మరోసారి రాజకీయ సన్యాసానికి కిరణ్ రెడీ
posted on Apr 21, 2014 @ 11:37AM
శాసనసభ తిరస్కరించిన విభజన బిల్లుని యధాతదంగా పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లయితే తాను రాజకీయ సన్యాసం తీసుకొంటానని సవాలు విసిరిన మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పని చేయకపోగా గంపెడు ఆశలతో వేరు కుంపటి పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగారు. కానీ కనీసం తనుకూడా గెలిచే అవకాశం లేదని గ్రహించడంతో, ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకొని తన స్థానంలో తమ్ముడు కిషోర్ రెడ్డిని పీలేరు నుండి బరిలో దింపి మరోమారు అస్త్ర సన్యాసం చేసారు. అయితే నేటికీ ఆయన తన సమైక్య గానం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో నిన్న ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మళ్ళీ మరోమారు రాజకీయ సన్యాసం ప్రతిజ్ఞ చేయడం విశేషం. తను గనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకొంటానని ప్రకటించారు.
తనకు పదవులు మీద ప్రేమ లేదు గనుకనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చానని అన్నారు. చంద్రబాబు, జగన్ తదితరులందరికీ చాలా పదవీ కాంక్ష ఉందని, అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు వారు అనేక ఆచరణ సాధ్యం కాని అనేకానేక వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. వారికి ప్రజల మీద నిజమయిన ప్రేమ కలిగి ఉంటే, తనతో కలిసి సమైక్య పోరాటానికి రాగలరా? అని సవాలు విసిరారు.
నిజమే! చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా తాము ముఖ్యమంత్రులు కావాలనే కోరికను ఎన్నడూ దాచుకొనే ప్రయత్నం చేయలేదు. సరికదా ఇరువురూ తాము అధికారం చెప్పట్టగానే తాము ఏ ఏ ఫైళ్ళ మీద మొదటి సంతకాలు చేస్తారో కూడా గొప్పగా చాటింపు వేసుకొంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తనకా ఆ ఆవకాశం ఎంతమాత్రం లేదని గ్రహించినందునే, ఆయన పోటీ నుండి తప్పుకొన్నారు. అందుకే ఆచరణ సాధ్యం కానీ సమైక్యం కోసం ప్రత్యర్ధులు పోరాడగలరా? అని సవాలు విసురుతున్నారు. అదే సాకుతో రేపు తన రాజకీయ సన్యాసానికి కూడా ఇప్పటి నుండే మార్గం సుగమం చేసుకొంటున్నారు. అటువంటప్పుడు ఇంకా ఈ మండుటెండల్లో పడి తిరుగుతూ ఈ వృదా ప్రయాస ఎందుకు? దానివలన ఫలితం ఏమిటి? ఆయనకే తెలియాలి.