డిల్లీలో నేడు ఆంధ్ర, తెలంగాణా విద్యుత్ పంచాయితీ
posted on Jul 14, 2014 @ 9:36AM
ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల, విద్యుత్ వివాదాలు సామరస్యంగా పరిష్కారమయ్యే అవకాశాలు బొత్తిగా కనబడటం లేదు. రెండు ప్రభుత్వాలు తమ హక్కులను కాపాడుకోవాలని ప్రయత్నించడంలో తప్పు లేదు. కానీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించే బదులు ఘర్షణ వైఖరి అవలంభిస్తుండటంతో కేంద్రం జోక్యం చేసుకోవలసివస్తోంది. నాలుగు రోజుల క్రితం కృష్ణా జలాల పంచుకోవడంపై కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ పాండ్యా ముందు పంచాయితీ జరిగిన తరువాత ఇరు రాష్ట్రాలకు 13టీ.యం.సి.ల నీళ్ళు కేటాయింపు జరగడంతో సమస్య తాత్కాలికంగా వాయిదా పడింది. ఈసారి వర్షాలు కురవకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య నీళ్ళ కోసం పేచీలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదని చెప్పవచ్చును.
ఇక ఈరోజు విద్యుత్ పంపకాలపై కూడా కేంద్రం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిటీ ముందు పంచాయితీ జరగనుంది. దానిలో సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులు డిల్లీ వెళ్ళారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థలతో చేసుకొన్న విద్యుత్ పంపిణీ అమ్మకపు ఒప్పందాలను (పీ.పీ.ఏ.) రద్దు చేయాలనే నిర్ణయం, సీలేరు, హిందుజా ప్రాజెక్టులలో తెలంగాణాకు వాటాల సంగతి తేల్చడం వగైరా అంశాలు నేటి సమావేశంలో చర్చించి, ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయనున్నారు. కానీ ఈ గొడవలు ఇలా ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? వీటికి ఎప్పటికయినా శాశ్విత పరిష్కారం దొరుకుతుందా? అనే ప్రజల ప్రశ్నలకు అటు ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు కానీ, కేంద్రం గానీ జవాబు ఇచ్చేస్థితిలో లేదు.