పార్లమెంట్‌కి వచ్చిన ప్రియాంక కొడుకు!

  సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా కొడుకు రైహాన్ బుధవారం తన ప్రెండ్స్.తో కలసి పార్లమెంట్‌కు వచ్చాడు. సందర్శకుల గ్యాలరీలోంచి పార్లమెంట్ కార్యకలాపాలను గమనించాడు. స్పోర్ట్స్ జాకెట్ ధరించి వచ్చిన రైహాన్ సెంట్రల్ హాల్‌ను తిలకించిన అనంతరం సోనియాగాంధీ కార్యాలయంలో కాసేపు గడిపాడు. ఈ సందర్భంగా మాట్లాడిన రైహాన్ పార్లమెంట్ చాలా బాగుందన్నాడు. ప్రియాంక గాంధీ తన పిల్లలకి రాజకీయ పాఠాలు చెబుతున్నట్టున్నారు. మొన్నామధ్య లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాయబరేలి, అమేథీ నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారానికి వెళ్ళినప్పుడు తన కొడుకు రైహాన్, కూతురు మిరాయాలను కూడా వెంట తీసుకెళ్ళారు.

గుజరాత్ గవర్నర్‌గా ఒ.పి.కోహ్లీ ప్రమాణం

  గుజరాత్‌ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా బీజేపీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఒ.పి.కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఒ.పి. కోహ్లీతో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ భాస్కర్ భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. కోహ్లీని గవర్నర్‌గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనియమించారని అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరిష్ సిన్హా ఉత్తర్వులను చదివి వినిపించారు. 74 సంవత్సరాల వయసున్న ఒ.పి. కోహ్లీ గుజరాత్ రాష్ట్రానికి 24వ గవర్నర్. ఇప్పటి వరకూ గుజరాత్ గవర్నర్‌గా వున్న 87 ఏళ్ళ కమలా బెనీవాల్‌ను కేంద్రం మిజోరాం గవర్నర్‌గా బదిలీ చేసి బెనీవాల్ స్థానంలో ఒ.పి. కోహ్లీని గుజరాత్ గవర్నర్‌గా నియమించింది.

10 రూపాయలు ఎర.. 7 లక్షలు చోరీ!

  మంగళవారం నాడు హైదరాబాద్‌లో మాజీ ఎంపీ డ్రైవర్‌కి పది రూపాయలు ఎరగా వేసి కారులోంచి విలువైన వస్తువులు, కొంత డబ్బు దొంగలు కొట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్‌లోనే అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని సత్యం థియేటర్ ప్రాంతంలో వున్న హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు నుంచి సత్యారాం అనే వ్యక్తి తాను పనిచేసే సంస్థ కోసం ఏడు లక్షల రూపాయలు విత్ డ్రా చేశాడు. సత్యారాంని ఫాలో అవుతున్న దొంగలు అతని ముందు ఒక పది రూపాయల నోటు విసిరారు. పరాయి పది రూపాయలను చూసిన మోజులో సత్యారాం ఆ పదిరూపాయల నోటుని అందుకోవడానికి కిందకి వంగాడు. అంతే, అతని చేతిలో ఏడు లక్షల రూపాయలతో వున్న బ్యాగ్‌ని లాక్కుని దొంగలు పరారైపోయారు. సత్యారాం లబోదిబో అంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాయలసీమలో ఏపీ రెండో రాజధాని: సునీత

  ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ఆకాంక్షలు వ్యక్తం చేసినా విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలోనే రాజధాని నగరం ఏర్పడే అవకాశాలు వున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది రీసెంట్‌గా రాయలసీమలో రాజధాని వుండాలని ఒకరంటే, రాజధాని ఒంగోలులోనే వుండాలని మరికొందరూ అంటూ వచ్చారు. తాజాగా పరిటాల రవి సతీమణి, రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఒక కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రాజధాని అనేది రాష్ట్రం నడిబొడ్డునే వుండాలని ఆమె చెప్పారు. అంటే పరోక్షంగా విజయవాడ - గుంటూరు ప్రాంతమే రాజధానిగా వుండాలన్నది ఆమె అభిమతం. అయితే ఆమె మరో ఆసక్తికరమైన మాట అన్నారు. రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఏదో బాగానే వున్నట్టుందే అనిపించిన ఈ ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తుందో లేదో చూడాలి.

మటను, సెల్‌ఫోనుల వల్లే రేప్‌లు: బీహార్

  మంత్రి సమాజంలో పెరిగిపోతున్న మానభంగాలకు కారణాలేంటో రాజకీయ నాయకులు చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది. అమ్యాయిలపై అత్యాచారాలు పెరిగిపోవడానికి నాన్‌వెజ్ ఫుడ్, సెల్ ఫోన్లే కారణమని బీహార్‌కి చెందిన మంత్రి అభిప్రాయపడ్డాడు. బీహార్ యువజన వ్యవహారాల శాఖ మంత్రి బినయ్ బిహారీ ఈ విషయం మీద తన అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, మాంసాహారం మనిషిలోని కామ ప్రకోపాన్ని పెంచుతుందట, అలాగే సెల్ ఫోన్లలో నీలి చిత్రాలు చూడడ్డం వల్ల కూడా యువతరంలో కామ ప్రకోపం పెరుగుతోందట. ఈ రెండు కారణాల వల్లే దేశంలో రేప్‌లు ఎక్కువయ్యాయట. ఈ రెంటినీ బంద్ చేస్తే ఇక రేపులనేవే వుండవట. శాకాహారంతో శరీరం, మనస్సు నిశ్చలంగా ఉంటాయనీ ఆయన చెప్పారు. అలాగే పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం అంటే, ఆత్మరక్షణ పేరుతో తుపాకీ లైసెన్స్ ఇవ్వడమేనని అన్నారు.

మనీలాలో తుఫాను బీభత్సం

  ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాను తుఫాను బీభత్సం అల్లకల్లోలం చేస్తోంది. ఈ తుఫానుకు ‘రమ్మసన్’ అనే పేరు పెట్టారు. ఈ తుఫాను కారణంగా తూర్పు మనీలాలో దాదాపు పదిమంది మృత్యువాత పడ్డారు. సుమారు లక్షా యాభై వేల మంది ప్రజలు ఉన్నదంతా కోల్పోయి కట్టుబట్టలతో మిగలడమే కాకుండా నిరాశ్రయులయ్యారు. భారీగా వీస్తున్న ఈదురు గాలుల వల్ల మనీలాలోని భారీ వృక్షాలు కూడా నేలకూలాయి. చెట్లు కూలిపోవడం, రోడ్లు కోసుకుని పోవడం వల్ల రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో ఫిలిప్పీన్ ఇంతటి భారీ తుఫానును ఎదుర్కోలేదని ఫిలిప్పీన్ వాతావరణ శాఖ చెబుతోంది.

టీఆర్ఎస్ సర్కారు మీద కిషన్‌రెడ్డి గుస్సా!

  తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మీద బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అటు సీమాంధ్రకు ప్రాంతానికి చెందిన విద్యార్థులతోపాటు తెలంగాణకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు కూడా నాశనమయ్యేలా వుందన్నారు. ఫీజు రీ ఎంబర్స్.మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం 1956 సంవత్సరాన్ని కటాఫ్ సంవత్సరంగా నిర్ణయించాలని భావించడానికి భారతీయ జనతాపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం మీద సంధించిన వాగ్బాణాలు ఇలా వున్నాయి...   1. విదేశాల పౌరసత్వం ఉన్నవాళ్లు కూడా మీ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు గానీ, తెలంగాణలో వున్న ఇతర ప్రాంతాల విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్మెంట్ ఉండకూడదా? ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాలం ఆడితే ఊరుకోం. విద్యార్థుల స్థానికతపై ఇతర రాష్ట్రాల్లో ఏ నిబంధనలు వున్నాయో తెలంగాణలో కూడా అవే నిబంధనలు వుండాలి.   2. రైతుల రుణమాఫీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది.   3. ముఖ్యమైన విషయాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం తలాతోకా లేని నిర్ణయాలు తీసుకుంటోంది.   4. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ఇంత అహంకారంతో వ్యవహరిస్తున్నారు. తొందరగా అధికారంలోకి వచ్చామని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ మొక్కటే ఉండాలా? ఇతరులెవరూ ఉండకూడదా? కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పటికైనా గద్దెదింపి మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది.   5. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎంత కృషి చేసిందో బీజేపీ కూడా అంతే కృషి చేసింది. అంలాంటి మా పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తారా?

రుణాల రీషెడ్యూల్ కు రిజర్వ్ బ్యాంకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రుణాల రీషెడ్యూల్ కు అంగీకరిస్తూ రిజర్వ్ బ్యాంకు రెండు ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలను పంపింది.మూడేళ్ళ వరకు రుణాల రీషెడ్యూల్ చేసేందుకు రిజర్వ్ బ్యాంకు తన అంగీకారాన్ని తెలిపింది. ఎంతమందికి రీషెడ్యూల్ చేస్తారో, వాటి విధివిధానాలపై ఓ నివేదిక పంపాలని ఇరు ప్రాంతాల ప్రభుత్వాలను కోరింది. రీషెడ్యూల్ చేసిన రుణాలను రైతులు మూడేళ్లలో తిరిగి చెల్లించగలరా? అని ఆర్‌బీఐ ఈ సందర్భంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రుణ మాఫీ ఎలా మారుతుందన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. కోటయ్య కమిటీ తన అద్యయనం ప్రకారం ఎవరికి ఈ పధకం వర్తింప చేయాలన్నది కూడా సూచిస్తుంది. రిజర్వ్ బ్యాంకు లేఖపై అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు రుణమాఫీపై ఆర్బీఐ చివరిలో ఏదైనా తిరకాసు పెడితే, అప్పుడు ఆ కొత్త ప్లాన్‌ను అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

58 ఎమ్మెల్సీ స్థానాలు కోరనున్నాం: యనమల

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 58 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో వున్న లోపాల గురించి కూడా కేంద్ర హోం శాఖకు ఒక లేఖ రాయబోతున్నట్టు ఆయన చెప్పారు. ఈ అంశంమీద ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించామని, వారి సూచన మేరకే కేంద్ర హోం శాఖకు లేఖ రాయబోతున్నామని ఆయన వెల్లడించారు. బిల్లులోని లోపాలను సవరించే బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పార్లమెంటులో పెట్టి ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నామని యనమల చెప్పారు.

జానారెడ్డి ఏడుపు చూతము రారండీ!

  తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసన సభా పక్ష నేత జానారెడ్డి మనసులో మాట బయటకి చెప్పారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఓ ప్రశ్నకు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి అధికారమే లేక ఏడుస్తుంటే ఇక ఆధిపత్య పోరు ఎక్కడిదని అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి జానారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని వస్తున్న వార్తల మీద స్పందిస్తూ ఆయన ఇలా అన్నారు. పొన్నాలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆధిపత్య పోరు పుకార్లు కేవలం అపోహలే అన్నారు. తామిద్దరం స్నేహపూర్వకంగా వున్నామని జానారెడ్డి వివరణ ఇచ్చారు. మాట్లాడుకుంటున్నామని చెప్పారు.

ఎరక్కపోయి వెళ్ళి ఇరుక్కుపోయిన రోజా!

  సినీ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఎరక్కపోయి ఒక కార్యక్రమానికి వెళ్ళి ఇరుక్కుపోయింది. ఇంతకీ జరిగిందేంటంటే, నగరి మునిసిపల్ కార్యాలయంలో జరిగే ఒక కార్యక్రమానికి రోజా వెళ్ళింది. అప్పటికే అక్కడ తెలుగుదేశం, వైసీపీ మునిసిపల్ కౌన్సిలర్లు ఏదో అంశం మీద ఆందోళన కార్యక్రమం, ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే అక్కడకి వెళ్ళిన రోజాని కొంతమంది కౌన్సిలర్లు నిర్బంధించారు. దాంతో రోజా ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను దేవుడా అనుకున్నారు. ఆ తర్వాత శాంతించిన కౌన్సిలర్లు రోజాని విడిచిపెట్టేశార్లెండి.

చనిపోయింది.. బతికింది.. మళ్ళీ అంతలోనే...

  ఫిలిప్పీన్స్‌లో ఒక విచిత్రకరమైన, విషాదకరమైన సంఘటన జరిగింది. విష జ్వరం కారణంగా మరణించిన మూడేళ్ళ బాలికకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వుండగా, బాలిక శవాన్ని శవపేటికలో పెట్టే సమయంలో పాపలో కదలికలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన అందరూ పాపని ఆస్పత్రికి తీసుకువెళ్ళడంతో బతికింది. చనిపోయిందని అనుకున్న తమ పాప బతకడంతో ఆ తల్లిందండ్రులు ఎంతో సంతోషించారు. చుట్టుపక్కల ప్రాంతాల జనం కూడా చనిపోయి బతికిన పాపని చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. అయితే కూతురు తిరిగి బతికిన ఆనందం ఆ తల్లిదండ్రులకు రెండు రోజులు కూడా మిగల్లేదు. ఆ పాప మళ్ళీ కోమాలోకి వెళ్ళి మరణించింది. గతంలో మాదిరిగా తమ పాప తిరిగి లేస్తుందేమోనని ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దాంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ ఆ పాపకి అంత్యక్రియలు నిర్వహించారు.

కిరణ్ పై రాజయ్యకు ఎందుకు అంత కోపం?

  తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో చూడగానే ఆవేశంగా వూగిపోయిన తీరుపై రాజకీయవర్గాలలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. అసలేం జరిగిందంటే, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడ ఆయనకి ఆస్పత్రి గోడ మీద మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫొటో కనిపించింది. దానిని గోడ మీద నుంచి లాగి పరపరా చింపేశారు. అసలు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ఫోటోని తానే చించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే అసలు విషయం వుందట..! గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజయ్య వున్నప్పుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా, జగన్ వర్గంలో వుండేవారు. ఆతరువాత జరిగిన పరిణామాల వల్ల ఆయన టీఆర్ఎస్ పార్టీ చేరారు. ఆ కాలంలో ముఖ్యమంత్రిగా వున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆయనపై కొంత ఇబ్బంది పెట్టారని అంటున్నారు.  ఇప్పుడు రాజయ్య అధికారంలో వున్నారు కాబట్టి కిరణ్ పైన బదులు తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆయనకి నిన్న తెలంగాణ ఆస్పత్రి గోడ మీద కిరణ్  ఫొటో చూసేసరికి కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోని గోడ మీద నుంచి లాగి పరపరా చింపేశారు. అప్పటిగానీ ఆయన ఆవేశం తగ్గలేదు.