రాజ్యసభలో పోలవరం బిల్లు మరికొద్ది సేపటిలో
posted on Jul 14, 2014 @ 1:56PM
ఈరోజు రాజ్యసభలో పోలవరం బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇంతవరకు ప్రవేశపెట్టకపోవడంతో దానిపై తెలంగాణాలో, డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు చూసి ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉండవచ్చని అందరూ భావించారు. కానీ ఈరోజు మధ్యాహ్నం 2.15గంటలకు ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నట్లు సభ్యులందరికీ సమాచారం పంపించారు. అయితే ఈ రోజు కేవలం బిల్లును ప్రవేశపెట్టి రేపు దానిపై చర్చ, ఓటింగు చెప్పట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న తెరాస, టీ-కాంగ్రెస్, ఒడిష, ఛత్తీస్ ఘర్ యంపీలు ఎట్టిపరిస్థితుల్లో ఈ బిల్లును అడ్డుకోవాలని ధృడ నిశ్చయంతో ఉన్నందున ఇంతవరకు ప్రశాంతంగా సాగుతున్న రాజ్యసభ సమావేశాలు బిల్లు ప్రవేశపెట్టగానే రసాభాసగా మారే అవకాశం ఉంది.
ఈ బిల్లును తమ పార్టీయే స్వయంగా రూపొందించినందున దానిని సభలో అడ్డుకోరాదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నభీ ఆజాద్ ద్వారా పార్టీ యంపీలకు కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. కానీ వారు ఇప్పుడు అధిష్టానం ఆదేశాలను ఖాతరు చేస్తారా లేక తెలంగాణాలో తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తెరాస యంపీలతో కలిసి బిల్లును అడ్డుకొంటారా అనేది మరి కొద్ది సేపటిలో తేలిపోతుంది.