ఫార్మసీ అడ్మిషన్లు: కేసీఆర్‌కి చంద్రబాబు లేఖ
posted on Jul 12, 2014 @ 2:03PM
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు అడ్మిషన్లను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. జూలై 31లోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఆ లేఖలో స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం జూలై 31 లోగా అడ్మిషన్లు పూర్తి కావాలి, ఆగస్ట్ మొదటి వారంలో తరగతులు ప్రారంభం కావాలి. ఈ విషయాన్ని చంద్రబాబు తాను రాసిన లేఖలో కేసీఆర్‌కి గుర్తుచేశారు. సకాలంలో అడ్మిషన్లు చేయకపోతే స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తే రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా నివారించవచ్చని, తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించినట్లవుతుందని చంద్రబాబు సూచించారు.