యాచకవృత్తి ఏటా టర్నోవర్ అక్షరాలా 140 కోట్లు!
posted on Jun 6, 2014 @ 6:55PM
తెలంగాణలో యాచకుల ద్వారా ఏటా 140 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయనే జరుగుతున్నాయనే ఆశ్చర్యకరమైన వాస్తవం తాజాగా బయటపడింది. ఈ బిచ్చగాళ్ళ వ్యవస్థను తెలంగాణలో కొనసాగించరాదంటూ ఒక లాయర్ హైకోర్టులో వేసిన పిటిషన్ కారణంగా ఈ నిజం బయటపడింది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా యాచకులు కనిపిస్తూ వుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే ఏదో శారీరక లోపం వున్నవారిలా నటిస్తూ యాచిస్తూ వుంటారు. హైదరాబాద్‌లో యాచించే వారిలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా వుంటుంది. వీరందరూ వందల సంఖ్యలో వుంటారు. వీరంతా ఐకమత్యంగా వుంటారు. ప్రతిరోజూ తెల్లవారగానే తమ సొంత ఆటోలలో ఎక్కి వివిధ సిగ్నల్స్ దగ్గర దిగిపోయి బాగా చీకటి పడిపోయే వరకూ అక్కడే యాచిస్తారు. చీకటి పడ్డాక వారిని ఆటో వచ్చి పికప్ చేసుకుంటుంది. ఉత్తర భారతదేశ: నుంచి వచ్చే బిచ్చగాళ్ళ టీమ్‌లు సిగ్నల్స్ దగ్గర యాచించే స్థానిక బిచ్చగాళ్ళను తన్ని తరిమేస్తూ వుంటారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే యాచకుల సంఖ్యాబలం ఎక్కువగా వుండటం వల్ల స్థానికంగా, ఒక్కరే వుండే బిచ్చగాళ్ళు వారిని ఎదుర్కోలేక వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతూ వుంటారు. సినిమాల్లో చూపించినట్టుగా వడ్డీలకు డబ్బులు తిప్పే బిచ్చగాళ్ళు, లక్షల రూపాయల ఆస్తులు వున్న బిచ్చగాళ్ళు కూడా వుంటారట. హైదరాబాద్‌లో పెరిగిపోయిన బిచ్చగాళ్ళ వ్యవస్థను రూపుమాపాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే అవి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.