తప్పు దిద్దుకుంటున్న పవన్!
posted on Apr 1, 2014 @ 3:10PM
అన్నయ్య చిరంజీవితో పోలిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి ఆలోచన కాస్త ఎక్కువే అనొచ్చు. పైకి ఆవేశంగా కనిపించినా, లోపల ఆలోచన వుందనడానికి ఆధారాలు బయటపడుతున్నాయి. మొదట పవన్ ఆలోచనని ఆవేశం డామినేట్ చేసినా, ఆ తర్వాత ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకుంటాడని అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఆవేశంగా ప్రకటించడం ఆయన చేసిన మొదటి పొరపాటు. పార్టీని ప్రకటించకుండానే తన ఆవేదనను వ్యక్తం చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించే నాయకత్వం గురించి ప్రస్తావించొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తప్పడుగులు వేశాడు. పార్టీని ప్రకటించాకగానీ, పవన్ కళ్యాణ్‌కి పార్టీ పెడితే సరికాదు.. దాన్ని నడపటం, క్షణానికో మాట మార్చే రాజకీయ నాయకులతో వేగటం కష్టమని తెలిసొచ్చింది. దాంతో పార్టీ కార్యకలాపాలను ప్రకటించకుండానే తనలోని ఆవేశానికి విశ్రాంతి ఇచ్చాడు. ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆవేశాన్ని విరమించుకుని ఆలోచనాత్మకంగా వ్యవహరించాడు. తాను ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసి గెలిచేది లేకపోయినా, ఓట్లని చీల్చి సమర్థమైన నాయకత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం వుందని గ్రహించాడు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆయన చేసిన చాలా తెలివైన పని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దాంతోపాటు కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడ్డం కూడా మంచి పరిణామమని అంటున్నారు. రాజకీయాల్లో అనుభవం లేకపోయినా సరైన సమయంలో సరైన విధంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పరిణితిని కనబరిచాడని ప్రశంసిస్తున్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఇప్పటికీ రాజకీయ అపరిపక్వతతో విలసిల్లే చిరంజీవి భవిష్యత్తులో రాజకీయ పాఠాలు నేర్చుకోదలుచుకుంటో ఎవరిదగ్గరకో వెళ్ళడం కాకుండా పవన్ కళ్యాణ్ దగ్గరే నేర్చుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.