టీఆర్ఎస్ టిక్కెట్: పైసలుంటే చాలు భై!
posted on Apr 7, 2014 @ 3:12PM
టీఆర్ఎస్‌లో టిక్కెట్ కావాలంటే పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినవాళ్ళు, త్యాగాలు చేసినవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదని, బాగా డబ్బుండాలి, లేదా వేరే పార్టీకి చెంది వుండాలని టీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. కేసీఆర్ విడుదల చేసిన మొదటి, రెండు లిస్టులను చూసి కడుపు మండిన తెరాస నాయకులు సొంత పార్టీ మీద, పార్టీ నాయకుడు కేసీఆర్ మీద గుర్రుగా వున్నారు.
కేసీఆర్ విడుదల చేసిన రెండు లిస్టుల్లోనూ సగానికి పైగా పార్టీకి చెందని వారు, బాగా డబ్బుండి సడెన్‌గా ఊడిపడినవారే వున్నారని విమర్శిస్తున్నారు. డబ్బులుంటే చాలు సీటు ఇచ్చే పరిస్థితి టీఆర్ఎస్‌కి రావడం బాధాకరమని అంటున్నారు. పార్టీ కోసం జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని, పార్టీని అభివృద్ధి చేయడానికి నిద్రాహారాలు మాని కృషి చేసిన వారికి మొండిచెయ్యి చూపించారని విమర్శిస్తున్నారు. ఇలా మోసం చేసిన పార్టీకి ఈ ఎన్నికలలో సహకరించడానికి మనసు రావడం లేదని అంటున్నారు.