలు తమ తమ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో మజ్లిస్, లోక్ సత్తా, ఆమాద్మీ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఆ మూడు పార్టీలు కూడా ఇప్పటికే తమ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసాయి. ఇక తెదేపా-బీజేపీల మధ్య నిన్న అర్ధరాత్రి వరకు ఎడతెగకుండా సాగిన చర్చలలో ఎట్టకేలకు వాటి మధ్య ఎన్నికల పొత్తులు కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. గనుక, ఇక ఆ రెండు పార్టీలు కూడా తమ తమ అభ్యర్ధుల జాబితాలను నేడో రేపో ప్రకటించితే, ఇక అన్ని పార్టీలు ఎన్నికల రణరంగానికి సిద్దమయిపోయినట్లే!   ప్రస్తుతం తెరాస అభ్యర్ధుల పేర్ల ఖరారు, ఎన్నికల మ్యానిఫెస్టో, ప్రచారంలో మిగిలిన అన్ని పార్టీల కంటే కూడా చాలా ముందంజలో ఉంది. ఇంతవరకు తెరాస ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్దుల జాబితాను పరిశీలించినట్లయితే, వారిలో చాలా మంది గెలుపు గుర్రాలేనని అర్ధమవుతుంది. తెరాస తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా సాధన, పునర్నిర్మాణం అనే మూడు అంశాలతో రేసు గుర్రంలా దూసుకుపోతోంది. కానీ నేడోరేపో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కూడా తమ అభ్యర్ధులను ప్రకటిస్తే, వారితో పోల్చి చూసినప్పడు మాత్రమే తెరాస అభ్యర్ధుల అసలయిన బలాబలాలు తెలుస్తుంది.