రాజ్యసభలో పోలవరంపై రగడ
posted on Jul 14, 2014 @ 6:09PM
రాజ్యసభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లు మీద వాడిగా వేడిగా చర్చ జరుగుతోంది. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ లతో పాటు సీపీఐ, జేడీయూ నేతలు బిల్లు మీద స్పందించారు. 1956 కు ముందు ఈ ఆంధ్రప్రదేశ్ లో కలుపుతున్న గ్రామాలు ఆంధ్రలోనే ఉండేవని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ బిల్లును ప్రవేశపెట్టి చర్చను మొదలుపెట్టారు. ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపాలని యూపీఏ ప్రభుత్వంలో నిర్ణయించామని, ఎన్నికల నేపథ్యంలో అది ఆగిపోయిందని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. ముంపు ప్రభావాన్ని తగ్గించేందుకు రూ.600 కోట్లతో రక్షణ చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు.
జైరాం రమేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ విభేదించారు. తెలంగాణకు ఈ రోజు దుర్ధినం అని, కేంద్ర హోంమంత్రి నాలుగు లక్షల మంది గిరిజనుల ఆవేదనను అర్ధం చేసుకోవాలని, వారు నిరంతర ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. పోలవరం మూలంగా భద్రాచలం మునుగుతుందని, దీనివల్ల లాభాలకన్నా నష్టమే ఎక్కువని పలు నివేదికలు పేర్కొన్న విషయం పక్కన పెడుతున్నారని విమర్శించారు. మరో ఎంపీ నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నాలుగు రాష్ట్రాల సమస్య అని, గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను అమలు చేయొద్దని ఆయన సభను కోరారు. రాజకీయ లబ్ది కోసమే ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించారని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు.
పోలవరం బిల్లు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని సీపీఎం ఎంపీ రాజీవ్ అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు చట్ట సవరణ బిల్లుపై ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనగా ఉన్నారని ఒడిశా ఎంపీ మహాపాత్ర తెలిపారు. అనంతరం ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ పోలవరంపై గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకోవాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. ఇది 1.89 లక్షల మంది జీవితాలకు సంబంధించిన సమస్య అని ఆమె అన్నారు.