ఆంధ్రప్రదేశ్ కు అదనపు విద్యుత్ కేటాయింపు
రాష్ట్ర విభజన సందర్భంగా రెండు రాష్ట్రాలకు వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేయడం పొరపాటనే ఆంధ్రప్రదేశ్ వాదనతో ఏకీభవించిన నీరజా మాధుర్ కమిటీ, ఆ పొరపాటును సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ కోరుతున్న విధంగా ఆ రాష్ట్రానికి కేంద్ర విద్యుత్ కోటా నుండి 1.77 శాతం అదనపు విద్యుత్ కేటాయించేందుకు అంగీకరించింది. అందువలన రాష్ట్రానికి అదనంగా మరో 65మెగావాట్ల విద్యుత్ లభిస్తుంది. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు 46.11:53.89 శాతం నిష్పత్తిలో జరిగిన పంపకాలను సవరిస్తూ ఆంధ్రాకు 47.88 శాతంగా నిర్ణయించారు. అయితే కీలకమయిన ఈ సమావేశానికి రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ ప్రతినిధులు ఎవరూ హాజరు కాకపోవడాన్ని కమిటీ తప్పుపట్టింది. తెలంగాణా ప్రభుత్వం కోరుతున్న పీలేరు విద్యుత్ ప్రాజెక్టులో వాటా, ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాలు చేసుకొన్న విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాల కొనసాగింపు తదితర వివాదాలను కేంద్ర న్యాయ శాఖకు, కేంద్ర అటార్నీ జనరల్‌కు పంపించాలని నీరజా మాథుర్ కమిటీ నిర్ణయించుకోవడంతో ఈ సమావేశంలో ప్రధాన సమస్యలేవీ పరిష్కారం కాలేదు.
ఆంద్ర, తెలంగాణా తరపున ఈ సమావేశానికి హాజరయిన ఇంధన శాఖ కార్యదర్శులు అజయ్ జైన్, సురేష్ చందాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పీపీఏలను అమలు చేయదానికి నిరాకరించడం ద్వారా ఆంద్ర ప్రభుత్వం విభజన ఒప్పందాలను, విద్యుత్ చట్టాలను కూడా ఉల్లంఘించిందని తెలంగాణా ఇంధన శాఖా కార్యదర్శి సురేష్ చందా వాదించగా, పవర్ రెగ్యులేటరీ కమీషన్ (పీ.ఆర్.సి.) ఆమోదం పొందని పీపీఏలను అమలుచేయమని తమపై ఏవిధంగా ఒత్తిడి తెస్తారని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖా కార్యదర్శి అజయ్ జైన్ వాదించారు. ఆంధ్ర, తెలంగాణా విద్యుత్ డిస్కంల మధ్య పీపీఏలు జరిగినప్పటికీ అవి గత నాలుగేళ్ళుగా వాటిని ఆమోదించకుండా పెండింగులో పెట్టినట్లు కమిటీ చైర్మన్ నీరజా మాధుర్ గుర్తించారు. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ పీపీఏల అమలుకు నిరాకరిస్తున్నట్లు గుర్తించారు.
అందువల్ల ఈ వివాదాన్ని కేంద్ర న్యాయ శాఖకు, కేంద్ర అటార్నీ జనరల్ ముందుంచి వారి సలహాల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. మళ్ళీ ఈ నెల 24న మరో మారు సమావేశమయ్యే సమయానికి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొంటామని కమిటీ చైర్మన్ నీరజా మాధుర్ రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు.