బీజేపీతో పొత్తు-కోడెల సీటుకు ఎసరు
posted on Apr 6, 2014 @ 4:51PM
తెదేపా-బీజేపీల పొత్తులో భాగంగా మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నగుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గాన్ని బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలియడంతో ఆయన తీవ్ర ఆగ్రహం చెందారు. “మా రెండు పార్టీల మధ్య పొత్తులు కోరుకొనే వాళ్ళల్లో నేనే మొదటివాడిని. రాష్ట్రంలో చంద్రబాబు, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ అధికారం చెప్పట్టాలని నేను కోరుకొంటున్నాను. కానీ బీజేపీ తను బలంగా లేని, గెలవలేని స్థానాలకు కూడా పట్టుబట్టడం వలన రెండు పార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. దానివల్ల ప్రత్యర్ధ పార్టీలు లాభపడతాయి. అందువల్ల బీజేపీ తెదేపా నుండి వీలయినన్ని ఎక్కువ సీట్లు రాబట్టుకొనే ప్రయత్నం చేయడం కంటే, తను గెలవగలిగే సీట్లను మాత్రమే తీసుకొంటే మంచిది. తెదేపా ఖచ్చితంగా గెలవగల యంపీ సీట్లను, బీజేపీ బలవంతంగా తీసుకొని పోటీలో ఓడిపోయినట్లయితే దాని వలన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి అన్ని సీట్లు తక్కువ పడతాయి. అంతే గాక మేమూ నష్టపోతాము. ఇదివరకు జరిగిన ఎన్నికలలో కూడా ఈ సంగతి రుజువయ్యింది. అందువల్ల రాష్ట్రంలో, దేశంలో ప్రతీ ఒక్క సీటు కూడా చాలా విలువయినదేనని బీజేపీ నేతలు గుర్తించి అందుకు అనుగుణంగా తమకి బాగా బలం ఉన్నసీట్లను మాత్రమే తీసుకోవడం మేలు. లేకుంటే వారూ నష్టపోతారు,” అని అన్నారు.
గత ఐదు ఎన్నికలలో ఏకధాటిగా నరసరావుపేట నుండి గెలుస్తున్న కోడెలను, బీజేపీ కోసం ఆ సీటు నుండి తప్పించి సత్తెనపల్లి నుండి పోటీ చేయించాలనికోవడం తెదేపాకు నష్టం కలిగించవచ్చును. అయితే బీజేపీ కూడా అదే నియోజక వర్గం కావాలని బిగుసుకు కూర్చోవడంతో తప్పనిసరిగా కోడెలను తప్పించవలసి వస్తోంది. కానీ కోడెల మాత్రం తన నియోజక వర్గం వదిలే ప్రసక్తే లేదన్నట్లు చెపుతున్నారు. అవసరమయితే స్వతంత్ర అభ్యర్ధిగానయినా అక్కడి నుండే పోటీ చేస్తానని చెపుతున్నట్లు సమాచారం. ఇటువంటి సమస్యలే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో అనేక చోట్ల ఉన్నదున త్వరలోనే రెండు పార్టీలలో అలక పాన్పు-బుజ్జగింపు సీన్లు మొదలవుతాఎమో. ఇప్పటికే బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలక పాన్పు ఎక్కగా, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినట్లు తాజా సమాచారం. మున్ముందు ఇంకా ఎంత మంది అలక పాన్పులు ఎక్కుతారో చూడాలి.