కడప జిల్లాకు వైఎస్సార్ పేరు కట్?
posted on Jul 12, 2014 @ 12:14PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత కడప జిల్లాకు ‘వైఎస్సార్ కడప జిల్లా’గా పేరు మార్చడం మీద అప్పట్లోనే ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎంతోమంది మహానుభావులు జన్మించిన కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టడమేంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవేళ కడప జిల్లాకు ఎవరైనా ప్రముఖుల పేరు పెట్టాలంటే, వైఎస్సార్‌ని మించిన ప్రముఖులు ఎందరో కడప జిల్లాలో వున్నారని, కేవలం అధికారపార్టీ నాయకుడు కాబట్టి వైఎస్సార్ పేరును కడప జిల్లాకు పెట్టడం అన్యాయమని వాదనలు వినిపించాయి. అసలు కడప జిల్లాకు ఆ పేరు వేంకటేశ్వర స్వామి ‘దేవుని గడప’ అనే మాట నుంచి వచ్చిందని, ఆ పేరును మార్చడం మనోభావాలను గాయపరచడమేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా కడప జిల్లా పేరును పునరుద్ధరించాలన్న డిమాండ్ మరోసారి తెరమీదకి వచ్చింది. కడప జిల్లాకు పాత పేరును పునరుద్ధరించాలని కడప జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. మొత్తమ్మీద రాబోయే కాలంలో కడప జిల్లాకు వైఎస్సార్ పేరును కట్ చేసే అవకాశాలు వున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి.